S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోప్యత

నిరాడంబరంగా బ్రతుకుతున్న వారి
ఒంటిపైనుండి గోచీని సైతం గుంజుకుని
ఇంకా నిరాడంబరంగా బ్రతకమని
ఎగతాళి సలహాలు ఇచ్చేవాళ్లున్నట్టి
స్వార్థ ప్రగతి మాత్ర కాముకమైన ఈ జగతిలో...

అమాయకులు కనిపిస్తే చాలు-
తీయనైన మాటలతో నమ్మించి
సర్వస్వమూ మాయం చేసేవాళ్లున్నట్టి
ఈ మాయదారి లోకంలో...
పైసా లేకుంటే గడ్డిపోచ కూడా
చిన్నచూపు చూస్తుంది కాబట్టి,
చినిగిన దుస్తుల్ని లోపల ధరించినా-
ఎంతో కొంత ‘ఉన్నట్లు’గా కనిపించడానికి
పైన కిరాయి కోటు వేసుకుని,
కృతకమైన ‘హాయి’ నవ్వులను పూయిస్తూ
జీవన యాత్రను గడిపేవాళ్లు
కోకొల్లలుగా ఉన్నట్టి
ఈ కపట నాటక ప్రపంచంలో...
ఎప్పుడూ ఎదుటి మనిషి బలహీనతలపై
కోలుకోలేని దెబ్బలు కొడుతూ,
నిరుత్సాహపరుస్తూ కించపరుస్తూ
గెలవాలని ప్రతీ క్షణం తహతహలాడేవాళ్లు
అంగుళం అంగుళంలోనూ తటస్థపడే
ఈ అస్తవ్యస్థ వ్యవస్థలో...
మనిషి యొక్క అభిమాన ధనాన్ని
కాపాడే హక్కులకు-
ఎటువంటి విశ్వసనీయతా కనిపించని
ఈ మోసపూరితమైన రంగుల సమాజంలో...
మనిషి - తనని తాను ఒక సంపూర్ణ వ్యక్తిగా
రూపుదిద్దుకోవడానికి-
తోటి మనిషికీ, సాటి సమాజానికీ
ఏ హానీ కలిగించనంతవరకూ...
అతడి తెలివితేటలూ, తదితర విషయాలకూ
తగినంతగా వ్యక్తిగత గోప్యత
తప్పనిసరిగా అవసరం!
ఒక మనిషి యొక్క గోప్యతను చీల్చి చెండాడి
నట్టనడి బజారులో నగ్నంగా నిలబెట్టడం
మళ్లీ అనాగరిక దశలోనికి మరలిపోవడమే!

దుస్తుల ఆచ్ఛాదన-
మనిషి గౌరవాన్ని కాపాడుతుంది!
వ్యక్తిగత గోప్యత - వ్యక్తికి అందాన్నీ,
హుందాతనాన్నీ పెంచుతుంది!
ఈ వ్యక్తిగత గోప్యత
ప్రాథమిక హక్కుగా లేకపోతే
మనిషి దూదిపింజకన్నా తేలికవుతాడు!
గాజుపంజరమై చిక్కుతాడు!
ఉన్నా లేనట్లే అయిపోతాడు!
*
(వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని వచ్చిన తీర్పునకు హర్షం వ్యక్తం చేస్తూ...)

-రఘువర్మ 9290093933