S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంటికొక సైనికుడు కనిపించే మిలిట్రీ మాధవరం( లోకం పోకడ )

రాజ్యాల మధ్య యుద్ధమంటే అందులో రాజుల కంటే సైనికుల పాత్రే అధికంగా ఉంటుంది. కదన రంగంలో భీకరంగా పోరాడి తమ దేశ జయాపజయాలను నిర్ణయించేది ఆ సైనిక పాటవమే. అయితే ఎవరైనా రాజులా జీవించడానికి ఆసక్తి చూపుతారు గానీ, సైనికులై యుద్ధ్భూమిలో కదం తొక్కాలని ఆశించరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజల్లోనూ కనిపిస్తుంది. అందుకే ఎన్నో దేశాలు రక్షణ రంగంలోకి యువత పెద్ద పెత్తున రావాలని, అలా వచ్చిన వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తామని ప్రకటిస్తూ ఉంటాయి. కానీ మన దేశంలోని ఒక చిన్న ప్రాంతంలోని ప్రజలు మాత్రం ఎలాంటి ప్రకటనలు, ఆహ్వానాలు లేకుండానే తమ పిల్లలను స్వచ్ఛందంగా రక్షణ దళాల్లోకి సంతోషంగా పంపిస్తున్నారు. ఇదిప్పటి మాట కాదు. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఆ చిన్న ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మామూలు పల్లె పట్టు కావడం మనందరికీ గర్వకారణం. అదే మాధవరం. దీనిని మిలిట్రీ మాధవవరం అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు అంతా. నేటి అమరావతికి 150 కిలోమీటర్ల దూరంలో, తూర్పుగోదావరిలోని చిన్న పల్లె పట్టు ఇది. ఇటీవల ఇక్కడి నుండి 109 మంది యువకులు ఒకేసారి మిలిట్రీలో చేరారు. ఈ ప్రాంతంలోని యువకులు మూడు వందల ఏళ్ల కాలంలో భారత్ పాల్గొన్న అనేక యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించారు. మిలట్రీలో పని చేసి ఏ ర్యాంక్‌లో అయితే రిటైర్ అవుతారో, అవే ర్యాంకుల పేరుతో ఇక్కడి పెద్దవారిని పిలవడం కూడా మనకి కనిపిస్తుంది. మిలిట్రీలో పని చేసే యువకులకు తమ పిల్లని ఇవ్వడానికి వేరే ఎక్కడైనా అయితే తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపరు గానీ, ఈ ప్రాంతంలో అటువంటి అనాసక్తి మనకి కనిపించదు. పైగా మిలిట్రీలో పని చేసే యువకులను వివాహం చేసుకోవడానికి ఇక్కడి యువతులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ చాలా మంది పిల్లల్ని మేజర్, జనరల్, కెప్టెన్ పేర్లతో పెద్దవాళ్లు పిలవడాన్ని కూడా మనం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రాంత ప్రజలకు రక్షణ రంగమంటే ఎంత మక్కువో అర్ధమవుతుంది. ఇక్కడున్న ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక్క యువకుడైనా మిలిట్రీలో పని చేస్తూ కనిపిస్తారు మనకి. కొన్ని ఇళ్ల నుండి అయితే ఏకంగా నలుగురేసి యువకులు కూడా మిలిట్రీలో చేరి దేశానికి సేవలందిస్తుంటారు. దీనిపై ఇక్కడి పెద్దలు, యువకులు మాట్లాడుతూ రక్షణ రంగంలో చేరి దేశానికి సేవ చేయాలన్న భావన తమ రక్తంలోనే ఉందని, అందుకే ఇది శతాబ్దాలుగా కొనసాగుతుందని అంటుంటారు. గతంలో రక్షణ రంగ మంత్రిగా పని చేసిన మనోహర్ పారికర్ మాధవరంలో డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీని మాధవరంలో నెలకొల్పాలని అనుకున్నారు. ఈ విధంగా ఇంటికొక సైనికుడు కనిపించే మాధవరం మిలిట్రీ మాధవరంగా పేరు తెచ్చుకుని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తి నింపుతుంది.

- దుర్గాప్రసాద్ సర్కార్