S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి గుణం( కథ)

రామారావు, జగదీష్ బాల్యమిత్రులు. పెళ్లై పిల్లలు కలిగినా వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వేళలో జగదీష్ తండ్రికి జబ్బు చేసింది. వైద్య ఖర్చులకు డబ్బు అవసరం అయింది. ఎవరిని అడిగినా అప్పు పుట్టలేదు. జగదీష్ దిగులు పడ్డాడు. తండ్రి పరిస్థితి చూస్తూ కుమిలిపోయాడు. రామారావు జగదీష్ దీన స్థితికి చలించిపోయాడు. అతడిని ఓదార్చాడు.
తన భార్య నగలను తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పు తెచ్చాడు. జగదీష్‌కి ఇచ్చాడు. నోటు రాసిస్తానని జగదీష్ అన్నా, ‘మిత్రుల మధ్య నోటు ఎందుకురా? నోటి మాట చాలదూ?’ అని ఎలాంటి రాతకోతలు లేకుండా లక్ష రూపాయలు ఇచ్చాడు.
రోజులు గడిచాయి. అప్పుల బాధత రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్యాపిల్లలు వీధిన పడ్డారు. అంత్యక్రియలకు కూడా డబ్బు లేదు. రామారావు భార్య వెళ్లి ‘అన్నయ్యా! ఆయన అకాల మరణం చెందారు. అప్పుగా ఎక్కడైనా డబ్బు ఇప్పించు. ఎలాగోలా తీర్చుకుంటాను. కార్యం గట్టెక్కించు’ అని వేడుకుంది.
తనకు డబ్బు ఇచ్చిన సంగతి రామారావు భార్యకు చెప్పలేదని గ్రహించాడు జగదీష్.
పట్టుమని ఇప్పటికిప్పుడు అప్పు ఎక్కడ పుడుతుంది? ‘తరువాత చూద్దాంలే’ అని దాటేశాడు జగదీష్. ఆమె కాళ్లావేళ్లాపడి ఎక్కడో డబ్బు తెచ్చుకుంది. కార్యక్రమాలు ముగిసాయి.
లక్ష రూపాయలు అప్పలంగా వచ్చినందుకు జగదీష్ లోలోపల సంతోషించాడు. మిత్రుడి భార్యను ఆదుకునేందుకు ప్రయత్నించలేదు. వాడి స్నేహం వాడితోనే పోయింది అనుకుంటూ మిన్నకున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా రామారావు భార్య వచ్చింది. జగదీష్ గుండె గుభిల్లుమంది.
డబ్బు సంగతి తెలిసి వచ్చి ఉంటుంది అనుకున్నాడు.
‘అన్నయ్యా! ఇన్సూరెన్స్ కట్టడానికి మీరు ఆయనకు ఆరు వేలు ఇచ్చారని ఒకసారి చెప్పారాయన. మీ దయ వల్ల అవి ఈ రోజు లక్ష రూపాయలు వచ్చాయి. మీ ఆరు వేలు తీసుకోండి’ అని డబ్బు ఇచ్చి వెళ్లింది. ఆమె నిజాయితీకి అతడి మనసు కరిగింది. అంతేకాదు ఇచ్చిన డబ్బు సంగతి చెప్పకుండా, పుచ్చుకున్నవి మాత్రమే చెప్పిన మిత్రుని గుణానికి తన గుణం పోల్చుకుని సిగ్గుపడ్డాడు. అప్పటికప్పుడు లక్ష రూపాయలు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి ఇచ్చాడు. విషయమంతా చెప్పాడు. నగలు విడిపించుకోమని వడ్డీ కూడా ఇచ్చాడు.
నీతి: మనం మంచిగా, నిజాయితీగా ఉంటే కఠినాత్ముల, మోసగాళ్ల మనసులు కూడా మార్చవచ్చునని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదూ?!

-దార్ల బుజ్జిబాబు