S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తీపికబురు

తెలుగు వారికి ఇది తీపికబురు...
ఒకటా రెండే ఒకేసారి ఐదారు పదార్థాలు, కళాఖండాలకు భౌగోళిక గుర్తింపు లభించింది. సుదీర్ఘ పోరాటం అనంతరం అది సాధ్యమైంది. అది నిజంగా తీపి కబురే...
లడ్డూ అంటే తెలుగువారికి చాలా ఇష్టం...
తిరుపతి లడ్డూ అంటే మరింత ఇష్టం..
బందరు లడ్డూ అన్నా అంతే....
ఇది భక్తులు, ఆహారప్రియుల మాట కదా!
* చీరలంటే మహిళలకు మక్కువ...
తెలుగునేలపై అల్లిన చీరలంటే చాలామందికి ఇష్టం..
గద్వాల, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, పోచంపల్లి...ఇలా వీటన్నింటికీ ఎంతో గుర్తింపు ఉంది... వీటితో చేరింది ఇప్పుడు అందమైన పోచంపల్లి ఇక్కత్ చీర... ఇంతుల మనసుతోపాటు ఇప్పుడు మరో గుర్తింపునకూ అర్హత సాధించింది...
* మామిడి పళ్లంటే నోరూరించే బంగినపల్లి గుర్తొస్తుంది...
రంగు, రుచి, వాసన, సైజు అన్నీ దాని ప్రత్యేకతలే...
మామిడిపళ్లలో రాజుగా చెప్పుకునే ఈ మధురఫలం ఓ విజయం సాధించింది..అదీ తీపి కబురే..
*లలితమైన రంగులు, పొందికైన రూపం.. ఉట్టిపడే తెలుగుదనం... ముట్టుకుంటే పాడవుతాయేమోనన్నంత మృదువుగా ఉన్నాయా అనిపించే ఏటికొప్పాక బొమ్మలు... కొత్తహంగు వచ్చి చేరింది.. కొండపల్లి బొమ్మలకు దీటుగా నిలిస్తోంది...
* సున్నపుదిబ్బల నడుమ ఐదు శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న దుర్గి సున్నపురాయి బొమ్మల కళకు దుర్గి ఓ దుర్గం. ఇప్పుడు ఆ దుర్గం ఓ విజయం సాధించింది. అదీ ఆనందించే విషయమే...
ఒకేసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన అపురూప కళాసంపద, హస్తకళలకు ఎంతో గుర్తింపు వచ్చింది. శతాబ్దాల తరబడి కాపాడుకుంటూ వస్తున్న తమ ప్రతిభ, సంప్రదాయాలు, ప్రత్యేకతలకు దీనివల్ల రక్షణ లభిస్తుంది. ఆయా రంగాల కళాకారులకు ఇప్పుడు ఇది తీపికబురే..
జిఐ గుర్తింపు అంటే...
ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో భారత్ సభ్యురాలు. ఒక ప్రాంతం, లేదా ఒక స్థలంలో మాత్రమే తయారయ్యే, రూపొందే, సృష్టించే ప్రత్యేకమైన ఆహారం, వ్యాపార వస్తువు, లేదా కళాఖండాలకు గుర్తింపునిచ్చే సంస్థ జియోలాజికల్ ఐడింటిఫికేషన్ ట్రస్ట్. దీని గుర్తింపు లభిస్తే దాదాపు మేధోసంపత్తి హక్కులు లభించినట్లే. ఆయా వస్తువులు, పదార్థాలు, కళలకు అవి పుట్టినిల్లువంటివన్నమాట. అక్కడి వారికి ఆయా కళలు, ప్రత్యేకతలను గుర్తిస్తూ జిఐ ట్యాగ్ లిస్ట్‌లో చేర్చి ధ్రువపత్రం ఇస్తారు. దీనివల్ల ఆయా వస్తువులు, పంటలు, లేదా కళల పేరుతో మరొకరు, మరో ప్రాంతంలో వాటిని రూపొందించి విక్రయించడం చట్టరీత్యా చెల్లదు. అసలు హక్కుదారులకు ఇది రక్షణ. రుణాలు, అమ్మకాలకు ఇది ఒక సర్ట్ఫికెట్‌లాంటి అన్నమాట. భారత్‌లో తొలిసారిగా ‘డార్జిలింగ్ టీ’ జిఐ గుర్తింపును సాధించింది. చైనాకు చెందిన ఒక రకం తేయాకును అభివృద్ధి చేసి దీనిని సృష్టించారు. మిగతా తేయాకులకన్నా చిన్నగా, సన్నగా, ఎండి, వేయించిన తరువాత స్పష్టమైన రంగు, రుచి, వాసనలతో మెప్పించే డార్జిలింగ్ టీకి తొలి గుర్తింపు లభించింది. ఇది 2003 నాటి మాట. ఇప్పటివరకూ మన దేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వివిధ వస్తువులు, కళాఖండాలను, చీరలు, ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. నకిలీ తయారీని అరికట్టడం, గుర్తింపు లభించిన తరువాత ఆయా వస్తువులు, పదార్థాలను వేరేచోట, వేరొకలు తయారు చేసి అమ్మడం సాధ్యం కాదు. అలా చేస్తే హక్కుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నిజానికి మన దేశంలో 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ గూడ్స్ రెగ్యులేష్ అడ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ట్రేడ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం మేధోహక్కులు లభిస్తాయి. జిఐ గుర్తింపుతో ఇది సాధ్యం. అందుకే ఇటీవలి కాలంలో ఈ గుర్తింపుకోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ముఖ్యంగా వృత్తిసంఘాలు, ప్రభుత్వాలు ఈ అంశాన్ని ప్రాధాన్యం ఉన్న అంశాలుగానే గుర్తిస్తున్నాయి. పర్యాటకం, సంప్రదాయం, వృత్తికళాకారులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 269 అంశాల్లో జిఐ గుర్తింపు లభించింది. వాటిలో మనవాళ్లు మంచి రికార్డునే నమోదు చేశారు.
తెలుగు రాష్ట్రాలలో..
తెలుగు రాష్ట్రాలకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర ఉంది. కళలకు కాణాచి మన ప్రాంతం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత ఉంది.
పేద, ధనిక తారతమ్యం లేకుండా కళాకారులు అద్భుత సృష్టితో అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. తెలంగాణలోని చేర్యాలలో ఒకరకమైన చిత్రలేఖనం ప్రత్యేకతను కలిగి ఉంది. చేర్యాల బొమ్మలుగా వాటికి పేరు. పెంబర్తి, నిర్మల్ కొయ్యబొమ్మలు, ఫర్నిచర్ ఒక అద్భుతమైన కళకు గుర్తు. ఇక గద్వాల, పోచంపల్లి చీరలు నచ్చని అతివలు ఉండరు. పోచంపల్లికే పరిమితమైన ఇక్కత్ చీరలకు ఇప్పుడు కొత్తగా జిఐ గుర్తింపు వచ్చింది. అంతకుముందే ‘గొల్లభామ’ చీరలు ఆ ఘనతను సాధించాయి. రంజాన్ నెల రోజులూ తెలంగాణలో నోరూరించే హలీమ్ తెలియనివారు ఉండరు. మతంతో సంబంధం లేకుండా మాంసాహారులు దీనిని రుచి చూడకుండా ఉండరు. హైదరాబాద్ హలీమ్‌కు కూడా ఇప్పటికే జిఐ గుర్తింపు దక్కింది. కరీంనగర్ ఫిలిగ్రీ కళ చూసి కళ్లు తిప్పుకోలేం. వీటన్నింటికీ ఇప్పటికే గుర్తింపు వచ్చింది. తాజాగా తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ చీరలకు భౌగోళిక గుర్తింపు దక్కడం అక్కడివారికి గొప్ప ఆనందం కలిగిస్తోంది. ఈ తరహా చీరలకు నకిలీల నుంచి రక్షణ కల్పించే ఈ పరిణామం చేనేత హస్త కళాకారులకు ఎంతో రక్షణ ఇవ్వనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బొబ్బిలి వీణ, బందరు లడ్డు, శ్రీకాకుళం జిల్లాలోని బుడితి ఇత్తడి లోహపు వస్తువులు, గంటల తయారీ, మంగళగిరి, ధర్మవరం, కాళహస్తి కలంకారీ, మచిలీపట్నం కలంకారీ, ఉప్పాడ చీరలు వంటివి గతంలోనే జిఐ గుర్తింపును సాధించాయి. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగినపల్లి మామిడి, తిరుపతి లడ్డూ, ఏటికొప్పాక లక్క బొమ్మలు, దుర్గి రాతి బొమ్మలు ఈసారి జిఐ గుర్తింపును సాధించాయి. ఒక్కోదానికీ శతాబ్దాల చరిత్ర ఉంది. మామిడి పళ్ల ఉత్పత్తితలో భారత్ రారాజు. ప్రపంచంలో ఉత్పత్తి జరిగే మామిడిలో మనదేశం 56 శాతం వాటా కలిగి ఉంది. మామిడి పళ్లను మధురఫలం అంటారు. ఆ ఫలాల్లో బంగినపల్లి మామిడి రారాజుగా చెబుతారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో అభివృద్ధి చేసిన ఈ పళ్లు పచ్చని రంగుతో, మందమైన తోలుతో, మూడునెలలైనా నిల్వ ఉండే గుణంతో, తియ్యగా ఉంటాయి. కనీసం వందేళ్లుగా వీటిని అక్కడ సాగుచేస్తున్నారు. అక్కడ ఆ రకాన్ని సృష్టించినందువల్లే వాటిని బనగానపల్లి మామిడి అంటారు. కాలక్రమంలో వాటిని బంగినపల్లి, బనేషాన్, సఫేదా, చప్పటామ్, బెనిషాన్‌గా పిలుస్తుంటారు. బంగినపల్లి మామిడిని ఇష్టపడని వారు చాలా తక్కువ. ఇక భక్తులకు, ఆహార ప్రియులకు ఇష్టమైన తిరుపతి లడ్డూ ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. రోజుకు 1.50 లక్షల తిరుపతి లడ్డూలు ఇక్కడ తయారు చేస్తున్నారు. నిజానికి రోజుకు 8 లక్షల లడ్డూలు ఉత్పత్తి చేసే ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి. చెన్నైకు చెందిన ఓ ప్రైవేటు స్వీట్‌స్టాల్ యజమాని (2013) తిరుపతి లడ్డూ పేరుతో స్వీట్లను విక్రయిస్తున్న విషయం దృష్టికి రావడంతో టిటిడి అప్రమత్తమై చెన్నై కోర్టును ఆశ్రయించింది. జిఐ గుర్తింపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. టిటిడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటరి డిసిప్లినరీ స్సై అండ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్ట్ ప్రవీణ్‌రాజు కోర్టును ఆశ్రయించి టిటిడి కోరుతున్న తిరుపతి లడ్డూ జిఐ గుర్తింపు ఇవ్వరాదని కోరాడు. అది భక్తికి సంబంధించిన అంశమని, వ్యాపార వస్తువు కాదన్నది ఆయన వాదన. అయితే ఈమధ్య ఆ కేసు పరిష్కారమైంది. టిటిడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తిరుపతి లడ్డూకు జిఐ గుర్తింపు లభించింది. ఇలా ప్రతీదీ ఒక పోరాటమే. జిఐ గుర్తింపు కోరడం ఒక్కటే సరిపోదు. అర్హతలు, చరిత్ర, ప్రత్యేకతలను రుజువు చేసుకోవాలి.
ఇదీ మన జాబితా.. తెలంగాణలో ఇప్పటివరకు జిఐ గుర్తింపు పొందినవి దాదాపు పది ఉన్నాయి. పోచంపల్లి చీరలు, పోచంపల్లి ఇక్కత్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, పెంబర్తి లోహకళ, హైదరాబాద్ హలీమ్, గద్వాల చీరలు, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయిటింగ్, నిర్మల్ ఫర్నిచర్, కరీంనగర్ ఫిలిగ్రి వీటిలో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ఎక్కువగానే జిఐ గుర్తింపు పొందినవి ఉన్నాయి. ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ చీరలు, కాళహస్తి, మచిలీపట్నం కలంకారి, బుడితి, తొలుబొమ్మలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, బందరు లడ్డు, గుంటూరు సన్నమిరప, వెంకటగిరి చీరలు, బనగానపల్లి మామిడి జిఐ గుర్తింపు పొందాయి. తాజాగా దుర్గి సున్నపురాయి బొమ్మలకు గుర్తింపు వచ్చింది. ఇలా గుర్తింపు రావడం వల్ల ఆ వృత్తి, కళలపై ఆధారపడ్డవారికి ఆశలు చిగురిస్తాయి. దళారీలు, నకిలీల బెడద ఉండదు. వీటికి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది కనుక ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలు వీటి అమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తాయి. అదే జరిగితే కావలసినదేముంది. ఇంకా గుర్తింపు సాధించాల్సిన అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇదంతా ఒక ఎత్తు. అసలు ‘జిఐ’ గురించి విస్తృత ప్రచారం చేయాలని, అందుకోసం ఒక లోగోను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. లోగో కోసం ఒక పోటీని ఇటీవల నిర్వహించింది. ఫలితాలు త్వరలో వస్తాయ.
తిరుపతి లడ్డూ మహా రుచి
తిరుపతి లడ్డూ తెలియని వారు దేశంలో ఎవరూ ఉండరు. దాని విశిష్టతను కాపాడేందుకు తిరుపతి లడ్డూకు భౌగోళిక గుర్తింపు లభించింది. దీనివల్ల తిరుమలలో తయారయ్యే లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిహక్కులు సంక్రమిస్తాయి. దీనివల్ల ఇలాంటి లడ్డూను తయారుచేయడానికి, దాని పేరును వినియోగించుకునేందుకు ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇప్పటికే పలు చోట్ల తిరుపతి లడ్డూ పేరుతో ప్రసాదం అమ్ముతున్నారు. దానిపై టిటిడి పెద్ద పోరాటమే చేసినా ఎలాంటి హక్కులు లేకపోవడంతో దానిపై ముందంజ వేయలేకపోయింది, కాని ఇపుడు టిటిడికి లడ్డూపై సర్వహక్కులూ లభిస్తాయి. ఈ భౌగోళిక హక్కు కోసం టిటిడి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ -చెన్నైలో దరఖాస్తు చేసింది. దానిని పరిశీలించిన కార్యాలయం భౌగోళిక కాపీరైట్‌ను నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ట్రేడ్‌మార్కు జి ఎల్ వర్మ టిటిడి అధికారులకు అందజేశారు.
తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దాని రుచి, శుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకూ లేదు. భక్తులు దీనిని మహా ఇష్టంగా స్వీకరిస్తారు. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుండే లడ్డూ ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు, ఆ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేది. 15 ఏళ్లక్రితం లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవారు, తర్వాత గిరాకీ పెరగడంతో లడ్డూలపై సీలింగ్ విధించారు. స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలను దీనిలో వినియోగిస్తారు. 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయం మొదలైంది, నాటి నుండి బూందీ తీపి ప్రసాదం విక్రయించడం మొదలు పెట్టారు. అనేక విధాలా ప్రసాదం రూపం మారి 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. ఒకపుడు బియ్యపు పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారు, బియ్యపు పిండి, బెల్లం కలిపి కట్టిన లడ్డూలను మనోహరాలు అని పిలిచేవారు, తర్వాత శనగపిండికి మార్చారు. ప్రస్తుతం తిరుమలలో ఆస్థాన లడ్డూ, కళ్యాణోత్సవ లడ్డూ, ప్రోక్తం లడ్డూ అంటూ పలు అవసరాలకు అనుగుణంగా లడ్డూల తయారీ జరుగుతోంది.
రసగుల్లా వెస్ట్ బెంగాల్‌దే..
పల్చటి పాకంలో తేలే తెల్లని, మెత్తటి బంతుల్లాంటి రసగుల్లాలను చూస్తే నోరూరుతుంది. దేశవిదేశాల్లో దీనికి ఆదరణ చాలా ఎక్కువ. అయితే ఈ రసగుల్లాలు సృష్టించినది తామంటే తామని వెస్ట్‌బెంగాల్, ఒడిశా పోటీపడ్డాయి. వివాదం కోర్టులకు చేరింది. తాజాగా బెంగాల్ రసగుల్లాను భౌగోళిక గుర్తింపును ఇస్తున్నట్లు భారతీయ పేటెంట్ సంస్థ ప్రకటించింది. ఒడిశా, వెస్ట్‌బెంగాల్ మధ్య రసగుల్లాల గుర్తింపు విషయంలో వివాదం తమవద్దకు రాలేదని అధికారులు చెప్పారు. బెంగాల్ రసగుల్లాగా జిఐ గుర్తింపు ఇచ్చామని వారు చెబుతున్నారు. కాగా పూరీ దేవాలయంలో భగవంతుని నివేదించే ‘పహలా రసగుల్లా’ తయారీ 12వ శతాబ్దం నుంచి సంప్రదాయంగా వస్తోందని, రసగుల్లాపై జిఐ గుర్తింపు తమకే దక్కాలని ఒడిశా ఇన్నాళ్లూ వాదించింది. అయితే చివరికి పశ్ఛిమ బెంగాల్ విజయం సాధించింది. 1860లో నొబిన్ చంద్రదాస్ అనే అతడు పశ్చిమబెంగాల్‌లో ఈ రసగుల్లాలను కనిపెట్టాడని చెబుతారు. దాని ఆధారంగా పోరాడి చివరకు ప్రభుత్వం విజయం సాధించింది.

పోచంపల్లి ఇక్కత్ చీరలు
దేశవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న పోచంపల్లి ఇక్కత్ చీరలు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం పోచంపల్లిలో తయారవుతాయి. నిలుపు పేకల మగ్గంపై వేసిన చేనేత కళాఖండాలకు నేడు భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో ఇక్కత్ చీరలకు ప్రత్యేక గుర్తింపు చిహ్నం లభించింది. ఇక్కత్ నేతలో టైయింగ్, డైయింగ్‌లో 18 అంకాలుంటాయి. నేసే ముందు బండిళ్లకొద్దీ దారాలకు రంగులు అద్దుతారు. ఇప్పటికే పోచంపల్లి చీరలకు మేథోసంపత్తి హక్కులు కూడా లభించాయి. 11 డిజైన్లకు పేటెంట్ హక్కు లభించింది. జాతీయ స్థాయిలోనే గాక, అంతర్జాతీయంగానూ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ చీరలు మిగిలిన ప్రసిద్ధి చెందిన చీరలతో పోటీపడే అవకాశం దక్కింది. అంతర్జాతీయ మార్కెట్‌తో ధర కూడా లభిస్తుంది. జిఐ భద్రత ఉన్న వస్తువుల బ్రాండ్‌లు ఇతరులు దుర్వినియోగం చేయడానికి వీలుండదు. ఆ వస్తువులు ఉపయోగించే వినియోగదారులకు దాని ప్రామాణికతపై ఎలాంటి అనుమానాలు ఉండవు.
ఏటికొప్పాక లక్క బొమ్మలు
జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన విశాఖ జిల్లా యలమంచిలి మండలం వరహ నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక లక్క బొమ్మలకు కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కళకు ఇంతకాలానికి విశిష్ట గుర్తింపు దక్కినట్టయింది. ఎటువంటి హాని చేయని సహజమైన రంగులతో బొమ్మలను తయారుచేయడం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. ఏటికొప్పాక బొమ్మల తయారీ, ఆకారం, రూపం , పదార్ధంలోనూ ప్రత్యేకంగా ఒక ముద్రను వేశాయి. సహజంగా మృదువుగా ఉండే ‘అంకుడి కర్ర’గా పిలిచే రైట్టియా టింక్టోరియా అనే వృక్షం నుండి ఉపయోగించే చెక్కతో తయారుచేస్తారు. పెళ్లిమండపంలో సకుటుంబ సపరివార సమేతంగా ఉన్న బొమ్మ పల్లకి తయారుచేసి స్థానిక కళాకారులు శతాబ్దాల క్రితమే తమ సత్తా చాటారు. భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఈ ఏటికొప్పాక లక్క బొమ్మల పేరుతో ఇకపై ఇతరులు బొమ్మలు చేసి అమ్మకూడదు. ఈ నేపథ్యంలో సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర లభించడం సహా వీటిని విక్రయించడానికి ఆన్‌లైన్ సంస్థలూ ముందుకు వస్తాయి. ఫలితంగా ఈ కళకు ఆదరణ పెరిగి కళాకారులకు మంచి రోజులు వస్తాయి. ఈ లక్కబొమ్మలకు ప్రత్యేక హాలోగ్రామ్ కూడా ప్రకటించారు. వీటిపై ముద్రించేందుకు తల్లిప్రేమకు చిహ్నంగా ఉన్న బొమ్మను ఇందుకు ఎంపిక చేశారు.
దుర్గి రాతి విగ్రహాలు
దుర్గి రాతి విగ్రహాలలో జీవ కళ ఉట్టిపడుతుంది. గుంటూరు జిల్లా మాచర్లకు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న దుర్గిలో తయారయ్యే రాతి విగ్రహాలకు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. సున్నపురాయితో, లైమ్‌స్టోన్ గ్రానైట్‌తో రూపుదిద్దుకునే ఈ విగ్రహాలు 6 నుండి 12 అంగుళాల సైజులో ఉంటాయి. పల్నాడులో ఎక్కువగా సున్నపురాయి దొరుకుతుంది. ప్రాచీన శిల్పకళావైభవానికి ప్రతీక దుర్గి. శిల్పులను తయారుచేసే కార్ఖానాగా దుర్గి ప్రసిద్ధి చెందింది. దుర్గిలో 15వ శతాబ్దం నాటికే శిల్పకళాప్రాచుర్యంలో ఉంది, ప్రసిద్ధి చెందిన దుర్గి శిల్పకళాఖండాలు విశ్వవ్యాప్తంగా ఎగుమతి అయ్యాయి. ఆరు నుంచి 15 అంగుళాల సైజులో ఇక్కడి బొమ్మలు ఉంటాయి. నాగార్జున సాగర్ తవ్వకాలలో బయలుపడిన అనేక విగ్రహాలలో దుర్గి శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. శతాబ్దాలు గడచినా ఆ కళను కాపాడుకోవడం దుర్గి విశిష్టత.

-ఎస్.కె.రామానుజం