S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర రాగ లయజ్ఞులు తామనుచు వదరేరయ్యా!

వక్తా.. శ్రోతాచ దుర్లభా! అంటారు. సంగీత రసజ్ఞత, సంస్కారం కలిగిన శ్రోతలెదురుగా ఉంటే విద్వాంసుడు గజారోహణం చేసినంతగా సంబరపడతాడు. తన విద్యకు సార్థకత లభించినంతగా పొంగిపోతాడు. సర్వసాధారణంగా మహా విద్వాంసుల కచేరీకి బొత్తిగా సంగీత సాహిత్య వాసన లేని ప్రముఖుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూంటారు. సంగీతం గురించి తెలిసీ తెలియని మాటలేవో నాలుగు చెప్పి వేదిక దిగి వెళ్లి మొదటి వరుసలోనే ఆశీనుడౌతారు. అంతవరకూ బాగానే ఉంటుంది. కూర్చోగానే శ్రద్ధగా సంగీతం విందామనుకున్న వారి ప్రక్క చేరి బాతాఖానీకి దిగుతారు. పనికిరాని కబుర్లతో విసిగించి కాసేపటికి చేతిలో సెల్‌ఫోన్‌తో అదేదో కొంప మునిగిన విషయమైనట్లు లేచి సెల్‌ఫోన్‌లో చిరునవ్వులు చిలికిస్తూ నిష్క్రమిస్తాడు. వీరివల్ల లోకానికి ఏమిటి ఒరిగేది? ఏమీ లేదు. తెలిసీ తెలియని వారిని పిలవటమే వేడుక కొందరికి. మేలుకొలుపు నుండి పవ్వళింపు సేవ వరకూ దివ్య నామ సంకీర్తనలతో పొద్దు గడిపిన త్యాగరాజు లోకరీతి, బాగా తెలిసినవాడే. ఇంట్లో కుదురుగా కూర్చున్నా ప్రపంచాన్ని చూశాడు. మూర్తిత్రయం వారిలో ప్రముఖులైన శ్యామశాస్ర్తీ, దీక్షితర్‌లు కూడా త్యాగయ్యతో కలిసి ఒకేచోట నివసించినవారే. పక్కపక్కనే వున్నప్పటికి తరతమ భేదాలు, అంతరంగాల్లో అంతరాలూ ఏ మాత్రం వుండేవి కావు. పైగా ఒకరినొకరు కలుసుకునేవారు కూడా. తనకంటే గొప్పవారిని ‘ఎందరో మహానుభావులని’ సగర్వంగా అభినందించాడు. చిన్నవారిని ప్రోత్సహించాడు. ఆయనకు ద్వేషం లేదు. ఆత్మస్తుతి ఎరగడు. పరనింద చేయలేదు. సంగీత విద్వాంసుల కుండవలసిన ప్రాథమిక గుణం ఇదే. కానీ యిటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఏనుగు లక్ష్మణ కవి అంటాడు..
హృదయ వచశ్శరీరముల నెంతయు పూర్ణ సుధాప్రపూర్ణులై/ ముదము బహూపకారముల మూడు జగంబులకు.../ వదలక సాధు సద్గుణలవంబులు కొండలు సేసి మెచ్చుచున్/ మదిని వికాస యుక్తులగు మాన్యులు కొందరు కొల్తురిద్ధరన్.
మనోవాక్కాయ శుద్ధితో అమృత హృదయులై త్రిలోకాలకూ మేలు చేస్తూ సజ్జనుల్లో ఏ మాత్రం కాస్తంత సద్గుణమున్నా దాన్ని కొండంతలుగా చేసి మెచ్చుకునే వారిని ఎందరో మహానుభావులని కొనియాడిన నిగర్వి త్యాగయ్య.
త్రిభువనం స్వామినాథయ్యర్, తూము నరసింహదాసు, వారణాశి నివాసి యైన గోపీనాథ భట్టాచార్యులు, తమిళనాడులోని గోపాలకృష్ణ భారతి, షట్కాల గోవింద్ మరార్ (తిరువాన్కూర్ సంస్థానంలోని విద్వాంసుడు) మొదలైన వారందరూ త్యాగయ్య నిరాడంబరత ఎరిగిన వారే. సంగీతంలో కూడా సాత్త్విక, రాజస, తామస గుణాలుంటాయన్నాడో పండితుడు. త్యాగయ్య కోరుకున్నది, పాడుకున్నది, సాత్త్వికమైన భక్తి సంగీతం. అందుకే (్భక్తి బిచ్చమీయవే) భావుకమగు సాత్త్విక భక్తి నివ్వమంటాడు.
సాత్త్వికమైన భక్తికి పరిపూర్ణమైన సుఖం ఉంది. ఆత్మానందం ఉంది. ఎవరో వింటున్నారనే భావమంటూ ఉండదు. ఎవరి కోసమూ పాడరు. ఆత్మోద్ధరణకు మాత్రమే పాడుకున్న త్యాగరాజాది మహనీయుడికి దక్కిన సంగీతం ఇదే. లోకంతో పనిలేదు. శ్రోతలతో అవసరం లేదు. వారి లోకంలో వాళ్లు హాయిగా గాన విహారం చేస్తూ బ్రహ్మానందంలో మునిగిపోతారు. రాజసంతో కూడిన సంగీతం పాడేవారితోపాటు వినేవారు కూడా ఆనందిస్తూంటారు. ఇందులో గాయకుడు నటుడులా పాడతాడు. హావభావాలు ప్రదర్శిస్తూంటాడు. లౌకిక ప్రయోజనమే ప్రధానం. ఇంక తామసంతో కూడిన సంగీత కచేరీలే ఇపుడు మనం తరచుగా వింటున్నాం. కేవలం గాయకుడి సాధనా బలాన్ని ప్రదర్శించటమే తప్ప, ఆత్మానందమంటూ వుండదు. ఎవరికీ దొరకదు కూడా. సాహిత్యంలోని అర్థాన్ని గ్రహించరు. వారికి నాదసుఖంతో అసలే పనిలేదు. ఇప్పుడు కొందరు విద్వాంసులకు కావలసింది కేవలం తామస గుణ ప్రధానమైన సంగీతం. వారికి కావలసినది పోటీ తత్త్వం. పక్క వాద్యాల వారికి పాటకుడు, పాటకునికి పక్కవాద్యాలు సహకరించడం పోయి ‘నువ్వెంతంటే నువ్వెంత’ అనే రీతిలో పాడే తామస గానం వల్ల సాహిత్యం ఒక్క ముక్కా అర్థమై చావదు. ఇంకెందుకా పాట? ప్రజల్లో కర్ణాటక సంగీతం పట్ల అనుకర్తి లేకపోవడానికి ఇదో కారణం. ‘నాద సుఖం కంటే లయకు ప్రాధాన్యత పెరగడం, చిత్ర విచిత్ర వేషధారణతో వస్తున్నట్లు’గా లయ వాద్య కళాకారులు దర్శనమివ్వటం లేదూ? సుఖంగా సాహిత్యం, సంగీతం విందామని కూర్చుంటే జ్ఞాపకశక్తి, దేహబలం ప్రధానం. తాళం ముందుకు వచ్చి కూర్చుని ఢమఢమ ధ్వనుల మధ్య ‘నాద సుఖం’ కాస్తో కూస్తో నడిస్తే ఇంకెందుకా పాట? సంగీత రసికులకు సంగీతం వినాలనే ఆసక్తి ఉంటుందా? ఇందుకే అన్ని వాద్యాలనూ వదిలిపెట్టి మృదంగ తాళం సొగసుగా ఉండాలని ప్రత్యేకంగా గుర్తు చేశారు త్యాగయ్య. పాట కోసమే తాళం. తాళం కోసం పాట కాదు. పాటను అనుసరించేదే తాళం - మృదంగం. వాద్యంలో నేర్చుకున్న వరసలన్నీ కుమ్మరించటం కాదు.
చెంచు కాంభోజి రాగంలో త్యాగయ్యగారి కీర్తన గమనించండి.
ప॥ వర రాగ లయజ్ఞులు తామనుచు వదరేరయ్యా/ అ ప॥ స్వర, జాతి, మూర్చనా భేదములు/ స్వాంతమందు తెలియక యుండియు ॥
చరణం: ఏవరోద్భవంబగు నాదమున్, దివ్యవౌ ప్రణవాకారమనే/ దాహం బెరుగని మానవుల్ - త్యాగరాజనుత ॥
త్యాగయ్య ఈ కీర్తన వ్రాయటానికో బలమైన కారణం ఉంది.
ఆయన కృతులు కొన్ని మనస్సున నాటే ఉపదేశాలతో నిండి ఉంటాయి. కొన్నిటిలో దీనుడై వేడుకొన్నట్లు, మరికొన్ని మనసును సంబోధించినట్లు, కొన్నింటిలో నిందాస్తుతులో, స్తుతి నిందలో కనిపిస్తాయి.
దేశ కాల పరిస్థితులలో మార్పులు కనిపించాయి. మనుషుల్లో మార్పు కనిపించడం గమనించారు. కేవలం సరళీ స్వరాలు తెలిసినవారు సంగీతమే ఔపోసన పట్టినంత అహంకారాన్ని చూపించడం మొదలెట్టారు. అయినవాణ్ణీ కానివాణ్ణీ ఇంద్రుడనీ, చంద్రుడనీ పొగడుతూ, వారి అవసరాలు తీర్చుకోవడానికి అలవాటుపడ్డారు. మనుషులలో శీల గుణాల పోయాయి. జార చోరత్వ లక్షణాలు మొదలయ్యాయి. అయోగుల్ని అసమర్థులనూ పొగడుతూ కవిత్వాలు రాయడం, పాడటం ప్రారంభమయింది. ఈ పరిణామాలు గ్రహించిన త్యాగయ్య ఆవేదనతో రాసిన (పాడుకున్న) కీర్తన ఇది.
తంజావూరు నేలిన ప్రభువులకు కొంతకాలానికి కళాపోషణ పట్ల శ్రద్ధ తగ్గింది. అశ్లీలంతో కూడిన సాహిత్యం మొదలైంది. సంగీత సాహిత్యాలు నట విట గాయకుల పాలయ్యాయి. మతోన్మాదం, మతద్వేషం కూడా బయలుదేరి రాజులు స్తుతిప్రియులై భోగలాలసులై సచాశ్రయులవడాన్ని గమనించి బాధపడిన త్యాగయ్య ఆవేదనతో పాడుకున్న కీర్తన.
నిజం చెప్పాలంటే ఈ వేళ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటున్నాయి. దర్శనంలో కూడా డాంబికత ఏర్పడింది. దశ సహస్ర గళ అర్చన లక్ష గళార్చన పేరుతో జరిగే మాయల్ని చూస్తున్నాం కదా. మనుషుల బలహీనతలు వ్యాపార వస్తువులై పోయాయి.
మనుషులలో మానవతా విలువలు పోయాయి.
ఆరోహణ అవరోహణ, స్వర మూర్ఛనాదులు తెలియకపోయినా, నోటికి వచ్చినట్లు పాడేయటం ప్రారంభించారు. నాభి, హృదయం, కంఠం నుండి వచ్చే దివ్యమైన ఓంకార నాదంలోని రుచి తెలియని వారంతా మహా గాయకులమని విర్రవీగుతూ తిరగటం కూడా త్యాగయ్య గమనించే వుంటాడని ఈ కీర్తన చెబుతుంది.
ఇది వరకు గుప్తదానాలు చేసేవారు. ఈ వేళ మంచినీళ్ల కుండలతో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన వారు కూడా ఫొటోలతో ప్రశంసలు కోరుకోవటం లేదూ?
కోసిచ్చేదే గొప్పాయెనురా/ కవిలో.../ హరిదాసులు సేవింపరనుచు ప్రభువులు/ దయ మానిరి పరమెంచక పోయిరంటా’డు త్యాగయ్య.
హరిదాసు మమ్మల్ని సేవించడం మానేసి హరిని సేవిస్తారేమి? అనే అహంకారంతో విర్రవీగే రాజులను నిరశిస్తూ చాలా కీర్తనల్లో తన ఆవేదన వెళ్లగ్రక్కాడు.
సంగీతం విలాస విద్య కాదు. జవసత్త్వాలుండి సాధనకు తట్టుకోగల ఆరోగ్యముండాలి. సంప్రదాయం మీద భక్తి గౌరవాలుండి, లక్ష్య లక్షణం తెలిసిన సద్గురువులు దొరకాలి. లక్షలు ఆర్జించగల అర్హతలుండీ సంప్రదాయ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగిన వారెందరో దక్షిణాదిలో వున్నారు. గురువును బట్టే గురి. ఎంతకాలం ఎవరి దగ్గర నేర్చుకున్నామనేది కాదు ప్రధానం. ఎలా పాడాలన్నదే లక్ష్యంగా ఉందా?
మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే అంశాల్లో సంప్రదాయ సంగీతం ఒకటి. సంగీతాన్ని ఆలంబన చేసుకుని ఎన్ని బాణీలున్నా, శుద్ధ సంగీతం లేనిదే ఏదీ నిలబడదు. మద్రాసులో నా మిత్రుడు, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు పి.బి.శ్రీనివాస్‌కు కర్ణాటక సంగీతమంటే మహా ఇష్టం. కొనే్నళ్లు నేర్చుకున్నాడు. విరిబోణి వర్ణం నేర్చుకోవడానికి ఎంతో శ్రమ పడేవాణ్ణి. సంప్రదాయ సంగీతంలోని మాధుర్యం తెలియని రోజుల్లో యాంత్రికంగా నేర్చుకునేవాణ్ణి. కొన్నాళ్ల తరువాత విరమించాను. అర్ధశతాబ్దం దాటిన తర్వాత ‘సంగీతంలోని విలువ ఇప్పుడు తెలిసొస్తోంది. సినీ గాయకునిగా పేరు సంపాదించాను. సంగీత విద్వాంసుడిగా కీర్తి లభించి వుంటే ఎంతో తృప్తి లభించేది కదా? అంటూండేవాడు.
ఓ రోజు మైలాపూర్‌లో నేనున్న హోటల్‌కు వచ్చి చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పి బయలుదేరుతోంటే అడిగాను.
-ఎంతో టాలెంటున్న గాయకులు మీరు పాడిన పాటల్ని యథాతథంగా పాడగల్గుతున్నారు కదా? వారిలో సంగీతం నేర్చుకున్న వారు చాలా తక్కువ. కనీసం ప్రాథమిక సంగీత జ్ఞానం లేకపోయినా పాడి మెప్పిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అందుకని కట్టుదిట్టంగా సంగీతం నేర్చుకోలేదనే చింత మీకుండవలసిన పని లేదు అన్నాను.
‘ఎవరో పాడేసిన పాట, పదిసార్లు వినేసి పాడటం కాదు. స్వయంగా పాడగలగాలి. తనేమిటో నిరూపించుకోవాలి. రాగాలేమిటో తెలియాలి. వాటికున్న పరిధులు తెలియాలి. నాకున్న సంగీత జ్ఞానం నాకుపయోగపడింది. ఎనె్నన్నో పాడాను. పాట నాభిలోంచి రావాలి. పెదవులపై పలికించటం కాదు’ అని కాస్సేపు ఆ పునాదుల్లేని భవంతికి ఎప్పుడైనా ప్రమాదమే’ అని ముగించి వెళ్లిపోయాడు.
ఐహిక విద్య అయినా ఆముష్మిక విద్య అయినా అభ్యాసం చేసిన కొద్దీ పెరిగేదే కాని రాత్రికి రాత్రే సిద్ధించేది కాదు. సంగీతంలో అభ్యాస సంగీతం, భాషకు వ్యాకరణం లాంటిది. శుద్ధమైన సంగీతం నేర్చుకునే వారికి చక్కటి వాతావరణం ఉండాలి. గుంపులో గోవిందా అన్నట్లుగా కూర్చోబెట్టి చెప్పేస్తే వచ్చేది కాదు. సంగీతం అందరికీ ఒకే పద్ధతిలో నేర్పటం కుదరదు. అందరి కంఠస్వరాలూ ఒకేలా వుండవు. పరీక్షల్లో 35 మార్కులు సంపాదించాలనుకునే గురు శిష్యుల ప్రయోజనం అదే లక్ష్యం.
దీన్ని సాధించటానికి కావలసిన ఏవేవో కొత్తవి కనిపెట్టేస్తారు. ఆ యేఱు దాటిన తర్వాత తిరిగి చూడవలసిన పని లేదు. సంగీతం అలా కాదు. ఒక కవి కావ్యాన్ని రాస్తే, అదే కావ్యాన్ని ఎంతమందికైనా వినిపించవచ్చు. ఒకసారి చిత్రించిన తైలవర్ణ చిత్రాన్ని తరువాత ఎందరికైనా చూపించవచ్చు.
ఒక విద్వాంసుడు ఏ రెండు మూడేళ్ల క్రితమో అత్యద్భుతంగా తోడి రాగం పాడి శ్రోతల అభినందనలు పొందితే, ఈ వేళ ఆయన్ని పిలిచి సత్కరించరు. ఎప్పుడూ అలాగే శక్తివంతంగా పాడుతూండాలి. ఎప్పటికప్పుడు మారిపోయేది మనోధర్మం. అతడి పాట మెఱుపు తీగ లాంటిది. అందుకే ఎప్పటికప్పుడు కొత్తకొత్త ప్రయోగాలతో మెప్పించవలసిన విచిత్రమైన విద్య సంగీతం.
రోజూ పాడుకోవాలి. లేకపోతే స్వాధీనం తప్పుతుంది. కర్ణాటక సంగీతానికీ సినిమా సంగీతానికీ పోలికే లేదు. ఎప్పుడు పాడినా సంప్రదాయ సంగీతం నవ నవోనే్మషంగానే ఉంటూ రసికులను ఆనందింపజేస్తూండాలి. శరీరం, శారము (సంగీతం) రెండూ అదుపులో వుండాలి. ప్రభుత్వ ఆధీనంలో ఎన్నో సంగీత కళాశాలలున్నాయి. అధ్యాపకులెందరో వున్నారు. వీరిలో సంగీత విద్వాంసులతోబాటు కేవలం సంగీతం విద్యార్హత మాత్రమే కలిగిన వారు కూడా ఉంటారు. వారు నేర్చుకున్న కీర్తనలు మాత్రమే పాడగలరు. అంతకు మించి వారికున్న ప్రత్యేకత ఉండదు. జన సామాన్యంలో సామాన్యమైన సంగీతాభిరుచిని కలిగించటమే కాని, సంగీత కళాశాలల్లో సంగీత విద్వాంసులను తయారుచేయటం మాత్రం మా ఉద్దేశం కాదని వాళ్లను వారు సమర్థించుకుంటే ఆ సంగీత కళాశాలల వల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమీ వుండదు. వృథా వ్యయ ప్రయాసలు తప్ప. సంగీత కళాశాలలంటూ లెక్క కోసం వున్నాయే గాని సంప్రదాయ సంగీతం పట్ల సదవగాహన కలిగిన ప్రభుత్వ అజమాయిషీ లేదు.
సంగీత బోధన, సాధనకు అర్థం తెలియని అధికారులు అజమాయిషీ ఎలా చేస్తారు. రిటైరైన తర్వాత సంగీతం నేర్చుకోవాలనే కోరిక తీరనివారూ, వివాహమై పిల్లలున్నా, ఆశ తీరక సంగీత భ్రాంతిని వదల్లేని వారి కోసం, వారికి అనుకూలమైన వేళల్లోనే ఈ ప్రభుత్వ సంగీత కళాశాలలు నడుస్తూ, వాటి ఉనికిని చాటుతున్నా, వారానికి ఒకటి రెండు గంటలపాటు సరళీ స్వరాలు, గీతాలు పాడించటం వల్ల సంప్రదాయ సంగీతం పట్ల సదవగాహన ఎంతవరకూ ఏర్పడుతుందనేది సమాధానం దొరకని ప్రశ్న.
అక్షరాభ్యాసంతోనే అభిరుచి పుట్టదు. నేర్చుకోవాలనే వొక్క ఆశతోనే కలగదు. సాధన కంటే సంస్కారం ముఖ్యం. సంగీత విద్వాంసులను ఆహ్వానిస్తూ, రాగాలాపన, స్వరకల్పన లాంటి మనోధర్మంతో కూడిన అంశాలపై విస్తృతంగా సోదాహరణ ప్రసంగాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యుత సంగీత కళాశాలకు ఉంది. కానీ అటువంటి ఆలోచన పొరబాటున కూడా వారికి కలగదు. నేర్చుకునేవారికీ నేర్పేవారికీ ఏం కోల్పోతున్నారో తెలియని స్థితి. ఊళ్లో జరిగే సంగీత కచేరీలకు, సంగీతం నేర్చుకునే విద్యార్థులు వెళ్లరు. కానీ సంగీతం కావాలి. కొందరు సంగీతానికి సంగతులెందుకు? అంటారు. శ్రుతి చేసేంతవరకూ వేచివుండే ఓర్పుండదు. కొందరికి అసలు తంబురా శృతికి అర్థమే తెలియదు. ఏళ్లు గడిచిపోతాయి. డిప్లొమోలు చేతికొచ్చేస్తాయి. నాద సౌఖ్యం సంగతి దేవుడెరుగు. దూరమైనా, భారమైనా ఎంతో ప్రయాసపడి నేర్చుకున్న వారకి ఆ డిప్లొమోలు కూడా దక్కకపోతే, అర్హులు లేక కాలేజీయే అనవసరమనే ఆలోచన వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ ప్రమాదం ఎప్పుడూ పొంచి వుండే వుంటుంది. పర్యవసానం సంప్రదాయ సంగీతం పట్ల గౌరవాభిమానాలు క్షీణించటం, పైగా కష్టపడి అంకితభావంతో పాడేవారి పట్ల నిరాదరణ రెంటికీ చెడ్డ రేవడిలా, ఏళ్ల తరబడి నేర్చుకున్నది ఒంటబట్టక అతి తేలికగా పాడి ఊదేసే సినిమా పాటలే ధ్యేయంగా పేరు కోసం ప్రాకులాడటం, ఈ పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తృప్తి లేని బ్రహ్మానందాన్ని ప్రసాదించే దివ్యమైన సంగీత విద్యకు సంగీత విద్వాంసుల వల్లే ముందు గౌరవం పెరగాలి. నాదంలోని రుచి బోధించే అధ్యాపకులకే తెలియక పోతే, ఇక నేర్చుకున్న వారికేం తెలుస్తుంది? అందుకే కర్ణాటక సంగీతం అందని ద్రాక్ష కారాదు.

- మల్లాది సూరిబాబు 9052765490