S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రిమ్‌జిమ్... రిమ్‌జిమ్... హైదరాబాద్...మెట్రోరైలూ జిందాబాద్

మన హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరును మించిపోతోంది తెలుసా!...
ఇది పిచ్చాపాటీగా బస్సుల్లో, రైళ్లలో, ఆటోల్లో ప్రజలు మాట్లాడుకుంటున్న మాట...
..అలా ప్రయాణం సాగిస్తూ తలఎత్తి మెట్రో ట్రాక్‌ను చూస్తూ నగరానికి కొత్త అందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది కదూ...అనుకోవడం కొద్దిరోజులుగా మామూలైపోయింది.
ఐటీ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో మైత్రివనం జంక్షన్‌లో ఓ గంట నిల్చుంటే మెట్రో మాట వినిపించకుండా ఉంటుందేమో చూడండి....
అసలు మన హైదరాబాద్ మెట్రో గొప్పదనం, ప్రత్యేకతలేమిటో ఆ ప్రాజెక్టు అధికారులను అడగక్కర్లేదు... ఇప్పటికే విశేషాలను తెలుసుకున్న హైదరాబాదీలు... ఎప్పుడెప్పుడు అధునాతన మెట్రో రైలు ఎక్కుదామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ శుభసమయం ఎంతోదూరంలో లేదు. రెండు రోజులాగండి చాలు... మీరూ ఆ బాటనే ఎంచుకుంటారు.
అభివృద్ధికి.. అధునాతన సాంకేతికతకు..
మహిళల సాధికారతకు... సౌకర్యానికి
భాగ్యనగర సోయగానికి మెట్రో సరికొత్త సొబగులు తెస్తోందంటే
అతిశయోక్తి కాదు..
దాదాపు దశాబ్దకాలంగా కలలు కంటున్న మెట్రోరైలు మరో రెండు రోజులలో సాకారం కాబోతోంది. మనం ఎక్కాల్సిన మెట్రోరైలు 48 గంటల దూరంలోనే ఉంది. ఆలనాడు హైదరాబాద్ నగర వైభవాన్ని రిమ్...జిమ్... రిమ్..జిమ్...హైదరాబాద్... రిక్షావాలా జిందాబాద్ అంటూ ఒక సినీ కవి వర్ణించాడు. ఇక నుంచి ఆ పాటకు బదులుగా హైదరాబాద్ విశ్వనగరిగా రూపుదిద్దుకుంటోన్న నేపథ్యంలో రిమ్...జిమ్.. రిమ్..జిమ్ హైదరాబాద్... మెట్రోవాలా జిందాబాద్ అని పాడుకోవాల్సిందే.
హైదరాబాద్ మైట్రోరైలు ప్రాజెక్టు...ఒక సాదాసీదా ప్రజారవాణా వ్యవస్థ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక వౌలిక వసతుల ప్రాజెక్టులలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు భిన్నమైంది. ఇది కేవలం రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు, హైదరాబాద్ నగర పునర్నిర్మాణ (అర్బన్ రీడిజైన్) ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. దీనిని రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఎంఎంటిఎస్ లోకల్ రైళ్లతో అనుసంధానం, స్కైవాక్‌లు, ఫుట్‌పాత్‌లతో పాదచారులకు సౌకర్యం, మెట్రో స్టేషన్లలో బైక్ స్టేషన్లు, సైకిల్ ట్రాక్‌లు, హరిత స్టేషన్లుగా తీర్చిదిద్దడం ఒక భాగమైతే, రెండో భాగం మెట్రోరైలు స్టేషన్లలో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, వ్యాపార, వాణిజ్య ప్రాంగణాలకు అధునాతన వసతి సౌకర్యాలతో భవనాలు అద్దెకు లభించడం వంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కూడా ముడిపడి ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే మెట్రోరైళ్లను తమ వ్యాపార, వాణిజ్య వస్తువుల విక్రయాల ప్రచారానికి కూడా దోహదం చేయనున్నాయి. ప్రపంచంలోని 200 మెట్రోరైలు ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిలోని లోటుపాట్లను అధిగమించి రూపొందించిన అత్యుత్తమ, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ఇది. అందుకే దీనికంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐదు సంవత్సరాల కిందట లండన్‌లో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడర్‌షిప్ ఫోరం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వంద ప్రాజెక్టులు పోటీ పడగా వడపోతలో మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటిలో అజర్ బైజాన్‌కు చెందిన ట్రాన్స్ అనటోలియన్ గ్యాస్ పైప్‌లైన్ (రూ.37,800 కోట్లు), కువైట్‌కు చెందిన అల్ అబ్దాలియా సోలార్ ప్రాజెక్టు, ఇండియా నుంచి మన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు (రూ.14,132 కోట్లు) పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నంబర్ వన్‌గా ఎంపికై గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013 అవార్డును కైవసం చేసుకుందంటే ఇక దీని ప్రత్యేకతలను వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
*
ప్రాజెక్టు ప్రత్యేకతలు...
శంషాబాద్‌లో 2009లో ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి ముందే 2006లోనే హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు అంకుర్పాణ జరిగింది. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) మేనేజింగ్ డైరెక్టర్, మెట్రో గురుగా పేరుగాంచిన శ్రీ్ధరన్ హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు డిజైన్ చేసారు. ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో తనకు ఎదురైన లోటుపాట్లు, అనుభవాలను రంగరించి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోరైలును తీర్చిదిద్దారు. నాలుగు వందల ఏళ్లకిందటి నాటి చారిత్రక హైదరాబాద్ నగరం అశాస్ర్తియంగా అడ్డదిడ్డంగా విస్తరించింది. ఇరుకైన రోడ్లు, జనసాంద్రతతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో చారిత్రక నగరంలో మరో ప్రజారవాణా వ్యవస్థకు అవకాశమే లేని పరిస్థితి. భూ ఉపరితలం నుంచి కానీ, భూగర్భం (అండర్ గ్రౌండ్) నుంచి మాత్రమే అవకాశం ఉందని అధ్యయనం జరిపిన నిపుణులు గుర్తించారు. అండర్‌గౌండ్ కంటే భూ ఉపరితలం పై నుంచి అయితే త్వరగా మెట్రోరైలును అందుబాటులోకి తీసుకురావచ్చని సూచించారు. ఈ మేరకు ఎక్కడా అండర్ గ్రౌండ్ మార్గం లేకుండా పూర్తిగా భూపరితలం నుంచే మెట్రోరైలుకు డిజైన్ చేసారు. అందుకే దీనిని ఎలివేటెడ్ హైదరాబాద్ మెట్రోప్రాజెక్టుగా సాంకేతికంగా నామకరణం చేసారు. ప్రభుత్వాలకు సంక్షేమ కార్యక్రమాల వ్యయం తలకు మించిన భారం కావడంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థకు అప్పగించినట్టే హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును గ్లోబల్ టెండర్ల ద్వారా 2010లో ఎల్ అండ్ టి సంస్థకు ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానం ద్వారా అప్పగించింది. మూడు దశల్లో 72 కి.మీ పొడవున ఐదేళ్ల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేసే విధంగా రూ.14,132 కోట్ల వ్యయం అంచనాతో ఒప్పందం చేసుకుంది. భూ సేకరణ, రోడ్ల అభివృద్ధి వంటి పనులకు ఖర్చయ్యే వ్యయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్లు, ఫండ్ గ్యాప్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్లు కేటాయించింది. మొదటి దశ మెట్రో మార్గాన్ని 2014 మార్చి నాటికి, ప్రాజెక్టు మొత్తాన్ని ఐదేళ్ల వ్యవధిలో పూర్తిచేసే విధంగా ఎల్ అండ్ టి సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే హైదరాబాద్ నగరంలో చారిత్రక, వారసత్వ కట్టడాలను కనుమరుగు చేసే విధంగా మెట్రో మార్గానికి డిజైన్ చేసారని వివాదం రేగింది. 2009-2014 వరకు ఉద్ధృతంగా సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు ఆలైన్‌మెంట్ మార్చాలని పెద్దఎత్తున ఆందోళన దిగారు. ఆలైన్‌మెంట్ మార్పు వంటి వివాదాలకు తోడు తెలంగాణ రాష్ట్ర విభజనకు అప్పటి పాలకులు మైట్రోరైలు ప్రాజెక్టును పావుగా వాడుకున్నారు. మెట్రోరైలు ప్రాజెక్టును 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఉండటం వల్ల కాంట్రాక్టు దక్కించుకున్నామని, రాష్ట్రం విడిపోతే ఈ ప్రాజెక్టు గిట్టుబాటు (వయబుల్) కాదని మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కేంద్రానికి రహస్యంగా లేఖ రాయడం మరో వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో మొదటి దశ నిర్మాణం పూర్తి కావడానికి మూడేళ్ల జాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు ఈ నవంబర్ 28 నాటికి అందుబాటులోకి రాబోతోంది. ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్స కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
*
మెట్రో రైలు ఎందుకు?
హైదరాబాద్ పట్టణ జనాభా 1948లో లక్ష 30 వేలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 68 లక్షలు. పొలిమేర ప్రాంతాలకు విస్తరించిన హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) పరిధిలో ఇది 80 లక్షలు కాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయే వారితో కలిపితే ప్రస్తుతం కోటికిపైగానే ఉంటుందని అంచనా. మరి నగరంలో కోటి మందికి సరిపడ ప్రజారవాణా వ్యవస్థ ఉందా? లేదనే చెప్పాలి. ప్రజారవాణా వ్యవస్థ జనాభాకు సరిపడ లేకపోవడంతో ప్రజలు సొంతంగా రవాణా సౌకర్యాన్ని కల్పించుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
‘హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అతి పెద్ద సమస్య. ఏదైనా శుభకార్యానికిగానీ, మరేదైనా కార్యానికిగానీ వెళ్తే అక్కడ ఉండేది పది, పదిహేను నిమిషాలే అయినా చేరుకోవడానికి ట్రాఫిక్ జామ్‌ల చక్రవ్యూహాన్ని ఛేదించుకుని గమ్యం చేరుకోవడానికి రెండు మూడు గంటలు పడుతుంది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇది అక్షర సత్యం. ఇక్కడి ట్రాఫిక్ సమస్యకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. దక్షిణ భారత రాజధానిగా పిలువబడే హైదరాబాద్ నగరం దేశంలోనే ఐదవ పెద్ద నగరం. ఐదవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి చేరుకునే గమ్యానికి చేరువలో ఉన్నట్టు అంచన. హైదరాబాద్ నగరం శరవేగంగా, విశ్వనగరంగా మారుతుండటంతో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు జటిలంగా మారిపోతుంది. పైగా ఫార్మా, ఐటీ, బయోటెక్, టూరిజమ్ వంటి రంగాలు శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. ఒకవైపు విస్తరించిపోతున్న నగరాన్ని చూసి సంతోషించాలా? కిక్కిరిసిన జనసాంద్రత వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు బాధపడాలో తెలియని పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్ స్థాయి నగరం మరొటి లేకపోవడంతో ప్రతీ పనికి అనునిత్యం జిల్లాల నుంచి లక్షలాది మంది జనం రాకపోకలు సాగిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ, విద్యా, మార్కెట్, వ్యాపార అవసరాల కోసం పట్టణ, నగర ప్రాంతాలకు ఏటేటా వలసలు రావడం శరవేగంగా పెరిగిపోతోంది. మరో నాలుగు సంవత్సరాలలో 2021 నాటికి హైదరాబాద్ మహానగర జనాభా కోటి 30 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం నగర జనాభా కోటి కాగా నగరంలో వాహనాల సంఖ్య కూడా ఇందులో సగానికి చేరుకుందంటే అతిశయోక్తికాదు. రాష్ట్ర రవాణా సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం రోడ్లపైకి కొత్తగా సుమారు 50 వేల వాహనాలు వస్తున్నాయి. నగరంలో 2008లో 16 లక్షల ద్విచక్ర వాహనాలు ఉంటే వాటి సంఖ్య 2016 అక్టోబర్ నాటికి 36 లక్షలకు చేరుకుంది.
పెరిగిన వాహనాల వృద్ధిరేటు 118 శాతం. అలాగే 2008లో నగరంలో 3.75 లక్షల కార్లు ఉంటే వాటి సంఖ్య అక్టోబర్ 2016 నాటికి 8.5 లక్షలకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు, ఆర్టీసి బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల సంఖ్య కలిపితే 50 లక్షల వరకు ఉంటుందని అధికారిక సమాచారం. ప్రస్తుతం నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 40 లక్షల రాకపోకలను సాగిస్తున్నాయి. వీటిలో సిటీ బస్సులు, లోకల్ రైళ్లు 4 శాతం, ద్విచక్ర వాహనాలు 72 శాతం, ఆటోలు 25 శాతం, కార్లు 20 శాతం ఉన్నట్టు లెక్కించారు. నగరంలో పెరిగిపోతున్న వాహనాల ట్రిప్‌లెంగ్త్ 1980లో 7 కి.మీ కాగా అది 2010 నాటికి 18 కి.మీ, 2016 నాటికి 24 కి.మీటర్లకు చేరుకుంది. అలాగే నగరంలో 1980లో వాహనాల సగటు వేగం గంటకు 30 కెఎంపిహెచ్ కాగా ప్రస్తుతం 10-12 కెఎంపిహెచ్ భవిష్యత్‌లో 8-10 కెఎంపిహెచ్‌కు చేరుకోబోతుందనే సర్వేలు మరింత అందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో వాహన చోదకులు గమ్యానికి చేరుకోవడమే గగనంగా మారింది. దీనికి తోడు వాహన వాయు, ధ్వని కాలుష్యాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నగర జీవనం దుర్లభంగా మారిపోనుందనే ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి నుంచి గటెక్కడానికే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దూరదృష్టితో నగరం చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్లు, పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఎంఎంటిఎస్ రైళ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు, రోడ్లు, జంక్షన్ల విస్తరణపై దృష్టి సారించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెరుగుతోన్న నగర జనాభాకు సరిపడ ప్రజారవాణా వ్యవస్థను కల్పించడానికే హైదరాబాద్ మెట్రోరైలును అందుబాటులోకి తీసుకురాబోతుంది.
*
హైటెక్ భద్రత!
ఉగ్రవాదులు తమ దాడులకు జనం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్లేసెస్‌నే ఎంచుకుంటారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, రద్దీగా ఉండే షాపింగ్ సెంటర్లలోనే ప్రేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రోరైలు స్టేషన్లవద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు గట్టినిఘా వ్యవస్థను ఏర్పాటు చేసారు. దేశంలోనే అంతర్జాల ఆధారిత నిఘా వ్యవస్థను (సర్వెలెన్స్) ఎల్ అండ్ టి ఏర్పాటు చేసింది. అన్ని స్టేషన్లలోకలిపి వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. మెట్రోస్టేషన్ బయటి రోడ్ మార్గంలో, ప్లాట్‌ఫామ్‌పైనా, రైలు కోచ్‌లోకి ఎక్కే మార్గం, స్టేషన్ల పరిసర ప్రాంతాల నుంచి సామాన్లు భద్రపరిచే స్టోర్ల వరకు అన్నింటినీ ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలించే విధంగా నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసారు.
ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెట్రో స్టేషన్లు డిపోలకు సమకూర్చారు. మెట్రోరైలు స్టేషన్లలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో పసిగట్టే రక్షణ వ్యవస్థను నెలకొల్పారు. ప్రతీ మెట్రో స్టేషన్ రెండు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో స్మార్ట్‌కార్డు రీచార్జీ, స్పాట్ టికెట్ కౌంటర్, పరిమిత షాపింగ్‌కు అవకాశం ఉండే దుకాణాల సముదాయం ఉంటుంది. టికెట్ కొనుగోలు చేసిన వారిని మాత్రమే రెండో అంతస్తులోకి అనుమతిస్తారు. రెండో అంతస్తులోకి వెళ్లడానికి మానవరహిత గేట్లు ఆటోమేటిక్‌గా పని చేస్తాయి. స్మార్ట్ కార్డును కానీ, టికెట్‌ను కానీ స్వైప్ చేస్తేనే గేట్లు తెరుచుకుంటాయి. మెట్రోరైలులో ప్రయాణించడమే కాదు బయటికి వెళ్లాలన్నా టికెట్‌కు బదులుగా ఆటోమేటిక్ మిషన్లు జారీ చేసే టోకెన్ అవసరం ఉంటుంది. ఈ టోకెన్ ఉంటేనే ప్రయాణికుడు బయటికి వెళ్లడానికి గేట్లు తెరుచుకుంటాయి. ప్రతీ స్టేషన్‌కు రెండు వైపుల ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, మెట్ల మార్గాలు ఉంటాయి. అలాగే ప్రతీ స్టేషన్‌లో అత్యంత శక్తివంతమైన లాంగ్ విజన్ సీసీ కెమెరాలు ఉంటాయి. మెట్రో స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించే ద్వారం నుంచే వచ్చిపోయే ప్రయాణికుల కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తుంటారు. ప్రతీ స్టేషన్‌కు ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయి పోలీస్ అధికారిని, ప్రతీ కారిడార్‌కు ఎస్‌పి స్థాయి అధికారిని నియమిస్తారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో మెట్రోరైలు నిర్వహణ సంస్థ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. పోలీసు రక్షణ వ్యవస్థతోపాటు ఎల్ అండ్ టి సొంతంగా శిక్షణ ఇచ్చిన సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంది.
*
నాగోల్ డిపో కీలకం
మెట్రోరైలు వ్యవస్థలో కీలకమైన కమాండ్ కంట్రోల్ వ్యవస్థను నాగోల్ డిపోలో ఏర్పాటు చేసారు. మొదటి దశలో అందుబాటులోకి రానున్న 57 రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఇక్కడి నుంచే రైళ్ల వేగాన్ని నియంత్రిస్తారు. మెట్రో రైళ్లకు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే కమాండ్ కంట్రోల్ నుంచే చక్కదిద్దుతారు. మొదటి దశలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు అందుబాటులోకి రానున్న 30 కిలో మీటర్ల మార్గాన్ని, వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్న 42 కిలో మీటర్ల మార్గాన్ని కూడా నాగోల్ కమాండ్ కంట్రోల్ నుంచే నియంత్రిస్తారు. ఈ కేంద్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఇందులో మూడు వరుసల్లో నిపుణులు కూర్చుంటారు. ఒక్కో వరుసలో పది మంది చొప్పున కూర్చొని రైళ్ల రాకపోకలను నియంత్రిస్తారు. మెట్రోరైలుకు ముందూ వెనుకా ఉండే ఇంజన్లలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నా నియంత్రణ వ్యవస్థ పూర్తిగా కమాండ్ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇక్కడ మూడు కారిడార్లకు సంబంధించిన స్క్రీన్లను ఏర్పాటు చేసారు. ఎక్కడి నుంచి ఏ స్టేషన్‌కు ఏ రైలు వచ్చేది, ఆగేది, బయలుదేరేది అన్నీ స్క్రీన్లలో కనిపిస్తాయి. రైలు ఆగాలన్నా, బయలుదేరాలన్నా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. రైలుకు ముందు, వెనుకా ఆటోమేటిక్ ట్రేన్ ఆపరేషన్ సిస్టమ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్ట్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌తో పాటు రైళ్లు ఒకదానినొకటి ఢీ కొనకుండా రైల్ కొల్యూజన్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసారు. కమాండ్ కంట్రోల్‌లో మొదటి వరుసలో కూర్చునే వారు రైళ్ల రాకపోకలను నియంత్రిస్తారు. రైళ్లలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే రెండవ వరుసలో కూర్చునే నిపుణులు సరిచేస్తారు. వీరికి సాధ్యం కాకపోతే మూడవ వరుసలో కూర్చునే నిపుణులు రంగంలోకి దిగుతారు. మూడంచల వ్యవస్థ ద్వారా ఎక్కడా చిన్న పొరపాటు జరుగకుండా డేగ కళ్లతో నిపుణులు పర్యవేక్షిస్తుంటారు. మొత్తంగా 57 మెట్రోరైళ్లను నియంత్రించడానికి ఎంతోమంది నిపుణులు పని చేస్తారని అనుకుంటాం. కానీ కేవలం 40 మంది నిపుణులతోనే కమాండ్ కంట్రోల్ పని చేస్తుందంటే నమ్మాలిమరి. ఇక్కడ మానవ వనరుల కంటే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థదే నియంత్రణ భారం.
*
అదిరేటి స్టేషన్..అమీర్‌పేట్!
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్ట్‌కే మణిమకుటంగా అమీర్‌పేట స్టేషన్ నిలువనుంది. ఇది ఇంటర్ ఛేంజ్ స్టేషన్ కావడమే దీని ప్రత్యేకత. అన్ని స్టేషన్లలో మెట్రోరైలు 20 సెకన్లు ఆగితే, అమీర్‌పేట స్టేషన్‌లో మాత్రం 2 నిమిషాలు ఆగుతుంది. ఇదే అమీర్‌పేట స్టేషన్‌లో ప్రత్యేకత. ప్రతీ స్టేషన్‌లో రెండేసి ఎస్కలేటర్లు ఉంటే ఇక్కడ మొత్తంగా 8 లిఫ్ట్‌లు, 16 ఎస్కలేటర్లు ఉంటాయి. స్టేషన్ పై కప్పును కూడా మిగతా స్టేషన్ల కంటే భిన్నంగా కొట్టొచ్చేటట్టు డిజైన్ చేసారు. ఇది దేశంలోనే అతి పెద్ద మెట్రోస్టేషన్‌గా రికార్డు కానుంది. అన్ని స్టేషన్లలో రెండేసి అంతస్తులుంటే ఇక్కడ మూడు అంతస్తులు ఉంటాయి. మొదటి దశలో ప్రారంభం కానున్న నాగోల్-మియాపూర్ 30 కిలోమీటర్ల మార్గంలో అమీర్‌పేటనే ఇంటర్ ఛేంజ్ స్టేషన్. మెట్రో కారిడార్ ఒకటి, కారిడార్ మూడును ఇక్కడే అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చే మార్గంలో నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఒకటవ కారిడార్, అమీర్‌పేట నుంచి మియాపూర్‌కు వెళ్లే మార్గం మూడవ కారిడార్. ఈ రెండింటినీ అనుసంధానం చేసి మొదటి దశలో 30 కిలోమీటర్ల మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. మియాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుడు మూడవ అంతస్తు దిగి రెండవ అంతస్తులో నాగోల్ వైపు వెళ్లే రైలు ఎక్కాలి. అలాగే నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లే ప్రయాణికుడు అమీర్‌పేటలో రెండవ అంతస్తులో దిగి మూడవ అంతస్తులో రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఒకటవ కారిడార్ రెండవ అంతస్తుకు, మూడవ కారిడార్ మూడవ అంతస్తు నుంచి అనుసంధానం చేసారు. ప్రతి రోజు కనీసం 40 వేల మంది ప్రయాణికులు అమీర్‌పేట స్టేషన్‌కు వస్తారని అంచనా. ఒకేసారి అమీర్‌పేట స్టేషన్‌కు ఆరు వేల మంది ప్రయాణికులు వచ్చినా సరిపోయే విధంగా ఇక్కడ వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసారు.
*
మొక్కుబడి ప్రారంభోత్సవం వద్దనే...
మెట్రోరైలు ప్రాజెక్టును మొక్కుబడిగా ప్రారంభించవద్దన్న ఉద్దేశం వల్లనే ప్రారంభోత్సవానికి ఆలస్యం జరిగింది. దేశంలో ప్రారంభమైన మెట్రోరైలు ప్రాజెక్టులు ఎక్కడా 30 కిలో మీటర్ల మార్గాన్ని ఒకేసారి ప్రారంభించలేదు. బెంగళూరులో కానీ చెన్నైలో కానీ 30 కిలో మీటర్ల మార్గం ప్రారంభ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెట్రోరైలును ప్రారంభించాలనే తపన మాకు మాత్రం లేదా?. అందరికంటే మాకే ఎక్కువ ఆత్రుత ఉంది. అయితే ఆదరాబాదరాగా మెట్రోరైలును ప్రారంభించడం వల్ల అసంపూర్తి పనుల వల్ల ట్రాఫిక్ జామ్‌లతో పాటు ప్రయాణికులు గమ్యం చేరుకోవడానికి ఏ మాత్రం దోహదం చేయదనే కొంత కాలం ఆగాం. ప్రస్తుతం ప్రారంభించే నాగోల్-మియాపూర్ మార్గం (29 కి.మి) అందుబాటులోకి రానుంది. దీనిని ప్రారంభించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా కోరారు. ప్రధాని సానుకూలంగా స్పందించారు. దీంతో నవంబర్ చివర్లో మెట్రోరైలు మొదటి దశలో కారిడార్ మూడు-కారిడార్ ఒకటిని అనుసంధానం చేయడం వల్ల 24 స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.
-కె తారకరామారావు, మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి
*
మూడు వరుసల వడ్డాణం
మెట్రోరైలుకు మొత్తంగా మూడు కారిడార్లు ఉన్నాయి. ఒకటవ కారిడార్ మియాపూర్ టు ఎల్‌బినగర్ (29 కి.మీ-27 స్టేషన్లు), రెండవ కారిడార్ జెబిఎస్ టు ఫలక్‌నుమా (15 కి.మీ-15 స్టేషన్లు), మూడవ కారిడార్ నాగోల్ టు రాయదుర్గ్ (30 కి.మీ-24 స్టేషన్లు) ఉన్నాయి. ఈ మూడు కారిడార్లు భాగ్యనగరానికి మూడు వడ్డాణాలుగా మారనున్నాయి. ఒకటవ కారిడార్ పడమర నుంచి తూర్పునకు, రెండవ కారిడార్ ఉత్తరం నుంచి దక్షిణం, మూడవ కారిడార్ తూర్పు నుంచి పడమరకు వెళ్లనున్నాయి. మొదటి దశ మెట్రోరైలు ప్రారంభమయ్యే నాగోల్-మియాపూర్ మార్గం తూర్పు పడమరల ప్రాంతాలను కలపునున్నాయి. తూర్పున ఉన్న నాగోల్ మెట్రోస్టేషన్‌ను పడమర ఉన్న మియాపూర్ స్టేషన్‌కు కలపడంతో మొదటి దశలో 30 కిలో మీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. సగటున 1.2 కిలో మీటర్లకు ఒక స్టేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల రెండు కిలో మీటర్ల నిడివిలోనే మూడు స్టేషన్లు ఉన్నాయి. ఎర్రగడ్డ, భరత్‌నగర్, మూసాపేట స్టేషన్లు అత్యంత దగ్గరగా ఉన్నాయి.
*
24 స్టేషన్ల మధ్య నిడివి...
*
క్ర.స స్టేషన్ నిడివి
*
1 నాగోల్-ఉప్పల్ 1.03కి.మీ
2 ఉప్పల్-సర్వే ఆఫ్‌ఇండియా 1.09 కి.మీ
3 సర్వే ఆఫ్ ఇండియా-ఎన్‌జిఆర్‌ఐ 1.17 కి.మీ
4 ఎన్‌జిఆర్‌ఐ-హబ్సిగూడ 0.86 కి.మీ
5 హబ్సిగూడ-తార్నాక 1.60 కి.మీ
6 తార్నాక-మెట్టుగూడ 1.25 కి.మీ
7 మెట్టుగూడ-సికింద్రాబాద్ 1.84 కి.మీ
8 సికింద్రాబాద్-పరేడ్ గ్రౌండ్ 1.59 కి.మీ
9 పరేడ్ గ్రౌండ్-ప్యారడైజ్ 1.19 కి.మీ
10 ప్యారడైజ్-రసూలుపూర 1.05 కి.మీ
11 రసూలుపూర-ప్రకాశ్‌నగర్ 1.14 కి.మీ
12 ప్రకాశ్‌నగర్-బేగంపేట 1.42కి.మీ
13 బేగంపేట-అమీర్‌పేట 1.58 కి.మీ
14 అమీర్‌పేట-ఎస్‌ఆర్ నగర్ 0.70 కి.మీ
15 ఎస్‌ఆర్‌నగర్-ఇఎస్‌ఐ 0.75 కి.మీ
16 ఇఎస్‌ఐ-ఎర్రగడ్డ 1.15 కి.మీ
17 ఎర్రగడ్డ-్భరత్‌నగర్ 0.90 కి.మీ
18 భరత్‌నగర్-మూసాపేట 1.00 కి.మీ
19 మూసాపేట=బాలానగర్ 0.70 కి.మీ
20 బాలానగర్-కూకట్‌పల్లి 1.40 కి.మీ
21 కూకట్‌పల్లి-కెపిహెచ్‌బి 2.70 కి.మీ
22 కెపిహెచ్‌బి-జెఎన్‌టియు 1.40 కి.మీ
23 జెఎన్‌టియు-మియాపూర్ 1.90 కి.మీ
24 మియాపూర్-రాయదుర్గ్ (పెండింగ్)
*
టికెట్ కారు చౌక...
మెట్రోరైలు ప్రయాణం కారు చౌకగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వంతో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి సంస్థ 2012లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కనిష్ఠంగా రూ. 8 గరిష్ఠంగా రూ.19 టికెట్ ఉంటుంది. అయితే ఈ ఒప్పందం ఐదు సంవత్సరాల కిందటిదని, పైగా మూడు సంవత్సరాల కింద ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడం వల్ల టికెట్ చార్జీలను కొంతలో కొంతైనా పెంచాలని ఎల్ అండ్ టి సంస్థ ప్రభుత్వాన్ని కోరుతుంది. కనీసం కనిష్ట చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ. 26 ఉండే విధంగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫైల్ ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలనలో ఉండటంతో చార్జీలు పెంచేది లేనిదీ త్వరలో తేలుతుంది.

-వెల్జాల చంద్రశేఖర్