S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కైలాసం

క్యారం బోర్డుతో ఇంట్లో నీడ పట్టున ఆడే ఆటలు మా చిన్నప్పుడు చాలా ఉండేవి. అందులో ముఖ్యమైనవి - అష్టా చెమ్మా, కైలాసం, పచ్చీసు.
కైలాసం పేరు తరువాతి కాలంలో స్నేక్ అండ్ ల్యాడర్‌గా మారిపోయింది. ఈ ఆట సరదాగా ఉండేది. ఇతరుల ప్రమేయం ఇందులో తక్కువగా ఉండేది. మన విజయం మన మీదే ఆధారపడి ఉండేది. మిగతా ఆటల్లో మన విజయం ఇతరుల ఆట మీద కూడా ఆధారపడి వుండేది.
శివరాత్రి రోజు ఈ ఆటలకి ఎక్కువ సమయం ఇచ్చేవాళ్లు. రాత్రి తొమ్మిదింటికి ఆటలు మొదలుపెడితే రాత్రి ఒంటి గంటకు పూర్తయ్యేవి. ఆ కాలంలో టీవీలు లేవు. రేడియోలు కూడా త్వరగా నిద్రపోయేవి. 12 వరకు ఆ రోజు నిద్ర పోకూడదని ఈ ఆటల్లో పెద్దవాళ్లు చిన్నవాళ్లు మునిగిపోయే వాళ్లు.
కైలాసం ఆటలో ఎన్నో పాములు ఉండేవి. మరెన్నో నిచ్చెనలు ఉండేవి. అందరికన్నా ముందు పరిగెత్తిన వ్యక్తిని ఎక్కడో పెద్ద పాము మింగి మళ్లీ మొదటికి వచ్చేవాడు.
చిన్నప్పుడు ఆ ఆటలో సరదా మాత్రమే కన్పించేది. కానీ అందులో అంతర్లీనంగా ఓ సందేశం ఉందని అప్పుడు తెలియదు. ఈ మధ్య మళ్లీ ఓసారి ‘కైలాసం’ ఆట ఆడినప్పుడు అందులోని సందేశం బోధపడింది.
ఈ ఆటకు జీవితానికి అన్వయించుకుంటే బ్రతుకు మీద ఆశ జనిస్తుంది.
‘కైలాసం’ దగ్గరికి వెళ్లే దగ్గర ఓ పెద్ద పాము ఉంటుంది. అది మింగితే పూర్తిగా కిందికి వచ్చేస్తాం. అయితే దాన్ని ఆనుకొనే ఓ నిచ్చెన ఉంటుంది. మళ్లీ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేయవచ్చు. నిచ్చెనని అందుకోకపోయినా మామూలు అడుగులతో మన గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. చేయాల్సింది ఒక్కటే పాములు మింగే విధంగా మన పందెం పడకూడదు.
మనని ఎన్ని పాములు మింగినా మళ్లీ పైకి వెళ్లడానికి నిచ్చెన ఉంటుంది.
మనం ఎంత చీకటిలో ఉన్నా కొంత వెలుగునిచ్చే క్రొవ్వొత్తి లాంటి నిచ్చెన ఉంటుంది.
ఆ నిచ్చెనని ఎక్కడానికి కావల్సిన శక్తిని మనం కూడదీసుకోవాలి.
కూడదీసుకునే శక్తి సామర్థ్యాలు మనకి వున్నాయన్న నమ్మకం మనకి ఉండాలి.
పైకి చేరుతామన్న ఆశ మనలో ఉండాలి.
అంతే..! ఇప్పుడు కైలాసం నాకు బోధించింది ఇదే సూత్రం.

- జింబో 94404 83001