S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి రోజులొచ్చాయి

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘బావగారూ! ఎవౌంట్ పట్టుకొని హైదరాబాద్ వస్తున్నాం. రేపు ట్రైన్ దిగాక కాల్ చేస్తాను’ ఫోన్ చేశాడు కృష్ణమోహన్. ‘సరే.. బావగారూ.. స్టేషన్‌కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అట్నుంచి సంజీవరావు బదులిచ్చాడు. కొడుకుతో కలిసి గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు కృష్ణమోహన్. బెర్తుపై కూర్చుని కాష్ బ్యాగ్‌ని చూసుకుంటూ ‘ఒకటా.. రెండా.. మొత్తం పదిహేను లక్షలు.. వాడి చేతిలో పోస్తున్నాను.. ఏం చేస్తాడో’ మనసులోనే నిట్టూర్చాడు.
అలా ఆలోచిస్తూనే ఎదురుగా కూర్చున్న ఓ కుర్రాడి మీద తన దృష్టి నిలిపాడు. ఆ కుర్రాడిని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. ‘ఎక్కడ చూసానబ్బా..’ ఆలోచిస్తున్నాడు. ‘బాబూ... మీది విశాఖపట్టణమేనా?’ ఆ కుర్రాడినే అడిగేశాడు. అవునన్నట్లుగా తలూపాడా కుర్రాడు. ‘మీ నాన్నగారి పేరు సత్యారావు కదూ?’ మళ్లీ అడిగాడు. ఓ క్షణం కృష్ణమోహన్ వైపు చూసి ‘అవునండీ..’ చెప్పాడా కుర్రాడు.
‘నాన్నగారిలాగే ఉన్నావు’ అంటూ ‘మీ నాన్నగారు ఎలా వున్నారు బాబూ?’ అని అడిగాడు.
‘చనిపోయారండి.. ఆరు నెలలయింది’ చెబుతున్నపుడు ఆ కుర్రాడి కళ్ల నుండి నీళ్లు ఉబికాయి. ‘అరెరే.. సారీ బాబూ.. బాధ పెట్టినట్లున్నాను.. నిన్ను చూస్తుంటే మీ నాన్నగారు గుర్తుకొచ్చారు. అందుకే అడిగాను’ ఇంకా ఏదో మాట్లాడాలనిపించినప్పటికీ.. మాటలు రాక ఆగిపోయాడు.
‘మా నాన్నగారు మీకు తెలుసా అంకుల్!’ ఆ కుర్రాడు అడగడంతో ‘ఆఫీస్‌లో అప్పుడప్పుడు కలుసుకునే వాళ్లం’ ముక్తసరిగా సమాధానం చెప్పి వౌనంగా ఉండిపోయాడు. సత్యారావు చనిపోయాడని తెలిసిన తర్వాత కృష్ణమోహన్ మనసంతా అదోలా అయిపోయింది. గతంలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు.
* * *
‘చూడండి.. అర్జంటుగా పనై పోవాలని కంగారు పడితే కుదరదు.. మీ ఫైల్ ఒకటే కాదు.. చాలా ఫైల్స్ వున్నాయి. ఓ వారం తర్వాత రండి’ చిరాకు పడుతూ అన్నాడు సీనియర్ అసిస్టెంట్ సత్యారావు.
ఆర్మీ నుండి రిలీవ్ అయిన తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లైసెన్స్ కోసం ఆ ఆఫీస్ చుట్టూ ఎన్నో రోజులుగా తిరుగుతున్నాడు కృష్ణమోహన్. వారమయింది. ఆ ఆఫీస్‌కు మళ్లీ వెళ్లాడు. అతన్ని చూసిన వెంటనే ఫైల్ నుండి పేపరొకటి బయటకు తీసి ‘ఈ సర్ట్ఫికెట్‌లో ఉన్న సంతకం చెల్లదు. అంతకంటే పై అధికారితో సంతకం చేయించుకొని రండి’ నిర్లక్ష్యంగా చెప్పాడు సత్యారావు.
కృష్ణమోహన్‌కి ఒళ్లు మండింది. ‘ఇన్ని రోజులు మీ చుట్టూ తిప్పించి ఇప్పుడిలా కొర్రీ వేయడం ఏం బాలేదు సార్..’ కోపం, మర్యాద రెండూ కలగలిపి అన్నాడు.
‘నేను కాబట్టి ఈ ఒక్క పేపర్ ఇస్తున్నాను. వేరే వాళ్లైతే ఫైల్ అంతా వెనక్కి ఇచ్చేసి మళ్లీ కొత్తగా పెట్టమంటారు. అలా చేయమంటారా చెప్పండి’ దబాయిస్తున్నట్లుగా అడిగాడు సత్యారావు. పేపర్‌ని విసురుగా అందుకుని ఆఫీస్ నుండి బయటకు వచ్చేసాడు. రెండు రోజుల తర్వాత సత్యారావు చెప్పిన ప్రకారం సర్ట్ఫికెట్ తెచ్చి ఇచ్చాడు కృష్ణమోహన్. అందులో వున్న సంతకాన్ని చెక్ చేసుకొని సంతృప్తిగా తలపంకించి ఫైల్‌లో పెట్టుకుంటూ ‘మీరు రేపు రండి’ అంటూ తన బాస్ ఉన్న ఛాంబర్‌లోకి దూరిపోయాడు సత్యారావు.
మర్నాడు మళ్లీ వెళ్లాడు. తనెదురుగా నిల్చున్న కృష్ణమోహన్‌ని చూసి ‘మీ ఫైల్ సార్ దగ్గరుంది. ఆయన చూడ్డానికి కొంచెం టైం పడుతుంది’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నట్లుగా నసిగాడు సత్యారావు. ‘ఏదో చెప్పబోతున్నారు.. చెప్పండి..’ కాస్త అసహనంగా అడిగాడు కృష్ణమోహన్.
‘చూడండి బాసూ! సారు ఓ పట్టాన సంతకం పెట్టరు. ఏ చిన్న తేడా ఉన్నా ఫైల్ మళ్లీ వెనక్కి వస్తుంది. అవన్నీ ఎందుకు.. మీ పని వెంటనే అయిపోవాలనుకుంటే.. మీకు తెలిసిందే కదా.. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి’ అర్థం చేసుకోమన్నట్లుగా అన్నాడు సత్యారావు. విషయం అర్థం అయింది కృష్ణమోహన్‌కి. ‘ఎంత’ అని అడిగాడు. ‘యాభై వేలు’ క్లియర్‌గా చెప్పాడు సత్యారావు.
బాధగా బయటకు వచ్చాడు కృష్ణమోహన్. ‘ప్రాణాలొడ్డి దేశానికి మేము కాపలా కాస్తుంటే వీళ్లు లంచాలు మింగుతూ దేశాన్ని తినేస్తున్నారు. వీళ్లను వదలకూడదు’ కసిగా అనుకున్నాడు.
మర్నాడు సత్యారావు అడిగిన డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టడం, క్షణాల్లో ఏసీబీ వారు ఎంటర్ అయి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. వొంటి నిండా చెమటలు పట్టి, గొంతు మూగబోయి నిలువు కళ్లేసుకుని అలాగే కుర్చీలో కూలబడ్డాడు సత్యారావు. వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
* * *
‘అలా జరగకుండా ఉండాల్సింది.. తొందర పడ్డాను’ ఆ సంఘటనను తలచుకొని బాధపడ్డాడు కృష్ణమోహన్. ఎదురు బెర్తుపై కూర్చున్న సత్యారావు కొడుకు మీద చాలా సింపతీ కలిగింది. ‘హైదరాబాద్‌లో ఏమైనా చదువుకుంటున్నావా?’ అడిగాడు కృష్ణమోహన్.
‘కాదంకుల్.. ఇంటర్వ్యూకు వెళుతున్నాను’ చెప్పాడా కుర్రాడు.
‘ఏ ఇంటర్వ్యూకి?’ ఎక్జయిటింగ్‌గా అడిగాడు కృష్ణమోహన్.‘బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌కి’ చెప్పాడా కుర్రాడు. ఆశ్చర్యపోతూ ‘మా వాడూ అందుకేనమ్మా..’ అంటూ కిటికీ వద్ద కూర్చున్న తన కొడుకుని చూపాడు. ఒకర్నొకరు ‘హాయ్’ అని విష్ చేసుకున్నారు. ఆ కుర్రాడితో ఇంకా మాటలు కలపాలనిపించింది. ‘ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా?’ అడిగాడు కృష్ణమోహన్. ‘బాగానే ప్రిపేర్ అయ్యానండి..’ చెప్పాడా కుర్రాడు.
‘వట్టి ప్రిపరేషనే కాదయ్యా.. బ్యాక్ డోర్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఆ విషయంలో నీకేదైనా హెల్ప్ కావాలంటే అడుగు. నేను చేసి పెడతాను’ చెప్పాడు కృష్ణమోహన్.
‘అక్కర్లేదంకుల్.. నేను ఎగ్జాం బాగా రాసాను. కచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోయినా ఫర్వాలేదు. మరో జాబు కొట్టగలను’ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడా కుర్రాడు. అతనిలో వున్న కాన్ఫిడెన్సు చూసి ముచ్చటేసింది కృష్ణమోహన్‌కు.
‘బాగుందయ్యా.. కాకపోతే వచ్చిన అవకాశాన్ని పాడుచేసుకోకూడదు. ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నించి సాధించాలి. రికమండేషన్, డబ్బు లాంటి అన్ని సోర్సు ఉపయోగించాలి’ అన్నాడు కృష్ణమోహన్.
‘చూడండి అంకుల్... సిన్సియర్‌గా ప్రయత్నం చేస్తాను. వచ్చిందంటే నిజాయితీగా డ్యూటీ చేస్తాను. అంతేగాని వాళ్లను వీళ్లను పట్టుకొని అడ్డదారులు తొక్కడం నాకిష్టం లేదు’ చాలా స్పష్టంగా చెప్పాడు.
‘అంత నిజాయితీగా ఉందామనుకున్నప్పుడు ఇలాంటి ఉద్యోగంలో చేరడం అనవసరం. నీ ప్రమేయం లేకపోయినప్పటికీ నీ డిపార్టుమెంట్ వాళ్ల వల్లనైనా.. జరుగుతున్న అవినీతిలో నువ్వూ భాగమవుతావు. నువ్వు నిజాయితీగా ఉందామనుకున్నా ఉండలేవు.. గొంగట్లో తింటూ వెంట్రుకలేరుతున్నట్లు ఉంటుంది’ నవ్వుతూ చెప్పాడు కృష్ణమోహన్.
‘అంకుల్.. నేనేమీ లంచాలిచ్చి ఉద్యోగంలో చేరటం లేదు. గవర్నమెంట్ ఉద్యగమనగానే జీతం గురించి కాకుండా పై డబ్బులెంతొస్తాయి.. అనే లెక్కలు నాకు లేవు. ముందు నేను నిజాయితీగా ఉంటా. నన్ను చూసి ఒకరు, ఆ ఒకరిని చూసి ఇంకొకరు మారుతారనే నమ్మకం నాకుంది. ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ పరులైతే దేశం అభివృద్ధిలో ఎంత వేగంగా దూసుకుపోతుందో నేను చూపిస్తాను’ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చెప్పాడా కుర్రాడు.
తూటాల్లా దూసుకొచ్చిన ఆ కుర్రాడి మాటలు కృష్ణమోహన్ గుండెల్లో బాగా పేలాయి. బ్యాగ్ నిండా క్యాష్ పెట్టుకొని లంచమీయటానికి బయలుదేరిన తనను ఉద్దేశించి అన్నట్లుగానే ఉన్నాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చాక వచ్చే రాబడి గురించి ఎన్నో లెక్కలు వేసుకుంటున్న తనకు ఆ మాటలు నిప్పు చురకల్లా తగిలాయి. తన మనసు ఎదురు తిరిగి తననే ప్రశ్నించడం మొదలుపెట్టింది. ‘లంచమడిగినందుకు దేశాన్ని తినేస్తున్నారని ఆవేశపడిపోయి ఆ కుర్రాడి తండ్రిని జైలుకి తోయించిన నువ్వే ఇప్పుడు నీ కొడుకు ఉద్యోగం కోసం కోరి లంచమిస్తున్నావు.. అవినీతి చేయమని ప్రోత్సహిస్తూ దేశాన్ని దోచుకోమంటున్నావు. ఒక లంచగొండిని పట్టించిన నువ్వు.. అవే లంచాల కోసం కొడుకుని లంచగొండిగా మారుస్తున్నావు.. అసలు శిక్ష పడాల్సింది నీకు...’ బాణాల్లాంటి ప్రశ్నలతో మనస్సు తన గుండెల్ని గుచ్చుతోంది.
చీకటిని పట్టాల మీద వేసి తొక్కుతూ ట్రైన్ పరిగెడుతోంది. కృష్ణమోహన్‌కు నిద్ర పట్టడం లేదు. ‘నేను సత్యారావుని అరెస్ట్ చేయించినట్లుగా.. నా కొడుకుని కూడా రేపు మరెవరైనా అరెస్ట్ చేయిస్తే...’ ఆ ఆలోచనతో ఒక్కసారిగా గుండె కంపించింది. కళ్ల నుండి నీళ్లు అప్రయత్నంగా కారాయి. గట్టిగా కళ్లు మూసుకొని, ‘నో.. ఇక ఈ తప్పు జరగనివ్వను. నా నీతిమాలిన ఆలోచనలను ఈ చీకట్లోనే వదిలేస్తా.. ముందు నేను మారుతాను’ దృఢంగా నిశ్చయించుకున్నాడు.
సైడు బెర్త్ మీద పడుకున్న తన కొడుకుని చూశాడు. సత్యారావు కొడుక్కీ, తనకీ జరిగిన సంభాషణ కిటికీ వద్ద కూర్చున్న తన కొడుకు వినలేదు. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న కొడుకుని ఆర్తిగా చూసుకున్నాక హాయిగా నిద్ర పట్టింది కృష్ణమోహన్‌కు.
సికిందరాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగారు ముగ్గురూ. సత్యారావు కొడుకు సిటీ బస్సెక్కి తన ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. స్టేషన్‌కి వచ్చి కలుస్తానన్న సంజీవరావు కనబడక పోవడంతో తండ్రీ కొడుకులిద్దరూ ఆటోలో హోటల్‌కి బయలుదేరారు.
‘బావగారూ! పెద్దాయన రమ్మంటే వెళ్లాను. మన పని అయిపోద్ది.. కచ్చితంగా పోస్ట్ మనదేనని పెద్దాయన చెప్పేశారు. మీరు అవౌంట్ రెడీ చేసేయండి. నేను తర్వాత వచ్చి కలుస్తాను’ ఫోన్ చేశాడు సంజీవరావు. వౌనంగా విని ఫోన్ పెట్టేశాడు కృష్ణమోహన్.
హోటల్‌కి చేరుకున్నాక ఇద్దరూ ఫ్రెష్ అయ్యారు. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణమోహన్ తన ఉద్దేశం కొడుక్కి చెప్పడానికి సిద్ధవౌతున్నాడు. కొడుకుని పిలిచి దగ్గర కూర్చోమన్నాడు. ‘ఒరేయ్ నాన్నా! నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పాలి.’
‘ఏంటి డాడీ.. అడగండి..’ అన్నాడు కొడుకు.
‘నీకంటూ ఏదైనా లక్ష్యముందా? వుంటే ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలనుకుంటున్నావు..? అడిగాడు కృష్ణమోహన్.
‘సడన్‌గా ఇలా అడుగుతున్నారేమిటి నాన్నా.. సరే చెబుతాను.. కానీ.. మీకో విషయం ఎలా చెప్పాలా.. అని నిన్నటి నుండి ఆలోచిస్తున్నాను’ చెప్పాడు కొడుకు. ‘ఏంట్రా.. ఏం చెప్పాలనుకుంటున్నావ్?’ ఆసక్తిగా అడిగాడు కృష్ణమోహన్.
‘అంత డబ్బు లంచమిచ్చి ఉద్యోగంలో చేరి ఆ డబ్బు కోసం లంచాలు తీసుకుంటూ అందరి దృష్టిలో ఒక అవినీతిపరునిగా బ్రతకడం నాకిష్టం లేదు.. నిన్న పేపర్ చదివారా నాన్నా.. లంచం కేసులో పట్టుబడినందుకు ఆ అవమానం తట్టుకోలేక ఓ ఐఎఎస్ ఆఫీసర్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న వార్త ననె్నంతగానో కదిలించింది.. ‘తనదాక వస్తే గాని.. తెలీదు’ అంటారు. అలాంటి సంఘటన నాకే జరిగితే మీరు తట్టుకోగలరా నాన్నా.. లంచంగా డబ్బు పెట్టుబడి పెట్టి అంతకు రెట్టింపు రాబడి లంచాల రూపంలో ప్రజల నుండి పిండుకోవచ్చనే నీచపు ఆలోచనతో మనమున్నందుకు చాలా సిగ్గేస్తోంది’
‘చూడండి నాన్నా! మన బిజినెస్‌ని ఎంతో గౌరవం చేసుకుంటున్నాం. పది మందికి ఉపాథి కల్పించి వాళ్ల కుటుంబాలు హాయిగా బ్రతికేలా చేస్తున్నాము. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా వాళ్ల కళ్లల్లో మీ పట్ల ఎంత ఆరాధన కనపడుతుందో.. నాకు తెలుసు. ఆ క్షణంలో నేనెంత గర్వపడతానో మీకు తెలీదు. అవసరమయితే ఈ డబ్బుతో కూడా బిజినెస్ పెంచుకొని ఇంకో పదిమందికి ఉపాథి కల్పించి అందులో వచ్చే ప్రతి రూపాయి మన కష్టార్జితమేనని తలెత్తుకొని గర్వంగా ఉండాలని ఉంది నాన్నా...
‘నీ లక్ష్యమేమిటి.. అని అడిగారు కదా.. అలా సమాజంలో గర్వంగా తలెత్తుకొని ఉండటమే నా లక్ష్యం..’ ఎంతో ఉద్వేగంతో చెప్పాడు కొడుకు.
కొడుకు నుండి ఏ మాత్రం ఊహించని సమాధానం వింటున్న కృష్ణమోహన్‌కి ఒళ్లంతా పులకరించిపోయింది. కళ్ల నుండి కారుతున్న ఆనందభాష్పాలను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. తన కొడుకు ఎంతో ఎత్తున ఉన్నట్లు కనిపించాడు. ఆనందంగా కళ్లు తుడుచుకుంటూ ‘శభాష్ రా నాన్నా! నిన్న సత్యారావు కొడుకు మాటలు నా కళ్లు తెరిపించాయి.. ఇప్పుడు నీ మాటలు వింటూంటే ఎంతో గర్వంగా ఉంది. మన దేశానికి మంచి రోజులొచ్చాయని మీ కుర్రాళ్ల దృక్పథం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ఈ లంచాలు, ఉద్యోగాలు మనకొద్దు. ఇప్పుడు మన ధ్యేయం.. మన బిజినెస్‌ని ఉన్నత విలువలతో అభివృద్ధి చేస్తూ.. ఎంతో మందికి ఉపాథి కల్పించి వాళ్ల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ.. దేశ సేవ చేసుకుందాం..’ అంటూ ఎంతో ఆనందంగా తన కొడుకుని హృదయానికి హత్తుకున్నాడు.

-కిల్లాడ సత్య శ్రీనివాస్.. 9553978484