S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారసుడొచ్చాడు!

రాహుల్.. అమ్మచాటు బిడ్డ..
ఆ అతడు ఒట్టి పప్పు...
అబ్బే... రాజకీయాలపై శ్రద్ధ లేదు...
ఔను.. అతడివి చిన్నపిల్లల చేష్టలు..
నిజమే... అతడిది ఐరన్‌లెగ్..
అతడి సారధ్యంలో ఏ ఎన్నికల్లోనూ గెలుపు దక్కలేదు...
లోక్‌సభలో నిద్రపోవడం... చెప్పాపెట్టకుండా చెక్కేయడం...
ఏంటిదంతా...ఇవన్నీ నిన్నమొన్నటి వరకు సోనియా తనయుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై వచ్చిన విమర్శలు...
అందుకే అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించేందుకు మీనమేషాలు లెక్కించారు.. కానీ గుజరాత్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో... ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి... ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగితే రాహుల్ వస్తే చాలు.. మేం గెలుస్తాం అని బిజెపి ఎద్దేవా చేసేది. కానీ ఇప్పుడు గుజరాత్‌లో బెంబేలు పడుతోంది. ఎందుకింత మార్పు వచ్చింది.?
****
తనకు, తన పార్టీకి తిరుగులేదని భావించిన ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా ఇప్పుడు గుజరాత్‌లో యుద్ధమే చేస్తున్నారు. అధికారంలో స్థిరంగా, దూకుడుగా, అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కేంద్రప్రభుత్వ సారధి ఇప్పుడు సొంత రాష్ట్రంలో అన్నిమూలలూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. సునాయాస విజయం అన్న ధీమా చెరిగిపోయి విజయం సాధించి తీరాలన్న లక్ష్యంతో అడుగువేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల? రాహుల్‌లో వచ్చిన మార్పు. వ్యూహాత్మకంగా, మాటలు, చేతలు, విమర్శలు, సామాజిక మాధ్యమాల వినియోగం, పదునుతో కూడిన వ్యంగ్యం, హాస్యం మేళవిస్తూ చేస్తున్న ప్రసంగాలు, జనంలో కలియతిరగడం వంటి ఎన్నికల విన్యాసాలను సమర్ధంగా రాహుల్ వినియోగించగలుగుతున్నారు.
రాహుల్ ఫరవాలేదు... మారుతున్నారు..
విమర్శల్లో పరిణతి కనిపిస్తోంది...
వ్యాఖ్యల్లో పస ఉంటోంది...
గుజరాత్‌లో ఆశలు చిగురిస్తున్నాయి...
బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు...
మణిశంకర్ అయ్యర్‌లాంటి నోటిదురుసు మనుషులను
కట్టడి చేయగలుగుతున్నారు...
ఇదీ అసలు సమయం.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి...
ఇదీ ఇప్పుడు రాహుల్‌పై పార్టీ వర్గాల అభిప్రాయం..
అందుకే ముహూర్తం ఖరారైంది. ఎన్నిక లాంఛనమైంది..
పార్టీ పగ్గాలు చేతికందాయి..
అయితే ఆ బాధ్యతల నిర్వహణ సులభమేమీ కాదు...
ఎన్నడూ లేని పతనస్థాయిలో పార్టీ ఉంది...
కాంగ్రెస్ విముక్త భారత్ కోసం కమలదళం పనిచేస్తోంది...
మెజారిటీ రాష్ట్రాలు చేజారిపోయాయి..
రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి.. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లో అనుకూల ఫలితాలు వస్తే కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి కలసివస్తుంది. శతాధిక సంవత్సరాల కాంగ్రెస్‌లో వృద్ధ నేతల పట్టు గట్టిగానే ఉంది.. యువతరం రాటుదేలి రాణించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు రాహుల్ తపన అదే. లక్ష్యం అదే.. కేవలం వారసత్వం వల్ల పార్టీ బాధ్యతలు వచ్చాయన్న విమర్శల నేపథ్యంలో గట్టి సవాలును స్వీకరించి అడుగు వేస్తున్న రాహుల్... ఏం చేస్తారో చూడాలి..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పుట్టిన ప్రధాని నరేంద్రమోదీ దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలోనే స్వాతంత్య్రానంతరం పుట్టిన తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ చరిత్ర సృష్టించారు.
ఇదీ చరిత్ర..
దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో నెహ్రూ కుటుంబ వారసత్వం రాహుల్‌కు కలిసొచ్చిన మాట నిజమే అయినప్పటికీ పూర్తిగా అదే అసలు కారణం అని చెప్పనక్కరలేదు. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాలేదు. ప్రజల నుండి తిరస్కార బాణాలు, 132 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో భవిష్యత్ ప్రస్థానాన్ని ఖరారు చేసేందుకు రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ తలరాతను 47 ఏళ్ల రాహుల్ మార్చగలరా? చూడాలి
పుష్కరకాలంగా రాహుల్ పార్టీ కార్యకర్త స్థాయి నుండి పనిచేస్తూ వచ్చారు. ఇన్నాళ్లకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారు. పార్టీ నియమావళిలోని 24వ అధికరణకు సవరణలు తీసుకువచ్చి ఎన్నికల సంఘం తరహాలోనే సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 1న మొదలైన ఎన్నికల సందడిలో జాతీయాధ్యక్షుడి పదవికి 89 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అవన్నీ రాహుల్ పేరిట మాత్రమే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్వతంత్ర భారతావనిలో రాహుల్ కాంగ్రెస్ పార్టీకి 17వ అధ్యక్షుడయ్యారు.
భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం అంటే 49 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, మేఘాలయ,
మిజోరం రాష్ట్రాల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుళత్వానికి మారుపేరుగానే ఎదిగింది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అన్ని ప్రాంతాల వారూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత నెహ్రూ కుటుంబ సభ్యులే 38 ఏళ్ల పాటు అధ్యక్షులుగా కొనసాగారు. సోనియాగాంధీ 19 ఏళ్లపాటు అధ్యక్షురాలిగా కొనసాగడం కాంగ్రెస్ పార్టీలో ఒక రికార్డు. 132 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రథమ అధ్యక్షుడిగా 1885లో ఉమేష్ చంద్ర బెనర్జీ బాధ్యతలు చేపట్టారు. 1890లో తెలుగువాడైన పనప్పాకం ఆనందాచార్యులు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ కాలంలో ఐదుగురు విదేశీయులు కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. 1888లో స్కాట్లాండ్‌కుచెందిన వ్యాపారి జార్జి యూలే, 1889, 1900లో ఇండియన్ సివిల్ సర్వీసు మాజీ అధికారి సర్ విలియం వెడ్డర్ బర్న్, సర్ హెన్రీ కాటన్, బ్రిటన్ దిగువ సభ సభ్యుడు ఆల్ఫ్రెడ్ వెబ్‌లు కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. హిందూ మహాసభ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయ 1909, 1918లో రెండు మార్లు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. తండ్రీకొడుకులైన మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షులు కావడం ఒక విశేషం అయితే , నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీలు సైతం కాంగ్రెస్ అధ్యక్షులు కావడం మరో విశేషం.
జాతిపిత మహాత్మాగాంధీ 1924లో బెల్గాంలో జరిగిన సమావేశాల్లో అధ్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్‌కు ఇంత వరకూ మొత్తం నలుగురు మహిళలు అధ్యక్షులుగా వ్యవహరించారు. అందులో స్వాతంత్య్రానికి ముందు అనిబిసెంట్, సరోజనీ నాయుడు ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 15 మంది కాంగ్రెస్ అధ్యక్షులు కాగా, వారిలో 11 మంది నెహ్రూ కుటుంబానికి చెందనివారే. 1948-49లో భోగరాజు పట్ట్భా సీతారామయ్య, 1960-63లో నీలం సంజీవరెడ్డి, 1992-96లో పివి నరసింహరావులు కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు.
జవహర్‌లాల్ నెహ్రూ ఇతర నాయకుల అభిప్రాయాలను ఎంతో సహనంతో వినేవారు. అందరికీ అవకాశం కల్పించేవారు. ఇందిరాగాంధీ హయాంలోనే వారసత్వ పాలనకు బీజం పడిందనేది సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్‌మెంట్ సొసైటీకి చెందిన సుహాస్ పల్సీకర్ అభిప్రాయం. ఇందిర నుండి రాజీవ్ గాంధీకి పదవి అందడం వారసత్వమే. అయితే సోనియా గాంధీకి పదవి అప్పగించడంలో మాత్రం కొంత తేడా ఉంది. పార్టీ గందరగోళంలో పడటంతో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఆమెకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. నెహ్రూ కుటుంబ సభ్యురాలు కావడం వల్లనే ఇది సాధ్యమైందనేది నిర్వివాదాంశం. రాహుల్ రాకతో ఇపుడు మరో అధ్యాయం మొదలైంది.
ఉన్నత చదువు
రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ దంపతులకు 1970 జూన్ 19న రాహుల్ జన్మించారు. రాహుల్ 21వ వడిలో అడుగుపెట్టిన సమయంలోనే రాజీవ్‌గాంధీ 1991లో తమిళనాడు పెరుంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. రాహుల్ స్కూల్ విద్యాభ్యాసం తొలుత ఢిల్లీలోని సెయింట్ కొలంబాలో జరిగింది. 1981 నుండి డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లోనే సాగింది. కొద్ది రోజులకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని భద్రతా సిబ్బంది హతమార్చడంతో తండ్రి రాజీవ్ 1984 అక్టోబర్ 31న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సిక్కు ఉగ్రవాదుల నుండి వీరికి బెదిరింపులు రావడంతో రాహుల్‌ను, ఆయన చెల్లెలు ప్రియాంకను కొంత కాలం ఇంట్లోనే ఉంచి చదివించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో 1989లో ఇంటర్ పూర్తి చేశారు. అక్కడి నుండి చదువుల కోసం హార్వర్డుకు వెళ్లారు. 1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో భద్రతా కారణాలతో రాహుల్ యుఎస్ ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీకి మారిపోయారు. 1994లో ఆయన బిఎ పూర్తి చేశారు. ఆ సమయంలో రాహుల్ రోల్ విన్సీ అనే మారుపేరుతో చదువుకున్నారు. ఆయన అసలు పేరు వివరాలు కొందరు భద్రతా, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు. 1995లో కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన ట్రినిటీ కాలేజీ నుండి ఎం.్ఫల్ పట్టా పుచ్చుకున్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ మేనేజిమెంట్ కంపెనీ మానిటర్ గ్రూప్‌లో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. అనంతరం ఆయన ఇండియాకు వచ్చి ముంబైలో బాకోప్స్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే టెక్నాలజీ అవుట్‌సోర్సింగ్ సంస్థను స్థాపించారు.
2004లో ఒక ప్రెస్‌మీట్‌లో తనకు ఒక స్పానిష్ గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పారు. ఆమె వెనుజులాలో ఉంటుందని, ఆమె ఒక ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోందని, ఇంగ్లాండ్‌లో చదువుకుంటున్నపుడు పరిచయం అయ్యిందని రాహుల్ చెప్పారు. అయితే 2013లో ఆ ప్రస్తావన తెచ్చినపుడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలేదని తేల్చి చెప్పారు.
రాజకీయాలలోకి...
రాహుల్‌గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తన తండ్రి పార్లమెంటుకు ఎన్నికైన అమేథీ నుండి పోటీ చేసి గెలుపొందారు. 2009లో కూడా అదే నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి నుండి క్రమంగా పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. 2007 సెప్టెంబర్ 24న ప్రధానకార్యదర్శిగా ఎంపికయ్యారు.
సామాన్య జీవితం
రాజకీయాలంటే పెద్ద ఆసక్తి చూపలేదు. తండ్రిలా, తల్లిలా అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తరువాత కూడా చురుకుగా, పూర్తి ఇష్టంతో పనిచేయడానికి మొగ్గు చూపలేదు. అయితే ఒకటి రెండు సంవత్సరాలుగా ఆయనలో మార్పు మొదలైంది. జనంలో కలియతిరగడం రాహుల్ నేర్చుకున్నారు. వారితో కలసిపోవడం మొదలెట్టారు. నాయనమ్మ ఇందిర, రాజీవ్ తరహాలో మొదట్లో ఎంతో బిడియంగా, అందరికీ దూరంగా ఉన్నప్పటికీ ఆ తరువాత ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాటలు కలపడం మొదలుపెట్టారు. ప్రధాని కుమారుడైనా, దేశాన్ని 49 ఏళ్లపాటు పాలించిన పార్టీ ప్రతినిధిగా ఉన్నా, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నా, ఉపాధ్యక్షుడిగా ఉన్నా ఎన్నడూ రాహుల్ గాంధీ సామాన్య జీవితానే్న గడిపారు. కుగ్రామాల్లో పూరిపాకలో తినడం, రోడ్డుపక్కన ఉండే కొట్టులో టీ తాగడం, సామాన్య కార్యకర్తకూ అందుబాటులో ఉండటం అనేది రాహుల్‌కే సాధ్యమైంది.
యువతే లక్ష్యం.. ప్రయోగాలు ఇష్టం
రాహుల్ చూపు తొలి నుండి యువతపైనే. ఎక్కడికి వెళ్లినా యువతతో చర్చించడం, వారి అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకోవడం తదనుగుణంగా అడుగులు వేయడం అలవర్చుకున్నారు. యువతను రాజకీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఎపుడూ చెబుతుంటారు. అంతే కాదు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐలకు నామినేషన్ పద్ధతిని తొలగించి అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విఫలమవుతున్నా, రాహుల్ మాత్రం ఎన్నడూ బెదిరిపోలేదు. ప్రతిసారీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి రాహుల్‌కు ప్రయోగాలంటే చాలా ఇష్టం. అంతర్గత ప్రజాస్వామ్యం కోసం యువజన కాంగ్రెస్‌లో ఎన్నికలను నిర్వహించి ఆ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కార్యకర్తలకే అప్పగించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ప్రయత్నం చేశారు. అది కొంతవరకూ సఫలమైనా, మరికొంత విఫలమైంది. పార్టీలో ఎపుడూ రెండు మూడు విభాగాలే ప్రధానంగా పనిచేస్తుండగా రాహుల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కొత్త విభాగాలను ప్రారంభించారు. మత్స్యకారుల కాంగ్రెస్, అసంఘటిత కార్మికుల కాంగ్రెస్, విదేశీయుల కాంగ్రెస్ వంటి విభాగాలు కొత్తగా చేరాయి.
ప్రస్తుతం ఎంపి హోదాలో విదేశీ వ్యవహారాల పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కూడా రాహుల్ వ్యవహరిస్తున్నారు.
ఓపిక, సహనం ఎక్కువే..
ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలకు కావల్సినంత సమయం ఇవ్వడం, వారు చెప్పింది ఓపికగా వినడం, ఒక కాగితంపై రాసుకోవడం ద్వారా మాట్లాడుతున్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం రాహుల్ అలవాటు చేసుకున్నారు. దానివల్ల కార్యకర్తలు తమ మనసులో మాటను చెప్పేందుకు ఆస్కారం కల్పించారు. అంతే కాదు, పార్టీలోని లుకలుకలను చెప్పినపుడు సైతం అంతే శ్రద్ధగా వినడం రాహుల్ ప్రత్యేకత. రోజంతా పనిచేయడం, నిరంతరం దేశం అంతా పర్యటించడం, చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల సభలు మినహాయిస్తే రాహుల్ ఏ రాష్ట్రంలో ఎపుడు ఎక్కడ పర్యటిస్తున్నారో స్థానిక కార్యకర్తలకు మినహా ఎవరికీ తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంటాయి. హంగు ఆర్భాటం లేకుండానే అవసరమైతే ఆయా గ్రామసభ కార్యాలయాల వరండాలో కూర్చుని, కార్యకర్తల ఇళ్ల ముంగిట కూర్చుని కూడా రాహుల్ సమావేశాలు నిర్వహించిన
రోజులు లెక్కలేనన్ని. ఇంత తేలికగా అందుబాటులో ఉంటే రాహుల్ కాంగ్రెస్ పార్టీని మార్చడానికి, సీనియర్లను గాడిలోకి తేవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక్కోమారు తనకే ఆశ్చర్యం కలిగే రీతిలో పార్టీ వ్యవహార సరళి ఉండటంతో అన్నీ త్యజించి అదృశ్యమవ్వడం కూడా అరుదుగా జరిగేదే.
కాని రానురాను మనం కొత్త రాహుల్‌ను చూడబోతున్నాం. కొత్త అవతారంలో రాహుల్ ఓటర్లతో కూడా ఎక్కువ సేపు గడపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అని రాహుల్ జీవితంపై పుస్తకం రాసిన ఆర్తి రామచంద్రన్ చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఉత్సాహం, ఉత్తేజం, పార్టీ శ్రేణుల్ని కొత్త బలాన్ని నింపేట్టు కనిపిస్తున్నాయి అని రామచంద్రన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలవాలంటే అవసరమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, సరికొత్త రాజకీయ వ్యూహాలను ఒంటబట్టించుకుంటున్నారు. రాష్ట్రాల్లో చురుకుగా, చరిష్మా ఉన్న నాయకులను గుర్తించి వారిని ప్రోత్సహించడం, ప్రాంతీయ పార్టీలతో మైత్రీ సంబంధాలను నెరపడం, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన సవ్యంగా జరిగేట్టు చూడటం ఇవన్నీ రాహుల్ ముందున్న లక్ష్యాలు. అధికారంలో ఉన్నపుడు తలకెత్తుకున్న అపవాదుల నుండి కాంగ్రెస్ పార్టీ బయటపడాలి. బలవంతుడైన నరేంద్రమోదీని ఢీ కొట్టేలా పార్టీని సంస్కరించడం ఆయన ముందున్న అసలు సవాలు.
నాన్చివేత ధోరణి మారాలి
ఏకాభిప్రాయ సాధన పేరుతో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరగడం కూడా పార్టీకి శాపంగా చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల నియామకాల కోసం ఆరు నెలలుగా సంప్రదింపులు జరుగుతున్నా ఇంత వరకూ నిర్ణయానికి రాలేకపోయారు. లోక్‌సభలో పార్టీ ఉప నాయకుడిగా కెప్టన్ అమరేందర్ సింగ్ రాజీనామా చేసి ఏడాది అవుతున్నా ఇంత వరకూ ఆ పదవిని భర్తీ చేయలేదు.
యువతను ఆకట్టుకోవడంలో, ఓపిక, సహనంలో రాహుల్‌కు తిరుగులేకున్నా ప్రజలను కట్టిపడేసే పడికట్టుమాటల ప్రవాహం ఆయన ఉపన్యాసంలో కానరాదు. బిజెపికి అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్, ఉమా భారతి, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు ( ఉప రాష్టప్రతి కాకముందు) లాంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఈ విమర్శ చాలా ఎక్కువగా రావడంతో ఈ మధ్య రాహుల్ సైతం తన ప్రసంగాల్లో హాస్యాన్ని, ఎత్తిపొడుపులను చేర్చి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ జీవితం ఇంత కాలం రాజకీయాలు , కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, దేశాన్ని అర్ధం చేసుకోవడం, మారుతున్న సమాజాన్ని విశే్లషించుకోవడం, ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ రంగాల్లో వస్తున్న మార్పులు కనిపెట్టడంతో పాటు వ్యక్తిగతంగా క్రీడారంగంపై ఉన్న అభిరుచులు కూడా మేళవించి ఉండటంతో రాహుల్‌ను అంతా వైముఖ్య నాయకుడిగానే చూసేవారు. అంతే కాదు, ఎవరికీ తెలియకుండా సెలవులు పెడతారని, కొన్ని సమయాల్లోపార్టీకి దూరంగా ఉంటారనే పేరు కూడా తెచ్చుకున్నారు. పూర్తి సమయం నాయకుడు కాదనే విమర్శలు రావడంతో తన ధోరణిని రాహుల్ ఇపుడు మార్చుకున్నారు. అపవాదులు తొలగిపోయేలా పూర్తి సమయం అందుబాటులోకి వచ్చారు. పార్టీ వ్యవహారాల్లో పూర్తి పట్టు సాధించినా, అధికార యంత్రాంగంలో అంతర్గతాంశాలపై అవగాహన ఇపుడిపుడే పెంచుకుంటున్నారు.
సామాజిక మాధ్యమాలలో జోరు
తాజాగా సామాజిక మాధ్యమాలపైనా పట్టుసాధించారు. మిగిలిన వారు చేసే వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇస్తున్నారు. లోక్‌సభలో రాహుల్ సరళిని ఎంత మంది విమర్శించినా, ఎక్కువ చింతనకు గురికాకుండా సమయం వచ్చినపుడు తన దైన స్టైల్‌లో సమాధానం చెబుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయనను సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అనుసరించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నికలు, పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకున్న తరువాత ‘వారసత్వ’ అవకాశాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ ‘కాంగ్రెస్’ మార్క్ రాజకీయాలంటే ఇష్టపడలేదు. ఇది రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోని మాట. తాజాగా ఆయన అమెరికాలో పాల్గొన్న కార్యక్రమాల్లో మాట్లాడినపుడు ‘వారసత్వ’ రాజకీయాలు మిగతా పార్టీల్లోనూ ఉన్నాయని, తనకే ప్రత్యేకం కాదన్నారు.
ఎన్నికల్లో తలబొప్పికట్టినపుడల్లా ఆత్మశోధన పేరుతో సమీక్షలు చేసుకోవడం, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందుతామనే హామీలు ఇవ్వడం వినా ఎలాంటి కార్యాచరణ ఉండటం లేదనే అపవాదు నుండి కాంగ్రెస్ పార్టీని రక్షించే బాధ్యత కూడా ఇపుడు రాహుల్‌దే. అయితే ఆయనకు అత్యంత ఆసక్తికలిగించే గిరిజన సమస్యలు, యువజన సమస్యలు, మహిళా సమస్యలు, దళిత సమస్యలే ఆయనకు బలంగా మారనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కాకుండా సంక్షోభ సమయంలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ కొత్త టీమ్‌పై దృష్టి సారించారు. ఈ దిశగా ఇప్పటికే ఆయన కసరత్తు మొదలు పెట్టారు. మాటల్లో కంటే చేతల్లో చూపడంలోనే రాహుల్ ఇష్టపడతారనేది అందరికీ తెలిసిందే. తన సహచరులు సైతం మెరుగైన పనితీరు కనబరచాలని కోరుకోవడం సహజం. శాసనసభ , సాధారణ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడం కోసం పార్టీలో ప్రతిభ కనబరుస్తున్న యువ నాయకులను ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు పంపించారు. అలాగే సచిన్ పైలట్ వంటి యువకులు పిసిసి అధ్యక్షులుగా ఉండటంలో రాహుల్ పాత్ర విస్మరించలేనిదే. ప్రజాసమస్యలను అనునిత్యం లోక్‌సభలో గొంతెత్తే సుస్మితా దేవ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ తరఫున లోక్‌సభలో ఆందోళన జరుగుతుంటే సీనియర్లు తమ సీట్లకే పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈపరిస్థితి ఉండరాదని రాహుల్ భావిస్తున్నారు. యువనేతల్లో దూకుడుగా ఉంటే జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్, దీపేందర్ హుడా, గౌరవ్ గొగాయ్, సుస్మితాదేవ్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, మీనాక్షి నటరాజన్ తదితరులకు ఎఐసిసిలో కీలక పదవులు దక్కే వీలుంది. మాజీ ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు మున్ముందు కూడా రాహుల్ టీమ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ప్రధానకార్యదర్శులు అందర్నీ తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశం ఉంది.
సంస్కరణలపై దృష్టి
సంస్థాగత చేర్పులు మార్పులతో పాటు కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా పార్టీ పనిపోకడలను సంస్కరించుకుంటూ, ప్రజల్లో మమేకమై వారి సాధక బాధకాల్లో పాలుపంచుకునేలా పార్టీని క్రియాశీలం చేస్తూ జనహితకర సైద్ధాంతిక ప్రాతిపదికలను జాగ్రత్తగా కాపాడుకుంటూ భావి సవాళ్లకు సరైన పరిష్కారాలను ప్రతిపాదించే చేవ, చొరవ ప్రదర్శించాలి. సామాన్య కార్యకర్తల మనోభావాలకు పెద్ద పీట వేయాలి. వ్యక్తి పూజ సంస్కృతికి సమాధి కట్టి, కోటరీ కోటల్ని కూల్చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిత. అది జరగకుంటే శతవసంతాల పార్టీ భజనపరుల సంబరాల్లో మునిగితేలడం తప్ప జరిగేది, ఒరిగేదీ పూజ్యం. పార్టీ పునరుత్తేజితమై అద్భుత ఫలితాలను సాధిస్తుందనే కార్యకర్తల ఆకాంక్షలను ఈడేర్చడమే రాహుల్‌కు సవాల్.
మొమొ అంటే ఇష్టం
తనను తాను హిందువునని, యజ్ఞోపవీతం ధరిస్తానని ఇటీవల గట్టిగా చెప్పి గుడులు చుట్టూ తిరిగి బిజెపికి కలవరం కలిగించిన రాహుల్‌గాంధీ శాకాహారంతో మాటు మాంసాహారం తింటారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొలువుదీరిన భూటాన్, టిబెట్, నేపాల్, భారత్ హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలలో సంప్రదాయ వంటకమైన ‘మొమొ’ అంటే రాహుల్‌కు చాలా ఇష్టం. మాంసం లేదా కూరగాయలతో చేసిన కారపుముద్దను మన పూర్ణాల్లా చేసి దానిని మైదా లేదా వరిపిండితో చుట్టి చేసిన వంటకం మొమొ. ఒకప్పుడు కేవలం మాంసానే్న లోపలి కూరేవారు. ఇటీవలి కాలంలో కూరగాయలు, ఇతర మాంసాలను కూరి వండుతున్నారు.
ఆటలపై ఆసక్తి
ఎవరికీ నమ్మశక్యం కాని అంశం జపాన్ మార్షల్ ఆర్ట్ అయికిడోలో బ్లాక్ బెల్ట్ ఉండటం. రన్నింగ్, స్విమ్మింగ్‌లలో కూడా ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. బ్యాడ్మింటన్ చిన్నప్పుడు బాగా ఆడేవారు. తనను తాను నియంత్రణలో పెట్టుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడిందనేది రాహుల్‌ను చూసిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. ఎగసిపడాల్సిన వయసులోనూ నిదానంగా, ఆధ్మాతిక చింతనతో కనిపించడం కూడా అందరి విమర్శలకు తావిచ్చింది. ప్రఖ్యాత క్రీడాకారుడు విజేంద్రన్‌తో ఓసారి రాహుల్ మాట్లాడుతూ తనకు ఆటలంటే ఎంత ఇష్టమో చెప్పారు. రోజులో కనీసం గంటపాటు వ్యాయామం, ఆటలు ఆడతానని స్వయంగా చెప్పారు. మార్షల్ ఆర్ట్ అయికిడో ఎలా నేర్చుకున్నదీ స్వయంగా వివరించారు. గడచిన కొద్దినెలలుగా తీరిక లేకపోవడం వల్ల ఆటలకు ఆటంకం ఏర్పడుతోందని కూడా చెప్పుకొచ్చారు.

నేనున్నాగా...
కాంగ్రెస్‌లో పుట్టి పెరిగి రాష్టప్రతిగా బాధ్యతలు నిర్వహించిన ప్రణబ్‌ముఖర్జీ ఆశీస్సులు రాహుల్‌గాంధీకి పూర్తిగా ఉన్నాయంటారు. రాష్టప్రతి పదవినుంచి తప్పుకున్నాక పార్టీ వ్యవహారాలలో ఆయన రాజగురు పాత్ర నిర్వహించేందుకు అంగీకరించారన్న ప్రచారం జరిగింది. సోనియాబృందం ఈ విషయంలో పార్టీకి పునరుజ్జీవం కల్పించడానికి ఆయన అండదండలు కావాలన్నరని చెబుతారు. ప్రణబ్ తాజాగా రాసి విడుదల చేసిన పుస్తకాల్లో కాంగ్రెస్ ఘనతను వివరిస్తూ ఆ పార్టీని తక్కువ అంచనా వేయొద్దని పేర్కొనడం గమనార్హం. రాహుల్‌లో ఇప్పుడు కాస్తంత పరిణతి కన్పించడంలో ఆయన సలహాలు, సూచనలు ఉన్నాయని అంటారు. సోనియా లేదా ప్రియాంక సారథ్యంలో పార్టీకి మంచి జరుగుతుందని కొందరు పార్టీలోని కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ రాహుల్ అందుకు సమర్థుడని ఆయన భావన అని కొందరు అంటారు. ఇందిర, రాజీవ్ మొదట్లో అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత తామేంటో నిరూపించుకున్నారని, రాహుల్ కూడా అలాగే రాణిస్తారన్నది మరో అంచనా.
*

-బి.వి. ప్రసాద్