S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..64 మీరే డిటెక్టివ్

పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు నమస్కరిస్తూ అడవికి వెళ్తూంటే అంతఃపురం నించి స్ర్తిల ఏడుపు ప్రతిధ్వనించింది.
‘రక్షకులు లేనివాళ్లం. బలం లేనివాళ్లం. దీనులమైన మా అందరికీ ఏ రాముడు రక్షకుడిగా ఉన్నాడో ఆ రక్షకుడు ఎక్కడికి పోతున్నాడో? ఎవరైనా నిందించినా కోపం తెచ్చుకునేవాడు కాదు. కోపం కలిగించే పనులని చేసేవాడు కాడు. కోపం వచ్చిన వాళ్ల కోపం పోయేట్లుగా బతిమాలేవాడు. అందరితో సమానంగా దుఃఖాన్ని పంచుకునేవాడు. అలాంటి రాముడు ఎక్కడికి వెళ్లిపోతున్నాడో? మహా తేజస్సు గల రాముడు తన తల్లి కౌసల్య విషయంలో ఎలా ప్రవర్తించేవాడో మా విషయంలో కూడా అలాగే ప్రవర్తించేవాడు. అలాంటి మహాత్ముడు ఎక్కడికి పోతున్నాడో. మా అందర్నీ, ఈ ప్రపంచాన్ని కూడా రక్షించే రాముడు కైకేయి నిర్బంధం వల్ల, దశరథుడి చేత అడవికి వెళ్లమని ప్రేరేపించబడి ఎక్కడికి పోతున్నాడో? ఎంత ఆశ్చర్యం! ఈ రాజు ప్రాణులందరికీ ఇష్టుడు. ధర్మాత్ముడు. సత్యానే్న మాట్లాడేవాడు. అలాంటి వాడు రాముడ్ని వనవాసానికి పంపుతున్నాడు. ఇతనికి బుద్ధిలేదు’
ఇలా రాజు భార్యలంతా తమ దూడల నించి దూరమైన ఆవుల్లా దుఃఖంతో బిగ్గరగా ఏడ్చారు. మొదటే పుత్రశోకంతో బాధపడే ఆ రాజుకి అంతఃపురం నించి వినపడ్డ ఆ ఏడుపులకి దుఃఖం రెట్టింపైంది.
అప్పుడు బ్రాహ్మణులు అగ్నిహోత్రాలని చేయలేదు. గృహస్థులు ఇళ్లల్లో వండుకోలేదు. ప్రజలు తమ పనులని చేయలేదు. సూర్యుడు కూడా కనపడకుండా పోయాడు. ఏనుగులు నోట్లో ఉన్న తినే పదార్థాలని కక్కేసాయి. ఆవులు దూడలకి పాలు ఇవ్వలేదు. తొలిసారిగా కొడుకు పుట్టినా తల్లి అందుకు సంతోషించలేదు. సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు.. క్రూర గ్రహాలన్నీ చంద్రుడితో కలిసి ఉన్నాయి. నక్షత్ర కిరణాలు మాయం అయ్యాయి. గ్రహాల తేజస్సు తగ్గిపోయింది. కోసల దేశ నక్షత్రమైన మూలని ఆకాశంలో పొగ ఆవరించింది. సముద్రం ప్రళయకాల సమయంలో వాయు వేగంతో పొంగినట్లుగా పొంగింది. రాముడు అరణ్యానికి ప్రయాణం కాగానే ఆ నగరమంతా చలించింది. దిక్కులన్నీ చీకటి కమ్మినట్లైంది. గ్రహాలు, నక్షత్రాలు, మరేమి వెలగలేదు. నగరంలోని పౌరులందరినీ అకస్మాత్తుగా దైన్యం ఆవహించింది. ఆహారం మీదకి కాని, విహారం మీదకి కాని ఏ ఒక్కడి మనసు మళ్లలేదు. అయోధ్యలోని ప్రజలంతా దుఃఖ పీడితులై దీర్ఘంగా నిట్టూరుస్తూ దశరథ మహారాజు గురించి విచారించారు. రాజమార్గంలో ఉన్న ప్రజల ముఖాలు కన్నీళ్లతో కలుషితమై పోయాయి. సంతోషంగా ఉన్న వాడు ఒక్కడూ కనపడక ప్రతీ ఒక్కడూ దుఃఖంతో ఉన్నాడు.
ఆ సమయంలో గాలి చల్లగా వీచలేదు. చంద్రుడు సౌమ్యంగా లేడు. సూర్యుడు ఎండని కాయలేదు. ప్రపంచం మొత్తం విచారంగా ఉంది. కొడుకులకి తల్లుల విషయంలో, భర్తలకి భార్యల విషయంలో ఆసక్తి తగ్గింది. సోదరులు ఒకరి మీద ఒకరు ఆసక్తి లేని వాళ్లు అయ్యారు. అన్నిటినీ విడిచి అంతా రాముడి గురించే ఆలోచించారు. రాముడి మిత్రులంతా విచారంతో నిండి ఏం చేయాలో తోచక మంచం దిగలేదు. రాముడు లేని ఆ అయోధ్య దేవేంద్రుడు లేని పర్వతాలతో కూడిన భూమిలా భయం, శోకాలతో కలిగిన బాధతో భయంకరంగా చలించింది. అక్కడ ఉన్న ఏనుగులు, యోధులు, గుర్రాలు కూడా పెద్దగా ఏడ్చాయి. (అయోధ్యకాండ సర్గ - 41)
రాముడి రథం నించి రేగిన దుమ్ము కనపడేంత వరకు దశరథుడు అటే చూశాడు. అత్యంత ధర్మాత్ముడైన, తనకి ఇష్టమైన కొడుకుని ఆ రాజు ఎంతవరకు చూసాడో అంతవరకూ అతనికి కొడుకుని చూసే ఆనందం కలిగించడం కోసం భూమి మీద ధూళి చెలరేగింది. రాముడి రథం వల్ల ఎగిరిన దుమ్ము ఎప్పుడు కనపడలేదో అప్పుడా దశరథుడు విచారంతో, దిగులుతో నేలకూలాడు. వెంటనే లేవదీయడానికై భరతుడి మీద ప్రేమ గల కైకేయి ఆయనకి ఎడమవైపునకు వచ్చింది. నీతితో, ధర్మంతో, వినయంతో కూడిన రాజు కైకేయిని చూసి చాలా బాధగా చెప్పాడు.
‘ఓ కైకేయి! చెడ్డ స్వభావం గల నువ్వు నన్ను తాకద్దు. నిన్ను చూట్టం నాకు ఇష్టం లేదు. నువ్వు నా భార్యవి కావు. బంధువు కూడా కాదు. నీ మీద ఆధారపడి జీవించే నీ అనుచరులకి నేనేమి కాను. నాకు వాళ్లేమీ కారు. ధర్మాన్ని వదిలి కేవలం ధనం మీదే ఆసక్తి గల నిన్ను నేను వదిలేస్తున్నాను. నీ చెయ్యి పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కలిగిన సంబంధాన్ని ఇహలోకంలో, పరలోకంలో కూడా విడిచి పెడుతున్నాను. నాశనం లేని ఈ రాజ్యం పొందినందుకు భరతుడు సంతోషిస్తే అతను పితృకార్యంలో నా కోసం ఇచ్చే జలతర్పణాలు నాకు చెందకుండుగాక!’
విచారంతో కృశించిన కౌసల్య ఒళ్లంతా దుమ్ముతో నిండిన ఆ రాజుని నేల మీద నించి లేవతీసి తన ఇంటికి వెళ్లిపోయింది. ముని వేషం ధరించి అడవికి వెళ్లిన కొడుకుని తలచుకుని ధర్మాత్ముడైన దశరథుడు కావాలని బ్రహ్మహత్య చేసిన వాడిలా, చేతిలో నిప్పుని పట్టుకున్న వాడిలా బాధపడ్డాడు. రథ మార్గంలో వెనక్కి తిరిగి, తిరిగి చూస్తూ విచారించే ఆ దశరథుడి రూపం కేతువు మింగిన సూర్యుడి రూపంలా కాంతి హీనమైంది. ఇష్టమైన తన కొడుకునే తలచుకుంటూ ఆయన దుఃఖంతో ఏడిచాడు. కొడుకు పట్టణాన్ని దాటాడని వినగానే ఇలా చెప్పాడు.
‘నా కొడుకుని తీసుకువెళ్లిన గుర్రాల అడుగుజాడలు నేల మీద కనపడుతున్నాయి. కాని మహాత్ముడైన రాముడు మాత్రం కనపడటం లేదు. నా కుమారుల్లో శ్రేష్ఠుడైన ఏ రాముడు శరీరానికి చందనం పూసుకుని, ఉత్తమమైన స్ర్తిలు వింజామరలు వీస్తూండగా మెత్తని దిళ్లపైన పడుకునేవాడో ఆ రాముడే ఇప్పుడు ఏదో ఓ చెట్టు నీడని ఆశ్రయించి, కర్రని కాని, రాయిని కాని దిండుగా చేసుకుని పడుకుంటాడు. దీనుడైన ఆ రాముడు దుమ్ముతో కప్పబడి నిట్టూరుస్తూ పర్వతం మీంచి ఏనుగు లేచినట్లుగా నేల మీద నించి లేస్తాడు. లోకాలకి నాథుడైన రాముడు ఈ విధంగా నేల మీంచి లేచి అనాథగా వెళ్తూంటే, ఆజానుబాహుడైన అతన్ని అడవుల్లో నివసించే ప్రజలు చూస్తారు. ఎల్లప్పుడూ సుఖాలకి అలవాటు పడ్డది, జనకునికి ఇష్టమైన కూతురైన సీత ఇప్పుడు ముళ్ల మీద నడవడం వల్ల బాధపడుతూ అడవిలోకి వెళ్తోంది. గతంలో ఎన్నడూ అడవులని చూడని ఆ సీత గగుర్పాటు కలిగించే క్రూరమృగాల గంభీర ధ్వనిని విని భయపడుతుంది. కైకేయి! నీ కోరిక తీరింది. విధవవై రాజ్యాన్ని పాలించు. పురుష శ్రేష్ఠుడైన రాముడు లేకుండా నేను జీవించలేను.’
ఇలా ఏడుస్తూ రాజు బంధు మరణాన్ని విని స్నానం చేసినవాడు అమంగళమైన ఇంట్లోకి ప్రవేశించినట్లు, జన సముదాయంతో కలిసి పట్టణాల్లో శ్రేష్ఠమైన అయోధ్యలోకి ప్రవేశించాడు.
అయోధ్యలోని కూడళ్లు, ఇంటి మధ్య భాగాలు నిర్మానుష్యమయ్యాయి. దుకాణాలు, దేవాలయాలు మూసేసారు. ప్రజలు విచారంతో అలసి నీరసంగా ఉన్నారు. రాజమార్గాలు సరిగ్గా శుభ్రం చేయబడలేదు. అలాంటి ఆ నగరాన్ని చూసి దశరథుడు రాముడ్నే తలచుకుంటూ, ఏడుస్తూ సూర్యుడు మేఘం చాటుకి ప్రవేశించినట్లుగా ఇంట్లోకి వెళ్లాడు. సీతారామ లక్ష్మణులు లేని ఆ ఇల్లు గరుత్మంతుడితో చంపబడ్డ సర్పం గల, ప్రవేశించడానికి శక్యం కాని గొప్ప సరస్సులా ఉంది. దశరథుడు గద్గదంగా ఏడుస్తూ మృదువుగా, మందమైన అర్థం కల, వినిపించీ, వినిపించని కంఠ స్వరంతో దీనంగా చెప్పాడు.
‘నన్ను వెంటనే రాముడి తల్లైన కౌసల్య ఇంటికి తీసుకెళ్లండి. నా మనసుకి మరి ఎక్కడా ఊరట కలగదు’
రాజు మాటలు విన్న ద్వారపాలకులు ఆయన్ని కౌసల్య ఇంటికి తీసుకెళ్లి వినయంగా అక్కడ పడుకోబెట్టారు. కౌసల్య ఇంట్లోకి వచ్చాక దశరథుడు పరుపు మీద పడుకున్నా ఆయన మనసంతా దుఃఖంతో నిండి ఉంది. ఇద్దరు కొడుకులు, కోడలు లేని ఆ ఇల్లు రాజుకి చంద్రుడు లేని ఆకాశంలా కనిపించింది. వీరుడైన ఆ మహారాజు ఆ ఇంటిని చూసి చేతులు పైకెత్తి, ‘అయ్యో రామా! నన్ను వదిలి వెళ్తున్నావు కదా?’ అని బిగ్గరగా ఏడ్చాడు.
‘పధ్నాలుగు సంవత్సరాల కాలం పూర్తయ్యేదాకా బతికి ఉండే వారు రాముడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని చూసి, కౌగిలించుకుని ఆనందపడగలరు. అయ్యో!’
కొద్దిసేపటికి దశరథుడికి కాళరాత్రి వంటి రాత్రి వచ్చింది. ఆ అర్ధరాత్రి దశరథుడు కౌసల్యతో ఇలా చెప్పాడు.
‘కౌసల్యా! నా దృష్టి రాముడి వెంట వెళ్లిపోయింది. అది ఇంక తిరిగి రావడంలేదు. నువ్వు నాకు సరిగ్గా కనపడటం లేదు. నీ చేత్తో నన్ను తాకు.’
మంచం మీద పడుకుని రాముడి గురించే ఆలోచించే ఆ రాజుని చూసి కౌసల్య చాలా విచారిస్తూ దగ్గరే కూర్చుని, నిట్టూరుస్తూ ఏడ్చింది. (అయోధ్య కాండ సర్గ -42)
ఆ హరికథ విన్న మీనమ్మ లేచి చెప్పింది.
‘కథని బాగా చెప్పారు. కాని మీరు కొన్ని తప్పులు చెప్పారు. చిన్నప్పటి నించి వాల్మీకి రామాయణం వందల సార్లు పారాయణం చేయడం వల్ల నాకు ఆ తప్పులు తెలిసాయి. వాటిని చెప్తాను వినండి.’
మీరా తప్పులని పట్టుకోగలరా?
*
మీకో ప్రశ్న
*
త్రిశంకుడు అంటే
అర్థం ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
దశరథుడు అంటే అర్థం ఏమిటి?
*
దశరథుడు అంటే దశ దిశల్లో రథగమనం కలవాడు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.మాతలి దేవేంద్రుడితో చెప్పినట్లుగా చెప్పాడు అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు ‘సూర్యుడితో’ అని తప్పుగా చెప్పాడు.
2.సుమంత్రుడు రాముడి రథం ఎక్కమని చెప్తూ పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉండాలి అని చెప్పాడు. హరిదాసు పొరపాటుగా పనె్నండు సంవత్సరాలు అని చెప్పాడు.
3.్భర్తని అనుసరించి వెళ్లే సీత కోసం దశరథుడు ఆమె అడవిలో ఎంత కాలం ఉండాలో లెక్క చూసి బట్టలని, ఆభరణాలని ఇచ్చాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
4.లేగ దూడ మీద ప్రేమగల ఆవు ఇంటికి తిరిగి వచ్చి కట్టి ఉన్న తన లేగ దూడ వైపు పరిగెత్తినట్లుగా కౌసల్య తన కొడుకు వైపు పరిగెత్తింది’ అనే అందమైన ఉపమానాన్ని చెప్పడం హరిదాసు విస్మరించాడు.
5.‘రథాన్ని ఎందుకు ఆపలేదు?’ అని రాజు తర్వాత నిన్ను నిందించినా, ‘నాకు వినపడలేదు’ అని చెప్పచ్చు. వీరి దుఃఖాన్ని చాలాసేపు చూసి సహించలేను’ అని రాముడు సుమంతుడితో చెప్పిన మాటలని హరిదాసు చెప్పలేదు. (రాముడు అబద్ధం ఆడమని చెప్పడం రామాయణంలో ఇది మొదటిసారి)
6.‘ఎవరు తిరిగి రావాలని మనం కోరుకుంటామో వారిని చాలా దూరం సాగనంపకూడదు’ అని మంత్రులు దశరథుడితో చెప్పిన హితవుని హరిదాసు చెప్పలేదు.
*

-మల్లాది వెంకట కృష్ణమూర్తి