S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ధన్యులు.. అమరగాన మూర్ధన్యులు’

లోకంలో సాధారణంగా మనుషుల ప్రవృత్తులకీ, చేసే వృత్తులకీ పొంతన కనిపించదు. వినేవారి చెవుల్ని పట్టి ‘నాదం’తో పాట పాడి మెప్పించటం ఒక కళ.
పాడాలనే ఉత్సాహం ఉంటుంది. శ్రుతి పక్వమైన కంఠస్వరం వుంటుంది. చేసే వృత్తులు వేరై పోతాయి. నేర్చుకోవాలని వున్నా వీలుపడదు కొందరికి. కంఠస్వరాలు శ్రుతిలో వుండవు. ఎంతో నేర్చుకుని పాడేయాలని ఉంటుంది. కానీ ఎంత నేర్చుకున్నా దారీతెన్నూ దొరకదు కొందరికి.
‘నాదోపాసన’ అంటే సుస్వరంతో చెవికి సోకేలా వినబడే ఓ ధ్వని విశేషం. ఒక్క చుక్కా వాన కురవకుండా ఉత్త ఉరుములే కనిపిస్తోంటే ఏం లాభం? పాటైనా అంతే.
వృత్తులూ ప్రవృత్తులూ ఒకటే అయిన వారు ఏ కొద్దిమందో ఉంటారు. పాట చెవుల పడగానే ఆకర్షించేది ముందు సంగీతమే. సాహిత్యం జోలికి తొందరగా మనసు వెళ్లదు. నాదం చెవులకు సోకిన మరుక్షణం మనసు ముందుగా పులకరిస్తుంది. నెమ్మదిగా సాహిత్యాన్ని వెదుకుతుంది.
పాకిస్తాన్ టీవీలో ఒక ఆటో డ్రైవర్‌ని ఇంటర్వ్యూ చేసి ఈ మధ్య చూపించారు - అతని పేరు మహ్మద్ అస్లాం. ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు ‘ఉస్తాద్ బడేగులామాలీఖాన్’ పాడిన ‘యాద్ పియా కీ జాయే’ అనే టుమ్రీని యధాతథంగా అన్ని గమకాలతో శ్రుతిబద్ధంగా ఆటోలో కూర్చునే పాడేశాడు - ఆశ్చర్యం?
కొనే్నళ్లపాటు గురువు దగ్గర కూర్చుని ఎంతో కఠోర సాధన చేస్తే గానీ లొంగని ఆ పాటను 5 నిమిషాల్లో పాడుతోంటే విస్తుపోయి వింటూ కూర్చుండిపోయాను.
ఏమి దైవలీల? అనుకుంటూ ఆ రోజంతా ఆ గాయకుణ్ణే తలుచుకుంటూ గడిపాను.
అందుకే తెలుసుకోవాలనే కోరిక, విందామనే కుతూహలం, పాడాలనే ఉత్సాహం, సహజంగానే పుట్టాలి. ఒకరు చెబితే రావు. ‘శ్రీమద్రమా రమణ గోవిందో! హరీ!’ అనుకుంటూ నా బాల్యంలో చేతిలో తంబురాతో శ్రుతి మాధుర్యంతో నారాయణతీర్థుల తరంగాలో, రామదాసు కీర్తనలో హాయిగా పాడుతూ గుమ్మం ముందు నిలబడి భిక్ష అడిగే హరిదాసులను ఎరుగుదును.
ఏమా శ్రుతి నిబద్ధత? ఎంతటి చక్కని లయ? తలపాగా చుట్టుకుని, ఆకుపచ్చ కండువా కప్పుకుని ఉత్తర హిందూస్థాన్‌లో యిలాగే.. శ్రుతి పక్వంగాపాడే ఫకీర్లుండేవారు.
అమృత్‌సర్‌కు సమీపంలో కోట్లా సుల్జాన్ సింగ్ అనే ఊళ్లో చేతిలో డప్పు, బుర్ఖాతో నడిచి వెళ్తూ, హాయిగా పాడే ఆ పాటకు 12 ఏళ్ల బాలుడు ఆ ఫకీర్ల వెంట వెళ్లిపోతూ పాట యందు ఆసక్తి పెంచుకున్నాడు.
ప్రతిరోజూ ఆ ఫకీర్ ఏదో ఓ కొత్త పంజాబీ గీతం పాడి వినిపిస్తూంటే, జనం పోగై ఆసక్తిగా వినేవారు. స్కూలుకు అయిష్టంగానే వెళ్తూ, దారిలో పాటలు పాడే ఫకీరు కనిపిస్తే, అతడి వెంటే తిరుగుతూ పాటలు వింటూ, అలాగే యింట్లో పాడే ప్రయత్నం చేయనారంభించాడు. అతని ముద్దు పేరు ‘్ఫకో’.
తండ్రి పేరు ఆలీ మొహ్మద్. ఆరుగురు సంతానంలో ‘్ఫకో’ రెండో వాడు. 1935లో ఈ కుటుంబం పాకిస్తాన్‌లోని లాహోర్‌కు తరలి వెళ్లిపోయింది.
సోదరుడు సిద్దిఖీ మొహమ్మద్‌కు స్నేహితుడైన హమీద్ ఫికో పాట విన్నాడు. క్రమక్రమంగా కోట్లా సుల్తాన్‌సింగ్ గ్రామంలో ప్రతివారూ ఈ బాలుడు పాడే పాటలు ఆసక్తిగా వినటం ప్రారంభించారు. అతడిలోని ప్రజ్ఞను గమనించిన సోదరుడు ఉస్తాద్ బడే గులామాలీఖాన్, ఉస్తాద్ వహీద్‌ఖాన్, జీవన్‌లాల్ మట్టూ వంటి దిగ్గజాలైన విద్వాంసులకు పరిచయం చేసి, సంగీతంలో ఓనమాలు దిద్దించటం మొదలెట్టారు. అదీ! తల్లిదండ్రులు చేయవలసిన పని.
సాధారణంగా యిటువంటి ప్రతిభ కలిగిన పిల్లల్ని ఈ రోజుల్లో ప్రోత్సహించి, ఆ విద్యలో వారికి మరింత అనురక్తి కలిగించే ప్రయత్నాలు చేయకపోగా తృణీకార భావంతో నిరుత్సాహపరుస్తూంటారు. శాస్తబ్రద్ధంగా నేర్పించే ఆసక్తిని చూపించరు, చాలామంది.
మానవ మేధస్సుపైన అపనమ్మకం, అవిశ్వాసం పెరిగితే కలిగే పరిణామాలు యిలాగే ఉంటాయి. ఎవరికి ఏయే విషయాలపై ఆసక్తి ఉందో పసికట్టినప్పుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. బుద్ధిగా చదువుకోకుండా ఏమిటా గాలిపాటలు? అంటూ వెనక్కిలాగే తలిదండ్రులుంటారు. కానీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆ బాలుడు శుద్ధమైన సంగీతం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ గాయకుడయ్యాడు. అతడే మహమ్మద్ రఫీ. (1924 - 1980).
ఆ రోజుల్లో బాగా పేరున్న గాయకుడు కె.ఎల్.సైగల్. మహామహులైన (సంగీత) దర్శకులు ఇష్టపడిన హీరోగా వెలిగిన సైగల్ చలనచిత్ర సంగీత రంగంలో సంచలనం సృష్టించిన మహా గాయకుడు. న్యూ థియేటర్స్‌లో పంకజ్ మల్లిక్, సిహెచ్.నౌషద్, ఆత్మా, ఆర్.సి.బొరాల్ వంటి సంగీత దర్శకులు చేసిన అమృతోపమానమైన పాటలు సైగల్‌ను తిరుగులేని గాయకుణ్ణి చేశాయి. మహమ్మద్ రఫీ ఆదర్శంగా నిలుపుకున్న గాయకుడు. విధాత కొందరికి కొన్ని విభూతుల్ని అలవోకగా ప్రసాదిస్తాడు. అలా లభించిన దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే వుంది ప్రజ్ఞ.
మనం చేయగలిగింది చేస్తే, మిగిలింది భగవంతుడు పూర్తి చేస్తాడు. ఉన్నదానితో తృప్తిపడితే లభించవలసినది దక్కకుండా పోతుంది. ఈలోగా అహంకారం కూడా తోడైతే, తెలియవల్సిన దారులన్నీ మూసుకుపోతాయి.
1950 - 1970 మధ్యకాలంలో మహమ్మద్ రఫీకున్న క్రేజ్ యింతా అంతా కాదు.
‘అంతర్ముఖులై పాడుతూండండి. అవార్డులు, రివార్డులూ వాటంతట అవే వెంటబడతాయి’ మన ప్రయత్నం అవసరం లేదంటూండేవారు ‘సంగీత కళానిధి’ డా.శ్రీపాద పినాకపాణి.
1967లో పద్మశ్రీ బిరుదుతో భారత ప్రభుత్వం రఫీని సత్కరించింది. ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. నాకనిపిస్తుంది. జీవితాలను మలుపు తిప్పగలిగేది పరమాత్ముడే. జీవితానికి మించిన ధ్యాన మందిరం ఉండదు. కాలానికి మించిన ఉత్తమ బోధకుడు ఉండడు. మనలో వున్నది మనకు చూపించటమే భగవంతుని చమత్కారం. ఎక్కడి నుంచీ ఏదీ తీసుకురాకుండా మనలో వున్నది మనకే చూపించి మనలను అద్వితీయులుగా చేసే శక్తి ఆయనకే వుంది.
మహమ్మద్ రఫీ వృత్తీ ప్రవృత్తీ రెండూ సంగీతమే. బ్రతుకుతెరువు కోసమే పాడి వుండచ్చు. కాని ఎలా పాడి బ్రతకాలో కూడా తెలిసిన గాయకుడు. ఆయనదో ప్రజ్ఞ.
కిషోర్‌కుమార్, ముఖేష్ లాంటి సహచర గాయకులక్కూడా రఫీ అభిమాన గాయకుడు.
ఏమిటి రఫీ గానంలోని విశేషం? మెలొడీకి అర్థం చెప్పిన గాయకుడు రఫీ.
శ్రుతిబద్ధమైన గాత్రం ఆయన సొమ్ము. భావం ఆయన ఆత్మ. ఆయన పాడిన వేలాది పాటల్లో ఏ పాట బాగుంటుంది? అని తేల్చి చెప్పటం కష్టం. బరువైన గాత్రంతో అక్షరాలను స్పష్టంగా పాడటం ఆయన ప్రత్యేకత. బాలీవుడ్ హీరోలను నిలబెట్టినది ఆయన గానం.
షకీల్ బదాయుని, హస్రత్ జైపురి, సాహిర్ లుథియాన్ వీ, మజ్రూ సుల్తాన్‌పురి, రాజేంద్ర కిషన్, శైలేంద్ర లాంటి సినీ రచయితల పాటలకు ప్రాణం పోసినది ఆ కంఠం.
లతామంగేష్కర్, ఆశాభోంస్లే, సుమన్ కళ్యాణ్‌పూర్, షంషాద్ బేగమ్, సురయ్యా, గీతాదత్, ఇలా ఎందరో గాయనీ మణులతో పాడిన రఫీని, సంపూర్ణ గాయకుడిగా తీర్చిదిద్దిన సంగీత దర్శకులలో మదన్‌మోహన్, నౌషద్ అలీ, ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, సలిల్ చౌదరి, రాజేష్ రోషన్, ఉషాఖన్నా, రోషన్, రవి, నయ్యర్, చిత్రగుప్త, ఖేమ్‌చంద్ ప్రకాష్, అనిల్ బిస్వాస్, సి.రామచంద్ర మొదలైన వారెందరో వున్నారు. 1957 అక్టోబర్ 2వ తేదీ నుంచి రేడియో వివిధభారతి కార్యక్రమాలు ఈనాటికీ వనె్న తగ్గకుండా ప్రసారమవుతూండటానికి ప్రధాన కారణం నిత్యం ఈ మహనీయుల గళాల నుండి వెలువడుతున్న అజరామర గీతాలే.
* * *
క్రిందటి శతాబ్దంలో యించుమించు నాలుగు దశాబ్దాలపాటు ఆంధ్ర దేశానికి అత్యుత్తమ సంగీతం పాడి వినిపించిన ప్రథమ శ్రేణి విద్వాంసుడు వోలేటి వెంకటేశ్వర్లు (1928-1989). డిసెంబర్ 29 ఆయన వర్థంతి.
సంగీతం వినటం, మననం చేయటం, అధ్యయనం, సంగీత బోధనం, సంగీతాన్ని సృజించటం, సంప్రదాయాన్ని సంరక్షించటం, సంగీత ప్రసారాల కోసమే తపించిన గాయకుడు వోలేటి వెంకటేశ్వర్లు.
విజయవాడ ఆకాశవాణి సంగీత విభాగపు మూల స్తంభాలలో ఆయన ఒకరు. డా.బాలాంత్రపు రజనీ కాంతరావు, డా.బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నంలతో కలిసి విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దిన మహా గాయకుడు. ఆయన ప్రాణం పెట్టి చేసిన కార్యక్రమాలు రెండు. ఒకటి భక్తిరంజని. రెండవది సంగీత శిక్షణ.
ఈ సంగీత శిక్షణ కార్యక్రమంలో రెండు దశాబ్దాలపాటు శిష్యుడుగా ఆయన ఎదురుగా కూర్చుని సంగీత మూర్తి త్రయం వారి కృతులు నేర్చుకున్న అదృష్టవంతుణ్ణి నేను. ఆయన నా గురువని చెప్పుకోవటంతోనే నాకు గౌరవముంది.
విజయవాడలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా మూడు దశాబ్దాల పాటు సంగీత సేవలందించిన వోలేటి చేపట్టిన వైవిధ్యభరితమైన కార్యక్రమాలలో కూచిపూడి యక్ష గానాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు మొదలైనవి ప్రముఖమైనవి.
ఆయన గానమే విలక్షణం. హిందూస్తానీ సంగీత సంప్రదాయంలోని తాన్ సంప్రదాయాన్ని కర్ణాటక సంగీతానికి అన్వయం చేస్తూ, శ్రుతిబద్ధమైన గాత్రంతో దక్షిణాది విద్వాంసులను అదరగొట్టిన విద్వాంసుడు వోలేటి.
మాధుర్యంతో నిండిన గాత్రం ఆయన సొత్తు. స్పష్టమైన ఉచ్చారణ, భావం, అనర్గళమైన రాగాలాపన, అనితర సాధ్యమైన మనోధర్మంతో నిండిన వోలేటి గానానికి పరవశులైన దక్షిణాది విద్వాంసులెందరో! కళ్లు మూసుకుని శిలా విగ్రహంలా కూర్చుని అంతర్ముఖుడై పాడే ఆ పాటకు దాసులైన సంగీత రసికులున్నారు.
ఆయన సంగీతానికి పటిష్టమైన పునాదిని వేసినది కాకినాడలోని మునుగంటి వెంకట్రావు పంతులు.
సాధారణంగా సంగీతాధ్యాపకుల మాదిరిగా కాకుండా పనె్నండు స్వర స్థానాలను వరుసగా సాధకం చేయించేవారు. అంటే షడ్జం, రెండు రిషభాలు, రెండు గాంధారాలు, రెండు నిషాదాలు, ఆరోహణ అవరోహణ క్రమంలో తడుముకోకుండా వేగంగా గానం చేయడమన్న మాట.
యిది అసాధారణమైన, క్లిష్టమైన సాధన. దీనివల్ల ఏ పాట చెవిని పడినా, ఆ పాటలోని స్వరాలను అవలీలగా గుర్తించ గలుగుతారు. దీనివల్ల నొటేషన్ రాయడం చాలా తేలికవుతుంది.
త్యాగరాజు తన్మయత్వంతో పాడుతోంటే ఆయన శిష్యులు అప్పటికప్పుడు నొటేషన్ రాయగలిగారంటే ఈ రకమైన అభ్యాసమే కారణం.
ఉస్తాద్ బడే గులామాలీఖాన్, కరీంఖాన్, రోషనారా బేగం వంటి దిగ్గజాల సంగీతం బాగా విన్న కారణంగా, హిందూస్తానీ సంగీతం పట్ల ఆయనకు మోజు ఏర్పడింది.
ఒక స్వరం మీద నిలిపి పాడే పద్ధతి ఆయనను ఎక్కువ ఆకర్షించింది. ఆ గుణాలను సాధనతో, సాధించి, తన బాణీకి అనువుగా మలుచుకున్న విద్వాంసుడు వోలేటి.
క్రియల్లో ఒదిగి వున్న స్వరాల కూర్పుని ఆయన నాకు అర్థమయ్యేలా వివరించి, పాడి బోధించేవారు. అందులో ‘రాగభావం’ నాకు ప్రస్ఫుటంగా కనిపించేది.
దీక్షితుల వారి నవగ్రహ, నవావరణ కృతులు, స్వాతి తిరునాళ్ నవరాత్రి కీర్తనలు, నేను అలా నేర్చుకున్నవే.
శుద్ధ కర్ణాటక సంగీతంలో హిందూస్తానీ సంగీత ఛాయలను పలికించటం అందరివల్లా కాదు. ఆయనకు మాత్రం అది వెన్నతోబెట్టిన విద్య. శోభిల్లే సప్త స్వర సుందరులను తనివితీరా దర్శించ గలిగిన విద్వాంసుడంటే ఆయనే.
1956 సం. నాటి మాట. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాహిత్య కార్యక్రమాల ప్రయోక్త పింగళి లక్ష్మీకాంతం, రంగస్థల ప్రయోక్త, సూత్రధారుడు బందా కనకలింగేశ్వర్రావు, వోలేటి సంయుక్తంగా రూపొందించిన కూచిపూడి యక్షగాన ప్రదర్శనల ఆదర్శ పరిణామాలకు కారకులు.
భామా కలాపం, గొల్ల కలాపం, ప్రహ్లాద, శశిరేఖా పరిణయం, ఉత్తర రామాయణం లాంటి కూచిపూడి యక్షగాన రచనలు తీసుకుని ఆయా నాటకాలలో ఆయా పాత్రల వేషధారణలో ప్రామాణికతను ఏర్పరుస్తూ, ఆయా నాటకాలలో వినబడే దరువులలోని రాగాలను సమన్వయపరుస్తూ, స్వరయుక్తంగా నిర్దేశిస్తూ వోలేటి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు.
వోలేటి మద్రాసులో నిరుద్యోగిగా వుండే రోజుల్లో (1950-54) కొన్ని సినిమా అనుభవాలు కూడా నాతో చెప్పేవారు.
జెమినీ వారి ‘దో దుల్హే’ హిందీ చిత్రంలో ఒక యుగళ గానంలో మహమ్మద్ రఫీతో పోటాపోటీగా పాడి, సంగీత దర్శకుడైన బాలకృష్ణకల్లా, రఫీ, తదితర ప్రముఖుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన సంఘటన చెబుతోంటే ఎంతో ఆనందించేవాణ్ణి. ఆ అవకాశాన్ని అప్పట్లో జెమినీలో సహాయకురాలిగా వున్న శ్రీమతి వక్కలంక సరళగారి ప్రమేయం వల్ల లభించిందని చెప్పారు వోలేటి.
మీకు మరో విషయం చెప్పాలి. ‘అర్ధాంగి’ చిత్రానికి బి.ఎన్.ఆర్. సంగీత దర్శకుడు. ‘వద్దురా కన్నయ్యా’ అనే పాట జిక్కి పాడింది. ‘కాపీ’ రాగంలో వోలేటిగారే ఆ పాటకు రూపకల్పన చేసిన సంగతి చాలామందికి తెలియదు. సినిమా ప్రపంచంలో ఇటువంటి సంఘటనలు సాధారణమే. అసలు వాడి పేరుండదు. కృతజ్ఞతకు అర్థం తెలియని సినిమాయా జాలంలో వింజమూరి అనసూయ, డా.బాలాంత్రపు రజనీకాంతరావు లాంటి వారు సైతం చిక్కుకున్న సంగతి కొద్దిమందికే తెలుసు.
కొన్ని దశాబ్దాల పాటు రేడియో సంగీత శిక్షణ ద్వారా ఎందరో సంగీత రసికులకూ, సంగీత విద్యార్థులకూ ప్రీతిపాత్రుడైన వోలేటి ప్రజ్ఞా ప్రాభవాలకు, అసూయ చెందిన ఆయన సహచరులే (ప్రక్కవాద్య కళాకారులు, ఆర్టిస్టులైన అధికారులు) ఆయనకు శత్రువులయ్యారు. దీనికి తీవ్ర మనస్తాపానికి గురై విజయవాడ కేంద్రంలో పనిచేస్తూ, ముందే రిటైర్‌మెంట్ కోరుకున్న సంగతి తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు.
పవిత్రమైన సంగీతాన్ని ఆశ్రయించుకున్నంత మాత్రాన విద్వాంసులందరి స్వభావాలూ, ఒకేలా వుంటాయనుకోకండి. కక్షలూ, కార్పణ్యాలు, పక్షపాతాలు, అసహనాలు, అసూయా ద్వేషాలు బాగా మెండుగా వుండే రంగమే.. సంగీత రంగం. మంచిని మెచ్చుకోలేక పోవటం, స్వీయ లోపాలు తెలియకపోవటం, అతి సహజం. అహంకార మమకారాలుంటాయి. కానీ ఆత్మగౌరవమే ప్రధానమని నమ్ముతూ తన పాట తాను హాయిగా పాడుకుని, కర్ణాటక సంగీత విద్వాంసుల మధ్య, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న వోలేటి వెంకటేశ్వర్లు వంటి విద్వాంసుణ్ణి మళ్లీ ఆ బ్రహ్మ సృష్టించగలడా?
*

- మల్లాది సూరిబాబు 9052765490