S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గానమూర్తులు.. జ్ఞానకీర్తులు

సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి (1759-1847)
ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రత్యేకం
*
‘మనిషి జన్మకు మూలం అన్నం. ఆనందం మానవుని గమ్యం - అన్నగత ప్రాణియైన మనిషి ప్రాణాన్ని కుదుటపరచుకుని జ్ఞానం సంపాదించి ఆనంద స్థితికి చేరుకుంటాడు’ అని ఉపనిషత్తులు చెప్పే మాట.
మనం తినే అన్నం, మనల్ని నిలబెట్టే ప్రాణం, మనకు ఆలోచనలిచ్చే మనస్సు, మనస్సు వల్ల లభించే ఆనందం- ఇదే పరమావధి. ఈ ఐదూ పరతత్త్వం వల్లనే లభిస్తున్నాయి. ఆ పరబ్రహ్మం ఆనంద నిలయుడు. ఆనందానికంటే అతీతుడు. ఇంటి కంటే ఇంటి యజమాని గొప్పవాడు కదా? పంచ భూతాల వల్ల పుట్టిన మనిషి మళ్లీ పంచభూతాల్లో ఐక్యమై పోతాడు.
ఈ మధ్య కాలంలో సాగించే ప్రయాణంలో మనిషి వెదుకులాటంతా ఆనందం కోసమే. ఈ ఆనందం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. తింటే ఆకలి తీరుతుంది. తాగితే దాహం తీరుతుంది. మళ్లీ అవే కావాలి. ఎప్పటికప్పుడే పరగడుపు.
కానీ, నిత్యానందం కోసం తపించిన వారున్నారు. అది తరగని ఆస్తి. వారు నడిచిన దివ్య జీవన మార్గంలో కవులు, గాయకులు, వేదాంతులు, విజ్ఞానులు, యోగులూ నడిచారు. మనకో దారి చూపించారు. అటువంటి వారిలో, మన త్యాగరాజు మొదటి వరుసలో ఉంటాడు.
స్థిరమైన, శాశ్వతమైన, బ్రహ్మానందాన్ని అనుభవించి నిత్య స్మరణీయుడయ్యాడు.
పాడగలిగినా, పాడలేకపోయినా, వినాలనే రుచి వున్నా, సామూహికంగా విద్వాంసు లందరితో కలిసి కూర్చుని పాడి ఆనందించే కీర్తనలే ఈ పంచరత్నాలు. పంచనద క్షేత్రంలో వెలిసిన ఆణిముత్యాలు. త్యాగరాజు పుట్టినది తిరువాయూర్‌లో - జీవితం తిరూయ్యార్‌లో గడిచింది. దీనికి ‘పంచనద పురం’ అని పేరుంది. ఐదు నదులు కలుస్తాయి కాబట్టి తిరువైయ్యార్ అయింది చూడండి.
5 సంఖ్యకు ఒక ప్రామాణికత ఉంది, మనకున్నది పంచేంద్రియాలు, ఉన్నవి పంచకోశాలు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.. యిందులోనే ఈశ్వర తత్త్వం అంతా వుంది. మొత్తం గమనించండి.
పృథివ్యాప స్తేజో వాయు రాకాశాలు మొత్తం ఐదు పంచతత్త్వాలు - పంచలోహాలు, పంచామృతాలు, పంచ కావ్యాలు, పంచలింగాలులా పంచరత్నాలు పుట్టాయి. తిరువయ్యారులో వున్న శివుడు పంచనదీశ్వరుడు.
శివుని పంచముఖాలైన సత్యోజాత, అఘోర, ఈశాన, తత్పురుష, వామదేవ - ముఖాల నుంచి సప్త స్వరాలు పుట్టాయి. అలాగే ముఖ్యమైన తాళాలు త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్త జాతుల్లో వున్నవి తాళాలు ఐదు.
త్యాగరాజు ఈశ్వర సాన్నిద్ధ్యం చేరినది పుష్య బహుళ పంచమి (పరాభవ నామ సంవత్సర క్రీ.శ.1847. ఆయన 88 ఏళ్లు జీవించాడు.) సంగీత ప్రపంచంలో ఈ వేళ జాతీయ స్థాయిలో దేశమంతటా స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా ఈ పంచరత్న కీర్తనల బృంద గానంతో యావద్భారతావనీ పులకించి పోతుంది.
ఒక్కరూ పాడటం వేరు. విద్వాంసులంతా బృందగానంగా పాడటం వేరు. అంతా ఒక్కసారి గొంతెత్తి పాడితే పరమేశ్వరుడు వింటూ పులకించి పోడా? మొదటి కీర్తన ‘జగదానంద కారక’
బ్రహ్మానంద ప్రాప్తి లక్ష్యంగా సాగిన ‘జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయక..’ పూర్తిగా సంస్కృతంలో నాట రాగంలో రచించబడిన కీర్తన.. నాట, గౌళ, వరాళి, ఆరభి, శ్రీరాగాలు ఐదూ ఘన రాగాలు.
ఘన రాగాలని ఎందుకు పేరొచ్చిందో తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కొన్ని రాగాలు సులభంగా రక్తి కలిగించి, తాత్కాలికమైన ప్రయోజనాన్ని, ఆకర్షణను కలిగిస్తాయి. కానీ హృదయం లోతుల్లోకి వెళ్లవు. గంభీరమైన సంస్కారాన్నివ్వలేవు - వాటి స్వరూపం చిన్నది. కానీ ఈ ఘన రాగాలు హృదయంలో ఆధ్యాత్మిక భావనలు రేకెత్తించి, చిత్త సంస్కారాన్ని కలిగించి ఆనందం వైపు తీసుకెళ్లగలవు - జగదానంద కారకుడైన రాముడి అనంత కల్యాణ గుణ వైభవాన్ని జయ శబ్దంతో కీర్తించిన కీర్తన.
గౌళ రాగంలోని దుడుకు గల ననే్నదొర బ్రోచురా మానవ స్వభావాన్ని పూర్తిగా ప్రతిబింబించిన అద్భుతమైన కీర్తన. ఈ ఒక్క కీర్తన చాలు. మానవ స్వభావం ఏమిటో తెలిసిపోతుంది. ‘అన్నం పరబ్రహ్మ’ అనే భావంతో తినాలి. ఇతరులకు పెట్టాలి. అయితే తినే తిండికి పరిమితి లేకపోతేనే కష్టం. ‘కడుపే కైలాసం.. ఇదే వైకుంఠం’గా బ్రతికేవారికుండే దుడుకుతనం ఎన్ని రకాలుగా ఉంటుందో స్పష్టంగా ఈ కీర్తనలో కనిపిస్తుంది.
అచ్చపు చీకటింబడి, గృహవ్రతులై, విషయ ప్రమత్తులై,/ చచ్చుచు బుట్టుచున్, మరల చర్విత చర్వణులైన వారికిన్/ చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైన, నిజేచ్ఛమైన, ఏ/ మిచ్చిననైన, కానలకు నేగిననైన, హరి ప్రబోధముల్‌॥
అంటాడు. భాగవత కర్త పోతన. లోకంలో మనిషికి పరలోక చింతన పొరబాటున పుట్టదు. ఒకరు చెప్పినా వినబుద్ధి కాదు. భక్తుల్లా నటిస్తారు. మనస్సు మాత్రం దుర్విషయాలపై పరుగెడుతూంటుంది.
భూమీదకు ఎందుకొస్తారో తెలియదు. ఏం సాధిస్తారో అసలు తెలియదు. ఎందుకా జన్మ? ఈ కీర్తనలో త్యాగయ్య చెప్పినవన్నీ మనిషికున్న బలహీనతలే. మనిషికున్న అవలక్షణాలన్నీ ఏకరవు పెట్టి వాటిని తనకే ఆపాదించుకుంటూ మనల్ని ఉతికి ఆరేసాడు త్యాగయ్య. ముఖ్యంగా గాయకులను గురించి ఎంతో ఆవేదన చెందాడాయన.
తమ నాద విద్యచేత ఆకర్షించబడే స్ర్తిలను వశం చేసుకోవడానికి గాయకులు పడే తహతహను నిశితంగా విమర్శించాడు. అంతేకాదు. కాస్త ఆరోహణ అవరోహణ తెలిస్తే చాలు. మహా విద్వాంసులమని విర్రవీగే వారిని ఘాటుగా విమర్శించాడు. సంగీత రహస్యాలన్నీ వారేదో ఆపోసన పట్టినట్లు నటిస్తారు. ఉత్తమ గాయకులుగా తీర్చిదిద్దుతామని ఆశలు చూపి మోసం చేసే మాయా గురువులున్నారు. స్ర్తి లోలులౌతారు. బలహీనులు వీరి బారిన పడతారు. చివరకు ఉభయులూ మోసబోతారు. సంగీతం పెరగదు సరిగదా, ఆత్మవంచనతోనే బ్రతుకుతూంటారు. ఆత్మ వికాసమంటూ వుండదు. శిలాత్ములై బ్రతుకుతారు. సంగీతం గురించి ఉపన్యాసాలు గుప్పించటమే కాని పాడటం చాతకాదు. ఎక్కడ వేశావు గొంగళి అంటే అక్కడే అన్నట్లుగా బ్రతుకుతూంటారు. ఒక్క అంగుళం కూడా కొందరి సంగీతం పెరగదు. సంగీతాన్ని అడ్డం పెట్టుకుని బ్రతికేసే అటువంటి సంగీత విద్వాంసులు లేకపోలేదు. వాళ్లను - ఈ కీర్తనలో పాతరేశాడు త్యాగయ్య.
ఒక దుడుకు మరో దుడుకుకు దారి తీస్తుంది. ఈ చరణం చూడండి. ‘పరధనముల కొరకు నొరుల మది కరగ/ బలికి కడుపు నింప తిరిగినట్టి/ దుడుకు గల ననే్నదొర కొడుకు బ్రోచురా॥
ఇహ సుఖాలకు ధనం కావాలి. సిగ్గు విడిచి దేహి అని ఇతరులను అడగాలి. కష్టపడి పనిచేసేవాడికి కోరికలుండవు. సోమరిగా తింటూ ఖాళీగా కూర్చుని బ్రతికే వాడికే కోరికలు ఎక్కువ. పనికిరాని అడ్డమైన వాళ్లను పొగిడి, డబ్బు లాగాలి. తన కడుపు నింపుకోవాలి. ఈ దుడుకు కంటే మరో దుడుకుంది. ‘అచ్చువేసిన ఆబోతులా ఎక్కడబడితే అక్కడ కడుపు నింపుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిరిగే దౌర్భాగ్యులు చివరకు సంఘ విద్రోహ శక్తులుగా తయారౌతారు. చివరకు వారి జీవితాలను నికృష్టంగా ముగించుకుంటారనే సందేశంతో పాడుకున్న ఈ కీర్తనలోని ప్రతి మాటా విలువైనదే. సమాజంలోని మనుషుల పట్ల ఎంతో జాలిపడి పాడిన కీర్తన బాధ్యత మరచిపోయి జులాయిగా సమాజంలో తిరిగే వాళ్లను తూర్పారబోసి బెట్టిన కీర్తన. అంతేకాదు. అర్థం పర్థం లేని ఆలోచనలతో వ్యర్థంగా బ్రతికే దౌర్భాగ్యులను మందలించే కీర్తన. ఈ దుడుకు గల - గౌళ రాగ కీర్తన.
ఆరభి రాగంలోని ‘సాధించెనే ఓ మనసా’ అనేది పంచరత్నాల్లోని మూడవ కీర్తన. ‘సమయానికి తగు మాటలాడెనే’ అనే ప్రతి చరణానికి అనుసంధానింపబడుతూ గానం చేస్తారు. చరణాలు పాడిన తర్వాత పాడవలసినది పల్లవి మాత్రమే. అప్పుడే సమన్వయం ఉంటుంది. లావొక్కింతయు లేదు.. నీవే తప్ప యితః పరంబెరుగను’ అని దీనావస్థకు తెచ్చేస్తే గాని దైవం అందుకోడు. ఆ స్థితి కలిగించడం లోక రక్షకుడైన శ్రీరాముడి శిక్షా విధానం. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఈ కీర్తనలో కనిపిస్తాయి.
భగవంతుడేం చేసినా, ఎన్ని బాధలు పెట్టినా భక్తుల శ్రేయస్సునే కోరతాడు అనే దృఢ విశ్వాసమంటూ ఏర్పడితే చాలు. పరమాత్మ బోధించిన సన్మార్గ వచనాలన్నీ అర్థవంతంగా కనిపిస్తాయి అని చెప్పటానికే ఈ కీర్తన పుట్టింది.
పిల్లలు లేకపోతే తల్లి ఎలా ఉండలేదో, భక్తుల ప్రేమ లేకపోతే భగవంతుడూ వుండలేడన్నారు.. శ్రీరామ్‌సర్ అనే జగమెరిగిన సద్గురువు. ఆయన చెప్తారు చూడండి.
‘మామూలు వైద్యుడు యిచ్చే మాత్రలు పైకి తీయగా వుండి లోపల చేదుగా ఉంటాయి. కానీ విశ్వ వైద్యుడిచ్చే మాత్రలు పైకి చేదుగా వుండి, లోపల నమ్మశక్యం కానంత తీయగా ఉంటాయి. భగవంతుడు కరుణ చూపించటానికే కాఠిన్యంతో వుంటాడు. ఆయన మనల్ని కాపాడేది ‘ఆపదల’ నుంచి కాదు. ‘ఆపద’లలోనే.. నమ్మితేనే జీవితం.
ఇంక వరాళి రాగంలోని ‘కనకన రుచిరా’ అనే కీర్తన. రాగం ముద్దకట్టిన రూపమే ఈ కీర్తన. ఆవేదనతో పరితపించి పాడే కీర్తన. వినగా వినగా రుచి కలిగించేది కవిత్వం. పాడగా పాడగా మైమరపించేది మధురమైన గానం. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి నిలబడి, దివ్య మంగళ విగ్రహుడైన శ్రీ వేంకటేశ్వరుణ్ణి కనులారా ఒక్కసారి దర్శించిన మరుక్షణం ఆనందాతిశయంతో ఆనంద నిలయం నుంచి బయటకు రాగానే ఆనందాశ్రువులతో పులకాంకితులైన భక్తులెంతమందిలేరు? ఆనంద జ్యోతి స్వరూపుడైన శ్రీహరి తేజోమయం రూపం చూడగానే కలిగే అనుభూతి మాటల్లో చెప్పగలమా? ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, అంతా ఆ పరమాత్ముడి దివ్య కళామయంగా భావించిన త్యాగయ్య భక్తి జీవన విధానంతో భగవంతుడి పట్ల విపరీతమైన చనువు ఏర్పడగా వెడలిన కీర్తన ఇది. ఆయనకు ‘కలడను వాడు కలడో లేడో’ అనే అనుమానం లేదు. ఎందుకంటే అందరికంటే ఆప్తుడై తనలోనే తిష్టవేసి కూర్చుంటే పాడే పాట ఎలా వుండాలో అలాగే పాడాడు.
‘వరాళి’ రాగం ఎంతో విలక్షణం. నిజానికి ఈ రాగం విద్వాంసులు అంతర్ముఖులై ఆర్తిగా గానం చేయాలే గాని, అందరితో కూర్చుని బృందగానంలా పాడేసేది మాత్రం కాదు. కానీ అలాగే గానం చేస్తున్నారు. వింటున్నారు.
స్వాతి తిరునాళ్ (1829 - 1847) ఆస్థానంలోని మహా విద్వాంసులలో గోవింద మరార్ అనే గాయకుడుండేవాడు. షటాలాల్లో అనర్గళంగా పాడగలిగిన విద్వాంసుడు. త్యాగరాజు దర్శనార్థం ఏకాదశి రోజున తిరువయ్యార్ ప్రయాణమై వెళ్లాడు. స్వాతి తిరునాళ్‌కు లభించని త్యాగరాజు దర్శనం ఆయన ఆస్థానంలోని గోవింద్ మరార్‌కు లభించింది. త్యాగయ్య సన్నిధిలో ఏకాదశి, పర్వతిథి రోజు సాయంత్రం, పాడే అవకాశం కలిగింది.
19వ శతాబ్దంలో బాగా పేరుండి, ఆరుకాలాల్లో పల్లవి పాడగల సమర్థుడు గోవింద మరార్.
ఆయన తంబురాకు ఏడు తీగలుండేవి. (సాధారణంగా తంబురాకు నాలుగు తీగలే ఉంటాయి) ఆయన సంగీత పాండిత్యానికి చిహ్నంగా తంబురాకు చివర ఒక జయ పతాకముండేది. ఒక చేత్తో తంబురా మీటుతూ మరో చేత్తో కంజిరా వాయంచడం ఆయన ప్రత్యేకత. యది అసాధారణమైన ప్రక్రియ. ఎవరూ సాహసించి చేయలేని విద్య. ఆయన ప్రతిభ త్యాగరాజుకే ఆశ్చర్యాన్ని కలిగించి మతిపోయేలా చేసింది. లోకంలో తనకంటే గొప్పవాళ్లుంటారని ఋజువు చేసి తానే చెప్పుకునేలా చేసిన సన్నివేశం.
ఏకాదశి రోజు సాయంత్రం సాధారణంగా భక్తులూ, శిష్యులూ కలిసి ఉత్సవ సంప్రదాయ లేదా దివ్యనామ కీర్తనలో పాడి, ముగిస్తారు. ఆ వెనువెంటనే గురువుగారు విలంబ కీర్తనలు పాడి, పవ్వళింపు సేవ కీర్తనలతో ముగించటం అలవాటు.
గోవింద మరార్ తంబురా అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. 7 తీగలను ఒక్కసారి శ్రుతి చేసి మీటగానే అందరి హృదయాలూ ఝల్లుమన్నాయి. త్యాగరాజు ఒక్కసారి గోవింద మరార్ వైపునకు తిరిగి పాడమన్నట్లు సైగ చేశాడు. జయదేవుని, ‘చందన చర్చిత నీలకళేబర’ అష్టపదిని చిత్ర విచిత్ర గతులతో గానం చేసి అక్కడున్న వారిని సంభ్రమాశ్చర్యాలతో నింపేశాడు. ఆ గానానికి త్యాగయ్య నోట మాట రాలేదు. పరవశించి పోయి తేరుకుని, శిష్యులను పిలిచి ‘ఎందరో మహానుభావులు.. శ్రీరాగ’ కీర్తన పాడమన్నారు.
గోవింద మరార్ కంటి వెంట ఆనందాశ్రువులను గమనించారు శిష్యులు.
త్యాగయ్య ఆనందానికి అవధుల్లేవు. గోవింద్ మళ్లీ మరెక్కడా పాడలేదు. త్యాగయ్యగారి ఆతిథ్యం పొంది, వెళ్లిన కొద్ది రోజులకే గోవింద మరార్ ఈ లోకం నుంచే నిష్క్రమించాడు.
ఎందరో మహానుభావులలో గోవిందుడొకడని త్యాగయ్య కీర్తించాడు. చాలా చింతించాడు. సంగీత రంగంలో సాధారణంగా ఒక విద్వాంసుడు మరో విద్వాంసుణ్ణి మెచ్చుకోగలిగే ఔదార్యం చాలా అరుదు. అజ్ఞానపు తెరలు నిజాన్ని తెలుసుకోనివ్వవు. త్యాగరాజు జన్మ దీనికి భిన్నం.
రక్త సంబంధీకులు శరీరం వున్నంతవరకూ పట్టుకు వేళ్ళాడతారు. కానీ త్యాగరాజు బంధువులు శాశ్వతులు. పరమాత్మ దర్శనంతో ధన్యులైన భృంగి, నటేశ, నారద, తుంబురు, మతంగాది వౌనులు ఆదిగా గలవారందరూ త్యాగరాజుకు ఆప్తులే. పరమాత్మను కీర్తించే వారందరినీ తన ఆత్మబంధువులుగా కొనియాడుతూ బ్రతికాడు. ఎందరో మహానుభావులని మనసారా పాడుకున్నాడు. పరమ భాగవత వౌనుల పాదజలం చాలనుకున్నాడు. మహానుభావుడుగా పూజలందుకుంటున్నాడు.
తిరువయ్యారులో త్యాగరాజు సమాధి ఎదురుగా అంజలి ఘటిస్తున్న బెంగుళూరు నాగరత్నమ్మ గారి శిలా విగ్రహం, సంగీత రసికులకు దర్శనమిస్తుంది. 1949లో త్యాగరాజ ఆరాధనకు, సమాధి దగ్గర పూజ చేసినప్పుడు ఆ మహానుభావుడికి అంజలి ఘటిస్తూ విద్వాంసులు కలిసి ‘పంచరత్న కీర్తనలు’ పాడాలని త్యాగరాజ ఆరాధన సంఘం నిర్ణయించిన దాదిగా ఈ పంచరత్న బృందగానం జరుగుతూ వస్తోంది. ఊరూ వాడా, త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఇంత వైభవంగా ప్రతి ఏటా జరగడానికి కారణం బెంగుళూరు నాగరత్నమ్మే.
*
చిత్రాలు..బెంగుళూరు నాగరత్నమ్మ
(త్యాగరాజ ఆరాధన ప్రారంభించిన వ్యక్తి)
*త్యాగరాజు

- మల్లాది సూరిబాబు 9052765490