S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిజం

‘సండే గీత’ నుడివినట్లు... ‘బాధ్యులను చేయడం సులువు - బాధ్యత వహించడం కష్టం’ అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. అలాగే ‘ఓ చిన్న మాట’గా.. కఠోర శ్రమ, క్రమశిక్షణతోపాటు దైవకృపతో విజయబాట సుగమమవుతుందని మాకు అవగతమైంది. ‘అక్షరాలోచన’లో సిహెచ్.వి. బృందావన రావుగారి ‘క్షమ’ కవిత ‘క్షమ’కు సిసలైన నిర్వచన భావాన్ని అనువర్తించినట్లయింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందించిన ‘కవర్‌స్టోరీ’ చక్కగా ఉంది. ‘పప్పు’ను లైఫ్ సేవింగ్ డిష్‌గా మజుందార్ అన్న మాటను గుర్తు చేసుకున్నాం - పప్పు వలన కలిగే దోషాలకు కమ్మని నెయ్యి విరుగుడవడం.. రుచికర ఆహారాన్ని ఆస్వాదించే వారందరికీ హుషారు కలిగించేదే.
-నేమాన సుభాష్‌చంద్రబోస్ (విశాఖపట్నం)
మరపురానివి
‘అమృతవర్షిణి’లో కర్ణాటక సంగీతాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చిన లాల్‌గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, టి.చౌడయ్య, టి.వీరరాఘవన్, ఉమాయలపురం శివరామన్, ప్రొ.టి.శంకరన్, పాల్ఘాట్ మణిఅయ్యర్, పళని సుబ్రహ్మణ్యం పిళ్లై లాంటి విద్వాంసుల పరిచయాలు అమృతవర్షిణిలో చూస్తూంటే మల్లాది సూరిబాబు గారిని అభినందించక తప్పదు. సంగీతం సంగీతం కోసమే అని భావించే విద్వాంసుల పరిచయాలు మరపురానివి. సమ్మెట ఉమాదేవి గారి కథ ‘గంసీ’ చాలా బాగుంది. జీవితంలో కొంతమంది పరిచయం ఇలాంటి తీయటి అనుభూతిని అందిస్తుంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
సంగీతం ఇంతేనా?
సంగీత విశే్లషణలు, ఎన్నో సంగీత విషయాలను తెలియజేస్తూ, ఆలోచింపజేసేవిగా ఉంటోంది ‘అమృతవర్షిణి’. మల్లాది సూరిబాబుగార్కి ధన్యవాదాలు. అలనాటి రాజుల ప్రాపు సంగీతానికి ఆలవాలం అయితే అన్నీ ధనంతో సమకూర్చుకునేవారు. నేడు, కళ ఉచిత వస్తువుగా ఉపయోగపడాలనుకుంటున్నారు. వృత్తి కళాకారులకు దోహదం, ప్రోత్సాహం ఉండదు. ‘విత్తం ఉంటే వితరణ ఉండాలి. ధనికుడై ఫలమేది ధర్మము సేయు దాకా’ ‘కూర్చుని వినడానికి పెట్టుబడి కావాలా? రసజ్ఞులు లేని సంగీత సభలు వ్యర్థం’ అని చెప్పిన మల్లాది వారి మాటలు శిరోధార్యం. ఆర్భాటంగా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టే బడా ధనికులు పాటల విషయంగా, బేరాలకు దిగి, అతి తక్కువ డబ్బుకే కళాకారులను వాడుకోవాలని చూస్తారు వివాహాది శుభకార్యాలలో. అలాగే అభ్యాసులు కూడా ధనికులైనా, ఉచితంగా లేదా కాణీ ఖర్చు లేకుండా విలువైన సంగీతాన్ని గురువు ద్వారా పొందాలనుకుంటారు. ఇక నేడు పాటకు విలువే లేకుండా, డబ్బే పాడుతోందా? అనేలా జరుగుతున్నాయి అనేక విభావరులు.
-కె.ఆర్.కె. (హైదరాబాద్)
బాగా నచ్చింది
జీవితం చాలా చిన్నది అయినా అది సుదీర్ఘం అనుకొని అహంకారంతో ప్రవర్తిస్తారు. తమ తప్పు తెలుసుకునే సరికి జీవితం ముగిసిపోతుంది. అందుకే మంచి పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పిన ‘సండే గీత’ మాకు బాగా నచ్చింది. నేచర్ ఫొటోగ్రఫీ పోటీలో ఎంపికైన ప్రకృతి సోయగాల ఫొటోలు మమ్మల్ని ముగ్ధులను చేశాయి. ‘ఆగ్రహ సాగరం’ కవిత మాకు నచ్చింది. ముఖ్యంగా ఆకాశం ఊపిరాడటం లేదు ఏదీ అర్థం కాని మనసు అమావాస్యగా మారిందన్న భావన భలేగా ఉంది. నానీలు కూడా చాలా బాగున్నాయి. కుంచెం తేడాగా, ఇతర కార్టూన్లు కూడా బాగున్నాయి. నవ్వించాయి.
-వి.లంబకర్ణ (రాజేంద్రనగర్)
పథకం
అతి చిన్న పొరపాటు నేరగాడిని ఎలా పట్టిస్తుందో క్రైం కథ ‘పథకం’ చక్కగా ఉత్కంఠభరితంగా నిరూపించింది. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా నేరగాడు తప్పించుకోలేడనీ నిరూపించింది. ఈ కథలో పక్కింటావిడ దిండు గలీబులపై ఒలికిన ఆకుపచ్చ సిరా సాక్ష్యం చెప్పింది. అక్కడి పోలీసుల సమర్థత మెచ్చదగినదే. 5వేల సంవత్సరాల క్రితం నుంచీ విదేశాల్లో కూడా జీలకర్ర వాడేవారని తెలిసి ఆశ్చర్యపోయాం. జీలకర్ర భారత్‌కే సంబంధించినది అనుకునేవాళ్లం. దానిలోని ఔషధ గుణాల్ని డా.పూర్ణచంద్‌గారు బాగా వివరించారు. చాలా ఉపయుక్తమైన విషయాలు తెలిశాయి.
-కె.ప్రవీణ్ (కాకినాడ)
నమ్మలేని నిజం
బ్రాడ్లీ తన కుక్కతో మిలట్రీ కేంప్‌లోనికి పోయి మాంసపు ముక్కల గినె్న దొంగిలించగా సార్జెంట్ పట్టుకోగా, కెప్టెన్ వెళ్లి మేజర్‌కి చెప్తాడు. అతనిని మర్నాడే చంపేయమని మేజర్ ఆదేశించగా ఆ రాత్రంతా కుక్క ఏడుస్తూనే ఉంటుంది. అది అపశకునంగా భావించి మేజర్ దాన్ని చంపేస్తాడు. మర్నాడు బ్రాడ్లీ మతిభ్రమించినా సంకోచించక చంపేయమని ఆదేశిస్తాడు మేజర్. కుక్క అతని మీదకు ఉరికి మెడ కొరికి వేస్తుండగా కుక్క నుంచి తనని రక్షించమని మేజర్ అరుస్తాడు. కాని కుక్క ఎవరికీ కనిపించదు. మేజర్ చనిపోతాడు. చచ్చిపోయిన కుక్క వచ్చి మేజర్‌ని ఎలా చంపింది? యజమానిని ఎలా రక్షించిందన్నది నిజంగా నమ్మలేని నిజమే!
-ఎన్.గిరిధర్ (తూ.గో.జిల్లా)
చింత లేదు
మానవ జాతి పుట్టినప్పటి నుంచి నేటి వరకు మన అవసరాలు సౌకర్యాలు అన్న యావ తప్ప ప్రకృతి సమతూకం గురించి చింత లేదంటూ గోపాలం గారు చెప్పిన మాయమవుతున్న అనుభూతుల గురించిన విషయాలు ఆలోచింపజేశాయి. మనం మంచిగా నిజాయితీగా ఉంటే కఠినాత్ముడు కూడా మనసు మార్చుకుంటాడని చెప్పిన ‘మంచి గుణం’ కథ బాగుంది. మంచి నీతి చెప్పింది.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
సముచితం
చాలామంది ఏదో బతికేస్తారు. కాని జీవించలేరు. మనసు పెట్టి ప్రయత్నపూర్వకంగా జీవించడం నేర్చుకుంటేనే సంతోషాలు దక్కుతాయని చెప్పిన ‘ఓ చిన్న మాట’ ఎంతో సముచితంగా ఉంది. ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పాట్లు పడినా బతుకు వనె్న తేవాలంటూ చెప్పిన కవిత ‘జీవన రాగం’ మాకెంతగానో నచ్చింది. గగన వాణి క్రియాకలాప మూర్తులంటూ ఆకాశవాణి నిర్దేశకులు శ్రీకాంతశర్మ, రజనీకాంతరావు గార్ల గురించి ‘అమృతవర్షిణి’లో చెప్పిన విషయాలు అలరించాయి. కవర్‌స్టోరీలు బాగుంటున్నాయి.
-ఎస్.సంపూర్ణ (సాంబమూర్తి నగర్)