S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రావమ్మా... మహాలక్ష్మీ రావమ్మా

నవ్య దివ్య భవ్య క్రాంతి.. సంక్రాంతి
*
‘సూర్యోమరీచిమాదత్తే, సర్వస్మాద్భువనారధి తస్యాః పాక విశేషేణ, స్మృతం కాల విశేషణమ్’ సూర్యుడు సర్వభువనములకు పైభాగముల నందుండి కిరణములను ప్రసరింప జేస్తున్నాడు. సర్వ ప్రపంచమును ప్రకాశింప జేస్తున్నాడు. సూర్య కిరణముల పరిపాక విశేషము చేత, సంవత్సరము ఆయనము ఋతువు మాసము పక్షము దినము రాత్రింబవళ్లు మొదలగు కాల భేదము లేర్పడుతున్నాయని, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం చెప్పింది.
కాలాన్ని ఏర్పరచి భాగ విభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత యిచ్చి, హేమంతము శిశిరము ఒక ఋతువుగా చెపితే, అయిదు ఋతువులుగా, ఏడు చక్రాల రథముతో (ఏడు గుఱ్ఱాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో) పనె్నండు రూపాలు (ద్వాదశ ఆదిత్యులు) అనగా పనె్నండు నెలలుగా అన్నిటికీ నియామకుడుగా తండ్రిగా వ్యవహరిస్తున్నాడు. సూర్య భగవానుడని ఋగ్వేదం చెప్పింది.
హేమంత ఋతువు
కాల విభాగాలేర్పడిన ఆరు ఋతువులలో హేమంత ఋతువు విశిష్టమై ప్రకృతికే రమణీయంగా నిలుస్తుంది. పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంతో శోభాయమానంగా ఉంటుంది. అందు వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో, అరణ్యకాండలో హేమంతాన్ని హృద్యంగా వర్ణించాడు.
తట్టలో కూర్చోబెట్టిన వధువులా, గుమ్మడిపూవులో కులికే మంచు బిందువులతో, రాబోయే శిశిర భయంతో ప్రకృతి కాంత జమిలి దుప్పటి కప్పుకొన్నదా అన్నట్లు తెలుగు నేల నాల్గుదెసల మంచు కురుస్తూ ఉండగా హేమంత ఋతువు వచ్చిందంటాడు విశ్వనాథ. వేకువ ఝామున మ్రుగ్గుపెట్టే కనె్న, మంచుకొండ ఆడపడుచులాగా, పశువులను తోలుకొనిపోయే రైతు హిమగిరి పాలికాపులాగా, పంటకుప్పపై వేసే కప్పు - మంచుకొండ కనక శిఖరములాగా, తడి పాటి మట్టి గోడను చిఱుకొమ్మలతో గీరాడు గిత్త - నందీశ్వరుడు లాగా కనపడుట వలన నిత్యము మంచు పడుతూ ఉండటం వలన హిమాచలము పరివార సమేతముగా ఉత్తరము నుండి దక్షిణా పథమునకు వచ్చినట్లుగా, హేమంత ఋతువు ఆంధ్ర దేశంలో ప్రవేశించిందని హేమంత ఋతు శోభను విశిష్ఠంగా అందించాడు కవిసమ్రాట్ విశ్వనాథ.
అటువంటి హేమంత ఋతువులో పుష్యమాసంలో, శోభాయమానంగా వచ్చి, తెలుగు జీవన స్రవంతిని నయనానందకరం చేసే నవ్య దివ్య భవ్య క్రాంతి - మకర సంక్రాంతి.
సంక్రాంతి అంటే ఏమిటి?
సంక్రాంతి అంటే ‘చేరుట’ అని అర్థం. ఎవరు ఎక్కడ చేరుతారు? అనేది ప్రశ్న. అశ్విన్యాది నక్షత్రములు ఇరువది ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదములు - వెరశి 108. ఈ నూట ఎనిమిది పాదాలను 12 రాశులుగా విభజించారు. అవే, మేషాది మీనరాశులు. సూర్యుడు నెలకొక రాశిలో ఉంటాడు. పైన చెప్పబడిన 12 రాశులలో సూర్యుడు సంక్రమించే అనగా చేరే సమయానే్న ‘సంక్రాంతి’ అని పిలుస్తారు. సంవత్సరానికి పనె్నండు సంక్రాంతులు వస్తాయి, అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అదే ‘మకర సంక్రాంతి’. అదే ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు ధనూరాశిలో నుంచి, మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని పండుగగా చేసికొంటాము.
గజేంద్ర మోక్షం - మకర సంక్రాంతి
మకర సంక్రాంతిని గురించి, అందులోని ఆధ్యాత్మిక రస సౌందర్యాన్ని గురించి, పరమ భాగవతోత్తముడైన పోతన శ్రీమద్భాగవతంలో అష్టమాధ్యాయంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో ఎంతో వివరంగా చెప్పాడు. గజేంద్ర మోక్ష ఘట్టమే మకర సంక్రాంతికి దీప్తి. సాహిత్యము నందే, జ్యోతిష శాస్తమ్రు నందు, యోగ శాస్తమ్రు నందు ప్రవేశమున్న వారికి పోతనగారి గజేంద్ర మోక్ష కథలోని ఆధ్యాత్మికత అర్థమయి మకర సంక్రాంతి రస స్రవంతిలో పయనించగలుగుతారు.
‘మకరమొకటి రవిజొచ్చెను, మకరము మరియొకటి ధనువు మాటున దాగెన్, మకరాలయమున దిరిగెడు మకరంబులు, కూర్మరాజు మఱువున కరిగెన్’ ఉత్తరాషాఢ మూడు పాదములు, శ్రవణం నాలుగు పాదములు, ధనిష్ఠ రెండు పాదములు వెరశి తొమ్మిది పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఉత్తరాషాఢ మొదటి పాదం ధనూరాశిలో ఉంటుంది. మూలా నక్షత్రం ధనూరాశిలో ఉంటుంది, పృథ్వీ తత్త్వానికి సంకేతం. కూర్మరాజు - పృథ్వీ తత్త్వానికి చిహ్నం. అష్టదిక్పాలకులలో ఇంద్రుడు, తూర్పు దిక్కుకు అధిపతి. ‘ఐరావతం’ అంటే గజరాజు ఏనుగు, అతని వాహనం. అలాగే పడమర దిక్కుకు అధిపతి - వరుణుడు. అతని వాహనం మకరం - మొసలి. యోగశాస్త్ర ప్రకారం, ఏనుగు మన శరీరంలో షట్చక్రములలో ‘మూలాధారం’లో ఉంటుంది, పృథ్వీ తత్త్వానికి సంకేతం. ఇంద్రుడు సహస్రారంలో ఉంటాడు. గజరాజు ఒక సాధకుడు - యోగిలాగా ఉన్నాడని వర్ణిస్తాడు - పోతన. ఇది కుండలినీ యోగశాస్త్రం. మూలాధార తత్త్వాన్ని మననం చేసికొంటూ, స్వాధిష్ఠాన చక్రంలో ప్రవేశింపజేస్తాడు. స్వాధిష్ఠానం జలతత్వం. అనగా మూలాధార చక్రంలోని గజము జల తత్వంలోకి ప్రవేశించగా స్వాధిష్ఠానవాసుడై మకర రాశిలోని శ్రవణా నక్షత్రాధి దేవత అయిన శ్రీమన్నారాయణుడు - కాలచక్రమనే సుదర్శన చక్రాన్ని పంపి, మకరాన్ని ఖండిస్తాడు.
అజ్ఞానాంధకారం తొలగి, జ్ఞానజ్యోతి వెలుగుతో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందన్న మకర సంక్రాంతి పర్వదిన విషయాన్ని పోతన భాగవతంలో అష్టమ స్కంధంలో, జ్యోతిష యోగశాస్త్ర అన్వయంతో వివరించాడు. గజేంద్ర మోక్ష ఘట్టం మకర సంక్రాంతికి పూర్తి స్ఫూర్తిని, దీప్తిని యిస్తుంది.
మకర సంక్రాంతి పండుగను మూడు రోజులుగా జరుపుకొంటారు. అవి - భోగి, సంక్రాంతి పండుగ, కనుమ.
భోగిపండుగ
‘అగ్ని’ సూర్యునికి ప్రతీక. ఋగ్వేదంలో అగ్ని ఆరాధన విశేషంగా చెప్పబడింది. భోగి పండుగ నాడు, భోగి మంటలు వేస్తారు. ఆ మంటల్లో సంకటాలు దగ్ధమవుతాయి. ఆ మంటలు మానవాళి కల్మషాన్ని పటాపంచలు చేస్తాయి. మనలోని పాత దుష్ట భావాలను దుర్గుణాలను జ్ఞానమనే మంటలో వేసి దహించాలి. పెద్ద పండుగైన సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ. భోగి పండుగ రోజున, చిన్నపిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి, సాయంత్రం వరుసగా కూర్చోబెట్టి వారి శిరస్సుపై రేగిపండ్లు, బంతి పూరెక్కలు దిష్టితీసి పోస్తారు. పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. రేగిపండ్లలో సౌరశక్తి ఉంటుంది. శిరస్సు మీద పడితే ఆ శక్తి, తేజస్సు పిల్లలకి వస్తుందని, రావాలని అలా ఆచారం ఏర్పడింది.
వామనావతారం - బలిచక్రవర్తి
బలి చక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో, పాతాళానికి పంపిన పర్వదినమే - భోగి పండుగ అని కూడా చెప్తారు. మూడడుగుల స్థలం ఇవ్వమని కోరాడు. మూడడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను, జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలను, సత్వ రజ తమో గుణములను, దారేషణ పుత్రేషణ ధినేషణలను హరింప చేసుకున్నాడు - బలి చక్రవర్తి.
సూర్యగమనం
సూర్య గమనాన్ని ‘్భగ’మంటారు. ధనూ రాశి నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ప్రకృతిలో మార్పు స్పష్టంగా కనపడుతుంది. చండ మార్తాండ మండలములో ప్రచండ తేజస్కుడైన సూర్యుడు నవ్యకాంతిని ప్రజ్వలింపజేస్తూ ప్రకాశిస్తాడు. రాత్రి సమయం తక్కువయి, క్రమేపీ పగటి కాలం ఎక్కువవుతుంది. నూతన తేజోత్సాహాన్ని యిస్తుంది - మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. నవ్యతకు నాంది పలికేది - మకర సంక్రాంతి.
సంక్రాంతి శోభ
వ్యవసాయ ప్రధానమైన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ ప్రస్ఫుటంగా కనపడుతుంది. సంక్రాంతి నాటికి ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. ఇళ్లూ వాకిళ్లూ కళకళ లాడుతూంటాయి. వారం రోజుల ముందు నుండే పండుగ పనులు ప్రారంభమవుతాయి. కొత్త బియ్యం, నువ్వులు, బెల్లంతో పిండివంటలు తయారుచేస్తారు. సంప్రదాయాలు, సంబరాలు, వేడుకలతో సంక్రాంతిని పిల్లలు, కొత్త అల్లుళ్లతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ‘రాశి చక్రమ్ము దీరించి రంగవల్లి నిన్ను బూజింప, భక్తియై నిలిచినారు, ఉత్తరాయణ పుణ్యకాలోదయమున, రా రమ్ము మకర సంక్రాంతి లక్ష్మి’ అని వర్ణించిన పైడిపాటి సుబ్బరామశాస్ర్తీ గీతం, మకర సంక్రాంతి పండుగకు దీప్తినిస్తుంది.
పితృ తర్పణాలు
ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రాంతినాడు, పితృ దేవతలకు తర్పణములు అర్పిస్తే, వారు సంతరించి వంశవృద్ధిని అందిస్తారు. శుభాల్ని కూర్చిపెట్టి గృహంలో శుభకార్యములు నిర్విఘ్నంగా జరిగేటట్లు ఆశీర్వదిస్తారు. పితృదేవతలకూ ఉత్తమ గతి లభిస్తుంది.
గొబ్బిళ్లు, రంగవల్లులు
నెల పొడుగునా వాకిళ్లలో చిత్రవిచిత్రమైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. ప్రాచీన కాలం నుంచీ హైందవ సంప్రదాయంలో రంగవల్లులు పేర్కొనబడ్డాయి. స్కాంద పురాణం, రామాయణం, మహాభారతంలో ముగ్గుల ప్రస్తావన ఉన్నది. ఆంధ్ర సంస్కృతికి అద్దం పడుతూ, నెలరోజులూ వాకిళ్లలో రకరకాల ముగ్గులు వేస్తారు. ముగ్గులలోని బియ్యపు పిండిని క్రిమికీటకాదులు భుజిస్తాయి. ఇది ఒక విధమైన భూత యజ్ఞం.
గోమయంతో చేసిన ముద్దలను గొబ్బిళ్లు అంటారు. ప్రధానంగా మూడు ముద్దలు పెడతారు. ఒకటి, అందరినీ ఆకర్షించి, విశ్వమోహన మురళీ గానంతో ఆనందపరిచే గోపాలునికి, రెండవది గోపాలుని అనంత శక్తితో ఎత్తబడిన గోవర్థన గిరికి, మూడవది నిత్యజీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోవులకు ప్రతీకగా పెడతారు. గొబ్బిళ్లు ఈ మూడు ‘గ’కారాలకు స్ఫూర్తి.
బొమ్మలకొలువు
పురాణేతిహాసములు, చరిత్ర, సాంఘిక జీవన స్థితిగతులను ప్రతిబింబించేటట్లుగా బొమ్మల కొలువు పెడతారు. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయములకు స్ఫూర్తినిస్తాయి, బొమ్మల కొలువులు. అత్యంత విజ్ఞానదాయకం కూడా.
కనుము
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అని, ఏరువాక పౌర్ణమితో, సేద్య యజ్ఞానికి నాంది పలికి, శ్రమకోర్చి, విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి, దైవానుగ్రహంతో పంటను ఇంటికి తీసుకువస్తారు, కృషీవలులు. కనుకనే, మకర సంక్రాంతిని వైభవోపేతంగా జరుపుకుంటారు. వ్యవసాయ వృత్తికి చేదోడు వాదోడుగా నిలిచే గోజాతికి కృతజ్ఞత చూపుతూ కనుము పండుగనాడు పశువుల్ని, గోజాతిని పూజిస్తారు. ‘కృషియున్న నెపుడు దుర్భిక్షమే యుండదు, గోజాతి కృషికిని కుదురు కానీ, కనుము పండుగ నాడు కర్షక జనులెల్ల గోవుల పసుపులన్ కుంకుమలను పూజించి, వానికి పుష్కలమ్ముగ పుష్టి కలుగు నాహారము లొలయజేసి.. ‘మకర సంక్రాంతి’లో మనోహరంగా వర్ణించిన విషయం, కనుము పండుగకు స్ఫూర్తిని, దీప్తిని యిస్తుంది.
సంక్రాంతి సందేశం
దీక్షతో దక్షతగా ధర్మబద్ధంగా, ఋజుమార్గంగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఉత్తేజ ఉత్సాహ స్ఫూర్తితో, ముందు వచ్చే మార్పుకు స్వాగతం పలుకుతూ సమన్వయ సమరస భావంతో జీవన యాత్ర సల్పుతూ, సర్వమానవ సౌభ్రాత్రతో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షించే నవ్య తేజస్సు పొందాలని చెప్తోంది ‘మకర సంక్రాంతి’.
*
ఉత్తరాయణ పుణ్యకాలం అంటే?
‘అగ్నేనయ సుపథారాయే అస్మాన్’... అని అరుణ మంత్రం, ఈశావాశ్యోపనిషత్తు, భగవద్గీత అష్టమాధ్యాయం, ఛాందోగ్యోపనిషత్‌లు ఉత్తరాయణం, మకర సంక్రమణం గురించి వివరించాయి. ‘ఓ అగ్నిదేవుడా, మంచి మార్గాన్ని మాకు చూపించు’ అని ప్రార్థిస్తున్నారు, అగ్నిదేవుణ్ణి. జీవులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి ప్రయాణించే రెండు రకములైన మార్గాలను చెప్తూ, మొదటిది ‘దేవయానం’ అనగా అర్చిర్మార్గం అంటే కాంతి (లేక) వెలుగు మార్గం, అంటే సక్రమ మార్గం. అదే ఉత్తరాయణం. రెండవది పితృయానం - బహుళ పక్షం చీకటి మార్గం - అక్రమ మార్గం - దక్షిణాయనం.
వెలుగు మార్గంలో పయనించిన వారు సూర్యసాయుజ్యం పొందుతారు. సూర్య చంద్ర సంబంధిత విషయాల్ని తెలిసికొని, దర్శించిన ఉపాసకులు పరబ్రహ్మ తత్త్వంలో తాదాత్మ్యం చెందుతారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణం - సూర్యుడు మకరరాశిలో ప్రవేశించేవరకు వేచి ఉండి, తనువు చాలించి పరబ్రహ్మ తత్త్వంలో లీనమయినాడు. అది హేమంత నవ్యకాంతితో వచ్చే మకర సంక్రాంతి పుణ్యకాల వైశిష్ట్యం.

గోదా రంగనాథుల కల్యాణం
భోగి పండుగ అనగానే జ్ఞప్తికి వచ్చేది గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం. శ్రీవిల్లిపుత్తూరు నివాసియైన పెరియాళ్వార్ - విష్ణుచిత్తుడు. అచట నున్న స్వామి వటపత్ర శాయి. ఆ స్వామికి పుష్పమాలాది సర్వ కైంకర్యములు అందిస్తూ భగవత్ సేవలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్న విష్ణుచిత్తునికి, ఒకనాడు తులసీ చెట్లకు కుదురులు చేస్తుంటే ఒక అయోనిజ శిశుప్రాయంలో భగవదత్తంగా లభించింది. బిడ్డలు లేని తనకు ఆ వటపత్ర శాయి ఆ లోటును తీర్చాడని సంతోషించి పెంచుకున్నాడు. ఆమెయే గోదాదేవి, ఆముక్తమాల్యద, ఆండాళ్ తల్లి. భక్తి జ్ఞాన వైరాగ్యాలను సహజసిద్ధంగా పొందిన గోదాదేవి శ్రీరంగనాథుని పతిగా తలంచి, భక్తితో ఆరాధించి, స్వామి అనుగ్రహమును పొంది మకర సంక్రమణమునకు ముందు రోజైన భోగి పండుగనాడు, శ్రీరంగనాథుని వివాహమాడుతుంది. ముప్పది రోజులపాటు మార్గళీ వ్రతాన్ని ఆచరించి సంపూర్ణ శరణాగతితో గోదాదేవి కీర్తించిన పాశురాల రూపమే ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధం.
అయ్యప్పస్వామి - జ్యోతి దర్శనం
హరిహరాంశగా అవతరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ శరణు ఘోషతో శబరిమలకు వచ్చే భక్తులను కటాక్షించే స్వామి - అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతినాడే అయ్యప్ప జయంతి. పందల రాజుకిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామిని జ్యోతి స్వరూపంగా దర్శించుకొని, జ్ఞానోదయాన్ని పొందుతారు. ఇది మకర సంక్రాంతి పండుగకు ఒక విశేషం.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440 737464