S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘బాబు-బంగారం’

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘వెధవా! ఏమయిందిరా నీకు.. నా స్నేహితుడి ముందు పరువు తీశావు కదరా... మా స్నేహితులందరి మధ్యలో తలెత్తుకోకుండా చేశావ్... ఏం మాయరోగమొచ్చిందో నీకు అర్థం కావటంలేదు!’
కొడుకు తలవంచుకుని తండ్రి ముందు నిలుచున్నాడు.
‘ఒకపక్క అడుగుతుంటే అట్లా ఉలుకు, పలుకూ లేకుండా చూస్తావేమిటి? ఏమయిందో చెప్పేడు!’ పెద్ద గొంతుకతో గద్దించి అడిగాడు శ్రీనివాసరావు పాతికేళ్ల కొడుకు కౌశిక్‌ని.
‘ఏమండి! ఏమిటా అరుపులు వీధంతా వినబడేలా!’ ఆయన భార్య కస్తూరి హాల్లోకి వస్తూ అన్నది చికాగ్గా.
‘వీడిని అరవటం కాదే! కొట్టాలా, నరకాలా... ఏం చేస్తే నాకు జరిగిన అవమానం తీరుతుందో అర్థం కావటంలేదు!’ భార్యని ఉద్దేశించి అన్నాడు శ్రీనివాసరావు పట్టరాని కోపంతో.
‘అయ్యో ఏమయిందండీ!... ఎందుకంత కోపం? ఏం చేశాడు?... ఇంట్లో చెప్పకుండా సినిమాకు వెళ్లాడు.. అంతేగా, దానికి అంతలా అరవాలా? అయినా వయసొచ్చిన పిల్లాడు, ఉద్యోగం చేస్తున్నాడు.. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే వెళ్లాడేమో!’ వేడెక్కిన వాతావరణాన్ని చల్లార్చాలన్నట్లుగా అన్నది కస్తూరి, భర్తను వెళ్లమన్నట్లుగా సైగ చేస్తూ.
‘అమ్మా! తల్లీ కస్తూరి... నీ కొడుకు నువ్వనుకున్నంత చిన్నపిల్లవాడేం కాదు.. నీకు ప్రతి విషయం చెప్పి, నీ అనుమతి తీసుకుని చేయడానికి... వారు చాలా పెద్దవారయిపోయారు!’ అన్నాడు శ్రీనివాసరావు సాగదీస్తూ.
‘కాస్త అర్థమయ్యేలా చెప్పండి... ఒరే కౌశీ! నువ్వయినా చెప్పరా ఏమయిందో!’ అంది కస్తూరి.
‘ఇందాకటి నుండి గొంతు చించుకుని అరుస్తున్నా నీ కొడుకు నోరు తెరవటం లేదు... వెధవ ఇప్పుడు నువ్వు వచ్చి అడగగానే చెబుతాడా, నీ పిచ్చిగాని!’ కోపం, అసహనం కలవగా అన్నాడు శ్రీనివాసరావు.
‘వాడు సరే! మీకేమయింది... మీరు చెప్పండి, ఎందుకలా వాడిని అరుస్తున్నారు?’
‘చెప్తానే, చెప్తాను... చెప్పక చస్తానా.. నీ కొడుక్కు పెళ్లి కావాల్సి వచ్చింది పెళ్లి! అంత పెళ్లి కావాలనుకుంటే మనమే ఒక మంచి పిల్లని చూడమా... వీడికి ఏకంగా మా స్నేహితుడు పార్థసారథి కూతురే కావాల్సి వచ్చిందా? తల్లిదండ్రులం ఒకళ్లం ఇంకా బ్రతికే ఉన్నాంగా, మనకు చెప్పి ఏడ్వవచ్చుగా, ఆహాఁ! పనికిరాలా... ఏకంగా వాడి దగ్గరకే వెళ్లి, నాకు సాగరి అంటే ఇష్టం... మాకు పెళ్లి చేయండి అని అడిగాడే నీ పుత్రరత్నం... తల్చుకుంటే తల కొట్టేసినట్లున్నది! అదుగో ఇంత జరిగినా ఏం జరగనట్లు ఎట్లా నించుని ఉన్నాడో చూడు!’
‘అబ్బ ఉండండి... కాసేపలా బయటకు వెళ్లి రండి.. ఈలోగా నే కనుక్కుంటాగా’ అంది కస్తూరి.
* * *
‘ఇప్పుడు చెప్పరా, ఏంటి పార్థసారథి అన్నయ్య గారింటికి వెళ్లి వాళ్ల లలితా సాగరిని పెళ్లి చేసుకుంటానని అడిగావా... నిజమా?’ శ్రీనివాసరావు గేటు తీసుకుని వీధిలోకి వెళ్లగానే కొడుకు దగ్గరకు వస్తూ అడిగింది కస్తూరి.
‘ఆఁ’ అని మాత్రం అనగలిగాడు కౌశిక్ తల్లి అడుగుతుంటే తప్పక.
‘నీకు నిజంగా ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమయితే పెద్దవాళ్లం మాకు చెప్పొచ్చు కదరా.. నీ అంతట నువ్వు వెళ్లి వాళ్లమ్మాయిని చేసుకుంటానని అనటం తప్పు కదూ! పెళ్లి విషయం అంటే ఒక పద్ధతి ఉంటుంది!’
‘ఊఁ...’ అన్నాడు నెమ్మదిగా కౌశిక్ తల్లికేసి చూడకుండానే.
‘ఏంటిరా.. ఎటో చూస్తూ ఊఁ... ఆఁ... అని మాత్రం అంటావ్... ఇలా అయితే ఎలా? మీ నాన్నని చూస్తే బాగా కోపం మీద ఉన్నారు... ఇలా ఉంటే మధ్య నేనేం చేయాలి!’
‘ఏదో ఒకటి చెయ్యమ్మా’ అంటూనే హాల్లో నుండి మొబైల్ చూసుకుంటూ తన గదిలోకి వెళ్లాడు కౌశిక్.
* * *
‘కస్తూరి! నీ కొడుకును కనుక్కున్నావా?’ మర్నాడు ఆఫీసు నుండి వస్తూనే అడిగాడు శ్రీనివాసరావు.
‘ఆ... వచ్చారా... ముందు మంచినీళ్లు తీసుకోండి!’
‘అవన్నీ తర్వాత! ముందిది తేల్చు.. నీ కొడుకును అడిగి అసలు విషయం తెలుసుకున్నావా లేదా?!’
‘సాగరి గురించేనా... అయినా అందులో మీ అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కావటంలేదు.. అడిగితే అడిగాడు... వాళ్లు సాగరిని మనవాడికిచ్చి చేస్తే మాత్రం తప్పేముంది? వీడికేం తక్కువ?’
‘తక్కువేంటే తక్కువ! ఆ అమ్మాయి అర్హతలేంటి... ‘వెధవ’ వీడు సాధించిందేంటి.. అయినా తెలియక అడుగుతా నువ్వేంటి వాడికి బుద్ధి చెబుతానని చెప్పి ఇప్పుడేంటి వాడిని వెనకేసుకొస్తున్నావ్? నీకు మతిగాని పోయిందా?’ గొంతు స్థాయిని పెంచి కస్తూరి మాటలకు మధ్యలోనే అడ్డుపడుతూ అరుస్తున్నట్లుగా అన్నాడు శ్రీనివాసరావు.
‘అయ్యో! అదేం లేదండి! వాడు నాతో ఏం చెప్పలేదు! నాకుగా అనిపించి అడుగుతున్నా అంతే!’ భర్త గొంతులోని కోపాన్ని పసిగట్టి వెంటనే సర్దుకుంది కస్తూరి. ‘అయినా కౌశి కూడా ఆఫీసు నుండి వచ్చే వేళయింది... వాడినే అడిగితే సరి.. ఈలోగా నేను ఇద్దరికీ టీ చేసుకు వస్తా!’
* * *
మర్నాడు ఉదయంవేళ ఆఫీసుకు బయల్దేరే ముందు, ‘కౌశీ! నువ్వు నాన్న స్నేహితుడు పార్థసారథి గారింటికి వెళ్లి వాళ్ల సాగరిని పెళ్లి చేసుకుంటానన్నావుట... అసలు ఏంటి సంగతి? నిన్నటి నుండి అడుగుతుంటే దాటేస్తున్నావు?’ కోపం నటిస్తూ అంది కస్తూరి, కొడుకు, భర్త టీ తాగటం అయిపోగానే.
‘అవును.. అడిగాను!’ కుండబద్దలు కొట్టినట్లు సీరియస్‌గా జవాబు చెప్పాడు కౌశిక్.
‘ఆ పిల్ల స్థాయి ఏంటి, ఇవతల నీ స్థాయి ఏమిటి?... ఏం మాట్లాడుతున్నావో నీకు కాని

అర్థమవుతోందా?... ఇన్ని సంవత్సరాల మా స్నేహాన్ని పాడుచేయడానికి పుట్టావురా నువ్వు!’ ఆవేశంగా అన్నాడు శ్రీనివాసరావు.
‘మీరుండండి... ఏ విషయం వివరంగా కనుక్కుంటాగా... మీరు ప్రశాంతంగా ఆఫీసుకు వెళ్లండి...’ టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగ్‌ను భర్త చేతికి అందిస్తూ అన్నది కస్తూరి. ‘అయినా మనవాడికి మాత్రం ఆస్తి, అంతస్తు ఉంది.. ఎంబీఏ చేశాడు.. నెలకు బాగానే సంపాదిస్తున్నాడు... ఇక అందమంటారా సాగరి ముందు కాస్త రంగు తక్కువ. అంతేకదా.. పైగా పార్థసారథి అన్నయ్యగారి కుటుంబం మన కుటుంబం ఎన్నో ఏళ్లబట్టి ఎరిగున్న వాళ్లం కూడానూ... ఆ అమ్మాయిని మనవాడికిచ్చి చేస్తే మాత్రం తప్పేమిటి?’ చిన్నగా గొణుగుతూ అంది కస్తూరి.
‘ఎక్కడే నీ కొడుకు?... ఇవ్వాళ వాడో, నేనో తేలిపోవాలి... ముందు పిలువు నా ముందుకు!’ వారం రోజుల తరువాత ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వస్తూనే శివాలెత్తి పోతున్నట్లు అరిచాడు శ్రీనివాసరావు.
‘అంత కొంపలు మునిగిపోయినట్లుగా అరుస్తున్నారు... కొత్తగా మళ్లా ఏం జరిగింది?’ కస్తూరి భర్తని అడిగింది.
‘ఇంకా ఏం జరగాలి. నీ సుపుత్రుడు ఇవ్వాళ పార్థసారథి ఆఫీసుకు వెళ్లి మళ్లా అడిగాడట ‘సాగరి’ని తనకిచ్చి పెళ్లి చేయమని!’
‘అన్నయ్యగారు గాని ఫోన్ చేసి చెప్పారా?’
‘అట్లా ఫోన్ చేసి నన్ను నాలుగు తిట్లు తిట్టినా బాగుండేది.. వాడిది మంచి మనసు కాబట్టి ఫోన్ చేయలేదు.. వాడి ఆఫీసులో వాడితో పని చేస్తున్న నా స్నేహితుడొకడు ఫోన్ చేసి చెప్పాడు. నాకు విషయం తెలిసిందని తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని, వాడు నాకన్నా ముందే బాధపడ్తాడు. అంత మంచి మనిషే వాడు!’ గద్గద స్వరంతో అంటూ కుర్చీలో కూలబడిపోయాడు శ్రీనివాసరావు.
‘మీరు అంత బాధ పడబోకండి. అలా అయితే ఒక పనిచేద్దాం... రేణుని వెంటనే రమ్మనమని ఫోన్ చేస్తా... వాడు వాళ్లక్కకి చెప్పకుండా ఏ పనీ చేయడు... అదే వచ్చి కనుక్కుంటుంది వీడి వ్యవహారం ఏంటో!’ సమస్యకు పరిష్కారం సూచిస్తున్నట్లుగా అంది కస్తూరి ఫోన్ అందుకుంటూ.
* * *
‘రేణు! తమ్ముణ్ణి కనుక్కున్నావా? ఏం చెప్పాడు?’
రేణుక వచ్చిన రోజు రాత్రే శ్రీనివాసరావు, కస్తూరి కూతుర్ని కూర్చోబెట్టి అడిగారు. ఆమె శని, ఆదివారాలు సెలవులవ్వటంతో ఫోన్ చేయగానే వచ్చింది. మళ్లా మరునాడు రాత్రికల్లా రైలెక్కించాలి. లేకపోతే అక్కడ అల్లుడు, మనవడు ఇబ్బంది పడతారు.
‘మాట్లాడానమ్మా! కానీ వాడు నా మాట ఏ మాత్రం వినేలా లేడు!’ నెమ్మదిగా అంది రేణుక.
‘పోనీ వాడూ అంత ఇష్టపడుతుంటే సారథి అంకుల్ వాళ్లను అడిగి చూడవచ్చు కదా, నాన్నా!’ చెప్పలేక చెప్పింది రేణుక తండ్రితో.
‘ఏంటమ్మా! నువ్వూ మీ అమ్మలాగే ఏ మాత్రం ఆలోచన లేకుండా మాట్లాడతావు... మనకన్నా వాళ్లు అన్ని విధాలా పై స్థాయిలో ఉన్నారు.. మన వాడిని చూద్దామంటే సాగరికన్నా చదువు, ఉద్యోగం, ఆస్తి, అందం, ఇలా అన్నింటిలోనూ రెండు మెట్లు క్రిందే! అదీగాక పిల్ల చూస్తే కుందనపు బొమ్మ.. సాగరి సంవత్సరం ఆగి చేసుకుంటానందని కాస్త ఆగారు కాని, లేకపోతే బ్రహ్మాండమైన సంబంధాలు లైనులో ఉన్నాయి.. అందునా వాడి భార్య, అమ్మ గొప్పింటి సంబంధం చెయ్యాలని పట్టుమీదున్నారు...!’ అన్నాడు శ్రీనివాసరావు ఇటు కూతురికి, అటు భార్యకు అర్థమవ్వాలి.
‘ఏమో నాన్నా! వాడు గట్టిగానే నిర్ణయించుకున్నట్లే అనిపిస్తోంది!’ ఇక తాను చెప్పాల్సింది అయిపోయిందన్నట్లుగా అన్నది రేణుక.
* * *
‘కస్తూరి.. కస్తూరి! ఒకసారి వెంటనే ఇటురా...’ అంటూ పిలిచాడు శ్రీనివాసరావు సరిగ్గా రెండు వారాల తరువాత ఒకరోజు ఆఫీసు నుండి వస్తూనే.
‘‘ఇదుగో.. వచ్చే...’
ఏదో అత్యవసర విషయం చెప్పటానికే భర్త అట్లా పిలుస్తున్నాడని అనిపించి పరుగుపరుగున వచ్చింది కస్తూరి.
‘నువ్వు ముందిలా కూర్చో.. మనవాడు ఇంట్లో లేడుగా!’ అన్నాడు శ్రీనివాసరావు భార్యతో, కుర్చీ చూపిస్తూ.
‘కౌశీ.. ఇంకా రాలేదులెండి.. చెప్పండి!’ అంటూ తడి చేతుల్ని చీరచెంగుతో తుడుచుకంటూ కుర్చీలో కూర్చుని అంది కస్తూరి.
‘సాగరికి పెళ్లి నిశ్చయమయిందటనే.. వచ్చే వారంలోనే తాంబూలాలు తీసుకుంటున్నారుట!... నా స్నేహితులు చెప్పారు.. మన వెధవ స్నేహితుల్ని వెంటేసుకుని మళ్లా ఒకటి రెండుసార్లు వాడి దగ్గరకు వెళ్లాడట.. ఈ విషయమన్నా తెలుసా తమరికి?’
‘నాకెలా తెలుస్తుందండీ!’
‘సరేలే.. ఆ అబ్బాయి సాగరి ఆఫీసులోనే పనిచేస్తాడట.. జీతం బాగానే వస్తుందట కానీ, వీళ్లు కోరినన్ని ఆస్తిపాస్తులు లేవని తెలిసింది!’
‘అయ్యో అలాగా! వదినగారి కోరికంతా బాగా డబ్బున్న సంబంధం చూడాలని కదండీ!’ సాగదీస్తూ అన్నది కస్తూరి కొంచెం బాధ నిండిన స్వరంతో.
‘ఏమో! మన ప్రబుద్ధుడు చేసిన నిర్వాకానికి తొందరగా చేస్తున్నారేమో అనుకుంటా... సరేలే వాడు వస్తున్నాడల్లే ఉంది.. ఈ విషయాలేవీ వాడికి తెలియనీయబోకు!’ అన్నాడు శ్రీనివాసరావు గేటు తీసినట్లు చప్పుడవ్వటంతో.
* * *
బాబు-బంగారం (7వ పేజీ తరువాయ)
సరిగ్గా ఒక నెల తర్వాత, ‘కస్తూరి! నేను ఆఫీసుకు వెళుతున్నట్లుగానే బయల్దేరి వెళ్లి పెళ్లి ముహూర్తానికి ముందుగా వెళతాను. అక్కడ ముహూర్తం అయిపోయి భోజనం చేసి నేను వచ్చిన తరువాతే నువ్వు బయల్దేరుదువుగాని.. అంతవరకు నీకు ఒంట్లో ఏ మాత్రం బాగోలేనట్లుగా వాడిని తోడుగా ఉండాల్సిందే అన్నట్టుగా కూర్చోబెట్టుకో... ఆఫీసుకు వెళ్లకుండా చేశావ్‌గదా! అలాగే ఇల్లు కూడా వదలకుండా చూడు.. ఇన్నాళ్లు ఎలాగో నెట్టుకొచ్చాం గానీ, ఆ ముహూర్తం కాస్తా అయిందనిపిస్తే, ఇక ఏ గోలా ఉండదు... పెళ్లి ఇంట్లో సాయంగా ఉండవచ్చు!’ అంటూనే శ్రీనివాసరావు త్వరత్వరగా బయల్దేరాడు.
* * *
‘ఏంటిరా! బాధపడ్తున్నావా?’ టీవీ చూస్తున్న కొడుకుతో అంది కస్తూరి, శ్రీనివాసరావు వెళ్లిన గంటకు.
‘బాధ దేనికి?’ టీవీ ఛానల్ మారుస్తూ అన్నాడు కౌశిక్ వింతగా తల్లిని చూస్తూ.
‘నువ్వు ఎంతగానో ఇష్టపడిన సాగరి పెళ్లి వేరొకరితో అవుతున్నదని నీకు తెలీదా?’ కొడుకు వైపు అనుమానంగా చూస్తూ అన్నది కస్తూరి.
‘తెలుసు!’ ఎంతో సహజంగా అన్నాడు కౌశిక్.
‘సాగరినే పెళ్లి చేసుకుంటానని గొడవ చేసినవాడివి మరి అంత తాపీగా కూర్చున్నావ్!’ కొడుకుకేసి ఆశ్చర్యంగా చూస్తూ అంది కస్తూరి.
‘ఇష్టపడిన వాడితోనే సాగరి పెళ్లి జరుగుతున్నది... నేనెందుకమ్మా టెన్షన్ పడటం?’ చాలా ప్రశాంతంగా బదులిచ్చాడు కౌశిక్.
‘మరి నాన్న ఎంత అరుస్తున్నా వినకుండా వాళ్ల నాన్న వెంటబడి అడిగితివి సాగరిని చేసుకుంటానని’ ఆమెకు అంతా అయోమయంగా వున్నది కొడుకు వాలకం చూస్తుంటే.
‘అమ్మా! ఇటొచ్చి కూర్చో... నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్!’ తల్లిని మధ్యలోనే అడ్డుకుంటూ చేయి పట్టుకుని తను కూర్చున్న సోఫీలోనే కూర్చోబెట్టాడు కౌశిక్. ‘అమ్మా! సాగరి ఎంగేజ్‌మెంట్ అయిన దగ్గర నుండి నేను వాళ్ల ఇంటివైపు వెళ్లటంగాని, సాగరి పేరెత్తడం కాని చేశానా?’ ఆమెనే చూస్తూ అడిగాడు. ‘నీకొక రహస్యం చెబుతాను. విను... సాగరి పెళ్లి చేసుకుంటున్నది తను ప్రేమించిన వాడినే... అతడితో పెళ్లి జరగటం కోసమే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది!’
‘సాగరి ప్రేమించటం ఏమిటిరా?’
‘ఏమ్మా! ప్రేమించగూడదా? ఇంట్లో వాళ్లు ఆమెకు ఆస్తీ, అంతస్తు ఉన్న సంబంధాలే చూస్తున్నారు. ప్రేమించినతనికి తనకి సరిపోను చదువు, ఉద్యోగం, హోదా, అందం అన్నీ ఉన్నాయి. ఇద్దరిదీ ఒకే కులం కూడా. అతడి గుణగణాలు, నడవడి, కుటుంబ నేపథ్యం అంతా బాగుంది.. నేనూ, నా ఫ్రెండ్సూ అన్ని విషయాలూ కనుక్కున్నాం.. లేనిదల్లా ఆస్తులు మాత్రమే. పెళ్లికి అది అడ్డంటావా?’ తల్లిని ప్రశ్నిస్తూ అన్నాడు కౌశిక్.
‘ఆ విషయాలన్నీ నువ్వెందుకు కనుక్కోవాల్సి వచ్చింది?’
‘ఏం లేదమ్మా! సాగరి విషయమంతా చెప్పి సహాయం చేయమని అడిగింది. చిన్నతనం నుండి కలిసి తిరిగాం. పెరిగాం, కలిసి చదువుకున్నాం.. ఆ మాత్రం సాయం చేయలేనా?’
‘నాన్న ద్వారా పార్థసారథి అంకుల్‌కు చెప్పి పెళ్లి జరిగేటట్టు చూడవచ్చుగదా?’
‘అలా చేస్తే ఈ సంబంధాన్ని దగ్గరకు కూడా రానీరమ్మా వాళ్లు... అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు, నాతోనే పెళ్లి చేసి తీరాలన్నట్లు ఒక నెలపాటు ఇంట్లో, ఆఫీసులో కలిసి అడిగాను... నా స్నేహితులతో కూడా చెప్పించాను.. నేను సాగరికన్నా అన్ని విషయాల్లో తక్కువే కాబట్టి నాకిచ్చి చేసే ప్రసక్తే లేదు. నా గొడవ భరించలేక ఎట్లాగయినా కూతురు పెళ్లి త్వరగా చేయాలని చూస్తారు వాళ్లు. ఇదే సమయానికి సాగరి ప్రేమించిన అతని సంబంధం గురించి వాళ్ల అక్క ద్వారా వాళ్లింట్లో చెప్పించానా!’
‘మరి రేణు అక్కకి కూడా అబద్ధం చెప్పావా?’
‘అమ్మా! నేను చిన్నప్పటి నుండి అక్కకు చెప్పకుండా ఏదైనా దాచానా.. ఈ విషయాలన్నీ మొన్న అక్క వచ్చినప్పుడు పూర్తిగా చెప్పాను!’
‘అసలు విషయం దాచి, సాగరిని పెళ్లి చేసుకోవాల్సిందే అన్నట్లు చేసి, నాన్నచేత అన్ని మాటలు ఎందుకు అనిపించుకున్నావురా?’
‘ఎన్ని మాటలు అన్నా నానే్న కదమ్మా! ఐతేనేం నా చిన్ననాటి స్నేహితురాలు సాగరి పేరు బయటకు రాకుండా తన పెళ్లి తను కోరుకున్న వాడితోనే అయింది.. ఆ తృప్తి చాలు!’
‘ఇంతలోనే ఇంత పెద్దవాడివి ఎప్పుడయ్యావురా! ఎంత గొప్పగా ఆలోచించావు.. నా కొడుకు నిజంగా బంగారం!’ అన్నది కస్తూరి మనస్ఫూర్తిగా.
అక్కడ పెళ్లిలో కస్తూరి గురించి పార్థసారథి, బంధువులు, స్నేహితులు అంతా అడగటంతో ఇక నచ్చజెప్పటం కుదరక, పెళ్లి కూడా అయింది కాబట్టి కస్తూరిని వెంటబెట్టుకుని వెళ్దామని వచ్చిన శ్రీనివాసరావు గుమ్మం బయటనుండే కస్తూరి, కౌశిక్‌ల సంభాషణంతా విని తనలో తనే అనుకున్నాడు. ‘నా బాబు నిజంగానే బంగారం!’

ఎస్.మంజుల.. 9492062414