S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ తరం ఆ తరం మధ్య నా అంతరం

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘ఏమ్మా సుధా! ఈ ఉగాది పండుక్కేనా నీ కొడుకు, కోడలు ఇంట్లో వుంటారా లేక వాడి అత్తారింటికి వెళ్లిపోతారా?’ నీ కొడుకు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగారు మా అత్త రాజ్యలక్ష్మిగారు.
మా అత్తగారికి, మావగారికి మా వారు ఒక్కరే సంతానం. మాకు కూడా మా అబ్బాయి రక్షిత్ ఒక్కడే కొడుకు కావటంవలన మా నలుగురి ప్రేమాభిమానాలు వాడి మీద ఎక్కువగా వున్నా, మా అందరికన్నా వాళ్ల నాయినమ్మ ప్రేమ ఒకపాలు ఎక్కువే ఉంటుందని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుండి వాడు ఏ పొరపాటు పన్లు చేసినా మనవడ్ని మా అత్తగారు బాగానే సపోర్టు చేసేవారు. అందుకే వాడికి కూడా వాళ్ల నాయినమ్మ దగ్గర బాగానే గారాలు పోయేవాడు.
మా అందరి ముద్దు ముచ్చట్ల మధ్య మా అబ్బాయి రక్షిత్ చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్లి అక్కడ ఎం.ఎస్. చేసినా మమ్మల్ని విడిచి వుండలేక తిరిగి ఇండియా వచ్చి హైదరాబాద్‌లోనే ఉద్యోగంలో చేరి నాయినమ్మ, తాతయ్యల కోరికను తీర్చాడు.
ఉద్యోగంలో చేరిన ఆరు నెలల తరువాత నుండి మనవడి పెళ్లి చూడాలని పోరు పెట్టి మొత్తానికి మా వాడిని పెళ్లికి ఒప్పించారు మా అత్తగారు.
పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకోడానికి ఒప్పుకున్నా తన కాబోయే భార్య ఉద్యోగం చెయ్యాలని షరతు పెట్టాడు మా వాడు. పెద్ద చదువులు చదువుకుని ఇంట్లో కూర్చోవటం అన్నది ఈ కాలం పిల్లలు ఇష్టపడరని నాకు, మా వారికి తెల్సినా, మా అత్తగారు, మావగారు మాత్రం అమ్మాయి ఉద్యోగం చెయ్యడానికి అభ్యంతరం పెట్టారు.
‘తాతగారు సంపాదించిన భూములు, పొలాలు, తండ్రి ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్థి మొత్తం వాడిదే అయినప్పుడు మళ్లీ ‘పెళ్లాం సంపాదన నీకెందుకు?’ అని మనవడ్ని నిలదీశారు.
చిన్నప్పటి నుండి తాతయ్యని అన్ని విషయాల్లోనూ తేలిగ్గా ఒప్పించుకో గలిగినా, నాయినమ్మని ఒప్పించడానికి బాగానే కష్టపడి మొత్తానికి ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు మా అబ్బాయి.
అయితే మా అబ్బాయి పెళ్లి తరువాత నాలో అంతర్మథనం మొదలైంది. కారణం నా పెళ్లైన దగ్గర నుండి మా అత్తగారి మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి. ఇంట్లో తన పెద్దరికం మాత్రమే వుండాలనుకునే ఆవిడ పెద్దరికంలో ఇంట్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో అన్న భయం పట్టుకుంది నాకు.
ఉమ్మడి కుటుంబంలో నుండి వచ్చిన పిల్ల అయితే నలుగురిలో బాగా కల్సిపోతుందని ముందు చూపుతో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకుని మనవడికి పెళ్లి చేశారు కాబట్టి మా కోడలు స్పందన ఆవిడ ఊహించిన విధంగా మా ఇంట్లో బయట కూడా అందరితో బాగా కల్సిపోగలిగినా ఇంకా తనకి మడి, తడి అంతగా తెలియదంటూ మా అత్తగారి విసుర్లు అప్పుడప్పుడు బాగానే విన్పిస్తూ వుండేవి.
ఈ కాలం పిల్లలు బరువైన చీరలు, నగలు వేసుకోడానికి ఇష్టపడరని తెలిసిన నేను ఖరీదైన చీరలు, నగలు పెళ్లికి కొనడానికి ఇష్టపడలేదు. కాని మా అత్తగారు మాత్రం ఒక్కగానొక్క కోడలుకి ఆ మాత్రం ఖరీదు పెట్టి చీరలు, నగలు కొనకపోతే నలుగురూ నవ్విపోతారంటూ అన్నీ భారీగా వున్నవే కొనిపించారు. అక్కడితో ఆవిడ కోరిక తీరిపోలేదు.
ఏ పండుగ వచ్చినా ఆ నగలు పెట్టుకొని గుడికి వెళ్లమనీ, ఏ పేరంటానికి పిల్చినా చీరలు మాత్రమే కట్టుకోమని స్పందనని అడగటం కాదు ఒక విధంగా ఆజ్ఞాపించినట్లే చెప్పేవారు.
‘అమ్మో.. ఆ చీరలు, నగలు పెట్టుకోని పండుగ పూట గుడికి వెళ్తే దేవుడి దర్శనం మాటటుంచి గంటలు గంటలు ఆ క్యూలో నిల్చునేసరికి మాకు దొరికిన ఒక్క సెలవు రోజు వేస్ట్ అయిపోతుంది కదా అత్తయ్యా’ అన్న ఆ అమ్మాయి మాటల్లో నిజాన్ని గ్రహించి మా అత్తగారు విసుక్కుంటున్నా అమ్మాయిని బలవంతం పెట్టేదాన్ని కాదు.
కొత్తగా పెళ్లైంది కాబట్టి, పండుగలకే సెలవులు దొరుకుతాయి కాబట్టి కొడుకు, కోడలు వాళ్ల ఊరికి వెళ్లడానికి రిజర్వేషన్ చేయించుకున్న రోజు నుండి ఇంట్లో అత్తగారి మూలుగులు మొదలైపోయేవి.
ఏం మనింట్లో మాత్రం పండుగ చేసుకోమా ఏంటీ? ప్రతీ పండక్కీ నీ కొడుకు కోడలు వాల్ల ఊరికి ఉడాయిస్తారంటూ నన్ను సాధించేవారు.
‘పోనె్లండి అత్తయ్యా. పెళ్లైన కొత్తకదా, మళ్లీ పిల్లలు పుడితే ఈ ప్రయాణాలు అవీ చెయ్యలేరు కదా’ అని నేను సర్దిచెప్పబోతే ‘అలాగే కోడల్ని ముద్దుచేసి నెత్తికెక్కించుకో, రేప్పొద్దున్న అది ముద్ద పెట్టకపోతే బాధ పడేది నువ్వే’ భవిష్యత్తుని ముందుగానే ఊహించుకుని మాట్లాడే ఆవిడ మాటలకి విస్తుపోవడమే తప్ప ఎదిరించి వాదించే స్వభావం మొదట నుండీ నాకు లేదు కాబట్టి వౌనంగా వుండిపోయేదాన్ని.
నేను కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఉదయం పూట వంట మడిగా మా అత్తగారే చేస్తుండేవారు. ‘ఇంక మనవడి పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి హాయిగా ఈ వంటలు, వార్పులూ మానేసి హాయిగా రెస్ట్ తీసుకోమ్మా’ అని మా వారు ఒకనాడు సరదాగా అన్న మాటలకి ఆవిడ కోపం తెచ్చుకొని ‘నా వంట తిని తిని మొహం మొత్తిందని నేరుగా చెప్పకుండా, ఇలా డొంకతిరుగుడు మాటలెందుకురా’ అని తిరిగి ప్రశ్నించేసరికి, మళ్లీ మా ఆయన ఆ ఊసెత్తడం మానేశారు.
పోనీ ఆవిడకి ఓపిక శక్తి వున్నన్నాళ్లు చేసుకున్నా ఫర్వాలేదు అని సరిపెట్టుకుందామంటే వారం రోజులు ఆవిడ చేసిన ప్రసాదాలు తినాల్సిందే! ఆదివారం సూర్యనారాయణ మూర్తికి మొదలుపెట్టి మళ్లీ శనివారం వేంకటేశ్వర స్వామికి ప్రసాదాలు నైవేద్యం పెట్టి ఎలాగూ మీరు టిఫిన్లు తినాలి కదా ఈ ప్రసాదాలే టిఫిన్లు కింద తింటే పుణ్యం, పురుషార్థం కూడా వస్తాయని మభ్యపెట్టి అందరి చేత తినిపించేవారు.
వాళ్ల పెళ్లైన దగ్గర నుండి అలవాటై పోయిన మా మావగారు, తనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి తల్లి చేసిన ప్రసాదానే్న టిఫినులా తినే మా ఆయనగారు, ఈ ఇంటికి వచ్చిన తరువాత నేను కూడా దేవుడికి నివేదించిన ప్రసాదాల్ని ఆయన ఎలాగూ ఆరగించడు కాబట్టి మేమే ఆరగించేవాళ్లం.
‘ప్రసాదాలు తింటే బాగా చదువు వస్తుంది. పెద్దయ్యేక మంచి ఉద్యోగం, డబ్బులు అన్నీ వస్తాయంటూ’ చిన్నప్పటి నుండి మనవడికి కబుర్లు, కథలు చెప్పి ఆవిడ చేసిన ప్రసాదాల్ని చిన్నప్పుడు తినిపించినా రానురాను మా వాడు మాత్రం ఏదో విధంగా తినకుండా తప్పించుకునేవాడు.
మా అబ్బాయి పెళ్లి తర్వాత మొదటిసారిగా ఆవిడ చేసిన ప్రసాదాల మీద చర్చలు ప్రారంభమయ్యాయి. మా కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటిలా ఆవిడ సత్యన్నారాయణ స్వామి ప్రసాదం అంటూ హల్వా చేసి పొద్దుటే మా వాడు, కోడలు ఆఫీసుకి బయల్దేరుతుంటే తినమని బలవంతం చేశారు. అందులో ఆవిడ పోసిన నెయ్యి, వేసిన జీడిపలుకుల్ని చూసి మా కోడలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ‘అమ్మో! ఇలాంటివి టిఫినులా తినడం నా వల్ల కాదు, కావాలంటే ఒక్క స్పూను తినగలను. నిన్ననే కదా వడలు ప్రసాదం చేసి పెట్టారు. ఇలా రోజూ తింటుంటే మరో వారం రోజుల్లో నా బరువు మూడురెట్లు పెరిగిపోతుంది’ హాస్యంగా చెప్పినా కచ్చితంగా చెప్పింది మా కోడలు.
‘తప్పమ్మా ప్రసాదం తిననని చెప్పకూడదు. అయినా మరీ అలా పూచిక పుల్లలా వుండి గట్టిగా తుమ్మితే ఎగిరిపోయేలా వుంటే రేప్పొద్దున్న పిల్లల్ని ఎలా కంటావు. ఎలా పెంచుతావంటూ క్లాసు తీసుకున్నారు. పెళ్లికి ముందు మా మనవడి పెళ్లాం నాజూగ్గా, మెరుపు తీగెలా ఉంటుందన్న ఆవిడ మాటలు హఠాత్తుగా మారిపోవడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఇంట్లో విసురు మాటలు ప్రారంభమయ్యాయి.
ప్రతీ శని ఆదివారాలు ఇంట్లో వుండకుండా బయటతిరుగుతారని, పొద్దుట నిద్ర ఎనిమిది గంటల వరకు లేవరని.. ఇలా మా ముందే కాదు ఇంటికి ఎవరొచ్చినా చెప్పడం మొదలుపెట్టేవారు. ‘పిల్లల్ని గారంగా పెంచడమే కాదు, పెళ్లై అత్తారింటికి వెళ్లేక ఎలా మసలుకోవాలో పుట్టింట్లో నేర్పించాలంటూ విసుక్కునేవారు. ఆవిడ మాటలకు చిన్నబుచ్చుకున్నా, మా వాడు సర్ది చెప్పేసరికి స్పందన కూడా పట్టించుకునేది కాదు.
కాని ఇలా చిలికిచిలికి గాలివాన అయేటట్టు ఇవన్నీ దేనికి దారితీస్తాయోనన్న భయం నాకు పట్టుకుంది. నా ఆలోచనలను, భయాన్ని గమనించిన మా వారు ‘సుధా! నీ భయం నాకర్థమైంది. మా అమ్మ చాదస్తం నాకు తెల్సు. మన పెళ్లైన కొత్తలో నీకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనా నా కోసం ఓర్చుకునేదానివి.
ఇప్పుడు మన పిల్లలు కూడా ఆవిడ కంట్రోల్‌లో ఉండాలన్న అభిప్రాయం తప్పని తెల్సినా ఆవిడ్ని ఒప్పించలేక పోవడం నా బలహీనత. ఈ సమస్య ఒకటి రెండు రోజుల్లో తీరేది కాదు. ఈ సమస్యకి పరిష్కారం మన కొడుకు, కోడలు వేరే ఎక్కడికేనా ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడమే. ఈ విషయం నీకు, వాడికి కూడా బాధ కల్గించినా ఏ రోజు ఏ గొడవలు వస్తాయోనని నువ్వు పడే టెన్షన్‌కన్నా అదే నయం కదా! రాత్రి వాళ్లు ఆఫీసు నుండి రాగానే ఈ విషయం చెప్పి వాళ్లని ఒప్పిస్తాను’ అంటున్న మావారి ఓదార్పు మాటలు విని నాకు దుఃఖం ఆగలేదు.
రాత్రి పిల్లలిద్దరినీ పిలిచి విషయం అంతా చెప్పి మీ నాయినమ్మ చాదస్తురాలే కాని చెడ్డది మాత్రం కాదు. ఈ వయసులో ‘ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడకూడదు’ అని చెప్తే ఆవిడ పెద్దరికాన్ని దెబ్బతీసినట్లుంటుంది. మీ అమ్మ ప్రతిరోజు మీ అందరి మధ్య నలిగిపోయేకన్నా కొన్నాళ్లు మీరు వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటే మంచిదని నాకు అన్పిస్తున్నది. వీలున్నప్పుడల్లా మీరు వస్తూ వుండండి. మధ్యమధ్యలో అమ్మ కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటుంది’ అని నచ్చచెప్తూంటే ఆయన గొంతు వణకడం నేను గమనించాను.
మా వాడు ఏదో చెప్పబోతుంటే మధ్యలో స్పందన కలుగజేసుకుని ‘సారీ మావయ్యా! మేమెక్కడికీ ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని మీకు దూరంగా వెళ్లదలచుకోవటం లేలదు. అటు పెద్దవారైన అమ్మమ్మగారికి, చిన్నవాళ్లమైన మాకు సర్ది చెప్పలేక అత్తయ్యగారు పడుతున్న ఆవేదనను మేము ముఖ్యంగా మీ అబ్బాయి చూడలేక బాధపడుతున్నారు.
నేను కూడా ఒక ఉమ్మడి కుటుంబం నుండి వచ్చినదానే్న. కాబట్టి ఇలాంటి సమస్యల్ని అర్థం చేసుకోగలను. మిమ్మల్ని విడిచి ఆయన వుండలేరు. అసలు తప్పు నాదే కాబట్టి అమ్మమ్మగారికి సారీ చెప్పి ఆవిడ చెప్పినట్టే చెయ్యడానికి ట్రై చేస్తాను. మా అమ్మమ్మ బతికి వుంటే తను కూడా నాకు ఇలాగే చెప్పేదేమో. నేను సర్దుకుపోయి వుంటే ఈ గొడవలు వచ్చేవి కాదు కదా! మిమ్మల్ని బాధపెట్టినందుకు నిజంగా సారీ చెప్తున్నా’ నంటున్న స్పందన మాటలు పూర్తి కాకుండానే ‘నువ్వు కాదమ్మా సారీ చెప్పాల్సింది. నేనే మిమ్మల్నందరినీ ఆ ముక్క అడగాలి. పొద్దుట గుడికి వెళ్లినప్పుడు మీ తాతయ్యగారు నాకంతా బోధపర్చారు. వయసు అయిపోయిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న ఈ రోజుల్లో మీరంతా మమ్మల్ని ఇంత గౌరవంగా చూసుకుంటున్నందుకు హాయిగా కాలక్షేపం చేసుకోకుండా ఇంకా నా మాటే వినాలి. ఇంట్లో నా పెద్దరికమే నిలబడాలన్న పట్టుదలతో మిమ్మల్నందరినీ ముఖ్యంగా నా కోడల్ని ఎంత విసిగించానో తల్చుకుంటే నాకే సిగ్గుగా ఉంది. నా కొడుకు చెప్పినట్టు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, కృష్ణారామా అంటూ ఇంక కాలక్షేపం చేస్తాను. నువ్వు, నా మనవడు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ముచ్చటగా మూడు తరాల వాళ్లం కల్సి ఒకే ఇంట్లో వుంటూ అందరికీ ఆదర్శంగా ఉందాం. అయితే దీనికి ముందు నువ్వు, నా మనవడు నా కోరికని ఒకటి తీర్చాలి’ అన్న ఆవిడ మాటలకి ‘చెప్పు నాయినమ్మా! నీకేది కావాలన్నా నేను, నీ మనవరాలు ఇప్పుడే వెళ్లి కొని తెస్తాం’ అంటున్న మనవడితో, ‘కొని తేవడం కాదు మనవడా. మీ ఆవిడ్ని అర్జంటుగా నా కోసం ఒక మనవరాల్ని కనిపెట్టమని అడుగు’ అన్న ఆవిడ మాటలకి అందరం హాయిగా నవ్వుకున్నాం.

-భాగవతుల రమాదేవి