S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 67 మీరే డిటెక్టివ్

మీకో ప్రశ్న

జగత్ ప్రథమ మంగళం రామం..
దీన్ని ఏ సంస్కృత కవి రాశారు?

పురుషశ్రేష్ఠుడైన రాముడు తండ్రి ఆజ్ఞని గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి మిగిలి ఉండగానే చాలా దూరం ప్రయాణం చేశాడు. ప్రయాణంలోనే రాత్రి గడిచింది. ఉదయం రాముడు మంగళకరమైన సంధ్యోపాసన చేసి దేశ పొలిమేరల్లోకి ప్రవేశించాడు. దున్నిన పొలిమేరలు గల గ్రామాలని, పుష్పించిన వనాలని చూస్తూ, ఉత్తమమైన గుర్రాలతో వేగంగా ప్రయాణిస్తూ ఆ గ్రామాలు అన్నిటినీ దాటాడు. గ్రామస్థుల మాటలు విన్నాడు.
‘దశరథ మహారాజు కామానికి లొంగిపోయాడు. అయ్యో! క్రూరురాలు, పాపాత్మురాలైన కైకేయి ఇప్పుడు పాపకర్మలని చేస్తోంది. ధార్మికుడు, గొప్ప బుద్ధి, దయ కలవాడు, ఇంద్రియాలని జయించిన వాడైన రాముడ్ని వనవాసానికి పంపుతూ క్రూరురాలైన కైకేయి కట్టుబాట్లని ఛేదించి ఎంతటి క్రూరమైన పనికి ఒడిగట్టింది? మంచి భాగ్యంగల, సదా సుఖాలకి అలవాటుపడ్డ, జనకుడి కూతురైన సీత దుఃఖాలని ఎలా అనుభవిస్తుందో? ప్రజలకి ఇష్టుడు, దోషం లేని తన కొడుకైన రాముడ్ని దయలేని రాజు విడిచిపెట్టాడు. ఎంత ఆశ్చర్యం!’
వీరుడైన రాముడు గ్రామస్థులు, పల్లెల్లోని వాళ్లు చెప్పుకునే ఈ మాటల్ని వింటూ కోసల దేశాన్ని దాటాడు. తర్వాత రాముడు వేదశృతి అనే పవిత్ర నదిని దాటి, అగస్త్యుడు నివసించే ఉత్తర దిక్కు మార్గం పట్టాడు. అలా చాలా దూరం ప్రయాణించాక గోవులతో నిండిన, పవిత్రమైన సముద్రంలో కలిసే స్యందిక నదిని దాటాడు. వేగంగా గుర్రాలని నడిపిస్తూ నెమళ్లు, హంసల ధ్వనులతో నిండిన గోమతీ అనే నదిని కూడా దాటాడు. అక్కడ రాముడు పూర్వం మనుచక్రవర్తి ఇక్ష్వాకుడికి ఇచ్చిన అనేక రాష్ట్రాలతో కూడిన విశాలమైన భూమిని సీతకి చూపించాడు. మదించిన హంసల ధ్వని లాంటి కంఠధ్వని గల రాముడు సారథైన సుమంత్రుడ్ని, ‘సూతా!’ అని ప్రేమగా పిలిచి చెప్పాడు.
‘నేను మళ్లా వచ్చి తల్లిదండ్రుల దర్శనం చేసుకుని, సరయూ నదీ తీరంలోని పుష్పించిన వనంలో ఎప్పుడు వేటాడుతానో? వేట ఈ లోకంలో సాటిలేనిది. రాజర్షులు అందరూ ఆమోదించిన అది ఆనందకరమైన ఆట. కాని సరయూ నదీ తీరంలోని వనంలో వేటాడాలనే కోరిక నాకు అంతగా లేదు. ఈ లోకంలో వేట రాజర్షులకి ఆనందకరం. ఆయా కాలాల్లో ఇతర మనుషులు కూడా వేటాడుతారు. ధనస్సు ధరించేవారు దీన్ని అధికంగా కోరుకుంటారు. కాని నేను అంతగా కోరుకోను.’
రాముడు ఇలా మధురమైన కంఠంతో సూతుడికి చెప్తూ ఆ దారిలోనే ప్రయాణం కొనసాగించాడు. (అయోధ్యకాండ సర్గ 49)
బుద్ధిమంతుడైన రాముడు అందమైనది, విశాలమైనదైన కోసల దేశాన్ని దాటి, అయోధ్య వైపు తిరిగి నమస్కరిస్తూ చెప్పాడు.
‘కకుత్స వంశంలో పుట్టిన వారిచేత పాలించబడే ఓ నగర శ్రేష్ఠమా! నీలో నివసిస్తూ నిన్ను పాలించే దేవతల అనుమతి కోరుతున్నాను. నేను వనవాసం పూర్తి చేసుకుని, దశరథుడి రుణం తీర్చి, తల్లిదండ్రులతో కలిసి మళ్లీ నిన్ను చూస్తాను’
తర్వాత రాముడు కన్నీళ్లతో రక్తంలా ఎర్రబడ్డ కళ్లతో, దీనుడై తనని చూడటానికి వచ్చిన గ్రామీణులతో కుడిచేతిని ఎత్తి చెప్పాడు.
‘మీరు నా మీద తగినంత జాలి, దయ చూపించారు. ఎక్కువ కాలం విచారించడం బాగా చెడ్డది. అందువల్ల మీరు మీమీ పనులు చూసుకోడానికి వెళ్లండి’
వారంతా మహాత్ముడైన రాముడికి ప్రదక్షిణ, నమస్కారం చేసి బాగా ఏడుస్తూ అక్కడక్కడా నిలబడి రాముడ్ని చూడసాగారు. వారంతా రామదర్శనంతో తృప్తి చెందక ఏడుస్తూంటే రాత్రి ప్రారంభంలోని సూర్యుడు కళ్లకి కనబడకుండా వెళ్లిపోయాడు. తర్వాత రాముడు రథంతో కోసల దేశాన్ని దాటాడు. ఆ దేశం ధనధాన్యాలతో నిండి మంగళప్రదమై, ఎటు నించి ఎటువంటి భయమూ లేక అందంగా ఉంది. అక్కడి ప్రజలంతా దాతృత్వం గలవారు. అక్కడక్కడా చైత్యాలు, యూప స్తంభాలు కనపడుతున్నాయి. అడుగడుగునా వనాలు, మామిడి తోటలు, నీటితో నిండిన సరస్సులు ప్రకాశిస్తున్నాయి. ప్రజలంతా సంతృప్తితో ఉన్నారు. ఎక్కడ చూసినా వేదఘోష వినపడుతోంది. ఆ దేశం అంతటా ఆవులు ఉన్నాయి. అది రాజులంతా చూడాల్సిన దేశం. ధైర్యవంతుల్లో గొప్పవాడైన రాముడు దాని మధ్యభాగంలో ప్రయాణిస్తూ రాజుల చేత అనుభవించదగ్గ ఆ రాజ్యాన్ని దాటాడు. విశాలమైన ఆ రాజ్యం ఆనందకరమై, అందమైన ఉద్యానవనాలతో నిండి ఉంది.
కోసల దేశాన్ని దాటాక రాముడు అక్కడ అందమైన, మంగళకరమైన నీరుగల, నాచులేని, పుణ్యమైన, ఋషుల చేత సేవించబడే గంగని చూసాడు. ఆ నదీ సమీపంలోని అందమైన ఆశ్రమాలు ఆ నదికి అలంకారాలుగా ఉన్నాయి. అప్సరసలు ఆయా కాలాల్లో వచ్చి మంగళప్రదమైన ఈ గంగని సంతోషంగా సేవిస్తూంటారు. శుభ్రమైన ఈ గంగని దేవతలు, మానవులు, గంధర్వులు, కినె్నరలు ప్రకాశింపజేస్తూంటారు. గంధర్వుల భార్యలు ఈ నదిని సదా పూజిస్తూంటారు. ఈ నది అంతటా దేవతలు విహరించే వందల కొద్దీ పర్వతాలలు, ఉద్యానవనాలు ఉన్నాయి. దేవతల కోసం ఆకాశం నించి ప్రవహించడం వల్ల అది దేవనదిగా ప్రసిద్ధమైంది. ఆ నది కొన్నిచోట్ల నీటి తాకిడితో భయంకరంగా ఉంది. కొన్నిచోట్ల తెల్లటి నురుగు అనే నవ్వుతో కూడి ఉంది. కొన్ని చోట్ల నీళ్లు జడలా పొడవుగా ప్రవహిస్తూంటే, కొన్ని చోట్ల అందంగా సుడులు తిరిగింది. ఆ నది నీరు కొన్నిచోట్ల నిశ్చలంగా, లోతుగా ఉంది. కొన్ని చోట్ల వేగంగా ప్రవహిస్తోంది. దాని ధ్వని కొన్నిచోట్ల గంభీరంగా, మరికొన్ని చోట్ల భయంకరంగా ఉంది. తెల్లటి కలువలతో ప్రకాశించే ఆ నది దేవతలు స్నానం చేయబడ్డ నీరు గలది. కొన్నిచోట్ల నిండుగా, విశాలంగా ఉన్న ఇసుక తినె్నలు ఉన్నాయి. కొన్నిచోట్ల తెల్లటి ఇసుక వ్యాపించి ఉంది. హంసలు, సారస పక్షులు, చక్రవాకాలు ఆ నది మీద ఎగురుతూ అరుస్తున్నాయి. దాని మధ్యభాగం సదా మదించిన పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తూంటుంది. కొన్ని తీరాల్లో మొలిచిన చెట్లు మాలల్లా గంగని అలంకరిస్తున్నాయి. కొన్నిచోట్ల వికసించిన కలువలు, మరి కొన్ని చోట్ల పద్మవనాలు వ్యాపించి ఉన్నాయి. కొన్నిచోట్ల తెల్లటి కలువల గుంపులు, వాటి మొగ్గలు నదికి అందాన్ని ఇస్తున్నాయి. మరి కొన్ని చోట్ల అనేక రకాల పుపొప్పిడి పడి రంగు మారిపోవడంతో అది మత్తెక్కినట్లు కనిపిస్తోంది. ఆ గంగానదిలో ఏ విధమైన మలినాలు లేకపోవడంతో అది మణిలా నిర్మలంగా కనపడుతోంది. దిగ్గజాలు, మదించిన అడవి ఏనుగులు, దేవతల వాహనాలైన ఉత్తమ గజాలు దాంట్లో దిగి మాటిమాటికీ ఘీంకరిస్తూండటంతో అడవి అంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ గంగానదీ ప్రాంతం అంతటా పళ్లు, పువ్వులు, చిగుళ్లు, పొదలు, పక్షులు వ్యాపించి ఉండటంతో అది కావాలని ఉత్తమమైన అలంకారాలతో అలంకరించిన స్ర్తిలా ఉంది. ఆ నదిలో అడవి కోతులు, మొసళ్లు, పాములు నివసిస్తున్నాయి.
దేవలోకానికి సంబంధించింది, పాపాలు లేనిది, పాపాలని తొలగించేది, భగీరథుడి తపస్సుతో శంకరుడి జటాజూటం నించి నేలకి చేరినది, సారస, క్రౌంచ పక్షుల అరుపులతో ప్రతిధ్వనించేది, సముద్రుడి భార్యైన ఆ గంగని ఆజానుబాహువైన రాముడు సమీపించాడు.
అలలతో నిండి, సుడులు తిరిగే ఆ నదిని చూసి రాముడు సారథితో చెప్పాడు.
‘ఈ రోజు ఇక్కడే ఉందాం. ఈ నది దగ్గర్లోనే అనేక పూలతో, చిగుళ్లతో నిండిన చాలా పెద్దదైన గార చెట్టు ఉంది. అక్కడ ఆగుదాం. పూజించతగ్గ నీటితో నిండిన, నదీశ్రేష్ఠమైన ఈ గంగానది దేవతలకి, దానవులకి, గంధర్వులకి, మృగాలకి, మనుషులకి, పక్షులకి శుభాన్ని కలిగిస్తుంది. అలాంటి ఈ నదిని చూద్దాం’
లక్ష్మణుడు, సుమంత్రుడు రాముడు చెప్పింది విని రథాన్ని గార వృక్షం వైపు తోలారు. అక్కడికి చేరాక రాముడు, సీత, లక్ష్మణుడు రథాన్ని దిగారు. సుమంత్రుడు కూడా రథం దిగి, గుర్రాలని విప్పి చెట్టు మొదట్లో ఉన్న రాముడి దగ్గర వినయంగా కూర్చున్నాడు. అక్కడ రాముడికి ప్రాణస్నేహితుడు, బోయ జాతికి చెందిన బలవంతుడైన గుహుడు అనే బోయ రాజు ఉన్నాడు. రాముడు తన దేశానికి వచ్చిన సంగతి తెలుసుకోగానే గుహుడు వృద్ధులైన మంత్రులతోను, బంధువులతో కలిసి రాముడి దగ్గరికి వచ్చాడు. నిషాద రాజు వస్తున్నట్లు దూరం నించే చూసిన రాముడు లక్ష్మణునితో కలిసి ఎదురెళ్లాడు. గుహుడు దుఃఖంగా రాముడ్ని కౌగిలించుకుని విచారంగా చెప్పాడు.
‘రామా! నీకు అయోధ్య ఎలాగో ఈ నగరం కూడా అలాగే. నేను ఏం చేయగలనో చెప్పు. నీలాంటి ప్రియమైన అతిథి మరెవరికైనా దొరుకుతాడా?’
అనేక రకాల ఆహార పదార్థాలని, నీటిని వెంటనే తెచ్చి చెప్పాడు.
‘ఓ ఆజానుబాహు! నీకు స్వాగతం. ఈ భూమంతా నీకు చెందిందే. మేము మీ సేవకులం. నువ్వు రాజువి. మా ఈ రాజ్యాన్ని పరిపాలించు. పిండివంటలు, అన్నపానీయాలు, నాకే లేహ్యాలు, మంచి శయ్యలు, నీ గుర్రాల కోసం ఆహారం అన్నీ సిద్ధంగా ఉన్నాయి.’
గుహుడి మాటలు విని రాముడు అతన్ని కౌగలించుకుని చెప్పాడు.
‘నువ్వు కాలి నడకన మాకు ఎదురొచ్చి, స్నేహాన్ని చూపించి మమ్మల్ని అన్నివిధాల పూజించావు. అందుకు సంతోషం. నువ్వు, నీ బంధువులు ఆరోగ్యం, సుఖంగా ఉండగా నా అదృష్టం కొద్దీ నిన్ను చూడగలుగుతున్నాను. నీ దేశానికి, నీ మిత్రులకి, నీ ధనానికి క్షేమమే కదా? నువ్వు నాకు ప్రేమగా ఇచ్చినదంతా నీకే ఇచ్చేస్తున్నాను. ఎవరైనా ఇచ్చింది తీసుకునే స్థితిలో లేను. ఇప్పుడు నేను కుశాలని, నారచీరలని, కృష్ఠాజిన్నాన్ని ధరించిన వాడిని, పళ్లు, దుంపలు తింటూ అడవిలో నివసించే ధర్మ దీక్ష వహించిన మునిని అని తెలుసుకో. గుర్రాలకి ఆహారం తప్ప ఇంకేం కోరను. అది ఇస్తే నువ్వు నన్ను బాగా పూజించినట్లే అవుతుంది. ఈ గుర్రాలు నా తండ్రి దశరథ మహారాజుకి ఇష్టమైనవి. వీటిని బాగా చూసుకుంటే నన్ను పూజించినట్లే అవుతుంది’
గుహుడు అక్కడ ఉన్న మగాళ్లతో ‘గుర్రాలకి ఆహారం, నీళ్లు వెంటనే ఇవ్వండి’ అని ఆజ్ఞాపించాడు. రాముడు నారచీరని ఉత్తరీయంగా ధరించి సాయంసంధ్య వార్చాక స్వయంగా తెచ్చిన నీటిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. భార్యతో కలిసి నేల మీద పడుకున్న ఆ రాముడి పాదాలని కడిగి లక్ష్మణుడు చెట్టు దగ్గరికి వచ్చి నించున్నాడు. ధనస్సు ధరించిన గుహుడు కూడా లక్ష్మణుడు, సుమంత్రులతో మాట్లాడుతూ రాముడి రక్షణ కోసం అప్రమత్తంగా మేలుకుని ఉన్నాడు. బుద్ధిమంతుడు, కీర్తివంతుడైన రాముడు ఎన్నడూ దుఃఖాలని అనుభవించక సుఖాలకే అలవడ్డాడు. ఆ రోజు అలా నేల మీద పడుకున్న రాముడికి రాత్రి చాలా ఆలస్యంగా గడిచింది. (అయోధ్య కాండ సర్గ 50)
వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది. కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి.’
ఆ ఐదు తప్పులని మీరు కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:

గాంధీ రామాయణం మీద రాసిన
పుస్తకం పేరేమిటి?
-రామనామ మహిమ

క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1.అయోధ్యకాండ సర్గ 45, 46 లని హరిదాసు ఆ రోజు చెప్పాడు. కాని సర్గ 44, 45లని చెప్పానని హరిదాసు తప్పుగా చెప్పాడు.
2.మిత్రబృందం, దశరథ మహారాజు బలవంతంగా వెనక్కి పంపబడ్డారు. కాని హరిదాసు తప్పుగా దశరథుడు కూడా రాముడ్ని అనుసరించాడు’ అని చెప్పాడు.
3.‘్భరతుడు వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధుడు. మృదువైన స్వభావం, పరాక్రమం, సద్గుణాలు కలవాడు. అతను మీకు తగిన రాజై మీ సమస్త భయాలని తొలగిస్తాడు’ అని రాముడు ప్రజలతో భరతుడి గురించి చెప్పిన విశేషణాలని హరిదాసు చెప్పలేదు.
4.‘జ్ఞానం చేత, వయసు చేత, తేజస్సు చేత మూడు విధాలుగా వృద్ధులైన బ్రాహ్మణులు’ అని వాల్మీకి వాడిన విశేషణాలని హరిదాసు విస్మరించాడు.
5.‘వాజపేయ యాగం చేయడం వల్ల మాకు లభించిన, శరద్రుతువులోని మబ్బుల్లా తెల్లగా ఉన్న ఆ గొడుగులు మా వెనకే రావడం చూడు. నీడ లేక ఎండతో బాధపడే నీకు మేము మా వాజపేయ యాగం వల్ల లభించిన ఈ తెల్లటి గొడుగులతో నీడని కల్పిస్తాము’ అని రాముడితో వృద్ధ బ్రాహ్మణులు చెప్పిన మాటలని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి