S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 19

చిందరవందరగా చెదిరిన జుట్టు.. పంటి గాట్లు, గోటి గాయాలతో కదుములు కట్టిన శరీరం, పెదవి చివరన గడ్డకట్టిన రక్తం మరక జరిగిందేమిటో చెప్పకనే చెప్తుంటే అద్దం ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూలబడ్డాను.
శరీరానికి తగిలిన గాయం రెండు రోజుల్లో మానవచ్చు. కానీ మనసుకు తగిలిన గాయం ఎలా మానుతుంది? నాకు జరిగిన నమ్మకద్రోహం తలుచుకుని కళ్లలో నుండి నీరు కారుతోంది.
చంద్రం బృందం తనని ఎంత బాగా నమ్మించారో తలుచుకుంటే నాలో కసి పెరుగుతోంది.
వీళ్లకంటే తనను ఓపెన్‌గా గెస్ట్‌హౌస్‌కి రమ్మని పిలిచిన ఆ ముసలి దర్శకుడే నయమనిపించాడు.
ఎదురుగా టేబుల్ పైన బౌల్‌లో పండ్లు పెట్టి ఉన్నాయి. వాటిని కోసుకోవటానికి ఒక కత్తి కూడా ఉంది. ఆ చాకు నా దృష్టిని ఆకర్షిస్తూ తళుక్కున మెరిసింది. దాన్ని చేతిలోకి తీసుకుని అంటుకుని చూశాను. బాగా పదునుగా ఉంది.
‘ఒక్క కోత, ఒకే ఒక్క కోత..’ అనుకుంటూ అరచేతి కింద భాగాన్ని తదేకంగా చూసుకున్నాను.
చాకు తీసి చేతి మీద ఆనించుకోబోతుంటే భళ్లున తలుపు తెరచుకుంది.
‘ఆ చాకు పళ్లు కోసుకోవటానికి. చేతులు కోసుకోవటానికి కాదు...’ అంటూ లోపలకు వచ్చిన ఒక వ్యక్తి వేగంగా నా దగ్గరకు వచ్చి నా చేతి నుండి దాన్ని తీసేసుకున్నాడు.
‘ఎవరు మీరు? నేను ఎక్కడ ఉన్నాను?’ భయం భయంగా అడిగాను.
‘్భయపడే పనిలేదు. అన్ని విషయాలూ తెలుస్తాయి. మీరు ఫ్రెష్ అవండి. బట్టలు మార్చుకో దలచుకుంటే, అవసరమైనవన్నీ అక్కడ ఉన్నాయి...’ గదిలోనే మరోవైపు చూపిస్తూ చెప్పాడు అతను.
హఠాత్తుగా నాకు నా శరీర స్థితి గుర్తుకు వచ్చి సిగ్గు ముంచుకు వచ్చింది. అయితే అది గమనించనట్లు అతను బయటికి వెళ్లిపోయాడు.
‘నేను చాకు చేతిలోకి తీసుకున్న విషయం బయట ఉన్న అతనికి ఎలా తెలిసిందా..’ అనుకుని పైకి చూసిన నాకు అక్కడ సిసి. టీవీ కెమెరా కనిపించింది.
ఇన్ని ఏర్పాట్లతో ఉన్న ఈ భవనం ఎవరిదై ఉంటుందో నాకు అర్థం కాలేదు. ‘నన్ను ఈ స్థితికి దిగజార్చిన వాళ్లదే అయి ఉంటుందా..’ అన్న అనుమానం వచ్చింది. కానీ... వాళ్లయితే ఇంత జాగ్రత్తగా నాకు సేవలు ఎందుకు చేస్తారు?
అయినా అతనెవరో చెప్పినట్లు ముందు ఫ్రెష్ అయితే అన్ని విషయాలూ వాటంతట అవే తెలుస్తాయని భావించిన నేను ఆ పని చెయ్యటానికి అటు నడిచాను.
మరొక గంట తరువాత నా అనుమానాలన్నీ తొలగిస్తూ తలుపు తట్టి లోపలకు వస్తున్న వ్యక్తిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను.
అతను మరెవరో కాదు - నాకు మాల్‌లో ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చిన అశోక్.
‘మీరా?...’ అంటూ ఆశ్చర్యంగా నిలబడ్డాను నేను.
‘ప్లీజ్!.. కూర్చోండి’ అంటూ అతను అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు.
‘ఏమిటిదంతా? నేనిక్కడ ఉండటం ఏమిటి?’
‘నాకు తెలిసినంత వరకూ చెప్తాను...’ అంటూ మొదలుపెట్టాడు అశోక్. ‘మూడు రోజుల క్రితం మిమ్మల్ని కలుసుకోవటానికి మాల్‌కి వెళ్లిన నాకు మీరు కనపడలేదు. ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవటానికి మీ మేనేజర్‌ని అడిగాను. మీకు సినిమా అవకాశం వచ్చిందనీ.. అందుకే సెలవు పెట్టారనీ చెప్పాడు’
‘అసలు మీకేమిటి నా మీద ఇంట్రెస్ట్? నా గురించి మీరు ఎంక్వయిరీ చెయ్యటం ఏమిటి?’ నా కోపాన్ని అతని మీద చూపిస్తూ అన్నాను.
‘చెప్తాను.. అన్ని విషయాలూ వివరిస్తాను. నాకు మొదటి నుండి సినిమా వాళ్లంటే అంత మంచి అభిప్రాయం లేదు. అందుకే మీరు ఎవరో తెలియని వాళ్లతో ట్రయల్ షూట్‌కి వెళ్లి ఇబ్బందులు పడతారేమో అని నా సెక్యూరిటీ మనిషిని మీ రక్షణ కోసం పంపాను...’
‘ననె్నవరూ కలవలేదు. నాకెవరూ కనపడలేదు...’
‘మీకు తెలియకుండా మీ వెన్నంటే ఉన్నాడు. రాత్రి మీరు తడబడుతూ గెస్ట్‌హౌస్ నుండి బయటకు రావటం, తిరిగి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని లోపలకు తీసుకువెళ్లటం చూశాడు...’
‘నా ఫ్రెండ్సా?’
‘ఏం కాదా? గత మూడు రోజులుగా మీ మధ్య స్నేహం బానే డెవలప్ అయిందిగా...’
నేను ఏమీ మాట్లాడలేక పోయాను. ‘నిజంగా స్నేహితుడయితే ఇలా నీచంగా ప్రవర్తిస్తారా?’ అని మాత్రం అనుకున్నాను. అదే సమయంలో, ‘ఈ అశోక్‌కి నా గురించి తెలియని విషయం లేదా..?’ అని కూడా అనిపించింది.
అశోక్ ఇదేమీ పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు. ‘సెక్యూరిటీ అతను అయోమయానికి గురయ్యాడు. అక్కడ ఏమి జరుగుతుందో, తను ఏమి చెయ్యాలో అర్థంకాక నాకు ఫోన్ చేశాడు’
‘సెక్యూరిటీ అతను అక్కడే ఏదోఒకటి చేసి ఉంటే నాకీ దుస్థితి తప్పేదిగా..’
‘అతను ఒక చిన్న ఉద్యోగస్థుడు. మీరు పెద్దపెద్ద వారితో ఉన్నారు. అంత ధైర్యం అతను చెయ్యలేకపోయాడు. నాకు మాత్రం మీ స్నేహితుల మీద అంత సదభిప్రాయం లేదు. అందుకే వెంటనే తెలిసిన పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేశాను. ఆయన అక్కడకు వెళ్లేటప్పటికి మీరు తప్ప అక్కడ ఎవరూ లేరు. మీ పరిస్థితిని చూసిన పోలీసులు నాకు వివరించారు. హాస్పిటల్‌కు పంపవద్దనీ, కేసు రిజిస్టర్ చేయవద్దనీ చెప్పి మిమ్మల్ని ఇక్కడకు రప్పించాను...’
‘అలా ఎందుకు చేశారు? కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది...’
‘ఇప్పుడయినా సమయం మించిపోయింది లేదు. మీకు కావాలంటే అది కూడా ఏర్పాటు చేస్తాను. కానీ ఆ తరువాత మీకు నేను ఏ విధంగానూ సహాయపడలేను. ఎందుకంటే మీకు నా వృత్తి తెలుసనుకుంటాను. రాజకీయాల్లో ఉన్నవారు ఇలాంటి వార్తలకి దూరంగా ఉండాలి. ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రెస్ వాళ్లు ఈ కళంకం నాకు చుట్టినా చుడతారు...’
ఆలోచనలో పడ్డాను. ‘ఏం చెయ్యాలి? కేసు రిజిస్టర్ చెయ్యాలా? వద్దా?’
మళ్లీ అశోకే కల్పించుకున్నాడు. ‘చీకట్లో ఒకసారి జరిగిన అత్యాచారం, మీడియా చేతుల్లో పడితే పట్టపగలు ప్రతిక్షణం జరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచటానికి మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాను..’
ఆలోచిస్తే అతను చేసిందే కరెక్ట్ అనిపిస్తోంది. కానీ ఇతను ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు?
అదే ప్రశ్న అతనే్న అడిగాను.
‘నిజంగా మీకు అర్థంకాక అడుగుతున్నారంటే నాకు నమ్మబుద్ధి కావటంలేదు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణం నుండి మీ ఆకర్షణలో పడిపోయాను. నిజమే! నేను పెళ్లి అయినవాడినే!.. పిల్లలున్నవాడినే! కానీ మీ మీద ఏర్పడిన ఆకర్షణ నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. ఈ విషయం ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవటానికి ఇది సమయం, సందర్భం కాదు. అర్జంటుగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి...’
‘ఏమిటవి?’
‘ఇప్పటివరకు మీరు హాస్టల్‌కు వెళ్లకపోతే అక్కడ వాళ్లందరూ ఆందోళన చెందుతారు కదా! అందుకే నువు హాస్టల్ ఖాళీ చేస్తున్నావనీ, ఇక అక్కడకు రావనీ చెప్పి పంపాను. ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు - ఒక్క జానకి అన్న ఆవిడకు తప్ప. ఆమె నీతో ఏదో మాట్లాడాలని గట్టిగా పట్టుపట్టింది..’
నా కళ్ల వెంట నీళ్లు జలజలా రాలాయి. ‘నేను కూడా జానకితో మాట్లాడాలి...’ అన్నా ను.
‘మరొక పది నిమిషాల్లో ఆమె ఇక్కడ ఉంటుంది..’ లేస్తూ అన్నాడు అశోక్. ‘మీకు ఏది కావాలన్నా బయట మనుషులు ఉన్నారు. అడిగి తెప్పించుకోండి. దయచేసి మీ అంతట మీరు మాత్రం బయటకు వెళ్లకండి. ఒక రాజకీయ నాయకుడిగా నా రెప్యుటేషన్ గురించి అర్థం చేసుకోండి. మీరు వెళ్లిపోవాలనుకుంటే నాతో ఒక్క మాట చెప్తే, ఆ ఏర్పాట్లు నేనే చేస్తాను..’ అంటూ అతను వెళ్లిపోయాడు.
అతను చెప్పినట్లే పది నిమిషాల్లో జానకి వచ్చింది. నన్ను చూడగానే ఏమీ చెప్పకుండానే ఏం జరిగిందో అర్థం చేసుకుంది. దగ్గరకు వచ్చి నన్ను గాఢంగా కౌగిలించుకుంది.
నేను అప్పటివరకూ ఆపుకున్న దుఃఖం పొంగుకు వచ్చింది. ఆపకుండా అరగంటసేపు జానకిని ఆసరా చేసుకుని ఏడుస్తూనే ఉన్నాను.
నన్ను ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు జానకి. చివరకు నేనే తేరుకున్నాను. అప్పుడు అడిగింది తను ఇదంతా ఎలా జరిగిందని.
నాకు గుర్తున్నది చెప్పాను.
‘రియల్లీ అన్‌బిలీవబుల్!... సినిమాల్లో పనిచేసేవారిని రకరకాల ప్రలోభాలతో లొంగదీసుకోవటానికి ప్రయత్నిస్తారని తెలుసు. కానీ.. ఇలా బలవంతం చేయటం అన్నది ఎప్పుడూ వినలేదు. సరే!... జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ ఇల్లు ఎవరిది? ఇక్కడకు ఎలా వచ్చావ్?’ అంది.
అశోక్ గురించి చెప్పాను.
‘ఆయన నీ గురించి ఇంత ఇంటరెస్ట్ ఎందుకు తీసుకుంటున్నాడు?’
‘అది కూడా చెప్పాడు. నా మీద ఆకర్షణతో అంట...’
జానకి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ‘ఏది ఏమయినా ఇప్పుడు నీ జీవితం నాలుగురోడ్ల కూడలిలో ఉంది. ఎటు వెళ్లాలన్నది నిర్ణయించుకోవలసింది నువ్వే!..’
‘అన్ని దారులు ఏమీ లేవు. ఉన్నది ఒకే దారి.. గోదారి’ నిర్వేదంగా అన్నాను.
‘ఎందుకు లేవు? రెండు రోజులు విశ్రాంతి తీసుకుని నువు తిరిగి మీ యూనిట్ దగ్గరకు వెళ్లవచ్చు. సినిమా హీరోయిన్ కావాలన్న నీ చిరకాల వాంఛ నెరవేరుతుంది’
‘్ఛఛీ... మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లటమా?’
‘సినిమాలో వేషం కావాలంటే వెళ్లాలి. లేదంటే మాల్‌లో
జీవితాంతం పని చేసుకుంటూ బ్రతకాలి..’
‘ఆ అరకొర జీవితం ఎన్నాళ్లు?’
‘జీవితాంతం!... ఎందుకంటే అదేమీ మారదు. అలాగే ఉంటుంది. నీలాంటి పరిస్థితుల్లో ఉన్న గంతకు తగ్గ బొంత లాంటి వాడెవడో దొరుకుతాడు. అలాంటి వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవటం మూడో ఆప్షన్. ఫటాఫటా ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టుకు వస్తే జీవితాంతం ఇంతకంటే దిగజారిన జీవితం ఎంచక్కా గడపవచ్చు...’
‘వద్దు..! ఈ సంగతి తెలిసిన ఎవడూ నన్ను పెళ్లి చేసుకోడు. సంగతి దాచిపెట్టి చేసుకోవటం నాకిష్టం ఉండదు’
‘మరయితే అశోక్ కోరుకుంటున్నట్లు ఇక్కడ ఉండటంలో నీకు అభ్యంతరం ఏమిటి?’
‘ఇక్కడా?’
‘అవును. నువు చెప్పిన మాటలనుబట్టి ఆలోచిస్తే అశోక్ నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని పిస్తోంది...’
‘అతనికి అల్రెడీ పెళ్లయిపోయింది’
‘ఆ విషయం అతనేమీ దాయలేదు. అతనికున్న పరపతికీ, ఆర్థిక వనరులకీ నీకు అన్యాయం చేయవలసిన అవసరం అతనికి రాదు’
‘అంటే అతనికి ఉంపుడుకత్తెగా ఉండమంటావా?’
‘నాతో కంపేర్ చేసుకో!.. ఏది బెటర్ ఆప్షనో నీకే తెలుస్తుంది’
ఎంతసేపు ఆలోచించినా నాకు ఏమీ అర్థం కాలేదు. ‘రాయుడి నుండి తప్పించుకోవటానికి పారిపోయి ఇంతదూరం వచ్చాను. మనిషి మారి అశోక్ అయ్యాడు. పరిస్థితి మాత్రం మారలేదు...’ అన్నాను విరక్తిగా.
ఇక చెప్పేదేమీ లేదన్నట్లు భుజాలు ఎగరేసింది జానకి.
* * *
నేను కోలుకోవటానికి చాలానే సమయం పట్టింది. కొన్ని నెలలపాటు ఇంట్లో నుండి బయటకు రాలేదు. ఈ సమయంలో అశోక్, జానకి నన్ను డిప్రెషన్ నుండి బయట పడెయ్యటానికి తమ శాయశక్తులా కృషి చేశారు.
ముఖ్యంగా ఈ విషయంలో అశోక్ ఓపికని మెచ్చుకోవచ్చు. అంతులేని పనుల మధ్య ఎప్పుడూ బిజీగా ఉండే అతను ప్రతిరోజూ తీరిక చేసుకుని ఎంతో కొంత సమయం నాతో గడుపుతూ ధైర్యం చెప్పేవాడు. ఒకసారి అతనే అన్నాడు. ‘నీ సాన్నిహిత్యం నాకు వ్యసనంగా మారుతోంది వసుంధరా!’ అని.
అలా అని అతను నాకు లేనిపోని భ్రమలేమీ కల్పించలేదు. తన కుటుంబం గురించీ, భార్యాపిల్లల గురించీ నా దగ్గర ప్రస్తావిస్తూనే ఉండేవాడు.
నెమ్మది నెమ్మదిగా నాకు అశోక్‌తో సాన్నిహిత్యం పెరిగింది. ఎంత అధికారం ఉన్నా బయటకు ప్రదర్శించని అతని సింప్లిసిటీ, ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న అతని తపన నాకు నచ్చాయి.
‘నేను ఈ రాజకీయాల్లో కాకుండా మరే రంగంలో ఉన్నా నిన్ను కూడా పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఇప్పుడు ఆ పని చేస్తే నా రాజకీయ జీవితానికి తెరపడినట్లే..!’ అన్నాడు అశోక్ ఒకరోజు మాటల మధ్య.
‘అక్కర్లేదు. నువు చేసుకునే రెండో పెళ్లికి చట్టం దృష్టిలో విలువలేదు. నైతికంగా సరికాదు. విన్న ఎవరూ హర్షించరు. అలాంటప్పుడు ఆ పెళ్లి ఎవరి తృప్తి కోసం?.. నాకు మీ మీద నమ్మకం ఉంది. నమ్మకాన్ని మించిన బంధం ఇంకేమి ఉంటుంది?’ అన్నాను.
అలా మేమిద్దరం ఒకటయ్యాం.
నన్ను అశోక్ వేరే ఇంటికి మార్చాడు. నేనా ఇంటికి వచ్చాక బయటకు వెళ్లింది చాలా తక్కువ. అది అశోక్‌కి ఉన్న అనేక ఇళ్లలో ఒకటి.
ప్రస్తుతం నేను అశోక్ ప్రేమ ఆసరాతో జీవిస్తున్నాను. అతను తప్ప నాకు మరో లోకం లేదు. నా పాత జీవితాన్ని మరిచిపోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంకా నాకు నా పాత జీవితంతో లంకె ఉందంటే అది జానకి ఒక్కత్తె.
నేను ఎంత మరచిపోదామని ప్రయత్నించినా అంతశే్చతన ఆ జ్ఞాపకాలను మరువనివ్వటంలేదు. ఆ జ్ఞాపకాల పీడకలలతో.. అర్ధరాత్రి నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుని.. వణుకుతూ, ఒంటరిగా రాత్రంతా నిద్ర లేకుండా గడపవలసి వస్తుందని నేను ఎవరికీ చెప్పలేదు.
ఒకరోజు నా దగ్గరకు వస్తూ అశోక్ విలువయిన నగల సెట్ ఒకటి తీసుకువచ్చాడు. ‘ఎలా ఉంది?’ దాన్ని నాకు చూపిస్తూ అడిగాడు.
‘అది ఎవరికో చెప్తే ఎలా ఉందో చెప్తాను..’ అన్నాను.
‘నీకే!..’
‘నాకయితే బాగోదు...’ అని విచిత్రంగా నా వైపు చూస్తున్న అతనితో చెప్పాను. ‘మీకు అంతకు ముందు కూడా చెప్పాను. ఇంత విలువయిన బహుమతులు నాకు నచ్చవని...’
‘నువు ఆ మాట చెప్పినపుడు నేను నీకు ఏమీ కాను’
‘ఆమాటకొస్తే ఇప్పుడూ నేను మీకు ఏమీ కాను’
‘దయచేసి అలా మాట్లాడవద్దు వసూ! పెళ్లి చేసుకోనంత మాత్రాన నీకు లోటు చేస్తాననుకోకు. అలా ఎప్పటికీ జరగదు. పోనీ, ఇది నచ్చకపోతే ఏమి కావాలో అడుగు’
‘నేను ఏది అడిగినా ఇస్తారా?’

మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002