S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేలుకు మేలు

రామంపల్లి నీటి సదుపాయం లేని ఒక మెట్ట పొలాలున్న గ్రామం. రైతులంతా వర్షాధార పంటలు వేసుకుని ఎలాగో బతుకులు వెళ్లదీస్తున్నారు. అంతా పేదవారే. ఆ ఊరికి సమీపంలో ఒక చిట్టడవి ఉంది. రామంపల్లి పొలాలన్నీ చిట్టడవి చుట్టూ ఉన్నాయి. రైతులంతా మధ్యాహ్న భోజన సమయంలో ఆ చిట్టడవి మధ్యలోంచీ పారుతున్న వాహినీ నది పాయలో కాళ్లూ చేతులూ కడుక్కుని భోజనం ముగించుకుని మంచీ చెడూ మాట్లాడుకుని ఒక్క అర ఘడియ కాలం గడిపి తిరిగి పనుల్లోకి వెళ్లేవారు. ఒకరోజున సునందయ్య అనే రైతు కాళ్లు కడుక్కుంటుండగా దూరం నుంచీ ఒక చిన్న పక్షి కొట్టుకు రావడం చూశాడు. అది ప్రాణభయంతో రెక్కలు అల్లాడిస్తూ ఉంది. వెంటనే లోపలికి దిగి దాన్ని చేతుల్లోకి తీసుకుని ఒడ్డుకు తెచ్చి దాని రెక్కలు, ఒళ్లూ తన కండువాతో తుడిచి, ఒళ్లో పెట్టుకుని బుజ్జగించాడు. తన భోజనంలోంచీ కొంత తీసి దానికి తినిపించాడు. అది మెల్లిగా తన ముక్కుతో అందుకుని తిని కొంతసేపయ్యాక ఎగిరి వెళ్లిపోయింది. అంతా సునందయ్య పనిని వింతగా చూశారు.
ఆ మరునాడు ఆ బంగారు రంగు పక్షి ఎగురుకుంటూ వచ్చి వారు భోజనం చేస్తూండగా అక్కడ చేరి అరవసాగింది. దాని అరుపు చాలా కమ్మగా ఉండటాన అంతా అటు చూశారు. సునందయ్య ఆశ్చర్యంగా దానికేసి చూశాడు. నిన్న తాను నది నీళ్లలోంచీ తీసి బయటికి తెచ్చిన పక్షే అది అని గుర్తించాడు. అది తన సమీపంలో ఉండటాన తన భోజన పాత్రలోంచీ ఒక చిన్న ముద్ద తీసి అక్కడున్న ఒక ఎండుటాకులో పెట్టాడు. ఆ బంగారురంగు పిట్ట సునందయ్య చెంత ఒక విత్తనాన్ని వదిలింది. దాన్ని అతడు తన పంచె చెంగులో భద్రపరిచాడు. భయం లేకుండా వచ్చి ఆ ముద్ద కొంచెం కొంచెంగా ముక్కుతో పొడుచుకుని తింది. నదిలో నీళ్లు తాగి వెళ్లిపోయింది.
* * *
వర్షం పడగానే రైతులు నేల చదును చేసుకుని తమ కూరగాయల తోటల్లో విత్తనాలు నాటారు. ఆ బంగారు పిట్ట ఇచ్చిన విత్తును జాగ్రత్తగా దాచిన సునందయ్య దాన్ని కూడా తన కూరల తోటలో నాటాడు. మరునాటికే అది మొక్కగా మొలిచింది. ఆ మరునాటికి పెద్దమొక్కగా పెరిగింది. మూడో నాటికి మొగ్గలు తొడిగింది. నాల్గోనాటికి మొగ్గ విచ్చింది. ఐదో రోజుకు పిందెలేసింది. ఆరో రోజుకు కాయలు వచ్చాయి. ఏడో రోజుకు పండ్లు అయ్యాయి. సునందయ్య ఆశ్చర్యంగా బంగారు రంగులో మెరుస్తున్న ఆ పండు ఒకటి కోసి చూశాడు. దానినిండా బంగారు రంగు ముత్యాలు మెరిసిపోతున్నాయి. వాటినన్నింటినీ తీసుకెళ్లి పక్కనే ఉన్న నగరంలో నగల వ్యాపారికి అమ్మాడు. చాలా ధనం వచ్చింది. దాంతో సునందయ్య ఆ ఊరి చెరువు పూడిక తీయించి, నీటి ప్రవాహ వాటం చూసుకుని మరో కొత్త చెరువు తవ్వించాడు. ఊరి ప్రజలకు కావల్సినంత సహాయం చేశాడు. సునందయ్య చేసిన సాయానికి అంతా సంతోషించి పొగిడారు. అతడు ‘తన ప్రాణం కాపాడినందుకు ఆ చిన్న పిట్ట నాకు ఒక విత్తును బహూకరించింది. దానివల్లే ఇంత సంపద నాకు ఒనగూడింది. దాని వద్ద నేను ఉపకారం చేయడం ఎలాగో నేర్చుకోవాలి కదా! మీరంతా అంగీకరిస్తే మనకు సాయం చేసిన ఆ పిట్ట పేరు మన ఊరికి పెట్టుకుందాం. ‘బంగరు పాళ్య’ అని అన్నాడు సునందయ్య. అంతా అంగీకారంగా చప్పట్లు చరిచారు.
నీతి: సహాయం పొందడమేకాక చేయడమూ నేర్చుకున్నవాడే మనిషి.

-హైమా శ్రీనివాస్