S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సముద్రంలో మునిగిపోతున్న కిరిబాటి దీవులు

‘కిరిబాటి’ మధ్య పసిఫిక్ సముద్రంలోని కామనె్వల్త్ దేశాలలో ఒక స్వతంత్ర దేశం. స్థానికులు దీనిని ‘కీ-రీ-బాస్’ అని పిలుచుకుంటారు. ఇది హవాయికి నైరుతి దిశలో నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మైక్రోనేషియా అని పిలిచే పసిఫిక్ దీవులలో ఇది అంతర్భాగం. ముప్ఫైమూడు పగడపు దీవుల సమూహంగా ఉండే ఈ దీవులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి గిల్బర్ట్, ఫోనిక్స్, లైన్ దీవులు
కిరిబాటి దేశంలోని దీవులన్నీ వలయకారంలో ఉంటాయి. ప్రతి దీవి మధ్యలో పెద్ద నీటి మడుగులుంటాయి. గిల్బర్ట్ దీవులలోని ‘బనడా’ దీవి మాత్రం పెద్ద సున్నపురాతి దిబ్బ. కిరిబాటిలోని ముప్పైమూడు దీవులలో ఇరవై ఒక్క దీవులు నివాసయోగ్యమైనవి. ఎక్కువ జనాభా గిల్బర్ట్, ఫోనిక్స్ , కాంటన్ దీవుల్లో ఉంటుంది. లైన్ దీవులలో మూడు ప్రాంతాల్లో కూడా కొందరు నివశిస్తారు. కిరిబాటి రాజధాని టరావా. ఇది గిల్బర్ట్ దీవులలో ఒకటి. ఈ దీవిలోని ‘బైరికి’ ప్రాంతంనుండి మొత్తం పరిపాలన కార్యక్రమాలు కొనసాగుతాయి.
సముద్రం ఒడిలో ఉందా అన్నట్లుండే కిరిబాటి దీవులు ప్రకృతి అందాలతో భూతల స్వర్గానే్న తలపిస్తాయి. కిరిబాటి మొత్తం భూభాగం 811 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. లైన్ దీవులలో కిరిటిమటి దీవి ఉంది. దీనిని క్రిస్మస్ దీవి అని కూడా పిలుస్తారు. దీని వైశాల్యం 609 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో అతి పెద్ద భూభాగం ఉన్న దీవి ఇదే. కిరిబాటి దీవులు సముద్ర మట్టానికి సగటున రెండు మీటర్ల ఎత్తులోపు మాత్రమే ఉన్నాయి. కిరిబాటి చుట్టు సముద్రంలో మూడు మిలియన్లు చదరపు కిలోమీటర్ల మేర ఆ దేశ ఆర్థిక సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఈ పరిధిలో చేపల వేట ఇతర కార్యకలాపాల హక్కులన్నీ ఆ దేశానివే.
ప్రకృతి అందాలతో విలసిల్లే కిరిబాటి దీవులకు పర్యావరణపరమైన ముప్పు పొంచి ఉంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా భూ ఉపరితల ఉష్ణోగ్రత నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాలలోని మంచు ఖండాలు కరుగుతూ సముద్ర మట్టం పెరుగుతుండడంవల్ల ఈ దీవులు రాబోయే అరవై సంవత్సరాల్లో పూర్తిగా నీట మునిగిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు, ముఖ్యంగా ఆ దేశ వాసులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా కిరిబాటిలో ప్రధాన దీవియైన ‘టరావా’ త్వరలోనే సముద్రంలో ముంపునకు గురి కాబోతోంది. పురాణాల్లో చెప్పబడిన ద్వారక, అట్లాంటిస్‌లలాగే కిరిబాటి కూడ భవిష్యత్తులో సముద్రంలో మునిగిపోయిన ప్రాంతంగా మిగిలిపోనున్నది. సముద్రమట్టం నానాటికీ పెరుగుతుండడం వల్ల రానున్న ముప్ఫై-అరవై సంవత్సరాల్లో జలమయమైపోయి తమ దీవులు పూర్తిగా నివాసయోగ్యంగా కానివిగా తయారవుతాయని ఆ దేశ అధ్యక్షుడు అనోత్ తాంగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అక్కడున్న మంచినీటి వనరుల కాలుష్యం కూడ రోజురోజుకి పెరుగుతోంది.ముఖ్యంగా భూగర్భ జలాలు విపరీతంగా కలుషితం అవుతున్నాయి. ‘ఇప్పటికే ఒక దీవి సముద్రంలో మునిగిపోయింది. సముద్ర మట్టం పెరుగుతుండడం వల్ల ఎన్నో దీవులలో మంచినీటి వనరులలోకి ఉప్పునీరు చొచ్చుకు వచ్చి వాటిని కలుషితం చేస్తున్నాయి. దీని ప్రభావం వ్యవసాయ భూములపై కూడా ఉంటోంది. మా దీవులన్నీ ఒకటొకటిగా సముద్రంలో మునిగిపోవడం రాబోయే రోజుల్లో మేం చూడబోయే వాస్తవం అని అనోత్ తాంగ్ అన్నారు.
‘సైమన్ డోనార్’ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో వాతావరణ శాస్తవ్రేత్త. అతడు 2005 నుంచి దక్షిణ ‘టరావా’ను సందర్శిస్తున్నాడు. కిరిబాటికి రానున్న కాలంలో పొంచి ఉన్న ముంపు ప్రమాదాన్ని గురించి అతడు హెచ్చరించాడు కూడా. ‘వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు

కిరిబాటికి భవిష్యత్తులో పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టనున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు’ అని అతడు అన్నాడు.
ప్రతి ఏటా భూగోళంపై సముద్ర మట్టం ఒకటినుండి రెండు మిల్లీమీటర్లు పెరుగుతుండగా కిరిబాటి వద్ద మాత్రం 2.9 మిల్లీమీటర్ల వరకు పెరుగుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. కిరిబాటి ప్రభుత్వం కూడ అక్కడి ప్రజలకు రాబోయే రోజుల్లో ఆహార, వసతి సౌకర్యాలు కల్పించే మెరుగైన అవకాశాల కోసం చూస్తోంది.
మరోపక్క పర్యావరణ ముప్పువల్ల ఎదురయ్యే సమస్యలను తాళలేక వివిధ ప్రాంతాలనుండి తరలివస్తున్న వారికి పునరావాసం కల్పించే వత్తిడి కూడ పాశ్చాత్య దేశాలపై పెరుగుతోంది. ఇప్పటికే పొరుగు దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కిరిబాటినుండి వలస వచ్చే వారి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే భూగోళం వేడెక్కడంలో కిరిబాటి లాంటి దేశాల బాధ్యత 0.1 శాతం కనన్నా తక్కువే.
కిరిబాటి 19770లో బ్రిటిష్ వారినుండి స్వతంత్రమైంది. అప్పటినుంచి అక్కడ జనాభా పెరుగుదల ఎక్కువవుతోంది. కిరిబాటి జనాభా లక్షా పదివేల మంది. ఇందులో సగం మందికి పైగా దక్షిణ టరావాలోనే ఉంటున్నారు. ఇక్కడ వ్యవసాయానికి అనువైన భూములు తక్కువ. సముద్రమట్టం పెరగడం ఒక్కటే కిరిబాటి సమస్య కాదు. దానివల్ల వెంటనే వచ్చే ముప్పులేదు. వేగంగా పెరిగే జనాభా వారికి తక్షణ సమస్య అవుతోంది. దక్షిణ టరావాలో ఒక చదరపు మీటరుకు మూడు వేల మంది నివసిస్తున్నారు. 2030నాటికి ఈ సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అంచనా. జనన రేటు, అంతర్గత వలసలు తగ్గితే తప్ప ఈ పెరుగుదలను నివారించలేమని అక్కడివారు భావిస్తున్నారు.
ప్రస్తుతం కిరిబాటిలో జనాభా వృద్ధి రేటు 6 శాతం ఉందని, జనాభా పెరుగుదల వల్ల వ్యాధులు ప్రబలి శిశు మరణాలు ఎక్కువ అవుతున్నాయని ఆ దేశం వైద్య సేవల డైరక్టర్ బ్వాబ్వా ఓటెన్ అన్నారు. ఈ దేశంలో సంప్రదాయక ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. ప్రపంచంలో యుక్త వయసులో గర్భవతులయ్యే వారి సంఖ్య ఈ దేశంలోనే ఎక్కువ. ఈ జనాభా పెరుగుదల ఎంత ఎక్కువగా ఉందంటే పురుడు పోయించుకోవడానికి వచ్చే గర్భవతులను ఆసుపత్రుల్లో చోటులేక బయట వరండాలలోనే ఉంచాల్సి వస్తోంది. ‘ఒక్కోసారి పుట్టిన పిల్లలకి స్నానం చేయించడానికి తగినన్ని నీళ్లు కూడా దొరకవు’ అని రీనా తాబి అంది. ఆమె అక్కడ మెటర్నరీ వార్డులో నర్సు.
కిరిబాటి ప్రజల సామాజిక జీవనంలో అక్కడి చర్చి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడి జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ఆ దేశ అధ్యక్షుడు అనోత్ తాంగ్ చర్చి సహాయాన్ని కోరారు కూడా.
కిరిబాటి దీవుల తీరాలలో ఎక్కువగా ఈత చెట్లతో నిర్మించిన గుడిసెలు కనిపిస్తాయి. వీటి పైభాగం రేగు ఆకులతో కప్పబడి ఉంటాయి. దీవులలో మట్టి రోడ్లే కనిపిస్తాయి. ఈ దీవులలో చాలా చోట్ల పందులు, కోళ్ల ఫారాలు, శ్మశాన వాటికలతోపాటు రెండవ ప్రపంచ యుద్ధ విధ్వంస అవశేషాలు కూడా ఉన్నాయి. ఆహార, ఆర్థిక వనరుల కొరత కూడా కిరిబాటి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. ఈ విషయంలో ఆ దేశం ఫిజీతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
టరావాకి ఉత్తరంగా ఉన్న చిన్న ద్వీపం అబైయాంగ్. ఇక్కడి జనాభా పదివేలకన్నా తక్కువే. సముద్ర అలల తాకిడికి ఇది చాలావరకు కోతకు గురైంది. ఇలా ఒకటొకటిగా దీవులు కనుమరుగవుతుండడంతో దీర్ఘకాలిక వ్యవసాయంపై ఆధారపడడం వారికి పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇప్పటికే ఇక్కడ కొబ్బరి చెట్లనుండి వచ్చే దిగుబడి తగ్గిపోయింది. వాతావరణంలో మార్పుల వల్ల భూసారం తగ్గిపోతోంది అని అబైయాంగ్ కౌన్సిల్ వైస్ మేయర్ అనటా మేరోయేటా అన్నారు. ఆహార భద్రత సంగతి ఎలా ఉన్నా తమ భద్రత విషయంలో కూడా దక్షిణ టరావా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. సముద్ర అలల తాకిడికి గురి కాకుండా తమ ద్వీపం చుట్టు చాలామేరకు కోటలా రాతి గోడను నిర్మించుకున్నారు. ఇందుకు కావాల్సిన రాళ్లను తమ దీవిలో గల గుట్టలను తవ్వి తీసారు. ఇలా చేయడడంవల్ల తీరం వెంబడి నిర్మించిన గోడ పటిష్టంగా ఉన్నా లోపల వున్న భూమి యొక్క గట్టిదనం దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలికంగా చాలా హానికరమైనది.
‘దీనిని తీరప్రాంత సమస్యగా కన్నా, ఒక సివిల్ ఇంజనీరింగ్ సమస్యగానే చూడాలి. తీరాన్ని తాకే సముద్ర కెరటాలు గోడలకు తగిలి వెనక్కి వెళ్లిపోయినా ఒరుసుకుపోయి బలహీనంగా ఉన్న ప్రాంతాలను అవి దెబ్బ తీస్తాయి. ఈ దీవిలో నీరు, విద్యుత్ సరఫరా కోసం, టెలిఫోన్ సౌకర్యాల కోసం అండర్ గ్రౌండ్ పైపులున్నాయి. ఇతర దీవులకు కూడ అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. బలమైన అలల తాకిడివల్ల ఇవి కూడ దెబ్బతినే అవకాశం ఉంది’ అని క్లిఫ్ జులెరాట్ అంటారు. ఆయన కిరిబాటి పబ్లిక్ వర్క్స్ అండ్ యుటిలిటీస్ మంత్రిత్వ శాఖలో తీరప్రాంత ఇంజనీరుగా పనిచేస్తున్నారు. భూ ఉపరితల వాతావరణం వేడెక్కడంవల్ల సంభవించే ఉపద్రవంవల్ల ప్రజలు వలసవెళ్లే పరిస్థితి మొదటిసారిగా ఇక్కడే జరగవచ్చు. రానున్న ఉపద్రవాన్ని దృష్టిలో ఉంచుకుని కిరిబాటి అధ్యక్షుడు అనోత్ తాంగం తరచు ఫిజీ దేశాన్ని సందర్శిస్తున్నారు తమ ప్రజలను తరలించడానికి అనువైన స్థలం కోసం. ఫిజీ దేశస్తులకు కిరిబాటి ప్రజలను తమలో కలిపేసుకోవడం ఇష్టంలేదు. అందువల్ల కిరిబాటి ప్రభుత్వం 9.6 మిలియన్ డాలర్లు వెచ్చించి ఫిజీలో ఆరువేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గతంలో దక్షిణ మధ్య ఆఫ్రికాలోని జింబాబ్వే దేశ అధ్యక్షుడు కిరిబాటి ప్రజలకు కొంత భూమిని కేటాయిస్తానన్నాడు. కానీ ఆ తరువాత అతడు మరణించడంతో మరెవరూ ఆ విషయాన్ని కదపలేదు. వైశాల్యపరంగా గానీ, జనాభా రీత్యా గానీ ప్రకృతి వనరుల పరంగా కాని కిరిబాటి చాలా చిన్నదేశం. ఈ దేశం గురించి అక్కడి దీవుల గురించి ప్రపంచంలో ఎవరికీ తెలిసి ఉండేది కాదేమో. కానీ భూ ఉపరితల వాతావరణం వేడెక్కుతుండడంవల్ల సముద్ర మట్టం పెరుగుతుండడంతో భవిష్యత్తులో కిరిబాటి దీవులన్నీ నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ దీవులు ప్రపంచ దేశాల దృష్టిలోకి వచ్చాయి.

-దుగ్గిరాల రాజకిశోర్ 8008264690