S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ది హిచ్ హైకర్

అమెరికాలోని హైవే పక్కన నిలబడి థంప్స్ అప్ సైన్‌ని చూపించిన ఓ మధ్య వయస్కుడిని చూసి ఓ కారు ఆగింది. అతను ఎక్కాక ఆ కారు బయల్దేరింది. రివాల్వర్‌ని చూపించి అతను ఆ కారుని రోడ్డు పక్కన ఆపించి దిగాడు. రివాల్వర్ పేలగానే డ్రైవర్ కెవ్వున కేక వేసింది. ఆమె హేండ్‌బేగ్ తీసుకుని అతను వెళ్లిపోయాడు. ఇది పేపర్లో వార్తగా వచ్చింది. రెండు రోజుల తర్వాత అలాంటి మరో సంఘటన తాలూకు వార్త కూడా వచ్చింది.
* * *
అదే హైవేలో కారు డ్రైవ్ చేసే రాయ్‌తో అతని మిత్రుడు గిల్బర్ట్ చెప్పాడు.
‘వచ్చే చౌరస్తాలో ఎడమవైపు తిప్పు’
‘కాదు. కుడివైపు తిప్పుతాను. క్రితంసారి ఆ చెరువు దగ్గర వర్షం పడి మనం చేపలు పట్టలేక పోయాం’ రాయ్ చెప్పాడు.
వారి కారు కొంతదూరం వెళ్లాక చీకటి పడింది. థంప్స్ అప్ సైన్‌ని చూపించిన ఓ వ్యక్తిని చూసి రాయ్ కారాపాడు.
‘ఎక్కడికి?’ గిల్బర్ట్ అడిగాడు.
జవాబు చెప్పకుండా అతను వెనక సీట్లోకి ఎక్కి కూర్చున్నాడు. అతను జేబులోంచి రివాల్వర్ తీసి రాయ్‌కి గురి పెట్టి చెప్పాడు.
‘కారుని వేగంగా నడపక. నా పేరు ఎమిట్. నాతో పిచ్చివేషాలు వేసిన ఇద్దరు ఇప్పటికే హతులయ్యారు. నేను చెప్పినట్లు వింటే మీకేం కాదు. నువ్వు రోడ్డు మీంచి చూపు తిప్పకు.. నువ్వు కుడిచేతిని కిటికీ మీద, ఎడమ చేతిని డ్రైవర్ సీట్ మీద ఉంచు’
పక్కన కూర్చున్న గిల్బర్ట్ అతను చెప్పినట్లు చేశాక చెప్పాడు.
‘వచ్చే చౌరస్తాలో ఎడమవైపు మట్టి రోడ్డులోకి తిప్పు’
కాసేపటికి కారు అందులోకి తిరిగాక అతను చెప్పాడు.
‘ఆపు. గ్లవ్ కంపార్ట్‌మెంట్ తలుపు తెరు’
అతను టార్చిలైట్ వేసి చూసి అందులోని రైఫిల్ గుళ్ల పెట్టెని తీసుకుని దాన్ని మూశాడు.
‘కిందికి దిగినప్పుడల్లా ఇదీ పద్దతి. కారు తాళం చెవులు ముందు నాకు ఇవ్వాలి. నేను దిగాక ఇద్దరూ కారుకి కుడి వైపే దిగాలి. నువ్వు కారుకి దూరంగా నిలబడ్డాక, డ్రైవర్ దిగాలి.. ఇంకో హత్య చేస్తే నాకు ఎక్కువ శిక్ష పడదు’ గిల్బర్ట్‌తో చెప్పాడు.
ఆ ప్రకారం అంతా దిగాక వెనక నించి వారి జేబులని తనిఖీ చేసి, ఒకరి జేబులోని పర్స్‌ని తీసుకున్నాడు. తర్వాత తాళం చెవి ఇచ్చి వాళ్ల చేత డిక్కీ తలుపు తెరిపించాడు.
‘బ్లాంకెట్ బయటకి తీయండి’
తీయగానే వాటి కింద కనపడ్డ రైఫిల్‌ని చూసి చెప్పాడు.
‘తుపాకీని ముట్టుకోవద్దు’
డిక్కీ తలుపు మూసి బ్లాంకెట్స్, రైఫిల్‌ని అతను అందుకున్నాక అంతా కారెక్కారు. మళ్లీ కారు బయలుదేరాక వాళ్ల పేర్లు అడిగి తెలుసుకున్నాడు. గిల్బర్ట్, రాయ్ ఇద్దరూ కారు మెకానిక్స్ అనీ, మిత్రులని, చేపలు పట్టడానికి వెళ్తున్నారని కూడా తెలుసుకున్నాడు. వారి కారు కాలిఫోర్నియా, మెక్సికో మధ్యగల కొండల్లోని రహదారి మీద సాగింది.
* * *
ఎమిట్ మర్నాడు ఉదయం రాయ్‌తో చెప్పాడు.
‘పెట్రోల్ బంక్ కనపడగానే ఆపు. పెట్రోల్ పోయించుకుని మేప్ కొనుక్కుని వెళ్దాం’
పాతిక మైళ్ల దూరంలోని పెట్రోల్ బంక్‌లో కారు ఆపాక పెట్రోల్ పోయించి, మేప్‌ని తీసుకున్నారు.
‘కారు పోనీ. చిల్లర అవసరం లేదు’ వెనక సీట్లోంచి ఎమిట్ ఆజ్ఞాపించగానే రాయ్ కారుని ముందుకి పోనించాడు.
కేస్‌లోని బీర్‌ని తాగాక మేప్ చూసి తర్వాత పక్క రోడ్డులోకి కారుని తిప్పి ఆపమని చెప్పాడు. క్రితం రాత్రిలానే అతను తాళం చెవి తీసుకుని ముందు దిగాక, మిత్రులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు దిగారు. మేప్‌ని కారు బానెట్ మీద పరిపించి ఎమిట్ అడిగాడు.
‘శాంటా మోనికా ఎంతదూరం?’
‘ఐదు వందల మైళ్లు’
‘మధ్యలో ఫెర్రీ దాటాలా?’
‘అవును. శుక్రవారం తర్వాత ఫెర్రీ ఉంది’ గిల్బర్ట్ మేప్ చూసి చెప్పాడు.
‘ఈ రైఫిల్ ఎవరిది?’ అడిగాడు.
‘నాది’ రాయ్ చెప్పాడు.
‘గిల్బర్ట్! దీన్ని తీసుకెళ్లి అక్కడ రాయి మీద పెట్టు’ ఎమిట్ ఖాళీ బీర్ కేన్‌ని ఇచ్చి ఆజ్ఞాపించాడు.
అతను దూరంగా తీసుకువెళ్లి పెట్టీ పెట్టగానే ఎమిట్ చేతిలోని రివాల్వర్ పేలింది. గుండు తగిలి ఆ కేన్ దూరంగా వెళ్లి పడింది. రివాల్వర్‌ని రాయ్‌కి గురిపెట్టి రైఫిల్‌ని ఇచ్చి చెప్పాడు.
‘ఇప్పుడు నువ్వు ప్రయత్నించు’
రాయ్ గురి చూసి ట్రిగ్గర్ నొక్కగానే ఆ కేన్ ఎగిరి దూరంగా పడింది.
‘గిల్బర్ట్! కేన్‌ని తీసుకో’ ఎమిట్ అరిచాడు.
తీసుకున్నాక చెప్పాడు.
‘కుడి చేతిని పక్కకి చాపి పట్టుకో. రాయ్ దాన్ని పడగొడతాడు. అతనికి గురి చూసి కాల్చడం బాగా వచ్చు’
‘నీకు పిచ్చెక్కిందా? గుండు నా మిత్రుడికి తగలొచ్చు’ రాయ్ అభ్యంతరం చెప్పాడు.
‘లేదా నా గుండు తింటావు... గిల్బర్ట్! దాన్ని నీ తలకి దగ్గరగా ఉంచుకో. రాయ్! ఇప్పుడు కాల్చు’
రాయ్ జాగ్రత్తగా గురిపెట్టి ట్రిగర్ నొక్కగానే గిల్బర్ట్ చేతిలోని కేన్ కింద పడిపోయింది.
మళ్లీ కారు బయలుదేరింది.
‘రేడియో ఆన్ చెయ్యి. అమెరికా న్యూస్ ఛానెల్ పెట్టు’ కొద్ది దూరం వెళ్లాక ఎమిట్ కోరాడు.
కొద్దిసేపటికి వినిపించింది.
‘కొలరేడో పోలీసులు హంతకుడు ఎమిట్ కోసం వెదుకుతున్నారు. అతను కేలిఫోర్నియాలోకి ప్రవేశించాడని అనుమానపడుతున్నారు. ఇప్పటికే మిరియం, విలియం జాన్సన్‌లని చంపింది ఎమిట్ అని అనుమానిస్తున్నారు. నల్ల జాకెట్, బ్రౌన్‌రంగు పేంట్, తెల్ల షర్ట్ ధరించి ఉన్నాడని తెలుస్తోంది. ఇతని గురించిన సమాచారం తెలిస్తే పోలీసులకి తెలియజేయండి’
‘నేను మీ కారులో ఉన్నానని పోలీసులకి తెలిసేదాకా నాకు ఎలాంటి భయంలేదు’ ఎమిట్ నవ్వుతూ చెప్పాడు.
* * *
‘తాళంచెవులు’ చీకటి పడ్డాక కారు ఆపించి ఎమిట్ అడిగాడు.
వాటిని తీసుకున్నాక దిగాడు. తర్వాత ముందు గిల్బర్ట్, వెనక రాయ్ దిగారు. దుప్పట్లు తీసి, తనొకటి తీసుకుని మిగిలినవి వాళ్లకి ఇచ్చాడు.
‘పారిపోయే ప్రయత్నం చేస్తే వెంటనే చస్తారు. లేదా తర్వాత. మీరు చావడం మాత్రం ఖాయం’ ఎమిట్ వాళ్లని హెచ్చరించాడు.
ఆ రాత్రి ముగ్గురూ దూరం దూరంగా పడుకున్నారు. ముప్పై ఆరు గంటలుగా నిద్ర లేకపోవడంతో మిత్రులిద్దరూ అలసటతో నిద్రపోయారు.
* * *
మర్నాడు కారు ఓ చిన్న గ్రామంలో చిన్న షాప్ ముందు ఆగాక ఎమిట్ చెప్పాడు.
‘మెక్సికన్‌లో కాక ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అవసరమైన ఆహార పదార్థాలు, పానీయాలు కొనాలి. కోటు జేబులోని నా రివాల్వర్ ఏ క్షణంలోనైనా పేలచ్చని గుర్తుంచుకోండి’
ఆ ప్రకారం పని ముగించుకుని కారెక్కారు. కారు మళ్లీ బయలుదేరి కొండల మధ్య శాంటా మోనికా వైపు సాగింది. చేతిలో రివాల్వర్‌తో ఎమిట్ అప్రమత్తంగా కూర్చోవటం వాళ్లు గమనించారు. చీకటి పడేదాకా కారు ప్రయాణిస్తూనే ఉంది. ఆ రాత్రి మళ్ళీ ఓ చోట కారాపి కేంప్ చేశారు. రాయ్ గిల్బర్ట్‌కి రహస్యంగా చెప్పాడు.
‘కారు రేడియో పాడు చెయ్. పోలీసులకి ఎమిట్ గురించి ఎంత తెలిసిందో ఇతనికి తెలియకపోవడం ఉత్తమం. మనతో అవసరం ఉన్నంత దాకానే మనల్ని చంపడు. అది మనం ఊహించగానే ఎదురు తిరగాలి. ఇవాళో రేపో?’
రేడియో విని కిందకి దిగి వచ్చి ఎమిట్ అడిగాడు.
‘నా గురించి పోలీసులకి తెలిసింది. చాక్లెట్ మమ్స్ ఎక్కడుంది? మెక్సికో లోనేనా?’
‘కాదు. ఆరిజోనాలో’ గిల్బర్ట్ చెప్పాడు.
‘మీ భార్యలకి మీరు అక్కడికి చేపలు పట్టటానికి వెళ్తున్నారని చెప్పారా? నేను మీ కార్లో ఉన్నానని తెలిసిపోయింది’
ఆ రాత్రి కూడా అలసటతో నిద్రపోయారు. మర్నాడు ఉదయం పదిన్నరకి వెనక సీట్లోంచి ఎమిట్ ఆజ్ఞాపించాడు.
‘రేడియో ఆన్ చేయండి’
కానీ రేడియో పని చేయలేదు.
‘ఏం చేసారు?’ ఎమిట్ అసహనంగా అరిచాడు.
‘రేడియో వేవ్స్ కొండల్లోకి రాక పని చేయడం లేదు అనుకుంటాను’ రాయ్ చెప్పాడు.
అప్పటికే అమెరికాలోని ఎఫ్‌బిఐ ఏజెంట్లు ఎమిట్‌ని పట్టుకోడానికి మెక్సికన్ పోలీసుల సహాయం అర్థించారు. మేప్‌ని చూసి వాళ్లు శాంటా రోజలియాకి వెళ్తున్నారని తేలిగ్గా ఊహించారు. ఆ ముగ్గురూ ఓ గ్రామం దాటారని, కారు ఆపి ఆహార పదార్థాలు కొన్నారని తమ పరిశోధనలో గ్రహించారు. ఆ దుకాణం యజమాని వారి కారు నెంబర్‌ని గుర్తుంచుకున్నాడు. దోషి గోమర్స్‌డికి వెళ్తున్నాడని, అక్కడ సముద్రం దాటచ్చు అని కూడా వాళ్లు ఊహించారు.
‘వాళ్లు హైవేని వదిలి కొండల్లోని ట్రాఫిక్ లేని రోడ్లలో వెళ్తున్నారని ఈ రూట్‌నిబట్టి తెలుస్తోంది’ మెక్సికన్ పోలీసులు చెప్పారు.
మెక్సికన్ పోలీస్ కార్లు, అమెరికన్ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి.
* * *
మూడో రాత్రి కారుని ఓ పెట్రోల్ బంక్ పక్కన ఆపారు. మనుషులెవరూ లేరు. తాళం వేసి ఉంది. వాళ్ల చేత ఎమిట్ దాన్ని పగలగొట్టించి, కారులో పెట్రోల్‌ని నింపించాడు. రాయ్ తన వెడ్డింగ్ రింగ్‌ని తీసి, పంపు దగ్గర ఉంచడం ఎమిట్ చూడలేదు. మొరుగుతూ వచ్చిన ఓ కుక్కని ఎమిట్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు.
ఆ అర్ధరాత్రి మిత్రులిద్దరూ నెమ్మదిగా లేచారు. కొద్దిసేపటికి కళ్లు తెరిచి చూసిన ఎమిట్‌కి వాళ్లిద్దరూ కనపడలేదు. తక్షణం లేచాడు. మిత్రులిద్దరూ వేగంగా పరిగెత్తుతూండగా వెనక నించి కారు హెడ్‌లైట్స్ వారి మీద పడడంతో ఆగిపోయారు.
‘ఎక్కండి’ కారు దిగి కోపంగా అరిచాడు.
మళ్ళీ కారు బయలుదేరాక చెప్పాడు.
‘ఈసారి పారిపోయే ప్రయత్నం చేస్తే చంపకుండా వదలను’
* * *
మెక్సికన్ పోలీసుస్టేషన్‌లోకి వచ్చిన పెట్రోల్ బంక్ యజమాని తన పంప్ దగ్గర జరిగిన దొంగతనం గురించి చెప్పి, అక్కడ దొరికిన ఉంగరాన్ని ఇచ్చాడు. దాని లోపల ‘రాయ్ అండ్ మేగీ’ అన్న ఇంగ్లీష్ అక్షరాలని చదివిన ఇన్‌స్పెక్టర్ రిసీవర్ అందుకుని ఆ సమాచారాన్ని హెడ్ క్వార్టర్స్‌కి తెలియజేశాడు. వెంటనే ఎఫ్‌బిఐ ఏజెంట్, వాళ్లు ఎంత దాకా వచ్చారో, ఎటువైపు వెళ్తున్నారో మేప్‌లో గుర్తు పట్టాడు.
మధ్యాహ్నం ఓ బావి గట్టున కారుని ఆపి ముగ్గురూ లంచ్ తీసుకున్నారు. తర్వాత కారెక్కమని ఎమిట్ ఆజ్ఞాపించాడు. గిల్బర్ట్ కారులోంచి కారిపోయిన నేల మీది డీజిల్ ఇంజన్‌ని చూపించి చెప్పాడు.
‘మేమేం చేయలేదు. ఈ రోడ్డు వల్ల ట్యూబ్‌కి రంధ్రం పడింది’
ఇంక అది కదలదని తెలిశాక ముందు మిత్రులు ఇద్దరూ, వాళ్ల వెనకాల చేతిలో రైఫిల్‌తో ఎమిట్ మెక్సికన్ ఎండలో కాలినడకన బయలుదేరారు. దాదాపు గంట తర్వాత ఓ పోలీస్ కారు వచ్చి ఆ కారు పక్కనే ఆగింది. దిగి కారుని పరిశీలించి, కారు రేడియోలో మెక్సికన్ భాషలో ఇన్‌స్పెక్టర్ ఏదో చెప్పసాగాడు.
ఎమిట్ తన బట్టలని విప్పి, గిల్బర్ట్‌ని తొడుక్కోమని అతని దుస్తుల్ని తను తొడుక్కున్నాడు. అందువల్ల పోలీసులు గిల్బర్ట్‌నే ఎమిట్‌గా భావిస్తారని అతని పథకం.
ఓ గ్రామంలోని ఓ బార్‌లోకి ముగ్గురూ నడిచారు. దూరం నించి సముద్రపు హోరు వినిపిస్తోంది. ముగ్గురూ బీర్ తీసుకున్నాక ఎమిట్ బార్ యజమానిని అడిగాడు.
‘ఇక్కడ బోటున్న ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడతారా?’
బార్ యజమాని తలవాల్చి బల్ల మీద పడుకున్న ఒకతన్ని లేపాడు.
‘నీ బోట్ కావాలి’ ఎమిట్ కోరాడు.
‘్ఫషింగ్‌కా?’ అతను ప్రశ్నించాడు.
‘అవును. వెంటనే బయలుదేరాలి’
‘నేను రాత్రిళ్లు బోట్ నడపను. రేపు ఉదయం ఆరుకి బయలుదేరుదాం’
‘నీ బోట్ పేరేమిటి?’
‘అమీలియా’
‘సరే. రేపు ఉదయం ఆరుకి’
ఎమిట్ జేబులోంచి పర్స్ తీసి కొన్ని నోట్లని అడ్వాన్స్‌గా ఇచ్చాడు.
‘పడవల రేవుకి పదండి’ బయటికి వచ్చాక రైఫిల్‌ని గురి పెట్టి చెప్పాడు.
ముగ్గురూ పడవల రేవుకి చేరుకున్నాక ఎమిట్ చెప్పాడు.
‘అమీలియా పేరుగల పడవని దొంగిలించాలి. నాకు మరబోటు నడపడం వచ్చు. కాబట్టి గ్లామియస్‌కి ఒంటరిగా వెళ్తాను. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్లనందుకు విచారంగా ఉంది. నాకు కాదు. మీకు’
‘నీ బట్టల్లానే నువ్వూ కంపు కొడుతున్నావు. నీ చేతిలో రివాల్వర్ లేకపోతే నువ్వెందుకూ కొరగావు. నువ్వు వొఠ్ఠి పిరికివాడివి. అందుకే రివాల్వర్ వెనుక దాక్కున్నావు’ మూడు రోజుల వత్తిడి వల్ల గిల్బర్ట్ అరిచాడు.
బార్‌లోని పడవ యజమాని బిల్లు చెల్లించి బయటికి వెళ్తూ, టేబుల్ మీది దినపత్రికని చూశాడు. అందులోని మూడు ఫొటోలని చూడగానే అతని మత్తు వదిలింది. వాళ్లు బోటు కోసం తన దగ్గరికి వచ్చి వెళ్లిన వాళ్లుగా గుర్తించగానే పోలీసుస్టేషన్‌కి పరిగెత్తాడు.
‘కాదు. నల్లజాకెట్ వేసుకున్నది ఇతను కాదు. అతను’ గిల్బర్ట్ ఫొటోని చూపిస్తూ పోలీసులకి చెప్పాడు.
‘కానీ ఇతని పేరు ఎమిట్. ఎమిట్ బట్టలు తొడుక్కున్న ఇతని పేరు గిల్బర్ట్’ ఇన్‌స్పెక్టర్ తనకి అందిన ఫొటోలని బయటికి తీసి చూసి పోల్చుకున్నాడు.
వెంటనే అతను పోలీసులతో అమీలియా బోట్ దగ్గరికి బయలుదేరాడు.
* * *
‘మీ ఇద్దరూ నెమ్మదిగా అమీలియా దగ్గరకు వెళ్లండి. మీరు పరిగెత్తినా, ఎవరికైనా అనుమానం కలిగేలా ప్రవర్తించినా కాల్చేస్తాను. మీ వెనక నేను నెమ్మదిగా వస్తాను. ఒకవేళ పోలీసులు కాపుంటే, గిల్బర్ట్‌ని పట్టుకుంటారు. అప్పుడు నువ్వు నేనే గిల్బర్ట్‌ని అని చెప్పకపోతే నిన్ను కాల్చేస్తాను’ ఎమిట్ రాయ్‌ని హెచ్చరించాడు.
ముగ్గురూ చీకట్లో పడవల రేవులోని అమీలియా వైపు నెమ్మదిగా అడుగు వేయసాగారు. గిల్బర్ట్ గుండె దడదడలాడుతోంది. పడవ దగ్గరికి చేరుకున్నాక ఎమిట్ చెప్పాడు.
‘ఇక్కడితో మన ముగ్గురి ప్రయాణం ముగిసింది. థాంక్స్. మీకు తగిన బహుమానం ఇచ్చాక ఆ పడవ నాది’
పడవలో దాక్కున్న ఇన్‌స్పెక్టర్ రివాల్వర్‌తో, చేతిలో తుపాకులతో కానిస్టేబుల్స్ ఎమిట్‌ని చుట్టుముట్టారు. తక్షణం పడవల రేవు నిండా లైట్లు వెలిగాయి. వెంటనే గిల్బర్ట్ ఎమిట్ చేతి మీద రివాల్వర్ కిందపడేలా కొట్టి ఉద్రేకంగా అతన్ని బాదసాగాడు. పోలీసులు అతన్ని ఆపే ప్రయత్నం చేయకుండా కొద్దిసేపు నవ్వుతూ చూశాక చెప్పారు.
‘ఇంక ఈ ఆట చాలు’
*
(రాబర్ట్ జోసెఫ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి