S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరివర్తన

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
హాల్లో నుండి పెద్దగొంతుకతో భర్త మాటలు వినిపించడంతో అప్పుడే పక్క మీద నడుం వాల్చినదల్లా లేచి హాల్లోకి వచ్చింది ధరణి. ఉదయమే షోరూమ్‌కి వెళ్లి బుక్ చేసిన కొత్త ప్లాస్మా టీవీని ఇద్దరు కూలీలు మోసి తెచ్చి హాల్లో పెట్టినట్లున్నారు. భర్త ప్రకాష్ ఆ కూలీల మీద ఎందుకో అరుస్తుండటంతో అతని దగ్గరికి వెళ్లి అడిగి విషయం తెల్సుకుంది.
టీవీని మూడు అంతస్తులు మోసి తెచ్చినందుకుగాను కనీసం యాభై రూపాయలైనా కూలీ ఇవ్వమని ఆ కూలీలు అడుగుతున్నారు. ‘ఇంటి వరకూ టీవీని తెచ్చి పెట్టడమనేది షోరూమ్ వాళ్ల బాధ్యతేనని కొనేటప్పుడు చెప్పారు. అలాంటిది ఇప్పుడు నేనెందుకు మీకు అదనంగా డబ్బులు ఇవ్వాలి?’ అంటూ వాళ్ల మీద ప్రకాష్ అరుస్తున్నాడు.
ప్రకాష్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తన ఆడంబరాల కోసం చేసే ఖర్చుని గురించి ఏ మాత్రం ఆలోచించడు గానీ చిన్నచిన్న మొత్తాల దగ్గర అతనెంత నిక్కచ్చిగా ఉంటాడో ఆమెకి బాగా తెలుసు. పెళ్లైన పదేళ్లలో భర్తతో ఈ విధమైన అనుభవాలు ధరణికి కొత్తేమీ కాదు. ఆ ఒక్క విషయం తప్పిస్తే స్వభావరీత్యా అతను చాలా మంచివాడు. భార్యని, కూతురిని ప్రాణంలా చూసుకుంటాడు.
‘ఉదయమనగా ఎండనపడి ఆ టీవీ కోసమని వెళ్లారు. చూడండి మీ మొహం ఎలా వాడిపోయిందో. కూలీలకి నేనేదో నచ్చజెప్పి పంపిస్తానుగాని మీరు ఈ చల్లని బత్తాయి రసం తాగి డ్రెస్ మార్చుకుని కాస్త నడుం వాల్చండి’ అంటూ గంట క్రితమే ఫ్రిజ్‌లో పెట్టిన బత్తాయి రసాన్ని తెచ్చి చేతికి ఇవ్వడంతో ప్రకాష్ వెంటనే తాగేసి కాస్త కూల్ అయి భార్య చెప్పినట్లుగా కాసేపు రెస్ట్ తీసుకుందామని బెడ్‌రూమ్‌కి వెళ్లిపోయాడు.
ఒళ్లంతా చెమటలు కక్కుతూ హాల్లోనే నిలబడ్డ కూలీల మొహం చూస్తే ధరణికి ఎంతో జాలి కలిగింది. వెంటనే లోనికి వెళ్లి చల్లటి మంచినీళ్లతోపాటు ఇద్దరికీ చెరో రెండు అరటి పళ్లని కూడా తెచ్చి ఇచ్చింది. బాగా దాహం మీద ఉన్నట్లున్నారు వాళ్లు, మారుమాట్లాడకుండా గటగటా మంచినీళ్లని తాగేసి పళ్లని వాళ్ల చేతి సంచిలో వేసుకున్నారు. ‘మధ్యేహ్నం తింటామమ్మా’ అంటూ.
‘మూడు అంతస్తులు మెట్ల మీద కష్టపడి మోసుకొచ్చాం తల్లీ. అయ్యకి చెప్పి ఎంతో కొంత ఇప్పించండమ్మా. ఆ షాప్ వాళ్లు మాకిచ్చే కూలి రెండు పూటలా తిండికే సరిపోదు. కూలీ పెంచమని అడిగితే ప్రతీ కస్టమర్ దగ్గరా అడిగి టిప్ తీసుకోమని చెబుతారమ్మా వాళ్లు’
‘దాదాపు లక్ష రూపాయలు పెట్టి టీవీ కొన్న ఈయనకీ, కస్టమర్ దగ్గర అంత డబ్బులని వసూలు చేసిన ఆ షోరూమ్ వాడికీ కూడా కూలీ మనిషికిచ్చే ఒక్క యాభై రూపాయల దగ్గర అంత కక్కుర్తి దేనికో?’ అని స్వగతంగా అనుకుంటూనే వంటింట్లోకి వెళ్లి పోపుల డబ్బాలో నుండి యాభై నోటుని తీసి వారి చేతికియ్యగానే ‘చల్లంగుండు తల్లీ’ అంటూ ఆశీర్వదించి వెళ్లారు.
ఈలోగా స్కూల్ నుండి తిరిగొచ్చిన ఏడేళ్ల కూతురు ప్రజ్ఞ ఆ వేళ స్కూల్‌లో ఏం జరిగిందీ చెబుతుంటే వింటూ పాపకి పాలు తాగించే పనిలో పడిపోయింది ధరణి.
* * *
ఆ రోజు తమ పెళ్లిరోజు కావడంతో ఉదయానే తలారా స్నానం చేసి భర్త ప్రెజెంట్ చేసిన కంచి పట్టుచీరని కట్టుకుని గుడికి వెళ్లాలని తయారైంది ధరణి. కూతురికి టిఫిన్ తినిపించి స్కూల్ వ్యాన్ ఎక్కించిన తర్వాత వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చి భర్తని నిద్ర లేపింది.
‘ఏవండీ, ఈ వేళ మన పెళ్లిరోజు. గుర్తుందిగా, కాస్త మీరు త్వరగా స్నానం చేసి తయారైతే గుళ్లో అర్చన చేయించి వద్దాం’
‘గుర్తుంది లేవోయ్. అందుకేగా ఆఫీస్‌కీ సెలవు పెట్టాను. ఈ వేళ బైట ఏదైనా మంచి రెస్టారెంట్‌లో లంచ్ చేసి మూవీకి వెళదామనుకుంటుంటే మధ్యలో ఈ గుడి ప్రోగ్రాం ఏమిటి ధరణీ?’
‘్భలేవారే, ముందుగా గుడికి వెళ్లింతర్వాతే ఏదైనా. మరేం మాట్లాడకుండా మీరు త్వరగా తయారుకండి’ అంటూ ఆమె ఆజ్ఞ జారీ చేయడంతో యింక తప్పదని స్నానం చేసొచ్చి, భార్య ఇస్తీ చేసి సిద్ధంగా ఉంచిన పట్టుపంచెని ధరించాడు.
ఇద్దరూ కలిసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి కార్లో బయలుదేరారు.
గుడి ముందర వున్న పూలకొట్టుకి వెళ్లి పూలు, కొబ్బరికాయ, ఇతర పూజా సామాగ్రి తీసుకున్నారు.
‘మొత్తం ఎంతయింది అవ్వా?’ అడిగింది ధరణి.
‘అంతా కలిపి తొంభై రూపాయలమ్మా’
‘ఏమిటి రెండు మూరల పూలకీ, రెండు కొబ్బరికాయలకీ తొంభై రూపాయలా? అరవై రూపాయల పైన ఒక్క రూపాయి కూడా ఎక్కువిచ్చేది లేదు’ అంటూ బేరం మొదలుపెట్టిన భర్తని చూస్తూ తల పట్టుకుంది ధరణి.
‘ఏమండి, ఈ వేళ గుళ్లో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే వున్నట్లుంది కదూ. మీరు త్వరగా లోనికి వెళ్లి అర్చన టికెట్ తీసుకోండి. ఈలోగా నేను ఈ పూల బేరాన్ని ముగించుకుని వస్తాను’ అని భార్య చెప్పడంతో టికెట్ కౌంటర్ వేపు కదిలాడు ప్రకాష్.
‘అమ్మా, అరవై రూపాయలంటే నేను కొన్న రేటు కూడా నాకు గిట్టుబాటవదు. ఎనభై ఇవ్వండమ్మా’ మరోమాట చెప్పింది పూలకొట్టు అవ్వ.
పర్స్ నుండి వంద రూపాయల నోటు తీసివ్వగా చిల్లర కోసమని బొడ్డు దగ్గర కట్టుకున్న డబ్బు సంచీని విప్పబోతున్న అవ్వని వారించి ‘చిల్లర నీ దగ్గరే ఉండనీ అవ్వా’ అని చెప్పేసి గుళ్లోకి వెళ్తున్న ధరణిని చూస్తూ ‘నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లంగ వుండాలి తల్లీ నువ్వు’ అనుకుంటూ మరో బేరం వస్తే పనిలో పడింది.
గుళ్లో అర్చన పూర్తయిన తర్వాత హారతి పళ్లెంలో యాభై రూపాయల నోటునీ, హుండీలో అయిదు వందల నోటునీ వేస్తున్న భర్తని చూస్తూ మనసులోనే నిట్టూర్చింది ధరణి.
‘గుడి ముందున్న చిన్న పూలకొట్టు మనిషితో చిల్లర బేరం మొదలుపెట్టే ఈయన గుడి లోపల భగవంతుడికి మాత్రం వందలూ, వేలూ సమర్పించుకుంటాడు. ఆఫీస్‌లో లంచం డబ్బుల కోసం వెంపర్లాడడం, ఆపైన పట్టుబడతానేమో అని భయపడుతూ చేసిన పాపాలని కడిగేసుకోవడానికి దేవుడికి లంచాలనివ్వడం. ఏమిటో ఈ మనిషి నాకెప్పటికీ అర్థంకాడు’ అనుకుంటూ ప్రసాదం తీసుకుని భర్తతోపాటు ఇంటికి బయలుదేరింది.
* * *
మరుసటి రోజు ఉదయానే ప్రకాష్ ఆఫీస్‌కి చేరుకునేటప్పటికే అతని టేబుల్ వద్ద కాంట్రాక్టర్ రఘురాం అతని కోసం ఎదురుచూస్తున్నాడు.
‘సార్, మా ప్రాజెక్ట్ ఫైల్ మీ దగ్గర నాలుగు రోజులుగా పెండింగ్‌లో వుంది. త్వరగా క్లియర్ చేస్తే మంచిది’
గవర్నమెంట్ ఉద్యోగి అయిన తన దగ్గర చేతులు కట్టుకుని నిలబడవలసిన ఒక చిన్న కాంట్రాక్టర్ తనతో అలా రూడ్‌గా మాట్లాడడం, తనకే ఆదేశాలు ఇవ్వడంతో ప్రకాష్‌కి కోపం పొంగుకొచ్చింది.
‘నీ ఫైల్ నా టేబుల్ మీద ఎందుకు పెండింగ్‌లో వుందో నీకు తెలీదా రఘురాం? ముందు నేను అడిగిన అవౌంట్ సంగతి తేల్చు. ఆ తర్వాతే నీ ఫైల్ ఇక్కడ నుండి కదిలేది’
ప్రకాష్ మాటలు పూర్తవకుండానే గబగబా తన సెల్‌ఫోన్‌లో ఒక నెంబర్‌కి డయల్ చేసి ఒక్క క్షణం మాట్లాడి సెల్‌ని ప్రకాష్ చేతికిచ్చాడు రఘురాం.
‘సార్, చీఫ్ ఇంజనీర్ రాజగోపాల్‌గారు లైన్‌లో వున్నారు. మాట్లాడండి’
అతని చేతి నుండి ఫోన్ అందుకుని ‘గుడ్‌మార్నింగ్ సార్’ అన్నాడు ప్రకాష్.
‘ప్రకాష్, అతని ఫైల్ వెంటనే క్లియర్ చేసి నా టేబుల్‌కి పంపించు’ అని చెప్పి మరో మాట మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వకుండా ఫోన్‌ని కట్ చేశాడు చీఫ్ ఇంజనీర్.
చీఫ్ ఇంజనీర్‌కి అందవలసిన ముడుపు భారీ మొత్తంలోనే అందిందని అర్థం చేసుకున్న ప్రకాష్ గొణుక్కుంటూ ఫైల్‌ని క్లియర్ చేసి పంపేశాడు.
ప్రక్క టేబుల్ నుండే ఈ వ్యవహారాన్నంతా గమనించిన ప్రకాష్ కొలీగ్ మధుకర్ ఆ కాంట్రాక్టర్ వెళ్లిపోగానే ప్రకాష్ టేబుల్ దగ్గరికి వచ్చాడు.
‘కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌లని చేజిక్కించుకోవడం కోసం లక్షల రూపాయలని ఈ కాంట్రాక్టర్ లందరూ కూడా మన చీఫ్ ఇంజనీర్‌కీ, సీనియర్ ఇంజనీర్లకీ బహుమానంగా ఇస్తారు. మనలాంటి చిన్న ఉద్యోగస్తుల విషయానికొస్తే మాత్రం గీచిగీచి బేరమాడుతారు. అప్పుడప్పుడూ ఇలా మొత్తానికే మొండి చేయి చూపిస్తారు, వెధవలు’
మధుకర్ మాటలని వినగానే భార్య ఎప్పుడూ తనతో అంటుండే మాటలు మనసులో మెదిలాయి ప్రకాష్‌కి.
‘ఏమండీ, అంత ఖరీదైన బ్రాండెడ్ బట్టలని కొనుక్కుని ధరించే మీరు పండుగ పూట సెక్యూరిటీ గార్డ్ నోరు తెరిచి అడిగినప్పుడైనా ఒక్క వంద రూపాయలని విదిలించలేరు. స్టార్ హోటల్‌లో డిన్నర్‌లు చేసే మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చమెత్తుకునే వాళ్లని చూసి చిరాకు పడతారు. తప్పు కదండీ అలా చేయడం. పోతూపోతూ ఈ ఆస్తిపాస్తులేవీ ఎవరమూ కట్టుకుపోలేంగా. మనకున్నంతలో తృణమో పణమో దానం ధర్మం చేస్తే పుణ్యం, పురుషార్థం’
‘్ధరణి ఎన్నిమార్లు హెచ్చరించినా కూడా తనెప్పుడూ ఆమె మాటని ఖాతరు చేయలేదు. నిజమే, ఆడంబరాల కోసం ఇష్టమొచ్చినంత డబ్బుని ఖర్చు చేస్తూ చిన్నచిన్న చిల్లర కోసం కక్కుర్తి పడుతూ బేరాలు ఆడే తనకీ, ఆ కాంట్రాక్టర్‌కీ ఏ మాత్రం తేడా లేదు. అలాంటప్పుడు ఆ కాంట్రాక్టర్‌ని విమర్శించే హక్కు తనకెక్కడుంది? ధరణి చెప్పినట్లే వెళ్లేప్పుడు మనతోపాటు ఏవీ తీసుకెళ్లలేమని తెలిసీ యింకా యింకా సంపాదించాలన్న తాపత్రయం దేనికి నాకు?’
తనని తానే ప్రశ్నించుకుంటూ ఆలోచనలో పడ్డాడు ప్రకాష్. చాలాసేపు అంతరంగంలో తీవ్ర అంతర్మథనం జరిగింత్తర్వాత అతనికి తన కర్తవ్యం బోధపడటంతో, లంచాలు బాగా ముట్టే ఈ సీట్ నుండి తనని వేరే చోటుకి ట్రాన్స్‌ఫర్ చేయమంటూ ఆఫీస్‌లో అర్జీని పెట్టుకుని తేలికైన మనసుతో బైటకి వచ్చి కార్ పార్క్ చేసి వున్న వేపు నడిచాడు. సన్నటి తుంపరలు శరీరాన్ని తాకుతుంటే ఎంతో ఆహ్లాదంగా అన్పించింది.
కార్ స్టార్ట్ చేసి తనకిష్టమైన భద్రాచల రామదాసు కీర్తనలని వింటూ డ్రైవ్ చేయసాగాడు. రెడ్ సిగ్నల్ రాగానే స్లో చేశాడు. వర్షానికి తడుస్తూ, ఉన్న ఒక్క చేత్తోనే కార్ల అద్దాల్ని తుడుస్తూ అడుక్కుంటున్న ముష్టివాడిని చూసిన
అతని మనసు ద్రవించింది. కారులో వున్న దుప్పటిని తీసి ఆ బిచ్చగాడి భుజాల చుట్టూ కప్పి అతని చేతిలో యాభై రూపాయల నోటుని పెట్టడంతో ఒక్క క్షణం నమ్మలేనట్లుగా చూశాడు ఆ అవిటివాడు.
‘బాబూ, ధర్మప్రభువులు. మీరు నిండు నూరేళ్లు సల్లంగుండాలి’ అంటూ సంతోషంగా ఆశీర్వదించి వెళ్లాడు. మనకున్న దాంట్లో కొద్దిగా దానం చేస్తే ఆ కొద్ది మొత్తమే ఎదుటివారి కళ్లల్లో ఎంతటి సంతోషాన్ని నింపుతుందో, ఆనందంతో వారిచ్చే ఆశీర్వాదం దాతకి ఎంత బలాన్నిస్తుందో ప్రకాష్‌కి ఆ వేళ స్పష్టంగా తెలిసొచ్చింది.
ఈలోగా గ్రీన్ సిగ్నల్ పడటంతో కారుని స్టార్ట్ చేశాడు ప్రకాష్.
ఆలోచనల్లోనే ఇల్లు వచ్చేయడంతో సడన్ బ్రేక్ వేయడంతో కీచుమంటూ కారు ఆగింది.
ఈలోగా ఎక్కడి నుండి వచ్చాయో రెండు పెద్ద ఊరకుక్కలు కలిసి ఒక చిన్న కుక్క వెనకాల పడుతుండటంతో వాటి బారి నుండి తప్పించుకునే హడావిడిలో పరిగెత్తుకుంటూ వచ్చి కారు ముందు భాగం కాలికి తగలడంతో కిందపడిపోయింది.
గభాల్న కారు నుండి దిగి ఆ పెద్ద కుక్కలని తరిమివేసి, గాయపడ్డ చిన్న కుక్కని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువచ్చాడు ప్రకాష్.
‘డాడీ’ అంటూ పరిగెత్తుకొచ్చిన ప్రజ్ఞ, తండ్రి చేతుల్లో వున్న కుక్కని చూసి ఆశ్చర్యపోయింది.
‘చిన్నా, వెంటనే వెళ్లి బెడ్‌రూమ్‌లో వున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా’ అని చెప్పడంతో ఒక్క పరుగున వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ని తెచ్చి తండ్రికి ఇచ్చింది. కుక్కకి అయిన గాయాన్ని క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా టెర్రస్ మీద పక్షులకి పెసర గింజలు చల్లుతున్న ధరణి కిందకి వచ్చింది.
‘మమీ, ఈ రోజు డాడీ కుక్కని తీసుకువచ్చారు. పాపం సోనూకి దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు’ అంటూ గబగబా చెప్పేసింది ప్రజ్ఞ.
‘అప్పుడే దీనికి పేరు కూడా పెట్టేసావా చిన్నా’ అని ప్రకాష్ అంటుండగా ధరణి బెడ్‌రూమ్‌లోనికి వెళ్లి ఒక మెత్తటి చీరని నాల్గు మడతలుగా చేసి తేవడంతో దాని మీద కుక్కని పడుకోబెట్టాడు.
గోరువెచ్చగా వున్న పాలని, బ్రెడ్‌తోపాటు కలిపి తెచ్చి ఒక పళ్లెంలో పోసి కుక్క ముందు పెట్టగానే ఆకలితో ఉందేమో గబగబా తినేసి పడుకుంది.
ఆ తర్వాత కాఫీ తాగుతూ ఆ వేళ ఆఫీస్‌లో జరిగిన విషయమూ, తను సీట్ ట్రాన్స్‌ఫర్‌కి రిక్వెస్ పెట్టుకున్న విషయమూ భార్యకి చెప్పాడు ప్రకాష్.
‘యినే్నళ్లూ రెండు చేతులా ధనాన్ని సంపాదించడమూ, ఆడంబరంగా జీవించడమూ ఇవే జీవిత పరమార్థం అనుకున్నా ధరణీ. సకల ప్రాణుల ఎడల జాలీ, కరుణ కలిగి ప్రవర్తించాలనీ, మనుషులందరి పట్లా పిసరంత మానవత్వాన్ని చూపుతూ మనకున్నంతలో కొంతైనా దానధర్మాల కోసం ఉపయోగించాలనీ నువ్వెన్ని మార్లు చెప్పినా కూడా నా మొద్దు బుర్రకి ఎక్కలేదు. ఈ వేళ నా చేతులతో నేను నా జీవితంలో తొలిసారిగా దానం చేసిన ఒక పాత దుప్పటి, ఒక యాభై రూపాయల నోటు వలన ఒక మనిషి కళ్లల్లో కనిపించిన వెలుగూ, దాని వలన నాకు కలిగిన ఆనందం ఆనిర్వచనీయం ధరణీ. ఇకపై మనిద్దరిదీ ఒకటే బాట’ అన్న భర్త మాటలకి ఎంతో సంతోషించింది ధరణి.
హాల్లోనే కూర్చుని ఆడుకుంటూ తల్లిదండ్రుల మాటలన్నీ వింటున్న ప్రజ్ఞ ‘అయితే డాడీ, ఇక మీదట మన పనిమనిషి మల్లిక కూతురు రాజీ ఎప్పుడైనా మన కార్పెట్ పాడుచేస్తే దాన్ని కొట్టవు కదూ’ అని అడిగింది.
తన మునుపటి ప్రవర్తనకి సిగ్గుపడుతూ ‘లేదమ్మా, అస్సలు కొట్టను. నీలాగే రాజీని కూడా స్కూల్‌లో చేర్పించి పుస్తకాలు, మంచి బట్టలలు కూడా కొనిస్తాను. సరేనా’ అన్నాడు ప్రకాష్.
‘భలే భలే, మమీలాగే డాడీ కూడా మంచి అయిపోయారు’ అంటూ చప్పట్లు కొట్టింది ప్రజ్ఞ.
ఆలస్యంగానైనా సరే మొత్తానికి తన భర్తలో అంత చక్కటి పరివర్తనని కలిగించినందుకుగానూ తిరుపతి ఏడుకొండల స్వామికి మనసులోనే శతకోటి ప్రణామాలని అర్పించుకుంది ధరణి.

-అప్పరాజు నాగజ్యోతి 94809 30084