S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 71 మీరే డిటెక్టివ్

మంగళకరమైన ఆ రాత్రంతా సీతారామ లక్ష్మణులు ఆ పెద్ద మర్రిచెట్టు కింద నిద్రించి, మర్నాడు సూర్యోదయం తర్వాత అక్కడ నించి బయలుదేరారు. కీర్తిమంతులైన ఆ ముగ్గురూ ఆ పెద్ద అడవిలోకి ప్రవేశించి, అక్కడక్కడా గల అనేక రకాల భూభాగాలని, పూర్వం ఎన్నడూ చూడని అందమైన దేశాలని చూస్తూ యమునా నది, గంగానది కలిసే చోటకి చేరుకున్నారు. రాముడు అనేక రకాల చెట్లని చూస్తూ కష్టం కలగకుండా మెల్లగా సాయంత్రం దాకా నడిచాడు. తర్వాత లక్ష్మణుడితో చెప్పాడు.
‘లక్ష్మణా! భగవంతుడైన అగ్నికి పతాక అయిన పొగ ప్రయాగకి చుట్టూ ఎత్తుగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ దగ్గరలోనే అగస్త్య ముని ఉన్నాడని అనుకుంటున్నాను. మనం నిస్సందేహంగా గంగా, యమునల సంగమ స్థానానికి చేరాం. ఎందుకంటే నీరు నీటితో కొట్టుకునే శబ్దం వినిపిస్తోంది. అడవిలో దొరికే వస్తువుల మీద ఆధారపడి జీవించే వారితో నరకబడ్డ కర్రలు చూడు. అగస్త్య ఆశ్రమంలో అనేక విధాలైన చెట్లు కనిపిస్తున్నాయి.’
బాణాలు ధరించిన రామలక్ష్మణులు సుఖంగా ప్రయాణించి, సాయంకాలానికి గంగాయమునల సంగమం దగ్గరలోని భరద్వాజ ఆశ్రమాన్ని చేరారు. రాముడు దాని దగ్గరకి వెళ్లగానే, వాళ్లని చూసిన జంతువులు, పక్షులు భయపడ్డాయి. తర్వాత మరి కొంతదూరం ముందుకు నడిచి మునిని చూడాలనే కోరికతో ఆ ముగ్గురూ కొద్దిగా దూరంగానే నిలబడ్డారు. రాముడు ఆశ్రమంలోకి వెళ్లి అక్కడ శిష్యులతో ఉన్న మహాత్ముడు భరద్వాజ మహర్షిని చూశాడు. ఆ మహాత్ముడు కఠినమైన వ్రతాలని ఆచరిస్తూ ఏకాగ్రతతో తపస్సు చేసి దివ్యదృష్టిని పొందాడు. ఆయన నిత్యాగ్నిహోత్రుడు. మహాభాగ్యశాలి. ఆయన్ని చూసిన వెంటనే రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకి నమస్కరించారు. రాముడు ఇలా చెప్పాడు.
‘ఓ పూజ్యుడా! మేము దశరథుడి కొడుకులైన రామలక్ష్మణులం. ఈ కళ్యాణి జనకుడి కూతురు సీత, నా భార్య. ఎవరితోను నిందింపబడని ఈమె నన్ను అనుసరించి తపోవనానికి వస్తోంది. మా తండ్రి నన్ను అడవికి పంపగా దృఢనిశ్చయంగల, నాకు ప్రియుడైన నా తమ్ముడైన లక్ష్మణుడు నా వెంట వచ్చాడు. మేము తండ్రి మాట ప్రకారం తపోవనంలో నివసించి, అక్కడి దుంపలు, ఫలాలు తింటూ, ధర్మానే్న ఆచరిస్తాము’
బుద్ధిమంతుడైన రాముడి మాటలు విని దర్మాత్ముడైన భరద్వాజుడు పూజ కోసం ఆవుని, మంచినీటిని రాముడికి తెచ్చి సమర్పించాడు. గొప్ప తపశ్శాలైన ఆ భరద్వాజుడు వారికి అడవిలో లభించే దుంపలు, పళ్లతో చేసిన అనేక రకాలైన అన్నరసాలని ఇచ్చి వారికి బసని ఏర్పాటు చేశాడు. జంతువులు, పక్షులు, మునులు భరద్వాజుడి చుట్టూ కూర్చున్నారు. అప్పుడా ముని తన ఆశ్రమానికి వచ్చిన రాముడికి స్వాగతం చెప్పి, పూజించి ఇలా చెప్పాడు.
‘ఓ రామా! ఎంతో కాలానికి ఇక్కడికి వచ్చిన నిన్ను చూడగలుగుతున్నాను. అకారణంగా నిన్ను మీ నాన్న అడవికి పంపాడని కూడా విన్నాను. గంగా యమునల సంగమం దగ్గరున్న ఈ ప్రదేశంలో మనుషులు తక్కువ. ఇది పుణ్యమైన, అందమైన ప్రదేశం. నువ్వు ఇక్కడ హాయిగా ఉండచ్చు’
అంది మంచి కోరే రాముడు ఇలా జవాబు చెప్పాడు.
‘పూజ్యుడా! పౌరులు, జానపదులు ఈ ప్రదేశానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఇక్కడ నన్ను చూడటం తేలిక కాబట్టి వారంతా నన్ను, సీతని చూడటానికి ఈ ఆశ్రమానికి రావచ్చు. అందువల్ల ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. సుఖాలకి అలవడ్డ సీత ఏ ప్రదేశంలో సుఖంగా ఉండగలదో అలాంటి ఉత్తమమైన ఏకాంత ప్రదేశాన్ని సూచించు’
భరద్వాజుడు దానికి జవాబుగా ఇలా చెప్పాడు.
‘నాయనా! ఇక్కడికి పది క్రోసుల దూరంలో గంధమాధవ పర్వతంతో సమానమైన చిత్రకూటం అనే పర్వతం ఉంది. ఎందరో మహర్షులు నివసించే ఆ పర్వతం పవిత్రమైంది. అది ఎటు చూసినా ఆనందాన్ని కలిగిస్తుంది. దాని మీద కొండముచ్చులు, కోతులు, ఎలుగుబంట్లు నివసిస్తూంటాయి. అది నువ్వు ఉండటానికి తగిన చోటు. దాని మీద ఎందరో ఋషులు వందల కొద్దీ సంవత్సరాలు తపస్సుతో తమ తలలు కపాలాలుగా ఎండిపోయేంత వరకు తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. రామా! ఏకాంతంగా ఉండే ఆ చిత్రకూట ప్రాంతం నీ నివాసానికి సుఖంగా ఉంటుందని అనుకుంటున్నాను. లేదా నాతో ఇక్కడే ఉండి వనవాసాన్ని పూర్తి చేసుకోవచ్చు.
ధర్మవేతె్తైన భరద్వాజుడు భార్యాసోదరులతో కలిసి వచ్చిన ప్రియమైన అతిథి రాముడికి కావల్సిన పదార్థాలన్నీ ఇచ్చి పూజించాడు. ప్రయాగలో భరద్వాజుడి దగ్గర కూర్చుని రాముడు ఆయనతో అనేక విషయాలు మాట్లాడుతూండగా పవిత్రమైన రాత్రి వచ్చింది. సుఖానికి అలవాటుపడిన ఆ సీతా రామలక్ష్మణులు అలసిపోయి ఆ రాత్రి అందమైన ఆ భరద్వాజాశ్రమంలో సుఖంగా నిద్రించారు. తెల్లారాక రాముడు తేజశ్శాలైన ఆ ముని దగ్గరకి వెళ్లి చెప్పాడు.
‘ఓ పూజ్యుడా! నీ ఆశ్రమంలో రాత్రి గడిపాం. ఇక మా నివాస స్థానానికి వెళ్లడానికి మాకు అనుమతిని ఇవ్వు’
‘చిత్రకూట పర్వతం మీద తేనె, దుంపలు, పళ్లు బాగా దొరుకుతాయి. మహాబలుడైన ఓ రామా! చిత్రకూటం నీకు సరైన నివాస స్థలం అనే అనుకుంటున్నాను. కాబట్టి అక్కడికి వెళ్లు. ఆ పర్వతం పైన అనేక రకాల చెట్లు ఉంటాయి. కినె్నరలు, కింపురుషులు, ఉరగులు, దేవతలు దాని మీద నివసిస్తూంటారు. దుంపలు, పళ్లతో సమృద్ధమైన ఆ పర్వతం పవిత్రమైంది. అందమైంది కూడా. రామా! నెమళ్ల కూతలతో ప్రతిధ్వనించే ఆ చిత్రకూట పర్వతం మీద అడవి మధ్యలో గుంపులుగా తిరిగే ఉత్తమమైన ఏనుగులు, లేళ్లు నీకు కనపడతాయి. నవ్వు సీతతో కలిసి నదులు, సెలయేళ్లు, కొండచరియలు, చిన్న పెద్ద గుహలు, జలప్రవాహాలు చూస్తూ ఆనందించచ్చు. మంగళకరమైన ఆ చిత్రకూట పర్వతం మీద కోయష్టిక పక్షులు, కోకిలలు సంతోషంగా కూస్తూంటాయి. అటు ఇటు తిరిగే అనేక మృగాలతోను, మదించిన ఏనుగులతోనూ అది అందంగా ఉంటుంది. అలాంటి చిత్రకూటానికి వెళ్లి ఆశ్రమంలో నివసించు’ భరద్వాజుడు సూచించాడు. (అయోధ్యకాండ సర్గ 54)
ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓసారి రామాయణంలోని తను చెప్పిన కాండని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో 5 తప్పులు చెప్పాను. క్షంతవ్యుణ్ణి. అవి చెప్తాను వినండి.’
మీరా తప్పులని కనుక్కోగలరా?
................................

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:

పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన రామాయణం పేరు?
-జనప్రియ రామాయణం

క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1.లక్ష్మణుడితో రాముడు చెప్పిన, కర్మ సిద్ధాంతానికి చెందిన, ‘పూర్వ జన్మలో ఎప్పుడో నా తల్లి స్ర్తిలని తమ కొడుకుల నించి దూరం చేయడం వల్లే ఈ కష్టం వచ్చిందన్నది నిజం’ అన్నది హరిదాసు చెప్పలేదు.

మీకో ప్రశ్న

దశావతారాల్లో రామావతారం
ఎన్నో అవతారం?

-మల్లాది వెంకట కృష్ణమూర్తి