S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్పర్శ

చిన్నప్పుడు నాకు దట్టంగా జుట్టు ఉండేది. నా వెంట్రుకలు పొడవుగా ఉండి ఎప్పుడూ నా ముఖం మీద పడేవి. వాటిని సర్దుకోవడమే నాకు అనుక్షణం ఓ పెద్ద పనిగా ఉండేది. తల కిందికి దించుకొని చదువుకోవడం ప్రారంభించగానే అవి నా కళ్లకి అడ్డంగా వచ్చేవి. వాటిని పైకి అనుకుంటూ చదువుకోవడం ఓ సరదాగా ఉండేది. తల మీద వెంట్రుకలు దట్టంగా ఉండటం వల్ల తలని దువ్వుకోవడం కూడా అంత సులువుగా ఉండేది కాదు.
అప్పుడప్పుడూ మా అమ్మ వచ్చి కాస్తంత నూనె రాసి తల దువ్వేది. చలికాలం పూట మొఖానికి కాళ్లకు వాసిలైన్ రాసేది. ఆమె చేతులు నా నుదుటిని తాకినప్పుడల్లా ఏదో ప్రశాంతత లభించినట్టుగా ఉండేది. నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా మంచం మీద కూర్చొని నా తల మీద చేతులతో నిమిరేది. ఆ విధంగా నిమిరినప్పుడు ఎంతో హాయిగా అన్పించేది. మగత నిద్ర నుంచి నిద్రలోకి జారుకునేవాడిని.
చిన్నప్పుడు నాకు కావల్సినవి ఏడ్చి సాధించుకునేవాడిని. ఏడ్చినా ఇవ్వకపోతే తలని గోడకి కొట్టుకొని సాధించుకునేవాడిని. నుదురుపైన దెబ్బలతో నొప్పిగా ఉండేది. మా అమ్మ దగ్గరికి వచ్చి నుదుటి మీద చేతులతో రాసేది. దాంతో కొంత ఉపశమనం లభించేది.
ఇంటర్మీడియెట్ నుంచి మా అమ్మకి నాకూ కాస్త దూరం పెరిగింది. నాకు నేనే నూనె పెట్టుకోవడం, వాసిలైన్ బోరోలిన్ రాసుకోవడం మొదలైంది. మా అమ్మ చేతి స్పర్శ దూరమైంది.
పెళ్లైన తరువాత పరిస్థితి మారిపోయింది. అలసిపోయినప్పుడు కోపం వచ్చి తగ్గినప్పుడు మా ఆవిడ మా అమ్మలాగే తలకు నూనె రాసేది. ఆ స్పర్శ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చేది. మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి పడుకున్నప్పుడు కూడా ఆమె నా తల మీద తన చేతులతో రాసేది. అప్పుడు కూడా నాకు ఏదో తెలియని ప్రశాంతత లభించేది.
ఇప్పుడు తలలో వెంట్రుకలు తగ్గిపోయాయి. మొఖం మీద అవి పడే పరిస్థితి లేదు. కానీ మా అమ్మ చేతి స్పర్శని గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా అంతులేని ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మా ఆవిడ చేతి స్పర్శ గొప్ప ప్రశాంతతని ఇస్తుంది. మా అమ్మని ఆమె చేతి స్పర్శని తలచుకున్నప్పుడల్లా గతంలోకి ప్రయాణం చేస్తున్నట్టు అన్పిస్తుంది.
ఓ చిన్న స్పర్శ హృదయాన్ని కదిలిస్తుంది అది అమ్మ స్పర్శే కావొచ్చు. ప్రేమపూర్వకమైన ఏ స్పర్శ అయినా ఆ అనుభూతి కలుగుతుంది.
ఓ చిన్న స్పర్శ ఎందరి జీవితాలనో ప్రభావితం చేస్తుంది. వాళ్ల జీవితంలో మార్పుని తీసుకొని వస్తుంది. ఓ చిన్న స్పర్శ ద్వారా ప్రేమ ప్రవహిస్తుంది. బాధ తొలగిపోయినట్టు అన్పిస్తుంది. బాధలో కూరుకుపోయిన వ్యక్తుల జీవితాలకి వెలుగుని ప్రసాదిస్తుంది.
భార్యాభర్తల మధ్యన పేరుకున్న అగాధాన్ని అంతం చేస్తుంది ఓ చిన్న ప్రేమపూర్వకమైన స్పర్శ.
అందుకే తెలుగులో ఓ కవి ఇలా అన్నాడు-
మామూలు కర స్పర్శే
అనుకుంటావు నువ్వు
కానీ-
అందులో
అంతులేని ప్రేమ కూడా
ప్రవహిస్తుంది.

**

-జింబో 94404 83001