S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోహినూర్ ఎవరిది..?

==============
ఆర్థికంగా భారత్ బలోపేతం కావాలి.. వర్తమాన, భవిష్యత్ విషయాలపై
దృష్టి సారించాలి.. ఎప్పుడో పాతబడిన విషయాలపై (కోహినూర్)
ఇప్పుడు చర్చ అనవసరం.
- బ్రిటన్ ప్రధాని కేమరాన్
===============

‘కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది? అది ఎవరిది?’- అని అడిగితే చాలామంది.. ‘ఆంధ్రప్రదేశ్‌లో దొరికింది.. అది భారతదేశానిదే..’ అని ఠక్కున సమాధానం చెబుతారు. కానీ, ఆ వజ్రం తమదేనంటూ పాకిస్తాన్ ఇటీవల కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ప్రపంచంలోనే మేటి వజ్రంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ‘కోహినూర్’ తమదంటే తమదని దాయాదులైన భారత్, పాక్ వాదులాడుకుంటుండగా- దానిపై సర్వహక్కులూ తమవేనని, దాన్ని ఎవరికీ తిరిగి ఇచ్చేదిలేదని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తేల్చిచెబుతోంది. అనేకానేక అపోహలు, వింతగొలిపే విశ్వాసాలు, మరెన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ మేలుజాతి వజ్రంపై తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తూనే ఉంటాయి.
హిందూ రాజులకు, పారశీక రాజులకు మధ్య ‘కోహినూర్’ కోసం యుద్ధాలు జరిగాయి. చివరకు ఈ వజ్రం బ్రిటిష్ వారికి దక్కింది. 1877లో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్ట్భాషిక్తురాలైన సందర్భంగా ఆమె కిరీటంలో ఇది ప్రధానమైన వజ్రంగా చేరింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వజ్రం ప్రస్తుతం లండన్‌లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ నడుమ పదిలంగా ఉన్నప్పటికీ- దీన్ని ఎప్పటికైనా చేజిక్కించుకోవాలన్న ఆశ భారత్, పాక్ దేశాల్లో తగ్గలేదు. మగవారి పాలిట శాపంగానూ, ఆడవారికి మేలుచేసేదిగానూ కోహినూర్‌పై అనేక అపోహలు, నమ్మకాలు ఉన్నప్పటికీ, ఇది ఎప్పటికైనా తమకే చెందాలని భారత్, పాక్ ఆరాటపడుతున్నాయి. చారిత్రక విశేషాలతో దీని గురించి వెలువడే సరికొత్త కథనాలు దేశదేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
గోల్కొండ రాజ్యం నుంచి...
ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ‘కోహినూర్’ నిజానికి తెలుగువారి అమూల్య సంపద. గోల్కొండ రాజ్యం నుంచి బ్రిటన్ వరకూ సాగిన దీని ప్రస్థానంలో వివాదాలకు, విశ్వాసాలకు అంతే లేదు. గోల్కొండ రాజ్యంలోని కొల్లూరు గనిలో ఈ అసాధారణ వజ్రం దొరికిందని చరిత్రకారుల కథనం. పారశీక భాషలో కోహినూర్ అంటే ‘కాంతి పర్వతం’ అని అర్థం. గనిలో లభించినపుడు ఇది 793 కారట్లతో భారీ వజ్రంగా ఉండేది. ప్రస్తుతం ఇది 105.6 కారట్లతో 21.6 గ్రాముల బరువుతో తళుకులీనుతోంది.
మార్వా రాజు మహ్లక్ దేవ్ ఈ వజ్రానికి తొలి యజమానిగా (1304లో) చరిత్రపుటలకెక్కాడు. ఆ తర్వాత మార్వా సంస్థానాన్ని కైవసం చేసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. ఖిల్జీ సేనాని కపూర్‌తో సంధి కుదుర్చుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో దిల్లీ సుల్తాన్‌కు అపారమైన సంపదతో పాటు ఈ వజ్రాన్ని సమర్పించుకున్నాడన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. 1526లో కోహినూర్ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన బాబర్ వశమైంది. మొఘలులపై దండయాత్రకు పర్షియా నుంచి వచ్చిన నాదిర్ షా కోహినూర్‌ను సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. వజ్రం ఆచూకీని కనుగొనేందుకు ఏళ్ల తరబడి అతను చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ‘కోహినూర్’ ఎవరి కంటా పడకుండా తన తలపాగాలోనే దాచుకుంటాడని ఓ పరిచారిక ద్వారా నాదిర్ షా తెలుసుకుంటాడు. మహమ్మద్ షాని విందుకు ఆహ్వానించి, తలపాగాలు పరస్పరం మార్చుకుందామని నాదిర్ షా ప్రతిపాదిస్తాడు. అలా గత్యంతరం లేని పరిస్థితిలో మహమ్మద్ షా కోహినూర్ వజ్రాన్ని నాదిర్ షాకు ధారాదత్తం చేయాల్సి వచ్చిందన్నది చారిత్రక కథనం. ఆ వజ్రాన్ని చూసిన వెంటనే నాదిర్ షా ‘కోహ్-ఇ-నూర్’ (కాంతి పర్వతం) అన్నాడని, అప్పటి నుంచి దానికి ఆ పేరు స్థిరపడిపోయిందని చరిత్రకారులు చెబుతారు.
మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ వజ్రం గొప్పదనాన్ని వర్ణిస్తూ- ‘యావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగానికి మించి కోహినూర్ విలువ ఉంటుంద’ని పేర్కొన్నాడట! దీనికి ‘బాబర్ వజ్రం’ అని పేరు ఉందని మరో కథనం ప్రచారంలో ఉంది. 1526లో పానిపట్ యుద్ధం జరిగినపుడు గ్వాలియర్ సంస్థానాధీశుడైన రాజా విక్రమ్‌సింగ్ తన సంపద అంతా సురక్షితంగా ఉండాలని భావించి విలువైన నగలను ఆగ్రా కోటకు తరలించాడని, ఆ తర్వాత బాబర్ యుద్ధంలో విజేయుడైనపుడు విలువైన విక్రమ్ సింగ్ సంపదతో పాటు కోహినూర్ కూడా అతని చెంతకు చేరిందట.
మొఘలులకు ఎలా దక్కింది?
గోల్కొండ రాజ్యం నుంచి కోహినూర్ మొఘల్ సామ్రాజ్యానికి చేరడం వెనుక మరో ఆసక్తికరమైన కథనం ఉంది. గోల్కొండ పరిపాలకుడైన అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పర్షియాకు చెందిన మీర్ జుమ్లా అనే వజ్రాల నిపుణుడు ఉండేవాడు. కొన్ని కారణాల రీత్యా జుమ్లాను గోల్కొండను వదిలి వేరే చోట పనిచేయాలని కుతుబ్ షా ఆదేశిస్తాడు. కొల్లూరు ప్రాంతం వద్ద గనిలో తవ్వకాలు జరిగినపుడు విలువైన వజ్రాన్ని మీర్ జుమ్లా గుర్తించాడు. 1656లో మొఘల్ సామ్రాజ్య అధిపతి షాజహాన్‌ను కలిసినపుడు ఆ వజ్రాన్ని జుమ్లా కానుకగా సమర్పించాడట. ఆ తర్వాత బాబర్ కాలంలో అది ‘బాబర్ వజ్రం’గా కీర్తిపొందింది. సుమారు రెండు శతాబ్దాల పాటు ఆ వజ్రం మొఘలుల అధీనంలోనే ఉందని, మహమ్మద్ షా పాలకుడిగా ఉన్నపుడు నదిర్ షా దాన్ని చేజిక్కించుకున్నాడని చారిత్రక పరిశోధకులు పేర్కొన్నారు. మహమ్మద్ షా హయాంలో మొఘల్ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకోగా, పర్షియా రాజైన నాదిర్ షా ఆధిపత్యం మొదలైంది. 1739లో నాదిర్ షా దిల్లీని కైవసం చేసుకున్నపుడు మహమ్మద్ షాను ఖైదు చేయడమే గాక అతనికి చెందిన విలువైన ఆభరణాలను చేజిక్కించుకున్నాడు. తనకు దక్కిన ఆభరణాల్లో అమూల్యమైన వజ్రాన్ని ‘కోహినూర్’గా అభివర్ణించి పర్షియాకు తన వెంట తీసుకుపోయాడు. 1747లో నాదిర్ షాను సొంత మనుషులే హత్య చేయగా, అతని 14 ఏళ్ల మనుమడు షారుఖ్ మీర్జా కోహినూర్‌ను తన వద్ద ఉంచుకుంటాడు. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన అఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ అబదాలీకి కోహినూర్‌ను షారుఖ్ మీర్జా కానుకగా ఇచ్చాడట. దీంతో అహ్మద్ అబదాలీ ఆ వజ్రాన్ని ఆఫ్ఘన్‌కు తీసుకునిపోతాడు. అబదాలీ మరణానంతరం అతని కుమారుడు తిమూర్ ఆఫ్ఘన్ పాలకుడిగా పగ్గాలు చేపడతాడు. తిమూర్ మరణించినపుడు అతనికి చెందిన 23 మంది కుమారులు రాజ్యాధికారం కోసం ఘర్షణ పడతారు. పెద్దకుమారుడైన జమన్ షా, అతని సోదరుల్లో ఒకడైన షా షుజా పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చేరుకుంటారు. పాక్‌లో ‘పంజాబ్ సింహం’గా ప్రసిద్ధి చెందిన మహారాజా రంజిత్ సింగ్ వద్ద జమన్ షా, షా షుజా ఆశ్రయం పొందుతారు. షా షుజా వద్ద విలువైన కోహినూర్ వజ్రం ఉందని తెలుసుకుని దాన్ని పొందేందుకు రంజిత్ సింగ్ చాలారకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి 1813లో ఆ వజ్రాన్ని షా షుజా అయిష్టంగానే రంజిత్ సింగ్‌కు ఇస్తాడు. అప్పటి నుంచి రంజిత్ సింగ్ తన కిరీటంలో మిగతా వజ్రాలతో పాటు కోహినూర్‌ను ధరించేవాడు. రంజిత్ సింగ్ మరణానంతరం 1843లో అతని మైనర్ కుమారుడైన దులీప్ సింగ్ రాజుగా బాధ్యతలు చేపడతాడు. 1849లో బ్రిటిష్ వారు పంజాబ్‌ను కైవసం చేసుకుని తమ పరిపాలన కిందకు తెచ్చుకుంటారు. ఆ సమయంలో దులీప్ సింగ్ అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీతో ఒప్పందం చేసుకుంటాడు. ‘లాహోర్ ఒప్పందం’గా దీనిని చరిత్రకారులు చెబుతుంటారు. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్ మహారాణికి అందజేయాలన్నది ఆ ఒప్పందంలో ఒక అంశం. లార్డ్ డల్హౌసీ కోహినూర్‌ను లాహోర్ నుంచి బొంబాయికి తీసుకువచ్చినపుడు జీవితంలో ఎన్నడూ పొందని సంతోషాన్ని చవిచూశానని 1850లో రాసుకున్నాడు. ఆ తర్వాత 1850 ఏప్రిల్ 6న ‘హెచ్‌ఎంఎస్ మెడియా’ అనే నౌకలో కెప్టెన్ రేమ్సే పర్యవేక్షణలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ కోహినూర్ ముంబయి నుంచి లండన్ చేరింది. 1850 జూలై 3న లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో విక్టోరియా మహారాణికి దీన్ని అందజేశారు. ఆ వజ్రం పరిమాణాన్ని తగ్గించాలని రాణి ఆజ్ఞాపించడంతో డచ్‌కి చెందిన ‘కోస్టర్’ సంస్థ ఆ పనిని చేపట్టింది. 38 రోజుల వ్యవధిలో 43 శాతం మేరకు బరువును తగ్గించి 108.93 కారట్ల వజ్రంగా కోహినూర్‌కు నగిషీలు దిద్దారు. 1853లో దీనికి మరిన్ని మెరుగులు దిద్దారు. విక్టోరియా మహారాణి అయిదేళ్లపాటు ధరించాక మళ్లీ మార్పులు చేశారు. లండన్‌లోని క్రిస్టల్ పార్క్‌లో 1851లో ‘గ్రేట్ ఎగ్జిబిషన్’లో పౌరులు దీన్ని సందర్శించేందుకు తొలిసారిగా అనుమతి ఇచ్చారు.
1902లో మహారాణి కోడలు అలెగ్జాండ్ర, 1911లో క్వీన్ మేరీ పట్ట్భాషేకాల సందర్భంగా వారి కిరీటాల్లో కోహినూర్ చేరింది. 1937లో క్వీన్ ఎలిజబెత్ పట్ట్భాషేకం సందర్భంగా ఆమె ధరించిన నగల్లో ప్రధాన అలంకరణగా ఈ వజ్రం కాంతులీనింది.
భారత్ వినతులకు స్పందన లేదు..
కోహినూర్‌ను తమకు ఇచ్చేయాలంటూ భారత్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించడం లేదు. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించాక 1947లో ఒకసారి, 1953లో మరోసారి ఇదే విషయాన్ని విన్నవించినా ఎలాంటి ఫలితం దక్కలేదు. 1976లో అప్పటి బ్రిటిష్ ప్రధాని జిమ్ కల్లగాన్ కోహినూర్‌పై తమ ప్రభుత్వ వైఖరిని నిర్మొహమాటంగా ప్రకటించారు. శతాబ్దాల క్రితం జరిగిన సంఘటనల్ని ఇపుడు తిరగతోడలేమని, 1849లో లాహోర్ మహారాజాతో శాంతి ఒప్పందం జరిగిన సందర్భంగా కోహినూర్ బ్రిటిష్ కిరీటంలో చేరిందని ఆయన పేర్కొన్నారు. కోహినూర్‌ను వెనక్కి ఇచ్చేయాలంటూ బ్రిటన్ మహారాణికి తాను సలహా ఇవ్వలేనని ఆయన భారత్, పాక్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. 1997లో భారత్ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్ నుంచి రాణి ఎలిజబెత్-2 హాజరైనపుడు పలువురు భారతీయులు, బ్రిటన్‌వాసులు ఇదే విషయమై విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ‘టవర్ ఆఫ్ లండన్’లో మిగతా వజ్రాలతో పాటు కోహినూర్ సందర్శకులకు కనువిందు చేస్తోందని, దీన్ని తిరిగి ఇచ్చేయాలంటూ వస్తున్న వినతులను పరిశీలించే పరిస్థితి లేదని బ్రిటిష్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్ 2013లో మన దేశాన్ని సందర్శించినపుడు- ‘తిరిగి ఇచ్చేయడం’ అనే అంశంపై తనకు ఎలాంటి నమ్మకాలు లేవని కరాఖండీగా చెప్పారు. ‘టవర్ ఆఫ్ లండన్’పై దాడి చేసి కోహినూర్‌ను పట్టుకుపోవాలే తప్ప- చట్టపరంగా దాన్ని వెనక్కి ఇచ్చే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.
అలాగే, పాక్ నేతలు చేసిన అభ్యర్థనల్ని సైతం బ్రిటిష్ సర్కారు పట్టించుకోవడం లేదు. 1976లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో కోహినూర్ కోసం చేసిన విజ్ఞప్తిని బ్రిటిష్ పాలకులు త్రోసిపుచ్చారు. బ్రిటిష్ జాతీయ సంపదగా పేర్కొంటూ కోహినూర్‌ను లండన్‌లోని ‘జ్యూయల్ హౌస్’లో ఉంచారు. కాగా, కోహినూర్ విషయంలో తమ వాదనలను భారత్, పాక్ నెగ్గించుకునే పరిస్థితులు ఏ మాత్రం లేవని న్యాయ నిపుణులు అంటున్నారు. చట్టపరమైన చిక్కుల వల్ల కోహినూర్ ఎవరికి చెందుతున్నది అంత సులభంగా తేలే అంశం కాదు. చట్టాల వల్ల కానపుడు భారీగా డబ్బు పెట్టి ఆ వజ్రాన్ని దక్కించుకోవాలన్నా అదీ అసాధ్యంగానే కనిపిస్తుంది. కోహినూర్‌ను బ్రిటన్ విక్రయిస్తుందా? లేదా? అన్నది ఊహాజనితమైన విషయమైనప్పటికీ, దాన్ని కొనేంత ఆర్థిక స్థోమత ఈ రెండు దేశాలకూ లేవన్నది జగమెరిగిన సత్యం.
కోహినూర్ కోసం తాను ఇప్పటివరకూ బ్రిటన్ రాణికి, తమ ప్రభుత్వానికి 786 లేఖలు రాసినట్లు ఇటీవల పాక్ కోర్టులో కేసు వేసిన న్యాయవాది జాఫ్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించడంతో- ఈ కేసులో ఎలాంటి వాదప్రతివాదనలు జరుగుతాయో, లాహోర్ కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందోనన్న విషయం ఇప్పటికే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దాయాదులైన భారత్, పాక్ అవునన్నా, కాదన్నా ప్రస్తుతానికి కోహినూర్ చట్టపరంగా బ్రిటన్‌దే. దాని కోసం అదేపనిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కన్నా, మన దేశంలో లభించిన అపురూప వజ్రం లండన్‌లో కాంతులీనుతోందని భారతీయు లు సంబరపడాలా?
*

కోహినూర్ ప్రస్థానం ఇదీ..
* సుమారు అయిదువేల సంవత్సరాల క్రితం గోల్కొండ సామ్రాజ్యంలోని కొల్లూరు గని (ఇప్పటి గుంటూరు జిల్లా)లో ఈ వజ్రం లభించింది.
* ఒకానొక సంస్కృత గ్రంథంలో దీన్ని ‘శ్యమంతక మణి’గా అభివర్ణించారని ‘వజ్ర మైనింగ్’ సంస్థ చెబుతోంది.
* క్రీ.శ. 1200 నుంచి 1300 వరకూ ఇది వివిధ సంస్థానాధీశుల అధీనంలో ఉండేది. మార్వా రాజుల నుంచి 1306లో కాకతీయ ప్రభువులు దీనికి యజమానులుగా వ్యవహరించారు.
* 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఈ వజ్రం దిల్లీ సుల్తాన్లకు చేరింది.
* 1526లో బాబర్ చక్రవర్తి చేజిక్కించుకున్నాక మొఘల్ సామ్రాజ్యాధీశుల వద్ద సుమారు రెండు దశాబ్దాల పాటు కోహినూర్ ఉంది.
* మొఘల్ సామ్రాజ్యంపై గెలిచినపుడు 1739లో పర్షియాకు చెందిన నాదిర్ షా వద్దకు చేరింది.
* నాదిర్ షా హత్యానంతరం అతని మనవడు షా షుజా ద్వారా ఈ వజ్రం పంజాబ్ పాలకుడైన రంజిత్ సింగ్ చెంతకు చేరింది.
* 1851లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్షౌసీ కోహినూర్‌ను కైవసం చేసుకుని లండన్‌కు చేర్చాడు. లండన్‌లోని క్రిస్టల్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచినపుడు కోహినూర్ బరువు 186 కారట్ల నుంచి 105 కారట్లకు తగ్గింది.
* ఎలిజబెత్ రాణి కిరీటంలో 1936లో చేరింది.

పాక్ కోర్టులో పిటిషన్
ప్రస్తుతం లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రం నిజానికి తమ దేశానిదేనని, దాన్ని వెనక్కి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పాకిస్తాన్‌లోని లాహోర్ హైకోర్టులో తాజాగా ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. అప్పటి అవిభక్త పంజాబ్ రాష్ట్రాన్ని పరిపాలించిన రంజిత్ సింగ్ మహారాజా మనవడైన దులీప్ సింగ్ కోహినూర్‌ను బ్రిటన్‌కు తీసుకువెళ్లాడని, న్యాయపరంగా చూస్తే ఆ వజ్రం పాక్‌కే చెందుతుందని జావేద్ ఇక్బాల్ జాఫ్రీ అనే న్యాయవాది కేసు వేశాడు. ఎలాంటి చట్టాలు లేని ఆ కాలంలో దులీప్ సింగ్ కోహినూర్‌ను లండన్‌కు తీసుకువెళ్లారని, అప్పటి సంఘటనలకు ఇప్పటి చట్టాలు వర్తించవు గనుక కోహినూర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేయాలంటూ అతను వాదిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో కోహినూర్ కోసం తొలిసారిగా కోర్టును జాఫ్రీ ఆశ్రయించాడు. ప్రతివాదిగా బ్రిటన్ రాణిని పేర్కొనడంతో దాఖలైన పిటిషన్‌ను అప్పట్లో కోర్టు కొట్టివేసింది. అయితే, కొన్ని మార్పులతో జాఫ్రీ మళ్లీ పిటిషన్ వేయడంతో దాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు లాహోర్ హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2తో పాటు పాక్‌లోని బ్రిటిష్ హైకమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చడంపై కోర్టు రిజిస్ట్రార్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను త్రోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ ఖలీద్ మహమ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. 1947లో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించింది గనుక అంతకుముందు జరిగిన సంఘటనలను ఇపుడు అంగీకరించాల్సిన పని లేదని, ఎలాంటి హక్కులూ లేకపోయినా 1953లో పట్ట్భాషేకం సందర్భంగా ఎలిజబెత్ రాణి కోహినూర్‌ను కిరీటంలో ధరించారని జాఫ్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు న్యాయబద్ధంగా సేకరించలేదని, మహారాజా రంజిత్ సింగ్ మనవడైన దులీప్ సింగ్ నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇతరులకు చెందిన ఆస్తిని చేజిక్కించుకోవడం ఏ చట్టం ప్రకారం చూసినా అన్యాయమేనని ఆయన అంటున్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రాంత సాంస్కృతిక వారసత్వానికి కోహినూర్ ప్రతీక అని, గనుక దాన్ని వెనక్కి ఇచ్చేయడం అన్ని విధాలా న్యాయమని ఆయన వాదిస్తున్నారు. ఆ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకునేలా పాక్, బ్రిటన్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని జాఫ్రీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
*

మోదీ వచ్చి వెళ్లినా..
భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ లండన్‌లోని బకింగ్‌హ్యామ్ ప్యాలెస్‌ను సందర్శించి బ్రిటన్ రాణితో భేటీ అయ్యారు. రాణి ఇచ్చిన విందులో పాల్గొని, అక్కడి విలువైన వస్తువులను పరిశీలించారు. మోదీ పర్యటన సందర్భంగా కోహినూర్‌ను భారత్‌కు తిరిగి అప్పగించాలన్న చిరకాల డిమాండ్ కొలిక్కి వస్తుందనుకున్నా ఆ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదు. ఆ డిమాండ్ నెరవేరితే మోదీ పర్యటన చరిత్రలో నిలిచిపోయేదని బ్రిటన్‌లో ఆసియా ప్రాంతవాసులకు చాలాకాలంగా సేవలందిస్తున్న ఎంపీ కీత్ వాజ్ వ్యాఖ్యానించారు.

-మాధవి