S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వందేళ్లు దాటినా వనె్న తగ్గని మెదక్ చర్చి (ఆథ్యాత్మికం)

కళ్లముందు ఇష్ట దేవుడు..
చుట్టూ అద్భుత కళాఖండాలు..
అద్దాల్లో కొలువైన ప్రభువు జీవిత చరిత ..
ఎటుచూసినా అద్భుతమే.. ఆధ్యాత్మికతే..
ఇలా నమూనాలు గీసిన నిపుణులు.. నైపుణ్యంతో చెక్కుచెదరని నిర్మాణం చేసిన మేస్ర్తిలు.. వళ్లువంచి రేయింబవళ్లు శ్రమించి రాళ్లెత్తిన కూలీలు గతించిపోయినా.. ఇప్పటికీ.. ఎప్పటికీ అద్భుత కట్టడంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే మహాదేవాలయంలా దర్శనమిస్తోంది మెదక్ చర్చి. సాక్షాత్తు కరుణామయుడే ఇక్కడ నడయాడుతున్నాడా? అన్నట్లుగా ఉన్న ఈ చర్చిలో అపురూప దృశ్యాలు ఎనె్నన్నో..
చర్చి నిర్మాణం చేపట్టి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శత వసంతాల ఉత్సవాలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. 2024 సంవత్సరంతో వసంతోత్సవ వేడుకలు ముగియనున్న నేపథ్యంలో ఆ చర్చి నిర్మాణం వెనుక దాగున్న శ్రమైక చారిత్రక నిజాలను ఇప్పటితరం వారు తెలుసుకోవలసి ఉంది.
1914లో ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ మత గురువు క్రూరమృగాలు సంచరించే దట్టమైన అటవీ ప్రాంతంలో కరుణామయుడి కోవెల నిర్మాణం మొదలుపెట్టాడు. సామాన్య కూలీలు మొదలుకొని నిర్మాణ రంగంలో ఆరితేరిన ఎందరెందరో అకుంఠిత దీక్షతో, విశేష కృషి చేసి ఈ అపురూప కళాఖండాన్ని తీర్చిదిద్దారు. అదే నేటి క్రైస్తవుల ఆధ్యాత్మిక మహాదేవాలయం..
ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మెదక్ చర్చి నిర్మాణం చేపట్టి తన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకున్నాడు. 1870లో ఇంగ్లాండ్‌లోని శెఫిల్డ్ నగరంలో జన్మించిన ఇతను మెథడిస్ట్ సంఘంలో అభిషేకించబడ్డాడు. 1895లోక్రైస్తవ ప్రచారం కోసం ఫాస్నెట్ లండన్ నుండి ఎస్‌ఎస్ గోల్కొండ ఓడలో ఆరు నెలల సముద్ర ప్రయాణం తరువాత మన దేశంలోని మద్రాస్ పట్టణానికి చేరుకున్నాడు. ఈ ఓడలోనే మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ బారిష్టర్ చదువు కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లినట్లు ప్రశస్తి. కొంత కాలం తరువాత ఫాస్నెట్ మద్రాస్ నుండి తన మకాంను సికిందరాబాద్‌కు మార్చుకున్నాడు. తిరుమలగిరిలోని గ్యారోసిస్ చర్చిలో పాస్టర్‌గా నియమితుడయ్యాడు. 1897లోగ్రామీణ ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని విస్తరించేందుకు మూడు రోజులు కాలినడకన వెల్దుర్తి మీదుగా వంద కిలోమీటర్ల దూరంలోని మెదక్‌కు చేరుకున్నాడు. ఇక్కడ చర్చిని 158 సంవత్సరాల క్రితం బర్లిన్ దొర నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇది కేవలం 375 రూపాయలతో నిర్మాణం చేసినట్లు భక్తులు చర్చించుకుంటారు. ఫాస్నెట్‌తో పాటు అతని అక్క ఎమ్లి ఫాస్నెట్ కూడా ఇక్కడికి వచ్చింది. పెంకుటిల్లులాంటి చర్చి పక్కన చిన్న గదుల్లో ఫాస్నెట్, అతని అక్క ఎలీ ఫాస్నెట్‌లు ఉంటూ క్రీస్తు ప్రార్థనలు చేసేవారు. సరైన వసతి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఫాస్నెట్ అత్తమామలు కొంత డబ్బు పంపించగా చర్చి పక్కనే పక్కా భవన నిర్మాణం చేసుకున్నారు. ఆ భవనం చర్చికన్నా ఎత్తుగా ఉండడంతో కొత్తగా చర్చిని నిర్మించాలన్న సంకల్పం కలిగింది ఫాస్నెట్‌కు. నిధుల సమీకరణకై ఇంగ్లాండ్ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాడు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసేవారు ఒక నెల వేతనం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ నిధులతో ఫాస్నెట్ మెదక్‌కు చేరుకుని చారిత్రక దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
నిజాం ప్రభువు నుండి వెయ్యి ఎకరాల భూమిని కొనుగోలు చేసినా ఏ ప్రదేశంలో నిర్మించాలో అంతుచిక్కక సతమతమయ్యాడు ఫాస్నెట్. ఈ నేపథ్యంలోనే కారణజన్ముడు ప్రత్యక్షమై రణగడ్డ(బోరుగడ్డ) అనే ఎతె్తైన ప్రాంతంలో నిర్మాణం చేయాలని ఆజ్ఞాపించాడట. అలా చర్చి నిర్మాణానికి 1914లో ముహూర్తం పెట్టారు. అప్పటికి అది క్రూరమృగాలు సంచరించే అటవీప్రాంతం. భారతదేశం ఆంగ్లేయుల పాలనలోనే ఉన్నా నైజాం ప్రాంతంపై వారికి హక్కులు లేకపోవడంతో చర్చి నిర్మాణం అనుమతి కోసం ఫాస్నెట్ నిజాం ప్రభువును ఆశ్రయించాడు. అందుకు సమ్మతించిన నిజాం ప్రభువు కొన్ని నిబంధనలు విధించాడు. అందులో ముఖ్యమైనది ఈ చర్చి హైద్రాబాద్‌కు పేరు తెచ్చిన చార్మినార్ కన్నా ఎక్కువ ఎత్తు ఉండకూదన్నది. చార్మినార్ ఎత్తు 177 అడుగులు కాగా, మెదక్ చర్చి ఎత్తు 175 అడుగులు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పులో నిర్మాణం చేపట్టారు.
ఏకకాలంలో ఆరు వేలమంది ప్రార్థన చేయడానికి వీలుగా ఈ చర్చిని నిర్మించారు. ప్రపంచంలో రెండవదిగా, ఆసియాలో మొదటి చర్చిగా ఇది చరిత్రకెక్కింది. ఈ చర్చి నిర్మాణం డంగు సున్నంలో గుడ్లు, బెల్లం, కరక్కాయలు, ఇసుక, సున్నం, బెండకాయలు, కలబంద, జనుమును కలిపి ఉడకబెట్టి గంధంలా తయారుచేసి రాళ్ల మధ్యలో పెట్టేవారు. కర్నాటకకు చెందిన కాశవారు మంబోజిపల్లి సమీపంలో గల గుట్టలో రాళ్లు తొలిచారు. ఇంగ్లాండ్‌కు చెందిన బ్రాడ్‌షా గ్యాస్‌హోప్ అనే ఆర్కిటెక్ట్ చర్చి నిర్మాణం కోసం డిజైన్ చేశారు. ఇటలీ నుండి నేలపై పరిచే రాళ్లను తెప్పించారు. ప్రార్థన సమయంలో ప్రతిధ్వనులు వినిపించకుండా రబ్బరు, పత్తి, పలురకాల రసాయనాలు వినియోగించి ఎకోప్రూఫ్ చేయించారు. ప్రసిద్ధ సువార్త కేంద్రాన్ని బైబిల్ సూక్తులను ఆధారం చేసుకుని నిర్మించారు. పరిశుద్ధ గ్రంథం పఠన వేదిక దేవదారు కర్రతో తయారుచేసారు. దీన్ని జెకోస్లేవియా దేశస్థులు చాలా రోజులు శ్రమించి గరుడ పక్షిని తలపించేలా కళాత్మకంగా చెక్కారు. చర్చిలో కనిపించే అద్దాల కిటికీలకు ప్రత్యేకత ఉంది. ఇంగ్లాండ్ చిత్రకారుడు ఓ సాలిస్ బరి వీటిని రూపొందించాడు. చిన్న చిన్న స్టెయిన్ గ్లాస్ ముక్కలతో సృజనాత్మకంగా తయారుచేసిన అద్దాల కిటికీలు క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలుపుతాయి. ఇలా చర్చి నిర్మాణానికి దాదాపు రూ.14 లక్షల వ్యయం అయినట్లు చరిత్ర చెబుతోంది.
చర్చిలో మధుర స్వరాలను ఒలికించే సంగీత వాద్య పరికరం పైప్ ఆర్గాన్ కనిపిస్తుంది. దీన్ని రాబర్ట్ ఫాస్నెట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. 36 స్వరాలు వినిపించే ఈ పైప్ ఆర్గాన్ నుండి ఏ మూలన కూర్చున్నా స్వరం ఒకే స్థాయిలో వినిపిస్తుంది. మెదక్ చర్చిలో ఒక గంట మోగుతుంది. ఈ గంటను గిల్లెట్ జాన్సన్ చేయించాడు. ఈ గంట శబ్దం ఐదు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. 1939 మే 28న చివరిసారి ప్రార్థనలో పాల్గొన్న చార్లెస్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. తరువాత ఫాస్నెట్ 1950 సెప్టెంబర్ 30న తుది శ్వాస వదిలారట.
ఇందిరా గాంధీ, ఎన్‌టిఆర్, చంద్రబాబు, వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి రాజకీయ నేతలు, ఎందరో సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు, విదేశీయులు ఈ చర్చిని దర్శించి కొనియాడారు. చర్చి నిర్మాణానికి ముందే ఇక్కడ వివాహాలు జరిగేవి. 1909 మార్చి 1న మొదటి వివాహం జరిగినట్లు ఆధారాలు పేర్కొంటున్నాయి. అప్పటి వివాహ నమోదు పుస్తకం ఇప్పటికీ భద్రంగా ఉండడం విశేషం. క్రైస్తవులు పాటించే పండుగల సందర్భాలలోను, ప్రతి ఆదివారం రోజున ఇక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది.

-తమ్మలి మురళీధర్