S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్యాంకు కృష్ణుడు! (కళాంజలి)

అయ్యదేవర పురుషోత్తమరావు గారు కవి, గాయకుడు, రచయిత, రంగస్థల నటుడు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. జీవితంలో ఎంతో సాధించినా వీరు నిండు కుండ. బంగారు కొండ. కళాకారుడిగా ఎన్నో గౌరవాలు పొందారు. అయినా, వీరి మాట సున్నితం, మనసు నవనీతం. 3వేలకు పైగా నాటకాలు ప్రదర్శించారు. అందులో వెయ్యికి పైగా శ్రీకృష్ణుడిగా నటించారు. 500 పైగా శ్రీకృష్ణదేవరాయలుగా వేశారు. వీరు ‘చింతామణి’లో బిల్వమంగళుడిగా ఎంతో ప్రఖ్యాతి గాంచారు. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో విష్ణువు, శ్రీనివాసుడు, శ్రీరాముడుగా ఎంతో పేరు పొందారు. మధురమైన కంఠం, తీయని మాటలు వీరి సొత్తు. మంచి మనిషి, మహామనీషి అయ్యదేవర.
ప్రశ్న: మీ బాల్యం గురించి ...
జ: నేను 30.6.1933 నాడు జమలాపురపు దుర్గాంబ, రామ నరసింహరాయ దంపతులకు జన్మించాను. ప్రఖ్యాత సమరయోధుడు జమలాపురం కేశవరావుగారి వంశంలో జన్మించడం ఒక అదృష్టం. తరువాత అయ్యదేవర రంగనాయకమ్మ లక్ష్మీనరసింహారావు గారు నన్ను దత్తత చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారి వంశానికి వెళ్లాను నేను. నేను పుట్టింది ఖమ్మం, పెరిగింది విజయవాడ. నాకు ఉపనయనం బెజవాడలో 13.3.1944న జరిగింది.
ప్ర: మీ ఆదర్శ దాంపత్యం గురించి..
జ: నాకు దాదాపు 66 ఏళ్ల క్రితం పద్మావతితో వివాహం జరిగింది. ఇంటా బయటా సంతోషం నాకు. పిల్లలు, మనవలు, మునిమనవలు అందరూ నాకు ఎంతో సంతోషం ఇస్తున్నారు.
ప్ర: నాటకాలలో ఏయే పాత్రలు వేశారు?
జ: శ్రీకృష్ణుడు, హరిశ్చంద్ర, కృష్ణదేవరాయ, రామదాసు, తుకారాం, బిల్వమంగళుడు మొదలగు ఎన్నో పాత్రలు వేశాను. అందరూ ప్రేమతో అభినవ కృష్ణుడు, బ్యాంకు కృష్ణుడు అని పిలుచుకుంటారు. ఎందుకంటే నేను స్టేట్‌బ్యాంక్‌లో పనిచేసి రిటైరయ్యాను.
ప్ర: మీపై ఎవరి ప్రభావం పడింది?
జ: సాహిత్యపరంగా నాకు విశ్వనాథ, అడవి బాపిరాజు, దివాకర్ల వేంకటావధాని గారు అంటే ఎంతో అభిమానం. ప్రఖ్యాత చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ నాకు మిత్రుడు. సంగీత పరంగా నాకు ఘంటసాల వేంకటేశ్వరరావు అంటే ఎంతో అభిమానం.
ప్ర: మీరు ఎవరెవరితో కృష్ణుడి మేకప్ వేయించుకున్నారు?
జ: బాబూరావు, ఆదర్శ డ్రెస్ ప్యాలెస్, సురభి కేశవరావు, గుళ్లపల్లి గుంటూరు ఆదిశేషయ్య.. ఇంకా ఎందరో నాకు మేకప్ వేవారు. నటుడికి ఆహార్యాభినయం ఎంతో మంచి పేరు తెస్తుంది.
ప్ర: ఎన్ని సాహిత్య రూపకాలు వేశారు?
జ: భువన విజయంలో శ్రీకృష్ణ దేవరాయలుగా వందలసార్లు వేశాను. ఒకసారి నంది తిమ్మనగా వేశాను. భారతావరణంలో రాజరాజ నరేంద్రుడిగా వేశాను. ముత్యాలశాలలో ప్రౌఢ దేవరాయలు పాత్ర పోషించాను. ఇంద్రసభలో శ్రీనాథుడుగా వేశాను.
ప్ర: మీరు పాడుతున్నప్పుడు భావానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని అంటూంటారు.
జ: పౌరాణిక నాటకాలలో రెండు బాణీలు ఉన్నాయి. పాడుతున్నప్పుడు రాగానికి ప్రాధాన్యత ఇచ్చే బాణీ ఒకటి. భావానికి ప్రాధాన్యత ఇచ్చే బాణీ రెండవది. పద్మశ్రీ పీసపాటి నరసింహమూర్తి శ్రీకృష్ణుడి పాత్ర పోషించడంలో ప్రఖ్యాతి గాంచాడు. అతను భావానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. నాకు అతడే ఆదర్శం.
ప్ర: ఈ మధ్యనే మీ ‘త్రిలింగ ధరిత్రి’ నవల సీరియల్ ప్రారంభమైంది కదా!
జ: అవును. ఆంధ్రభూమి దినపత్రికలో కాకతీయ ప్రభువు గణపతి దేవుడి మీద నేను రాసిన ‘త్రిలింగ ధరిత్రి’ మొదలైంది. కాకతీయుల మీద ఇప్పటికే నోరి, ముదిగొండ శివప్రసాద్ కొన్ని నవలలు రాశారు కదా!
ప్ర: మీరు పొందిన గౌరవాలు, పురస్కారాలు..?
జ: ఈ మధ్యనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి నాకు ప్రతిభా పురస్కారం ఇచ్చింది.
1980 - విజయభారతి వారి నటసారథి
1986 - మిర్యాలగూడ శ్రీ త్యాగరాయ నాట్య కళాపరిషత్ - అభినవ కృష్ణ
1993 - అమెరికా తానా ఆహ్వానంపై రెండు నెలల పర్యటన.
2001 - జాతీయ సాహిత్య పరిషత్ ‘మోహనవంశీ’
2002 - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ధర్మనిధి పురస్కారం, యువకళావాహిని వారి ‘ఈలపాట రఘురామయ్య పురస్కారం’
2004 - నంది నాటకాల న్యాయనిర్ణేత
2004-06 - నిజాం కళాశాల రంగస్థల శాఖలో అధ్యాపకత్వం
2007 - కినె్నర వారి బందా పురస్కారం
2008 - కాజా కృష్ణమూర్తి పీసపాటి స్మారక పురస్కారం
2009 - కవిసామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ గారి స్మారక పురస్కారం
2010 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.27వేల రంగస్థల పురస్కారం
2012 - అభినయ కంఠీరవ బిరుదు
2013 - ఎస్‌బిహెచ్ సైదాబాద్. నాలుగు కాలనీలచే ‘బ్యాంక్ కృష్ణ’
ప్ర: నటుడిగానే కాకుండా రచయితగా ఎన్నో ప్రశంసలందుకున్నారు. వాటి వివరాలు చెప్తారా?
జ: నేను కొన్ని పుస్తకాలు, నవలలు రాశాను. అందులో కొన్ని - మరదలు - తొలి సాంఘిక నవల, పతితులు - మలి సాంఘిక నవల, మాయని మమతలు - సాంఘిక నవల, సుస్వరాలు - సాంఘిక నవల, అనుబంధం - స్వీయ చరిత్ర, అక్షతలు - కవితా సంకలనం, శ్రీకృష్ణదేవరాయలు - చారిత్రక నవల, మర్యాద - సాంఘిక నవల, రవీంద్రభారతి - సాంఘిక నవల, కళాకౌముది - వ్యాస సంకలనం, గణపతిదేవుడు - చారిత్రిక నవల, కళోపాసి - వచన కవిత, దాశరథి రామకథాసుధ - వాల్మీకి రామాయణం - వచన సంగ్రహం, ప్రౌఢ దేవరాయలు - చారిత్రక నవల, జన్మభూమి - సాంఘిక నవల.
రానున్న రచనలు..
మర్యాదా పురుషోత్తముడు - వాల్మీకి రామాయణం, నాట్య ప్రదీపిక - నాటక సంబంధ రచన, శాంతికుటీరం - సాంఘిక నవల, అయిన వాళ్లు - సాంఘిక నవల, నానాడు తెలుగునాడు - స్వీయ చరిత్ర, రాజా కృష్ణవంత్ - చారిత్రక నవల, రాజరాజ నరేంద్రుడు - చారిత్రక నవల, రఘునాథ నాయకుడు - చారిత్రక నవల, జాయపసేనాని - చారిత్రక నవల, జగన్నాథ పండితరాయలు - చారిత్రక నవల, నర్తనశాల - పౌరాణిక నవల, సంజయ రాయబారం - పౌరాణిక నవల, శ్రీకృష్ణ రాయబారం - పౌరాణిక నవల.

చిత్రాలు..సత్కారాలు, పురస్కారాలు అందుకున్న వేళ...

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి