S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవుడు చనిపోయాడు!

ఒక ఫకీరు ఒక చెట్టు కింద చల్లని నీడలో కూచుని ముస్లిం చట్టాలలోని ముఖ్యమయిన అంశాల గురించి చర్చిస్తున్నారు. చుట్టూ ఎందరో గొప్ప విద్యావంతులు, కాజీలు చేరి ఆ చర్చలో పాల్గొన్నారు. అందరూ గంభీరంగా న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు.
అక్కడికి ఒక భక్తుడు వచ్చాడు. అతని మనసు నించి ఆనందం పొంగిపొర్లుతోంది. అతని ముఖంలో కాంతి నిండి ఉంది. అతనెంతో పరవశంగా వున్నాడు. నిర్మలమయిన సంతోషంతో గానం చేశాడు.
ఫకీరు అతన్ని చూసి ‘నీ అంతులేని ఆనందానికి కారణమేమిటి?’ అని అడిగాడు. ఇంకా ‘నీలో ఏదో చెప్పలేని పరవశం పరవళ్లు తొక్కుతోంది. ఆ విషయం మాకు చెబితే మేమూ ఆనందిస్తాం కదా’ అన్నాడు.
ఆ భక్తుడు ‘మీరు చెప్పింది నిజం. సత్యం. నేను ఎందుకింత పట్టలేని ఆనందంగా వున్నానంటే దేవుడు చనిపోయాడు. అందుకని’ అన్నాడు.
ఫకీరు ‘ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా?’ అన్నాడు. భక్తుడు చిరునవ్వు నవ్వాడు.
ఫకీరు ‘నీ మనసు అదుపు తప్పినట్లుంది. నువ్వు ఇక్కడ నించి వెంటనే లేచి వెళ్లు’ అన్నాడు. భక్తుడు కదల్లేదు.
ఫకీరు అక్కడున్న వాళ్లను చూసి ‘యితన్ని ఇక్కడి నించి తీసుకెళ్లి దూరంగా వదిలేసి రండి’ అన్నాడు.
కొందరు అతన్ని లాక్కొని దూరంగా వదిలిపెట్టి వచ్చారు. మళ్లీ ధర్మాధర్మ విచారణలో పడ్డారు.
కొన్ని నిమిషాలకల్లా ఆ భక్తుడు మళ్లీ తిరిగి వచ్చాడు.
తీవ్ర చర్చలో వున్న వాళ్లని చూసి ‘సోదరులారా! దేవుడు కచ్చితంగా చనిపోయాడు. నేను ఆ విషయాన్ని నిరూపిస్తాను’ అని అరిచాడు. ఫకీరు చిరాకుగా ‘ఇతను అదుపు తప్పాడు. ఇక్కడి నించి అతన్ని తరిమేయండి. లేకుంటే మనం ప్రశాంతంగా చర్చించుకోలేం’ అన్నాడు.
అక్కడున్న కాజీలు, విద్యావంతులు అతన్ని దాదాపు లాక్కుపోయారు. అతన్ని కొట్టారు. రాళ్లు విసిరారు. గాయపరిచారు.
రక్తమోడుతున్న గాయాలతో అతను ఒక దగ్గర కదలలేక పడిపోయాడు. అందరూ మళ్లీ తిరిగి వచ్చి న్యాయం గురించి, చట్టం గురించి తీవ్రంగా చర్చించారు. చర్చ ముగిసింది. చాలామంది వెళ్లిపోయారు. కొంతమంది ఫకీర్ మాటలు వింటూ కూచున్నారు. రక్తమోడుతున్న గాయాలతో భక్తుడు మెల్లగా అందరూ వున్న చోటుకి వచ్చాడు. అతని ముఖం వెలుగుతోంది. సంతోషంగా ‘దయచేసి నన్ను నమ్మండి సోదరులారా! దేవుడు చనిపోయాడు’ అన్నాడు.
అక్కడున్న వాళ్లకు భక్తుణ్ణి చంపాలన్నంత ఆగ్రహం కలిగింది.
ఫకీర్ భక్తుణ్ణి పరిశీలనగా చూసి ‘మిత్రమా! రా! కూర్చో. నిజం. నువ్వు చెప్పింది నిజం. నిజంగా దేవుడు చనిపోయాడు. నీది సత్యదర్శనం’ అన్నాడు.
చుట్టూ వున్న జనం ఆశ్చర్యంతో ‘ఏమిటి మీరంటున్నది? మీ మాటలకు ఏమైనా అర్థముందా?’ అని ఫకీర్‌ని నిలదీశారు. ‘మీరు రెండుసార్లు ఈ వ్యక్తిని పిచ్చివాడన్నారు. ఇప్పుడేమో అతను చెప్పింది సత్యమంటున్నారు? ఎందుకని’ అని అడిగారు.
ఫకీరు ‘సోదరులారా! కాజీలు, విద్యావంతులు, నియమాలకు, చట్టాలకు నిబద్ధులు. మానవ పరిమితులకు కట్టుబడిన వాళ్లు. వాళ్లు దేవుడన్న వాడు వాళ్ల ఆలోచన మాత్రమే. అభిప్రాయాలు, ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు వాళ్ల నిజమైన దేవుళ్లు. వాళ్లు గుడ్డివాళ్లు. సత్యం గురించి వాళ్లకు ఆవగింజంతయినా తెలీదు. అందుకని వాళ్ల సమక్షంలో దేవుడుండడు. అంతేకాదు వాళ్లు దేవుణ్ణి చంపేస్తారు. వ్యర్థ చర్చల్తో సత్యాన్ని సంహరిస్తారు. మన సోదరుడు ఆ సత్యాన్ని బహిరంగ పరచడానికే దేవుడు చనిపోయాడని అన్నాడు. మనసు నించి, ప్రపంచం నించీ విముక్తి కలిగించేవాడు దేవుడు. అపరిమితుడు, అనంతుడు, చట్టాలు దేవుణ్ణి బంధించలేవు. మీరు చేస్తున్నది అదే. మనసుకు లొంగడం కాజీలకు, విద్యావంతులకు తెలుసు. దాదాపు వాళ్లంతా ఇక్కడి నించి అప్పుడే వెళ్లిపోయారు. ఈ మిత్రుడితో కలిసి ఈ చల్లని వేళ మనం ఉత్సవం జరుపుకుందాం. దేవుణ్ణి విశాల విశ్వమంతా వ్యాపించిన దైవానికి కృతజ్ఞత ప్రకటిద్దాం’ అన్నాడు.
*

- సౌభాగ్య, 9848157909