S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరట్లో గోతులు

ఫ్రెడ్‌తో నాకు మోలీ వల్ల కష్టం కలిగింది. వాళ్ళిద్దరూ పక్క పక్క ఇళ్ళల్లో ఉంటున్నారు. ఆ ఇద్దరికీ క్షణం పడదు. మోలీ ఎప్పుడూ ఫ్రెడ్ మీద ఏదో ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది.
‘‘ఫ్రెడ్ తన భార్య కోరాని నిన్న రాత్రి చంపి పాతిపెట్టాడు.’’ మోలీ నాకు ఫిర్యాదు చేసింది.
వాళ్ళ మధ్య గల వైరం తెలుసు కాబట్టి ఆ గ్రామానికి షెరీఫైన నేను దాన్ని వెంటనే నమ్మలేదు.
‘‘రుజువుతోనే మాట్లాడుతున్నాను. నిన్న అర్ధరాతి నా పడకగది కిటికీలోంచి చూసాను. అతను ఆమె శవాన్ని నా కిటికీ ఎదురుగా వాళ్ళింట్లో పాతిపెట్టాడు.’’ మోలీ చెప్పింది.
‘‘నువ్వా శవాన్ని చూసావా?’’ అడిగాను.
‘‘లేదు. నిన్న రాత్రి తవ్వే చప్పుడు వినిపించింది. ఇవాళ ఉదయం చూస్తే అక్కడ మట్టి కుప్ప కనిపించింది. ఆరడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు. అతను సమాధిని చదును చేయలేదు.’’
‘‘గొయ్యి హత్యకి రుజువు కాదు మోలీ. అందుకు శవాన్ని చూడటం ముఖ్యం.’’ చెప్పాను.
మోలీ దీన్ని అందరికీ చెప్తుందని నాకు తెలుసు. నేనేదైనా చర్య తీసుకోకపోతే గ్రామస్థులు నన్ను తప్పు పడతారన్న ఏకైక కారణంగా నేను ఫ్రెడ్‌ని కలిసి ఆ విషయం మీద ప్రశ్నించాను.
‘‘మోలీ అబద్ధం చెప్పింది షెరీఫ్. నాకు నిన్న రాత్రి నిద్ర పట్టక కొంత గొయ్యి తవ్వి పూడ్చాను తప్ప అందులో ఎవరి శవం లేదు. అది నేరమా?’’ ఫ్రెడ్ బాధగా అడిగాడు.
నేనా సమాధిని చూస్తే మోలీ చెప్పిందాంట్లో నిజం ఉందని అనిపించింది.
‘‘మీ ఆవిడ కోరా ఎలా ఉంది?’’ అడిగాను.
‘‘బానే ఉంది షెరీఫ్.’’
‘‘ ఇంట్లో లేదా?’’
‘‘లేదు. నిన్న రాత్రి కోరా చెల్లెలు వచ్చి తనతో తీసుకెళ్ళింది.’’
‘‘ఓ! ఎప్పుడు తిరిగి వస్తుంది?’’
‘‘నాకు తెలీదు.’’
కోరాకి చెల్లెలు ఉందని నాకు తెలీదు. నిజంగా చెల్లెలు ఉందా?
‘‘పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నా సమయం వృథా చేయకండి షెరీఫ్. నాకు ముఖ్యమైన పనులు ఉన్నాయి.’’ చెప్పి ఫ్రెడ్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
నేను పోస్ట్ఫాస్‌కి వెళ్ళి పోస్ట్‌మేన్‌ని అడిగాడు.
‘‘కోరాకి ఆమె చెల్లెలి నించి ఎప్పుడైనా ఉత్తరాలు వచ్చేవా?’’
‘‘అది అధికారికంగా రహస్యంగా ఉంచాల్సిన విషయం కాబట్టి చెప్పను. వాషింగ్టన్‌లోని పోస్ట్‌మాస్టర్ జనరల్ నించి మీ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి అనుమతిని తెప్పించుకుని అప్పుడు అడగండి.’’ పోస్ట్‌మేన్ జిమ్ తలబిరుసుగా చెప్పాడు.
మధ్యాహ్నం మోలీ నా ఆఫీసుకి వచ్చి అడిగింది.
‘‘శవాన్ని బయటకి తీయలేదే’’
‘‘నిన్న రాత్రి కోరా తన చెల్లెలితో వెళ్ళిందని ఫ్రెడ్ చెప్పాడు. నాకు హత్య జరిగిన రుజువులేం కనబడలేదు. ఒకతను తన ఇంటి వెనక తవ్వినంత మాత్రాన అసలు హంతకుడు కాదు.’’ చెప్పాను.
‘‘వాడు జైలుకి వెళ్ళే దాకా నేను నిద్ర పోను. నువ్వు పరమచెత్త షెరీఫ్‌వి.’’ మోలీ కోపంగా చెప్పి వెళ్ళిపోయింది.
ఆ సమస్య అంతటితో సమసిపోలేదు. రెండు రోజుల తర్వాత కౌంటీ అటార్నీ రూడీ నా దగ్గరకి వచ్చి అడిగాడు.
‘‘షెరీఫ్! ఆ నరహంతకుడ్ని ఇంకా అరెస్ట్ చేయలేదే?’’
‘‘నరహంతకుడు ఎవరు?’’ అడిగాను.
‘‘ఫ్రెడ్. కోరాను చంపిన ఫ్రెడ్.’’
రూడీ మూడేళ్ళుగా జీతం దండగ్గా తీసుకుంటున్నాడని, గ్రామంలో ఒక్క కేసు కూడా లేదని ఆరోపణ ఉంది.
‘‘కొద్దిరోజులు ఆగితే కోరా ఇంటికి తిరిగి వస్తుంది.’’ చెప్పాను.
‘‘సరే. కొద్దిరోజులే. ఈ లోగా కోరా ఎక్కడుందో విచారించి కనుక్కో.’’ రూడీ ఆజ్ఞాపించాడు.
‘‘షెరీఫ్! నా పక్కింటి మోలీ నా పక్కలో నల్లిలా తయారైంది. కోరా ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? లాంటివి మా వ్యక్తిగత విషయాలు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు.’’ కోరా చెల్లెలి అడ్రస్ అడిగిన నాతో ఫ్రెడ్ ఘాటుగా చెప్పాడు.
‘‘సరే. నా ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పు ఫ్రెడ్. ఆ సమాధిలో ఎవర్ని పాతావు?’’ ప్రశ్నించాను.
‘‘అది సమాధి అని నీకు ఎవరు చెప్పారు? అది సమాధి కాదు. నిద్ర పట్టని రాత్రి శారీరక శ్రమ చేస్తే నిద్ర పడుతుందని అక్కడ తవ్వి పూడ్చాను. అది నేరమైతే సరే.. నన్ను అరెస్ట్ చేయి.’’ ఫ్రెడ్ చేతులు చాపాడు.
రూడీని కలిసి ఫ్రెడ్ నాకు చెప్పింది చెప్పాను. అతను వౌనంగా తల పంకించాడు.
మూడు రోజుల తర్వాత రూడీ నా ఆఫీస్‌కి వచ్చి ఉత్సాహంగా చెప్పాడు.
‘‘షెరీఫ్! నువ్వు ఫ్రెడ్ ఇంటి పెరట్లో తవ్వడానికి కోర్ట్ ఆర్డర్ తెచ్చాను. మధ్యాహ్నం వెళ్ళి ఆ పని చూడు. ఈలోగా అందుకు మనుషుల్ని కుదుర్చుకో.’’
‘‘అది ఫ్రెడ్‌కి ఇష్టం ఉండదు. మనం అతని వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టడం మంచిది కాదేమో?’’ సూచించాను.
‘‘అతనికి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో మనకి అనవసరం. ఆ సమాధిని తవ్వే కోర్ట్ ఆర్డర్ మన దగ్గర ఉంది. కోర్ట్ ధిక్కార నేరం చేయకుండా ఆ పనిని ఇవాళే చేద్దాం.’’ రూడీ గట్టిగా చెప్పాడు.
సమాధి తవ్వడానికి సహాయం చేయమని నేను బార్లో అడిగిన ఇద్దరు తమని డిప్యూటీ షెరీఫ్‌లుగానే చేస్తేనే ఆ సహాయం చేస్తామన్నారు. కొంత బేరసారాలు సాగాక ‘తవ్వేంత సేపే’ వాళ్ళు డిప్యూటీ షెరీఫ్‌లు అవుతారని, ఆ పనయ్యాక మామూలు మనుషులు అవుతారని నేను చెప్పిందానికి అంగీకరించారు. ఆ సమయంలో వారికి నా యూనిఫారాలు ఇవ్వాలన్న డిమాండ్‌ని ఎదురు చెప్పకుండా అంగీకరించాను. తవ్వడానికి వెళ్ళే మమ్మల్ని చాలామంది గ్రామస్థులు అనుసరించారు.
ఫ్రెడ్‌కి రూడీ మేమెందుకు వచ్చామో చెప్తే అతను గట్టిగా కేకలు పెట్టాడు. కౌంటీ మీద పరువు నష్టం దావా వేస్తానని బెదిరించాడు. ఇంకా సమయం మించి పోలేదు కాబట్టి వెనక్కి తిరుగుదామని నేను రూడీకి చెప్పినా అతను నా మాట వినలేదు. డెప్యూటీ షెరీఫ్‌లు ఇద్దరూ తవ్వుతూంటే నేను ఫ్రెడ్ ఇంటి ఆవరణలోకి గ్రామస్థులు రాకుండా కంట్రోల్ చేయసాగాను.
మోలీ ఇంటి కిటికీలోంచి జరిగేది ఆసక్తిగా చూసే ఐదారు తలకాయలు కనిపించాయి. వాళ్ళు మూడు అడుగులు తవ్వాక వాళ్ళకి ఏదీ దొరకదనిపించింది. ఐనా రూడీ సూచన మేరకి నాలుగు అడుగుల తవ్వాక ఒకతను ఐస్‌క్రీం బండితో వచ్చాడు. అతని వ్యాపారం చురుగ్గా సాగింది. తవ్వే వాళ్ళు కూడా ఐస్‌క్రీం తినడానికి ఆగారు.
ఆ సమయంలో ఫ్రెడ్ ఇంటి బయట ఓ కార్ ఆగింది. అందులోంచి దిగిన కోరాని చూసి ఐదారు ఐస్‌క్రీంలు వాటి యజమానుల చేతుల్లోంచి నేలమీద పడ్డాయి.
‘‘ఏమిటది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఫ్రెడ్‌కేం కాలేదు కదా? వీళ్ళు ఎవరు?’’ కోరా డెప్యూటీ షెరీఫ్‌లని, జనాలని చూసి నన్ను ఆదుర్దాగా ప్రశ్నించింది.
తక్షణం మోలీ ఇంటి కిటికీ తలుపులు మూసుకున్నాయి. జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఒకడు గట్టిగా ఈల వేసాడు. రూడీ మొహం కందగడ్డలా మారింది. మోలీ ఇంటివైపు వెళ్ళి కోపంగా తలుపు తట్టాడు. ఎంత బాదినా అది తెరచుకోలేదు.
ఫ్రెడ్ కోరాతో చెప్పింది అంతా విన్నారు.
‘‘లోపలకి వెళ్దాం పద కోరా. నీ ట్రిప్ గురించి చెప్దువుగాని.’’
కోరా శవం కోసం రూడీ రప్పించిన శవవాహనం డ్రైవర్ రూడీని అడిగాడు.
‘‘అంతా వెళ్ళిపోతున్నారే? శవం ఏది?’’
‘‘శవం నడిచొచ్చింది. నువ్వింక ఇంటికి వెళ్ళు.’’ నేను వాడికి చెప్పాను.
***
మూడు రోజుల తర్వాత ఫ్రెడ్ కౌంటీ మీద, ఠూడీ మీద పదివేల డాలర్లకి నష్టపరిహార దావాని వేసాడు. తన ఆస్తి మీద దాడి, వ్యక్తిగత జీవితంలోకి చొరబడటం, మానసికంగా హింసించడం, పరువు తీయడం లాంటి చాలా అంశాలు అందులో రాసాడు.
తర్వాతి వారం కోర్ట్‌లో ఆ కేస్ విచారణకి వచ్చింది. కోర్ట్‌కి ఆ రోజు ఫ్రెడ్ ఇంటిని చూసిన వారంతా వచ్చారు. ఒక్క మోలీ తప్ప. ఐస్‌క్రీం వ్యాపారస్థుడి వ్యాపారం అక్కడ కూడా చురుగ్గా సాగింది. వాడు కూడా ఫ్రెడ్ తరఫున సాక్షి.
ఫ్రెడ్ కౌంటీ ఐదువందల డాలర్లు, రూడీ వంద డాలర్లు చెల్లించాలని కోర్ట్ తీర్పు చెప్పింది. అధికార దుర్వినియోగం చేసాడని జడ్జ్ రూడీని తీవ్రంగా మందలించాడు. తర్వాతి రెండు వారాలు రూడీ ఎవరికీ కనపడలేదు.
రెండోసారి కూడా మోలీ ఫ్రెడ్ మీద ఆరోపణ చేసింది. దాంతో రూడీ నా ఆఫీస్‌కి వచ్చాడు.
‘‘మోలీ నిన్న రాత్రి ఫ్రెడ్ ఇంట్లోంచి రివాల్వర్ పేలిన శబ్దం విన్నది. తర్వాత ఓ ఆడదాని అరుపు కూడా. నిన్నరాత్రి ఇంకో చోట సమాధి తవ్వే ఫ్రెడ్‌ని కిటికీ లోంచి చూసింది. ఇరుగుపొరుగుని నేను ప్రశ్నిస్తే వాళ్ళు కూడా మోలీ విన్నది విన్నారని రూఢీ ఐంది. ఫ్రెడ్‌ని ప్రశ్నిస్తే తృప్తికరమైన సమాధానాలు చెప్పలేదు. కోరా మాయమైంది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదని తడబడుతూ చెప్పాడు. ఈసారి ఫ్రెడ్ కోరాని నిజంగా చంపాడు.’’
నేను, రూడీ ఫ్రెడ్ ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే గోడలో దిగిన గుండు, రక్తం కనిపించాయి.
‘‘నిన్న రాత్రి ఎలుకని కాల్చాను.’’ అతను వివరించాడు.
పరుపు కవరు మాయమైంది.
‘‘అదేమైందన్నది నా వ్యక్తిగత విషయం. అమాయకుల మీద నేరారోపణ చేయడం ఎంత ఖరీదైందో మీరీపాటికి పాఠం నేర్చుకుని ఉంటారనుకున్నాను.’’ నవ్వుతూ హెచ్చరించాడు.
రూడీ మొహం బీట్‌రూట్ రంగుకి తిరిగింది.
‘‘ఫ్రెడ్. నాకు నీ పథకం అర్థమైంది. ఈ రెండో సమాధి కోసం మొదటి సమాధి నాటకం ఆడావు. నేనీ కౌంటీకి అధికారికంగా ఎన్నుకోబడ్డ డిస్ట్రిక్ట్ అటార్నీని. నా పరిధిలో ఉన్నది నేను చేస్తాను.’’ రూడీ కఠినంగా చెప్పాడు.
‘‘మళ్ళీ నిప్పులో వేలు పెట్టకండి.’’
రూడీ కళ్ళల్లోంచి నిప్పులు రాలుతూంటే బయటకి నడిచాడు.
***
రెండు వారాలు గడిచినా కోరా జాడలేదు. మోలీ యథాప్రకాఠం కోరాని ఫ్రెడ్ హత్యచేసినా చట్టం చేతులు కట్టుకుని చోద్యం చూస్తోందని గ్రామస్థులతో చెప్పసాగింది. ఐస్‌క్రీం బండివాడు ‘మళ్ళీ తవ్వకం ఎప్పుడు?’ అని నన్ను ఒకటి రెండుసార్లు అడిగాడు.
మూడు వారాల తర్వాత మళ్ళీ ఇద్దరు యూనిఫాంలోని డెప్యూటీ షెరీఫ్‌లు ఫె డ్ ఇంట్లోని కొత్త సమాధిని తవ్వుతూంటే ఫ్రెడ్ ఇంటి చుట్టూ ఇదివరకటి కన్నా ఎక్కువ మంది గుమిగూడారు. ఈసారి హాట్ డాగ్స్ బండి కూడా వచ్చింది. గ్రా మంలోని దుకాణాలన్నీ మూసేసారు. మోలీ కొందరు ఆడవాళ్ళకి టీ కలిపి ఇచ్చింది. వారంతా ఆమె పడకగది కిటికీ లోంచి టీవీలో సస్పెన్స్ డ్రామాని చూస్తున్నంత ఉత్కంఠగా తవ్వడాన్ని చూస్తున్నాను.
రెండడుగులు తవ్వాక పరుపు కవర్ కనిపించగానే జనం హాహాకారాలు చేసారు. డెప్యూటీలు దాన్ని బయటకి తీసి విప్పి అరిచారు.
‘‘నిజంగానే శవం ఉంది.’’
‘‘నేను చెప్పలా?’’ రూడీ ఉత్సాహంగా అరిచాడు.
‘‘ ఎలుక శవం.’’ ఓ డెప్యూటీ నవ్వుతూ అరిచాడు.
ఆ శవాన్ని చూడటానికి జనం నన్ను పక్కకి తోసి ఫ్రెడ్ ఇంట్లోకి దూసుకువెళ్ళారు. ఆ ఎలుక శరీరంలో గుండు చేసిన రంధ్రం కనిపించింది. ఫ్రెడ్ కావాలని మమ్మల్ని మళ్ళీ బురిడీ కొట్టించాడని నాకు బలంగా అనిపించింది. రూడీ డెప్యూటీలని ఇంకాస్త తవ్వమని పురమాయించాడు. ఏడడుగుల లోతుకి తవ్వాక నీళ్ళు పడ్డాయి కానీ కోరా శవం కనిపించలేదు. మళ్ళీ గోతిని మూసేసారు. ఫ్రెడ్ మా ముందే ఇల్లు తాళం పెట్టి లాయర్ దగ్గరకి వెళ్ళాడు.
అతను కౌంటీ మీద మరో నష్టపరిహారదావా వేసాడు. జడ్జి ఈసారి ఇంకాస్త మండిపడ్డాడు. రూడీని ఆయన పెదవి మెదపనివ్వలేదు. జూరీ సభ్యులు నాలుగు నిమిషాల్లో తమ తీర్పుని చెప్పారు. శవాన్ని ఎవరూ చూడకుండా హత్య జరిగిందనే ఆరోపణ చేయడం సరికాదని, ఫ్రెడ్‌కి నష్టపరిహారంగా కౌంటీ రెండు వేల డాలర్లు చెల్లించాలని, రూడీ వ్యక్తిగతంగా ఐదువందల డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పాడు. ఐతే కౌంటీ ట్రెషరీలో ఏడు వందల డాలర్లు మాత్రమే ఉండటంతో మిగిలింది రెండేళ్ళల్లో, పది శాతం వడ్డీతో ఫ్రెడ్‌కి చెల్లించాలని జడ్జ్ తీర్పు చెప్పాడు.
ఫ్రెడ్ రూడీని కలిసి అతను డిఏగా రాజీనామా చేసి, ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయే పక్షంలో అతను ఇవ్వాల్సింది వదులుకుంటానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రూడీ వాషింగ్టన్‌కి వెళ్ళిపోయాడు.
తీర్పు వచ్చిన వారం తర్వాత కోరా తిరిగి వచ్చింది.
గ్రామంలో ఐదు నెలలు ప్రశాంతత నెలకొంది. క్రమంగా అంతా ఫ్రెడ్, కోరాల కేస్‌ని మర్చిపోయారు. తర్వాత మళ్ళీ గ్రామస్థుల్లో కలవరం. ఫ్రెడ్ పక్కింటి మోలీ మాయమైంది. మర్నాడు ఫ్రెడ్ ఇంటి వెనక ఓ కొత్త సమాధిని అంతా చూసారు. కాని ఎవరూ నాకు ఆ విషయం మీద ఫిర్యాదు చేయలేదు. ఆ ధైర్యం ఎవరికీ లేకపోయింది అన్నది సరైన మాట. నేను కాని, ఎవరు కాని ఫ్రెడ్ ఇంట్లోని మూడో సమాధిలో జోక్యం చేసుకోదలచుకోలేదు. అది అతని వ్యక్తిగత విషయంగా భావించాం. కౌంటీ ఇంకా ఫ్రెడ్‌కి నెలసరి వాయిదాలు చెల్లిస్తోంది.
ఇప్పుడు గ్రామస్థులు చర్చించుకునేది అతని ఇంట్లోని మూడో సమాధిలో మోలీ శవం ఉందా? లేదా? అని. నిజానికి ఎవరికీ తెలీదు. తెలుసుకునే ప్ర యత్నం చేసి వేలల్లో నష్టపరిహారం చెల్లించడానికి కొత్త డిఏతో సహా ఎవరూ సిద్ధంగా లేరు.
*
(జాక్ లెమన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి