భర్తీ
Published Saturday, 14 April 2018కొన్ని ఉద్యోగాలు పదవులు మనకు కొన్ని పరిమితులని ఏర్పాటు చేస్తాయి. ఆ పరిమితులకి లోబడి పని చేయాల్సి ఉంటుంది.
1989లో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. జిల్లా జడ్జిగా వుండి జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా పనిచేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
మొదటిది ప్రభుత్వ ఉద్యోగం, రెండవది రాజ్యాంగ పదవి. రెండూ బాధ్యతాయుతమైన పదవులే. అందువల్ల నాకు కొన్ని పరిమితులు ఉండేవి.
ఈ రెండింటి కన్నా ముందు నేను కవిని, రచయితని. కవికీ రచయితకీ వుండే లక్షణం అన్యాయం జరిగినప్పుడు కలం చేతబట్టి రాయడం. గొంతెత్తడం. అయితే ఆ రెండు పదవులరీత్యా కొన్ని పరిమితులు వుండేవి. అయినా కూడా గొంతెత్తాను. బహుశా ఏ న్యాయమూర్తి నాలాగా గొంతెత్తి లేరని అంటే అది అతిశయోక్తి కాదు. స్వోత్కర్షా కాదు. నా రాతలు, నా పుస్తకాలే అందుకు నిదర్శనం.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నా వయసు రీత్యా కాలపరిమితి అయిపోయింది. రాజ్యాంగంలో దానికి ఓ వయస్సుని నిర్దేశించారు. అది లేకపోతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఆ పరిమితుల్లో బతికేవాడిని. ఇప్పుడు స్వేచ్ఛాజీవిని.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో ఏర్పరిచిన పరిమితులు అందరిలాగా నాకు వున్నాయి తప్ప మరే పరిమితులు లేవు అందుకని ఇప్పుడు స్వేచ్ఛగా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాను. నిస్సంకోచంగా నా అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నాను.
మనం రాస్తున్నప్పుడు, అందులో సామాగ్రి వున్నప్పుడు పత్రికలు ప్రచురిస్తాయి. మనకు ఎడిట్ పేజీలో ఓ సగం పేజీనో, పావు పేజీనో కేటాయిస్తాయి.
మనం మన శక్తిసామర్థ్యాలను ఉపయోగించి మనం రాయకుండా ఉంటే ఆ స్థలాన్ని మరెవరో ఆక్రమిస్తారు.
అందుకని రాస్తూ వుండాలి.
అప్పుడు మన పేజీ మనకు ఉంటుంది. ఇతరులు ఆక్రమించే పరిస్థితి వుండదు.
ఇది ఓ రచయితలే కాదు. అందరికీ వర్తిస్తుంది. వాళ్లు తాము చేయాల్సిన పనిని వాళ్లు చేయకపోతే ఇతరులు ఆ ఖాళీని పూర్తి చేస్తారు.
వాళ్లు సమర్థులు అయితే పర్వాలేదు సమాజానికి నష్టంలేదు.
వాళ్లు సమర్థులు కాకపోతే సమాజానికి కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఎవరి ప్రజ్ఞాపాటవాలని వాళ్లు ఉపయోగించుకోకపోతే వాళ్లు తమకి తాము నష్టపరుచుకున్న వ్యక్తులుగా మిగిలిపోతారు.
ఇది మన చేతిలో వుంది.
మన చేతిలోని పని.
మన ఖాళీని మనమే భర్తీ చేయాలి.