చైనా - జపాన్
Published Sunday, 22 April 2018ఉద్యోగంలో ఉన్నప్పుడే మా అబ్బాయి జపనీస్ భాష నేర్చుకున్నాడు. జపాన్ వెళతాడేమో అనుకున్నాను. కానీ అమెరికా వెళ్లాడు. జపాన్ వారి యానిమేషన్ ఫిల్మ్స్ అనే కార్టూన్‌లను మాత్రం తెగ సేకరించాడు. వాటిని నెట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేయడం కాక అప్‌లోడ్ చేసేవారిలో ఒకనిగా మారాడు. మా ఇంట్లో అందరికీ ఈ తిక్క ఉంది. ఏ పని చేసినా దాని అంతం చూడాలి. అప్పుడు నాకు జపాన్, చైనా దేశాల గురించి కొంత ఆలోచన మొదలయింది.
జపాన్, చైనా దేశాలు మూసిన పిడికిలి లాంటివి. వారి గురించి బయటి వారికి ఎక్కువగా తెలియదు. వార్తాపత్రికలు వెతికి చూచినా ఆ దేశాల గురించి వార్తలు రావు. ఎప్పుడో ఒక్కసారి ‘ద లాస్ట్ ఎంపరర్’ అనే ఫిల్మ్ ఒకటి చూచిన జ్ఞాపకం ఉంది. అలాగే కగేమూషా లాంటి సినిమాల ఆధారంగా జపాన్ సినిమాల వేపు దృష్టి మళ్లింది. ఒకసారి లలిత కళాతోరణంలో జరిగిన నాటకోత్సవాలలో భాగంగా జపాన్ కథ ఆధారంగా వచ్చిన ఒక నాటకం కూడా చూచాను. ఇవన్నీ మనసులో ఎక్కడో మూలన ఉండి ఈ మధ్యన మళ్లీ ముందుకు వచ్చాయి.
మధ్య ఆసియా దేశాలలోని ఇస్లామిక్ రాజ కుటుంబాల చరిత్ర చదవడం ఈ మధ్యన బాగా అలవాటయింది. అప్పుడే చైనా జపాన్‌లను గురించి కూడా చదవాలని అనిపించింది. నిజానికి జపనీస్ సాహిత్యం పెద్దఎత్తున అనువాదాలకు కూడా నోచుకోలేదు. ఈ మధ్యన అనువాదాలు బాగా వస్తున్నట్టు తెలిసింది. కనుక రకరకాలుగా ప్రయత్నించి కొన్ని నవలలు సంపాదించాను. ముందుగా జపనీస్ నవలల మీద దృష్టి కొనసాగింది. కానీ మధ్యలో చైనా నవలలు ఎక్కువగా కనిపించాయి. అందులో టోంగ్వాన్ సిటీ అన్న నవల నా దృష్టిని మరింతగా ఆకర్షించింది.
టోంగ్వాన్ సిటీ నవల కొనాలని ప్రయత్నించాను. చేసిన తప్పు ఒప్పుకుంటే పోతుంది అంటారు. నాకు అచ్చు నవల దొరకలేదు. ఇంటర్నెట్‌లో ఈ-బుక్ సంపాదించాను. నవల చదవాలంటే కంప్యూటర్‌లో చదవడం అంత ఆనందంగా ఉండదు అనిపించింది. ఏకంగా పుస్తకాన్ని అచ్చు వేయించుకున్నాను. నవలలాగ ఉండే సైజులోకి దాన్ని మార్చి అచ్చు వేయించాను. చక్కగా బైండ్ కూడా చేయించుకున్నాను. ఇక ఆ నవల చదవడం మొదలుపెట్టిన తరువాత ఆపలేకపోయాను. నా అచ్చులో నవల 400 పేజీలు మించింది. అది నాకు అంత ఆకర్షణవంతంగా కనిపించడానికి ముఖ్యమయిన కారణం కుమారజీవ అన్న ఒక పేరు. ఈ కుమారజీవుడు బౌద్ధ భిక్షువు. అతడిని బలవంతంగా చైనాకు తీసుకుపోతారు. నవలలో నిండా అతని కథే ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ రకంగా లేదు. అయినా నవల ఆసక్తికరంగా ఉంది.
ఇది చాలా ప్రాచీనమయిన రచన. రచయిత పేరు గావో జియాన్‌కున్. ఇంగ్లీషు అనువాదం రావడం నాలాంటి వారి అదృష్టం. ఇక కథలోకి కదిలితే హూణుల వంశం చివరి రాజు కథ ఇది. హూణులు అనగానే ఆ మాట తెలిసినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం ఆలోచిస్తే, అటిలా అనే పేరు ఒకటి మనసులో తళుక్కుమంటుంది. చరిత్ర పుస్తకాలలో హూణులను గురించి ఎక్కువగా చదువుకున్న జ్ఞాపకం లేదు. అటిలా కూడా అంతగా పరిచయం లేని వ్యక్తిగానే ఉండిపోయాడు. అటిలా యొక్క దాయాదులలో ఒకడు ఈ నవలకు నాయకుడు. అతని పేరు హీలియాన్ బోబో.
హూణులు యుద్ధాలు చేస్తూ బతికారు. వారు ఒకచోట స్థిరంగా ఉన్న జాతి కాదు. టోంగ్వాన్ సిటీ అన్న నవలలో నాయకుడయిన హీలియాన్ బోబో నిజానికి నడుస్తున్న బిడారులో ఒక బండిలో పుడతాడు. అక్కడి నుండి కథ ఆశ్చర్యాలను పంచుతూ ముందుకు సాగిన తీరు అద్భుతంగా ఉంటుంది. నవల రాసిన తీరు కూడా ఎంతో చిత్రంగా ఉంటుంది. కేవలం కథ మాత్రమే చెప్పాలన్న ప్రయత్నం కాక అలనాటి పరిస్థితులను గురించి అర్థం చేయించిన పద్ధతి ఆసక్తిగల వారిని గట్టిగా పట్టుకుంటుంది. ఈ నాయకులకు సైన్యం ఉండాలి. సైన్యం అంటే అందరికీ గుర్రాలు ఉండాలి. వీళ్లకు గల గట్టి ఆస్తి గుర్రాలు మాత్రమే. ఈ గుర్రాలను గురించి నవలలో చెప్పిన వివరాలు మరే విజ్ఞాన సర్వస్వంలో కూడా కనిపించవు అంటే అబద్ధం మాత్రం కాదు.
మళ్లీమళ్లీ నవల అంటున్నాను. ఇది కేవలం కల్పిత కథ కాదు అన్న భావన నాకు బలంగా కలిగింది. కనుక కాస్త పరిశోధించి చూచాను. కథ మొత్తం నిజంగా జరిగింది. కథగా చెప్పడంలో ఏవో కొన్ని సంఘటనలను మాత్రం కల్పిచి చెప్పి ఉండవచ్చు. ధైర్యం లేనివాడుగా పేరు తెచ్చుకున్న బోబోను తండ్రి తన్ని తగలేస్తాడు. ఇక అతను తనంత తానుగా దేశాలు తిరగడం మొదలుపెడతాడు. మధ్యలో కొంత ప్రేమాయణం కూడా జరుగుతుంది. అలసి సొలసి పడిపోయిన బోబోకు ఒక అమ్మాయి మజ్జిగ పోసి కాపాడుతుంది. ఆ అమ్మాయి అతగాడిని ప్రేమిస్తుంది. కానీ ఒకరికొకరు వివరాలు మాత్రం చెప్పుకోరు. వాళ్లు మళ్లీ కలుస్తారు. పెళ్లి చేసుకుంటారు. పిల్లలను కూడా కంటారు. కానీ విడిపోతారు. కథలో ఎన్ని మలుపులు, సంఘటనలు ఉండాలో అన్నీ ఉంటాయి.
బోబో గొప్ప సైన్యాన్ని సంపాదించుకుంటాడు. విజయాలు సాధిస్తాడు. రాజ్యాన్ని ఏర్పరుచుకుంటాడు. చుట్టుపట్ల ఎక్కడా లేనంతగా ఎత్తు, వెడల్పు గల నగరాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు. ఆ మనిషికి నిర్ణయం జరిగిందంటే చాలు అమలు చేయడం ఒక్కటే తెలుసు.
బహుశా నేను నవలలోని ఒక పార్శ్వాన్ని పట్టుకుని ప్రభావితుడనయి చెపుతూ ముందుకు పోతున్నట్టు ఉన్నాను. బోబో హూణుల పద్ధతి ప్రకారం పరమ క్రూరుడు. తన పని జరగడానికి ఎందరినయినా, ఎవరినయినా చంపడానికి వెనుకాడడు. ఇదే నవలలో సమాంతరంగా కుమారజీవ వృత్తాంతం కూడా సాగుతుంది. అది పూర్తిగా బోబోకు వ్యతిరేకమయిన వ్యక్తిత్వం. అతడు మహా పండితుడు. భారతదేశం నుండి అతడిని తరలించిన నాడు వెంట ముప్ఫయివేల మంది శిష్యులు కూడా తరలి వెళ్లారంటే అతడి గొప్పతనాన్ని మనం ఊహించవచ్చు. వాళ్లంతా కథ చివరిదాకా, అంటే అతని కథ చివరిదాకా గురువు వెంటనే నడుస్తారు. బోబో జీవితంలోలాగే, కుమారజీవ జీవితంలో కూడా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయి. అతనికి పెళ్లి కూడా జరుగుతుంది. అదొక పెద్ద విరోధాభాసం. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకప్పుడు అతనికి చెల్లెలు వంటిది. కానీ బతుకంతా భార్యగా అతనికి ఎంతో సేవ చేస్తుంది.
కుమారజీవ అనే ఈ భారతీయ భిక్షువు చైనాలోని బౌద్ధాన్ని మార్చిన పరిస్థితి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ కథలో మాత్రం అతను పడ్డ కష్టాలు తెలుస్తాయి. మొత్తానికి నవలలో బోబోకు గల ప్రాముఖ్యత కుమారజీవకు కనిపించదు. వాళ్లిద్దరూ ఒకటి, రెండు సందర్భాల్లో తప్పిస్తే ఎదురుపడరు కూడా. రచయిత తాను చెప్పదలుచుకున్న చరిత్రను చక్కగా, ఆసక్తికరంగా చెప్పాడని నేను కాదు, ప్రపంచమే ఒప్పుకున్నది. హూణుల జీవితాలు, చైనా నాగరికత మీద వారి ప్రభావం ఒకవైపు, చైనాలో బౌద్ధం చరిత్ర మరొకవైపు ఈ నవలకు పూర్వ రంగంగా సాగుతాయి. నవలను నేను ఆపకుండా చదివినట్టు ఇదివరకే చెప్పినట్టున్నాను. అంటే ఇది నిజాలు మాత్రమే చెప్పే చారిత్రక నవలలా కాక చదివించే శక్తిగల ఒక చక్కని రచనగా ముందుకు సాగింది.
నాకు కొంతకాలంపాటు ఈ నవలను తెలుగులో రాస్తే బాగుండును అన్న ఆలోచన కలిగింది. కానీ ప్రస్తుతానికి ఆ అభిప్రాయాన్ని కాస్త పక్కన పెట్టాను అని కొంత బాధతోనే చెపుతున్నాను. తెలుగులో నవలలకు మంచి కాలం ఉన్నట్టు కనిపించదు. అందునా ఇటువంటి నవలలు రాస్తే ఎంతమంది చదువుతారు అన్నది మరొక అనుమానం.
ఈలోగా పులిమీద పుట్రలాగ మంకీ అనే మరొక చైనా నవల వచ్చి నా తల మీద పడ్డది. ప్రస్తుతం దాన్ని చదువుతున్నాను. అది ఒక రకంగా చరిత్రగాథ, మరొక రకంగా పౌరాణిక కథ. అందులో దేవతలు, స్వర్గాలు లాంటివి కూడా ఉన్నాయి. చరిత్ర పుస్తకాలలో యువాన్ చువాంగ్ లేదా హుయెన్ త్సాంగ్ అనే చైనా పండితుడు భారతదేశానికి వచ్చినట్టు చదివాము. ఆ పండితుడు మహాయానం అనే బౌద్ధం గురించిన పుస్తకాలను సేకరించి తీసుకోవడానికి మన దేశానికి వచ్చినట్టు మంకీ నవలలో చెప్పారు. నిజానికి ఈ నవల పేరు పడమటి దేశాల యాత్ర అని ఉండేదట. నేను మధ్యలో ఉన్నాను కనుక నవల గురించి మరీ చెప్పలేను. సందర్భం చూచి మరోసారి అవకాశం వినియోగించుకుంటాను. ఇటువంటి ఆసక్తికరమయిన రచనలను తెలుగు పాఠకులు ఆదరించే తీరు గురించి మాత్రం నాకు సలహాలు కావాలి.
శీర్షికలో జపాన్ అన్న మాట వాడాను. ఆ వివరాలతోనే వ్యాసం మొదలుపెట్టాను. ఆ సంగతులు కూడా మరెప్పుడో మీకు అందిస్తాను.