ఉన్నత శిఖరాలు
Published Saturday, 28 April 2018సృష్టిలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. యువకుడిలాగా ఎవరూ ఎప్పుడూ వుండలేరు. వయస్సు వస్తుంది.
ఈ మధ్య వార్తాపత్రికలో ఓ వార్త చూశాను. ఓ వ్యక్తి బొమ్మ చూశాను. గతంలో అతను ప్రభుత్వంలో ఓ ఉన్నతాధికారి. ప్రధాన సమాచార కమిషనర్‌గా పని చేశారు. కానీ ఇప్పుడు అతను అన్నీ మరిచిపోయాడు. అతన్ని చూడటానికి ఇద్దరు ముగ్గురు మనుషులు అవసరం ఏర్పడినారు.
గతంలోని పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఆయుర్దాయం పెరిగింది. ఒక ఇంట్లో రెండు మూడు తరాలకు చెందిన వ్యక్తులు వుండే పరిస్థితి ఏర్పడింది. ఆ సీనియర్ అధికారికి వచ్చినటువంటి అనారోగ్యం అందరికీ ఉండదు. చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు. వాళ్లు ఉద్యోగం చేసిన కాలం కన్నా ఎక్కువ సమయం పదవీ విరమణ చేసిన తరువాత గడుపుతున్నారు.
పదవీ విరమణ చేయగానే ఏ పనీ చేయలేమని అనుకోవడానికి వీల్లేదు. పదవీ విరమణ తరువాత కొత్త జీవితం మొదలవుతుంది. కుటుంబానికి, సమాజానికీ ఎక్కువ ఉపయోగపడే విధంగా పని చేయవచ్చు.
ఈ మధ్య నేనూ ఓ మిత్రుడు కలిసి వాకింగ్ చేస్తూ వున్నాం. మాకు దగ్గర్లో సీనియర్ సిటిజన్స్ పార్క్ కనిపించింది.
‘కాస్సేపు అక్కడ కూర్చుందామా?’ అడిగాడు మిత్రుడు.
‘మనం అప్పుడే సీనియర్ సిటిజన్స్ అయినామా?’
‘వయస్సు రీత్యా సీనియర్ సిటిజనే్స కదా!’ జవాబు చెప్పాడు మిత్రుడు.
‘వయస్సు రీత్యా సీనియర్ సిటిజనే్స కావొచ్చు. కానీ ఇప్పుడు గతంలోకన్నా ఎక్కువగా పని చేస్తున్నాం కదా’ అన్నాను.
‘అవును. 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకి సీనియర్స్ సిటిజన్స్ నిర్వచనం మార్చాలేమో’ అన్నాడు మిత్రుడు.
శరీరం సహకరించినంత వరకు ఏదో పనిని చేస్తూ వుండాలి. నిర్వాపకంగా వుండకూడదు.
డబ్బు కోసం కాదు. సమాజం కోసం పని చేయవచ్చు.
ఎవరికో ఒకరికి మనం మార్గదర్శనం చేయవచ్చు.
ఎంత మందినో ప్రోత్సహించవచ్చు.
జీవన పరుగులో పడిన మనం అప్పుడు సాధించని విషయాల మీద దృష్టి పెట్టవచ్చు. వాటిని సాధించడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేయవచ్చు.
వయస్సులో కొంతమంది ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చు. ఇప్పుడు అప్పుడు అధిరోహించిన ఉన్నత శిఖరాలని అందుకోలేక పోవచ్చు.
కానీ
ఉపయోగంగా వుండవచ్చు.
విలువైన వ్యక్తులుగా మారవచ్చు.