గుజ్జనగూళ్ళు
Published Saturday, 28 April 2018పల్లెల్లో పిల్లలంతా ఒక గుంపుగా చేరి ఈ ఆట ను ఆడుకుంటారు. ఇందులో ఆడ, మగపిల్లలు కూడా ఉంటుంటారు. రెండు జట్లుగా ఏర్పడుతారు. ఎర్రమట్టితో చిన్న బొమ్మరిల్లు కడతారు. అందులో, వంటిల్లు, ముందిల్లు, చుట్టిల్లు, పడమటిల్లు అంటూ వేర్వేరుగా కడతారు. వీటిని ముగ్గుతో వేర్వేరుగా ఏర్పరుస్తారు.
ఆ తరువాత మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. వాటికి దర్జీల దగ్గర నుంచి కత్తిరింపుల్లో వచ్చిన బట్టముక్కలను తెచ్చుకుని ఈ బొమ్మలకు అంగీలు, చీరలు కడతారు. మంచి మంచి అలంకరణలు చేస్తారు. ఈ బొమ్మల్లో పెళ్లికూతురు బొమ్మను పెళ్లి కొడుకు బొమ్మను తయారు చేస్తారు. వీటిని అందంగా అలంకరించుతారు. ఆడపిల్లల తరఫున వాళ్లు అని చెప్పి తల్లి, తండ్రి, తోబుట్టువులు, తోడు పెళ్లికూతురు అనే బొమ్మలను కూడా మట్టితో చేసి వాటికి తగిన వస్త్రాలను కడతారు. ఇంట్లో దొరికే పూసలు, తినుబండారాలు కలిపి నగలుగా అలంకరిస్తారు. ఆ తరువాత పెళ్లితంతు నిర్వహిస్తారు. అపుడు ఆడపిల్లలతరఫు వాళ్లు, మగపిల్ల తరఫున వాళ్లు అంటూ మగపెళ్లివారమండీ అని పాడుతూ ఆట మొదలు పెడతారు. ఇది ఒకరకంగా పెద్దలు చేసే పెళ్లి తంతును పోలి ఉంటుంది. వీళ్లు బొమ్మలతో పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇందులో వత్రాలు చేయడం, నోములు నోచడం లాంటివి కూడా ఈ బొమ్మలాటలో ఆడుతుంటారు. ఇందులో ముఖ్యంగా పెళ్లి ఆటనే ఎక్కువమంది ఆడుతారు. ఈ పెళ్లి ఆటలో పెద్దవాళ్లను కూడా పిలుచుకుంటూ ఉంటారు. వారు వచ్చి పెళ్లి పెద్దలుగా పిల్లలు ఆడే ఆటను నవ్వుతూ సంతోషంగా చూస్తూ వారికి సలహాలు కూడా ఇస్తుంటారు. ఈ ఆటను చూసేవారికి, ఆడేవారికి వినోదంగా ఉంటుంది.