S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నైట్ క్లర్క్ -- -మల్లాది వెంకట కృష్ణమూర్తి

ప్లజెంట్ వ్యూ మోటెల్‌లో నైట్ క్లర్క్‌గా పనిచేసే బ్రూస్‌కి తను డ్యూటీలో చేరాక కొన్ని గంటల క్రితం జరిగిన ఆ దొంగతనం గురించి తెలిసాక చిత్రం అనిపించింది.
అతనికి రాత్రి తొమ్మిదిన్నరకి ఓ అతిథి నించి టవల్స్ కావాలని ఫోన్ వచ్చింది. రాత్రిళ్లు బ్రూస్ తప్ప మరే హోటల్ సిబ్బంది ఉండరు కాబట్టి ఇలాంటి సేవలని రిసెప్షనిస్ట్ బాధ్యతతోపాటు నైట్ క్లర్కే నిర్వహించాలి. ‘కుదరదు. మీరే వచ్చి తీసుకెళ్లండి’ అని ఎవరికీ జవాబు చెప్పకూడదు అన్నది ఆ మోటెల్ పాలసీ. అతను ఆ అతిథి గదికి వెళ్లి టవల్స్ ఇచ్చి తిరిగి వచ్చిన పావుగంటకి మళ్లీ ఫోన్ మోగింది. ఇంకెవరికి ఏం కావాలా అనుకుంటూ రిసీవర్‌ని అందుకున్నాడు.
‘హలో? రిసెప్షన్?’ నా గదిలోని బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. పోలీసులకి లైన్ కలపండి’ ఇందాక తను టవల్స్ ఇచ్చిన మిసెస్ సిండీ కంఠం ఆదుర్దాగా వినిపించింది.
‘ఏమిటి?’ అదిరిపడ్డాడు.
‘అవును. నేను స్నానం చేసి బయటకి వచ్చాక నా నగల పెట్టె ఉన్న సొరుగు కొద్దిగా తెరచి కనపడింది. దాన్ని పూర్తిగా మూసానని గుర్తు కాబట్టి తెరచి చూస్తే అందులోని నగల పెట్టె మాయమైంది. ఇందాక నువ్వు టవల్స్ తెచ్చిచ్చాక వాటిని విప్పి అందులో ఉంచి బాత్‌రూంలోకి వెళ్లి వచ్చేసరికి ఈ దొంగతనం జరిగిపోయింది. వాటిని ఇన్‌స్యూర్ కూడా చేయలేదు’ సిండీ కంఠం ఆవేదనగా వినిపించింది.
వెంటనే బ్రూస్ గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఆ దొంగతనం తన మీదకి రావచ్చనే భయం కలిగింది.
‘ఇంకెక్కడైనా ఉంచారేమో చూసుకున్నారా?’ అడిగాడు.
‘అన్ని సొరుగులూ తీసి చూశాను. ఈ గదంతా వెతికాను. ఆ నగల పెట్టెని దొంగిలించారు. వెంటనే పోలీసులని పిలు’
‘అలాగే. నేను వెళ్లాక మీరు గది లోపల తాళం వేసారా?’
‘ఆ’
‘ఆఖరి ప్రశ్న. నేను వెళ్లేప్పుడు మీరు నా చేతుల్లో ఆ నగల పెట్టెని చూడలేదు కదా?’ బ్రూస్ అడిగాడు.
‘సిల్లీ. లేదు. నువ్వు వెళ్లాకే వాటిని విప్పి ఆ పెట్టెలో పెట్టి బాత్‌రూంలోకి వెళ్లాను’
‘సరే. లెఫ్టినెంట్‌కి ఫోన్ చేస్తున్నాను’
బ్రూస్ లైన్ కట్ చేసి వెనక్కి తిరిగి గోడ మీద రాసిన పోలీసుస్టేషన్ నంబర్‌ని చూసి దానికి డయల్ చేశాడు. లెఫ్టినెంట్ రూబిన్ లైన్‌లోకి రాగానే జరిగింది చెప్పాడు.
ఏడు నిమిషాల్లో రూబిన్ ప్లెజెంట్ వ్యూ మోటెల్‌కి చేరుకున్నాడు. బ్రూస్ జరిగింది వివరించాడు.
‘అప్పటి నించి ఎవరైనా హోటల్‌ని ఖాళీ చేసి వెళ్లారా?’ వెంటనే రూబిన్ ప్రశ్నించాడు.
‘లేదు. ఈ మోటెల్‌లోని వాళ్లంతా నెలసరి పద్ధతి మీద ఉంటున్నారు. ఒకటి, రెండు రోజుల కోసం వచ్చే వారికి ఇక్కడ గది ఇవ్వం.’
‘ఎంతమంది తమ గదుల్లో లేరు?’
‘ముగ్గురు. వాళ్లంతా ట్రావెలింగ్ సేల్స్‌మెన్. కేంప్‌లకి వెళ్లారు. ఇంకా...’ వెనక్కి తిరిగి తాళం చెవులు ఉంచే పీజియన్ హోల్స్‌లోని తాళం చెవులున్న కానాలని చూసి చెప్పాడు.
‘ఒకటి. రెండు. మూడు. నాలుగు.. నలుగురు లేరు. నాకు తాళం చెవి ఇవ్వకుండా తమ గదికి రానివారు కూడా కొందరు ఉండచ్చు’
‘సరే. ఎవర్నీ బయటకి వెళ్లనీకు’
తనతో వచ్చిన ఓ సార్జెంట్‌ని రిసెప్షన్‌లో కాపుంచి లెఫ్టినెంట్ రూబిన్ 404 గదికి వెళ్లాడు. సిండీ వయసు అరవై - అరవై ఐదు మధ్య ఉండచ్చు అనుకున్నాడు. ఆవిడ బ్రూస్‌కి చెప్పిన వివరాలనే అతనికీ చెప్పి, పోయిన ఆభరణాల వివరాలు రాసిన కాగితాన్ని ఇచ్చి చెప్పింది.
‘ఇవి మీరు అడుగుతారని రాసి ఉంచాను’
‘మీరు బాత్‌రూంలో ఉండగా లోపలకి ఎవరైనా వచ్చిన శబ్దం, అంటే తలుపు తెరచిన శబ్దం, అడుగుల చప్పుడు లాంటివి వినిపించాయా?’
‘లేదు. షవర్ చప్పుడుకి బయట శబ్దాలు వినిపించవు’
‘మీరు లోపల తాళం వేసుకునే స్నానానికి వెళ్లారని గట్టిగా చెప్పగలరా?’
‘నేను ఒంటరి ముసలి ఆడదాన్ని కాబట్టి సదా లోపల తాళం వేసుకునే ఉంటాను. బ్రూస్ కూడా డూప్లికేట్ తాళంచెవితో ఎప్పటిలా తలుపు తెరచుకుని లోపలకి వచ్చి టవల్స్ ఇచ్చి వెళ్లాక లోపల తాళం వేసుకున్నాను’
‘ఈ రోజు మర్చిపోలేదుగా?’
‘లేదు’ ఆవిడ స్థిరంగా చెప్పింది.
‘బ్రూస్ కొట్టేసి ఉండచ్చా?’
‘్ఛ! లేదు.. కాని ఎవరు దొంగో, ఎవరు దొరో కనుక్కోలేం’
‘అది నిజమే. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?’
‘ఇక్కడ ఉండే మిగిలిన వాళ్లతో నాకు పరిచయం లేదు. కాబట్టి ఎవరి గురించీ చెప్పలేను’
లెఫ్టినెంట్ మళ్లీ బ్రూస్ దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘ఆ గది తలుపుని బలవంతంగా తెరచిన గుర్తులేమీ లేవు. ఎవరి దగ్గరో ఆ గది డూప్లికేట్ తాళంచెవి ఉండి తీరాలి’
‘నాకు తెలిసి నా దగ్గర తప్ప ఎవరి గది డూప్లికేట్ ఇంకెవరి దగ్గరా ఉండదు’ బ్రూస్ చెప్పాడు.
‘అప్పుడు అనుమానం నీ మీదకే వస్తుంది. పైగా ఆవిడ స్నానానికి బాత్‌రూంలోకి వెళ్తోందని నీకు మాత్రమే తెలుసు. నగలు తీసి వెళ్తుందని కూడా’
‘కాని నేను దొంగని కాను. కావాలంటే నన్ను వెదకండి’ బ్రూస్ ఆవేదనగా చెప్పాడు.
సార్జెంట్ సైగ చేయగానే బ్రూస్ జేబులని, ఒంటిని తనిఖీ చేసి తల అడ్డంగా ఊపాడు.
‘రొటీన్‌గా వెదికాం తప్ప అది నీ దగ్గర ఉంటుందని కాదు. నిజంగా నువ్వు దొంగవైతే ఆ పెట్టెని నీ దగ్గర ఉంచుకోవు. ముఖ్యంగా మాకు ఫోన్ చేసింది నువ్వే కాబట్టి. ఎక్కడ దాచావు?’ లెఫ్టినెంట్ ప్రశ్నించాడు.
‘నేను దొంగని కాను. ఎక్కడా దాచలేదు. మిగిలిన అతిథుల గదులన్నీ వెతికి కాని మీరా ఆరోపణ చేయకూడదు. నన్నడిగితే ఇది ఆవిడ బస చేసిన అంతస్థులోని ఇతర గదుల్లోని అతిథుల పనై ఉండచ్చు’ బ్రూస్ స్థిరంగా చెప్పాడు.
‘వారెంట్ లేకుండా, ఆధారాలు లేకుండా ఎవరి గదుల్లో వెతక్కూడదు. వాళ్లని ప్రశ్నించడానికి కూడా వారి అనుమతితోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను’
బ్రూస్ ఆ మోటెల్ యజమానికి ఫోన్ చేసి దొంగతనం గురించి చెప్పాడు. తర్వాత లెఫ్టినెంట్‌కి రిసీవర్ని ఇచ్చాడు.
‘ఇంత దాకా మా మోటెల్‌లో ఎలాంటి దొంగతనం జరగలేదు. అంతా గౌరవనీయమైన అతిథులే. మీరు బ్రూస్‌ని అనుమానిస్తున్నారని చెప్పాడు. అతను నిజాయితీపరుడు. నా దగ్గర ఏడేళ్లుగా పని చేస్తున్నాడు. కేష్‌లో ఎప్పుడూ ఒక్క సెంట్ కూడా తేడా రాలేదు. అంతేకాక అతని మీద ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు.’
‘సరే’
లెఫ్టినెంట్ అందరి తలుపులు కొట్టి, వాళ్లని అంత రాత్రి ప్రశ్నించాలా అని ఆలోచిస్తూంటే బ్రూస్‌కి తళుక్కున ఓ ఆలోచన కలిగింది. వెంటనే అతని మొహం వికసించింది.
‘దొంగ ఎవరో తెలుసుకోడానికి నాకో ఆలోచన తట్టింది’ చెప్పాడు.
‘ఏమిటది?’
బ్రూస్ తన పథకాన్ని లెఫ్టినెంట్ రూబిన్‌కి వివరించాడు.
‘ఇదొక్కటే నేను దొంగని కానని రుజువు చేసుకునే దారి’ బ్రూస్ చెప్పాడు.
‘ఇది మంచి ఆలోచనలానే అనిపిస్తోంది. ప్రయత్నించడంలో నష్టం లేదు’ రూబిన్ చెప్పాడు.
బ్రూస్ వెంటనే ఇనుప చెత్తబుట్టలో కొన్ని కాగితాలని నింపి దాన్ని మెయిన్ ఎంట్రన్స్ మెట్ల దగ్గరికి తీసుకెళ్లి అగ్గిపుల్ల గీసి అంటించాడు. కొద్ది సేపట్లో అవి మండుతూ పొగ పై అంతస్థులోని కారిడార్లలోకి వెళ్లసాగింది. బ్రూస్ దాంట్లో మరిన్ని చెత్తకాగితాలని నింపసాగాడు. పొగ బాగా అలుముకున్నాక పగలు సంగీతం ప్రసారం చేయడానికి ఉపయోగించే పబ్లిక్ అడ్రస్ సిస్టం వాల్యూం పెంచి మైక్‌లో చెప్పాడు.
‘ఫైర్! ప్లెజెంట్ వ్యూ మోటెల్ అంటుకుంది. అతిథులంతా దయచేసి సైడు మెట్లమీంచి వీధిలోకి వెళ్లండి. త్వరగా. ఫైర్’ అతను దాన్ని మూడుసార్లు ప్రకటించాక రాత్రి దుస్తుల్లో ఉన్న చాలామంది పొగకి దగ్గుతూ, చేతుల్లో కొన్ని చిన్నచిన్న విలువైన వస్తువులతో దిగసాగారు. వీధి బయట ఓ కారు వెనక పొంచి ఉన్న లెఫ్టినెంట్, సార్జెంట్లకి చేతిలో సూట్‌కేస్‌తో అందర్నీ తోసుకుంటూ బయటకి వచ్చిన ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే అతన్ని ఆపి ఆ సూట్‌కేస్‌ని తెరచి చూస్తే లోపల దొంగిలించబడ్డ నగల పెట్టె కనిపించింది.
‘ఇతని పేరు డేవిడ్. వచ్చి నెలైంది’ బ్రూస్ చెప్పాడు.
అతన్ని పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్లాక వేలిముద్రల సాయంతో అతని అసలు పేరు రఫ్కిన్ అని, ఇలాంటి మోటెల్స్‌లో బస చేసి అనుపానులు కనిపెట్టి దొంగతనం చేసి మర్నాడు మాయం అవుతాడని తెలిసింది.
‘నీ ఊహ నిజమే బ్రూస్. దొంగతనం చేసినవాడు తెల్లారాక గది ఖాళీ చేసి వెళ్లిపోతాడు. అందుకు రాత్రికి రాత్రే సూట్‌కేస్ సర్దేసుకుంటాడు. అమాయకులు సర్దుకుని ఉండరు కాబట్టి సూట్‌కేస్‌తో రారు. ఎవరు సూట్‌కేస్‌తో వస్తే వారు దొంగ అనే నీ ఆలోచన ఫలించింది’ లెఫ్టినెంట్ మెచ్చుకున్నాడు.
‘అపాయాల్లో చిక్కుకున్న వారికే ఉపాయాలు తడతాయి సర్’ బ్రూస్ నవ్వుతూ చెప్పాడు.

(రిచర్డ్ మిల్ విల్కిన్‌సన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి