తాడాట
Published Sunday, 6 May 2018తాడాట బలాలు తెలుసుకొనే ఆటగా తెలుస్తుంది. ఈ ఆటను పదిమందితో గానీ ఎనిమిది మంది గానీ ఉండి ఆడుతుంటారు. ఒక పెద్ద తాడుకు అటు ఇటు రెండు వైపులా సమాన సంఖ్యలో పిల్లలు నిలబడుతారు. మధ్యలో ఒక గీతను గీస్తారు. ఆ గీతను ఎవరు దాటకుండా ఇరువైపుల జట్లల్లో ఉండే పిల్లలు ఎదుటి జట్టువాళ్లు ఆ గీతను దాటాలనే కోరికతో తాడును గట్టిగా అందరూ కలసి లాగుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోసారి ఆ తాడును లాగుతారు. ఇట్లా లాగడంలో ఎవరైనా గీతను దాటితే వారు ఓడినట్టు అవుతుంది. ఈ ఆటను పెద్దవారు కూడా ఆడుతుంటారు. ఎటువైపు జట్టువాళ్లు లాగుతుంటారో వారికి ఉత్సాహం ఇవ్వడానికి ఈ ఆటను చూచేవాళ్లు కేరింతలు కొడుతూ హుర్రె అని లేక లాగండి లాగండి అని కేకలు వేస్తుంటారు. తాడాటలో పక్కపక్కన ఉండే ఊరి వాళ్లు కూడా ఆడుతుంటారు. కాని ఈ ఆట పెద్దవాళ్లు ఆడేసరికి వారిలో పంతాలు, పందేలు ఎక్కువై ఆటలోని సొగసును దూరం చేస్తుంటారు. కేవలం పిల్లలే ఆడుకుంటే వారి ఒకరిపైన ఒకరు పంతాలకు పోకుండా ఆట తరువాత మళ్లీ కలసిపోతుంటారు. ఇది పెద్దవాళ్లల్లో ఉండదు. పిల్లలను చూసి నేర్చుకోవాల్సిన నీతిగా కూడా ఇది మనకు కనిపిస్తుంది.