S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సౌందర్యం

కథాసాగరం.....

ఒక రాజు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఎందరో తాత్త్వికులూ, జ్ఞానులూ ఉన్నారు. రాజుగారి సన్నిహితులు, స్నేహితులు ఉన్నారు.
అక్కడ ఒక విషయం గురించిన చర్చ సాగుతోంది. ఆ చర్చ సౌందర్యం గురించిన చర్చ. అందం ఎందులో ఉంది? అన్నదాన్ని గురించిన చర్చ.
వాళ్లందరూ రాజుగారి భవనంపై కూచుని ఉన్నారు. కింద చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్లలో చాలామంది రాజుగారి స్నేహితుల పిల్లలు, సేవకుల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లలో రాజుగారి కొడుకు కూడా వున్నాడు.
మేడపైన వున్న అందరూ కింద ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నారు. అందం ఎక్కడుంది? భౌతిక సౌందర్యమే నిజమైన సౌందర్యమా? అంతరంగంలోని సౌందర్యమే అసలయిన అందమా? అన్న చర్చ కొనసాగుతోంది.
అంతలో హఠాత్తుగా రాజు తన పక్కన వున్న సేవకుణ్ణి పిలిచి తన తలపైన వున్న కిరీటాన్ని తీసి అతనికి ఇచ్చి కింద ఆడుకుంటున్న పిల్లల్ని చూపి ‘నువ్వు ఈ కిరీటాన్ని తీసుకెళ్లి ఏ కుర్రాడి అందం ఈ కిరీటానికి తగిందో చూసి అతనికి ఈ కిరీటాన్ని పెట్టు’ అన్నాడు.
మొదట సేవకుడు కొంత ఆందోళన పడ్డాడు. తరువాత ఆసక్తిగా ఆ కిరీటాన్ని అందుకుని జాగ్రత్తగా పట్టుకుని మేడ దిగి పిల్లలు ఆడుకుంటున్న దగ్గరికి వచ్చాడు.
అది వజ్రాల కిరీటం. ధగధగ లాడుతోంది.
అతను ఆ కిరీటాన్ని మొదట రాజుగారి కొడుక్కి పెడదామనుకున్నాడు. ఎందుకంటే రాజుగారి కొడుకు అందగాడు. వర్ఛస్సుతో అతని ముఖం వెలిగిపోతోంది. వెళ్లి కిరీటాన్ని రాజుగారి కొడుకు తలపై పెట్టాడు. కానీ కిరీటం ఆ కుర్రాడికి సరిపోలేదు. అయినా పెట్టి సర్దుదామనుకున్నాడు. కానీ ఎందుకో అతనికి అది సరిపోదని దానికి కుర్రాడు తగడని అతనికనిపించింది. ఇంకొందరికి పెట్టి చూశాడు కానీ నచ్చక తీసేశాడు. చివరికి వాళ్లతోబాటు ఆడుకుంటున్న తన కొడుకు తలపై పెట్టాడు.
ఆ కిరీటం సరిగ్గా తన కొడుక్కోసమే చేసినట్లు అతని తలపై ఒద్దికగా కూచుంది. దాంతో ఆ కుర్రాడు అద్భుతంగా కనిపించాడు.
తరువాత తన కొడుకుని తీసుకుని మేడపైకి వచ్చి రాజుగారి ముందు భయంతో నిల్చుని, ‘రాజా! అంతమంది కుర్రాళ్లలో ఇతనికి ఒక్కడికే కిరీటం అతికినట్లు సరిపోయింది. మీ ముందు ఇట్లా మాట్లాడడాన్ని మన్నించండి. ఇంకో సంగతి ఏమిటంటే ఈ కుర్రాడు దురదృష్టవంతుడయిన నా కొడుకు’ అన్నాడు.
అప్పుడు రాజుగారితో బాటు అక్కడున్న అందరూ ఉల్లాసంగా చిరునవ్వు నవ్వారు. రాజు సేవకుడిని అభినందించి ఆ కిరీటాన్ని అతనికే బహూకరించాడు. ‘నిజంగా నేను ఏది వుద్దేశించానో, ఏమనుకున్నానో నువ్వు ఆ మాటలే చెప్పావు. అందం శరీరంలో లేదు, హృదయంలో ఉంది. దాన్ని నిరూపించావు’ అన్నాడు.
రాజు తక్కిన వాళ్లందరూ ఆ కుర్రాణ్ణి చూశారు. ఆ కుర్రాడు నిజానికి ఎంతో వికారంగా ఉన్నాడు.

- సౌభాగ్య 98481 57909