S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..80 మీరే డిటెక్టివ్

అయోధ్యలో ఆనందవిహీనమైన ఆ రాత్రి ఆర్తనాదాలతో, దుఃఖాన్ని గొంతుల్లో దాచుకున్న ప్రజలతో చాలా సుదీర్ఘంగా గడిచింది. సూర్యోదయమైన తర్వాత బ్రాహ్మణులతో కలిసి సభకు వచ్చిన మార్కండేయుడు, వౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, గౌతముడు, గొప్ప కీర్తిగల జాబాలి అనే బ్రాహ్మణుడు, తమ మంత్రులతో, రాజ పురోహితుడైన వశిష్ఠుడితో వేరువేరుగా ఇలా చెప్పారు.
‘పుత్రశోకంతో రాజు మరణించాక వచ్చిన, వందేళ్లుగా మనకి తోచిన రాత్రి అతి కష్టం మీద గడిచింది. మహారాజు మరణించాడు. రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లిపోయారు. మహావీరులైన భరత శతృఘు్నలు ఇద్దరూ కేకయ దేశంలో తాత ఇంట్లో ఉన్నారు. అందువల్ల ఇక్ష్వాకు వంశానికి చెందిన ఎవరినైనా ఇక్కడ ఇప్పుడే రాజుగా చెయ్యాలి. రాజు లేకపోతే మన దేశం నశించిపోతుంది. దేశంలో మెరుపులు మెరుస్తూ ఉరిమే మేఘాలు భూమిపై కురవవు. రాజు లేని దేశంలో పిడికిళ్లతో విత్తనాలు చల్లడం జరగదు. రాజులేని రాజ్యంలో ధనం దక్కదు. భార్య కూడా దక్కదు. చాలా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, రాజు లేని దేశంలో సత్యానికి తావుండదు.
‘రాజులేని దేశంలోని ప్రజలు సంతోషంగా సభలని నిర్వహించరు. అందమైన ఉద్యానవనాలని, దేవాలయాలని నిర్మించరు. రాజులేని దేశంలో యజ్ఞం చేసే స్వభావం కలవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, వేదాధ్యయన సంపన్నులు, తీవ్రమైన వ్రతాలని అవలంబించేవారు ఐన బ్రాహ్మణులు యజ్ఞాలు చేయరు. రాజులేని దేశంలో ధనవంతులైన బ్రాహ్మణులు యజ్ఞాలు చేసినా తగిన దక్షిణలని ఇవ్వరు. రాజులేని దేశంలో ఎందరో నటులు, నర్తకులు పాల్గొనే దేశాభివృద్ధికి కారకాలైన ఉత్సవాలు, సమాజాలు వృద్ధి పొందవు. రాజు లేని దేశంలో దాయాదుల మధ్య వివాదాల్లో న్యాయస్థానానికి వెళ్లిన వారి పనులు న్యాయసమ్మతంగా నెరవేరవు. కథలు చెప్పే అలవాటు గల వారు కథాప్రియులతో కలిసి కథలు చెప్పుకుంటూ ఆనందించలేరు. రాజు లేని దేశంలో యువకులు యువతులతో కలిసి, వేగంగా ప్రయాణించే వాహనాలు ఎక్కి అరణ్యాలకి వెళ్లరు. రాజు లేని దేశంలో వ్యవసాయం, పశు సంపద మొదలైన వాటితో జీవించే ధనికులు సురక్షితంగా తలుపులు తెరచుకుని నిద్రించలేరు.
‘రాజులేని దేశంలో దంతాలకి గంటలు కట్టిన యవ్వనంలోని అరవై ఏళ్ల ఏనుగులు రాజమార్గాల్లో తిరగవు. రాజు లేని దేశంలో బాణాలు, అస్త్రాలు నేర్చుకునే వీరులు విసిరే బాణాల శబ్దాలు వినపడవు. రాజులేని దేశంలో అనేకాలైన వ్యాపార వస్తువులతో దూరదేశాలకి ప్రయాణం చెయ్యాల్సిన వర్తకులు దారిలో క్షేమంగా వెళ్లలేరు. రాజు లేని దేశంలో ఎప్పుడూ వంటరిగానే సంచరించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, మనసులో ఆత్మ స్వరూపాన్ని గురించి ధ్యానం చేసేవాడు, ఎక్కడ సాయంత్రమైతే అక్కడే ఇల్లుగా భావించి ఆ రాత్రి నివసించేవాడైన ముని సంచరించడు. రాజులేని దేశంలో యోగక్షేమాలు సరిగ్గా ఉండవు. సైన్యం యుద్ధంలో శత్రువులని ఎదిరించలేదు. రాజులేని దేశంలో మనుషులు చక్కగా అలంకరించుకుని ఉత్సాహంగా ఉండే గుర్రాల మీద, రథాల మీద కూర్చుని ప్రయాణం చేయడానికి భయపడతారు.
‘రాజులేని దేశంలో ఆయా శాస్త్రాల్లో పండితులు వనాల్లోను, ఉపవనాల్లోను కూర్చుని శాస్త్ర చర్చలని జరపలేరు. రాజులేని దేశంలో ప్రజలు నియమపూర్వకంగా, పద్ధతిగా దేవతా పూజలకి పూలమాలలు, పిండివంటలు, దక్షిణలు సమకూర్చరు. రాజులేని దేశంలో రాజపుత్రులు గంథం, అగరులు పూసుకుని వసంత కాలంలో వృక్షాల్లా ప్రకాశించలేరు. రాజులేని దేశం నీరు లేని నదుల్లాంటిది. గడ్డిలేని అడవి లాంటిది. గోపాలులు లేని గోవు వంటిది. ఒక రథం ఎవరి రథమో తెలుసుకోవడాని సాధనం జెండా. నిప్పుని గుర్తించే సాధనం పొగ. మనందరికీ జెండా లాంటి వాడైన ఆ దశరథ మహారాజు ఈ లోకాన్ని విడిచి స్వర్గానికి వెళ్లిపోయాడు. రాజులేని దేశంలో ఎవ్వరూ దేన్నీ కూడా తన సొత్తుగా భావించడానికి వీలుండదు. ప్రజలు నిత్యం చేపల్లా ఒకరిని మరొకరు తింటారు.
‘కట్టుబాట్లని పాటించక ఎలాంటి సంశయం లేక, స్వేచ్ఛగా ప్రవర్తించే నాస్తికులు కూడా రాజదండంతో బాధించబడి సన్మార్గంలోకి వెళ్తారు. దృష్టి నిత్యం శరీరానికి ఎలా ఉపయోగిస్తుందో అలాగే రాజ్యం యొక్క సత్యధర్మాల పోషణకి రాజు కారణభూతుడు. సత్యాన్ని, ధర్మాన్ని రక్షించేవాడు రాజే. కులాన్ని రక్షించేవాడు కూడా రాజే. రాజే తల్లి, రాజే తండ్రి. ప్రజలకి మంచి చేసేవాడు రాజే. కాబట్టి రాజు తన గొప్ప చరిత్ర చేత దిక్పాలుకులైన యమ, కుబేర, ఇంద్ర, సూర్యులతో కూడా సమానమైనవాడు. ఇది ధర్మం, ఇది అధర్మం అని రాజు విభజించి చెప్పకపోతే ఈ ప్రపంచమంతా అంధకార బంధురమై ఉండేది. సృష్టే జరక్కుండా ఉండేది. సముద్రం తీరాన్ని దాటనట్లు మహారాజు జీవించి ఉన్నంతకాలం కూడా మేమంతా నీ మాటని దాటలేదు. బ్రాహ్మణ శ్రేష్ఠుడివైన ఓ వశిష్ఠా. జరిగింది పరిశీలించి రాజు లేని రాజ్యం అరణ్యమై పోతుందని గుర్తించి నువ్వే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఉత్తమ స్వభవాం గల ఒకర్ని మాకు రాజుగా అభిషేకించు’ (అయోధ్యకాండ సర్గ 67)
ఆశే్లష వెంట ఆ రోజు వచ్చి ఆ హరికథని విన్న వాడి అమ్మమ్మ మీనమ్మ ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో చెప్పింది.
‘హరిదాసు నాలుగు తప్పులు చెప్పాడ్రా. ఇంటికెళ్లాక అయోధ్యకాండలోని 67వ సర్గ తీసి చూడు’
మీరా తప్పులని పట్టుకోగలరా?
*
మీకో ప్రశ్న
*
కేకయ రాజ్య రాజధాని రాజగృహకి గల మరొక పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
రామ శబ్దాన్ని రామాయణంలో వాల్మీకి ఎన్ని రకాలుగా ప్రయోగించాడు?
19 రకాలుగా. అవి 1.రామః 2.హేరామ 3.రామమ్ 4.రామేణ 5.రామాయ 6.రామాత్ 7.రామస్య 8.రామే 9.రావౌ 10.హేరావౌ 11.రామాభ్యామ్ 12.రామయోః 13.రామాః 14.హేరామాః 15.రామాన్ 16.రామైః 17.రామేభ్యః 18.రామాణామ్ 19.రామేషు
*
1.గూని దాని మూలంగా కైకేయి రఘు వంశాన్ని నాశనం చేసింది అని కౌసల్య మంథరని నిందించింది. హరిదాసు ఇది చెప్పకుండా మినహాయించాడు.
2.సీత గురించి చెప్తూ, ‘జనకుడి కూతురైన’ అనే విశేషణాన్ని కౌసల్య వాడింది. ఇది హరిదాసు చెప్పలేదు.
3.వశిష్ఠుడు మొదలైన వారి ఆజ్ఞ ప్రకారం దశరథుడి పార్ధివ దేహాన్ని నూనెలో ఉంచారని వాల్మీకి రాశాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
4.హరిదాసు చెప్పిన తప్పులు పై మూడు మాత్రమే. కాని ఆశే్లష తప్పుగా నాలుగు తప్పులు అని చెప్పాడు.

మల్లాది వేంకట కృష్ణమూర్తి