బంధనాలు
Published Sunday, 20 May 2018కొంతమంది కుక్కలని పెంచుకుంటారు. మరి కొంతమంది పిల్లులని పెంచుకుంటారు. ఇంకా కొంతమంది అక్వేరియమ్‌లలో చేపలని పెంచుతారు.
పావురాలని, పక్షులని పెంచుకునే వాళ్లు ఎందరో.
ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది.
మనుషులని పెంచడం కొంతమేరకు మాత్రమే ఉంటుంది. వాళ్లు కాస్త పెద్దవాళ్లు అయిన తరువాత స్వేచ్ఛా జీవులుగా మారిపోతారు.
పెంపుడు జంతువులు వేరు. మనుషులు వేరు.
సర్కస్ జంతువులు వేరు. పెంపుడు జంతువులు వేరు.
పెంచుకున్న కుక్కని కట్టివేస్తారు. దానికి సమయానికి తగినట్లుగా ఆహారాన్ని ఇస్తారు. పెంపుడు కుక్క తనకు తోచినప్పుడు బయటకు వెళ్లలేదు. దాన్ని మనం వదిలిపెట్టినప్పుడు, బయటకు తీసుకొని వెళ్లినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది.
అక్వేరియమ్‌లోని చేపలూ అంతే! అందులోనే ఈదాలి. అవి బయట ఈదాలంటే వాటిని అందులో నుంచి బయటకు తీయాలి. పక్షులూ అంతే! వాటిని పంజరం నుంచి బయటకు పంపిస్తేనే ఎగరగలవు.
ఇంతే కాకుండా సహజసిద్ధంగా వాటికి వుండే లక్షణాలని కూడా అవి మర్చిపోతాయి. ఈ మధ్య ఓ వీడియోని చూశాను. ఓ పులిని కుక్క బెదిరిస్తుంది. ఆ పులిని చిన్నప్పటి నుంచి ఇంట్లో పెంచుతారు. సమయానికి ఆహారం ఇస్తారు. అది వేటాడ్డం మర్చిపోయింది. సహజంగా దానికి వుండే బలాన్ని కూడా మర్చిపోయింది.
ఇది సహజం.
అయితే మనం బందీలం కాదు.
అందుకని మనం ఎప్పుడు ఈదాలి. ఎప్పుడు చర్య తీసుకోవాలి అన్న విషయాలు మనకి ఎవరూ చెప్పరు. మన శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి మనలని ప్రోత్సహించడానికి ఎవరూ అవసరం లేదు.
ఈ ప్రపంచాన్ని మార్చటానికి, మంచి వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయవచ్చు.
మనసు బందనాలు లేవు.
ఏవైనా వుంటే అవి మనం సృష్టించుకున్నవే!
వాటిని తెంచుకుందాం.
పరుగెడదాం.
మనలని ఎవరో ఎంపిక చేయాల్సిన అవసరం లేదు.
మనమే ఎంపిక చేద్దాం.
*