S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశా పిశాచం (కథ)

పరిమళదేశాన్ని ప్రతాపవర్మ అనే రాజు పాలించేవాడు. అతడు విశ్రాంతిగా ఉన్నప్పుడు పండిత చర్చ చేసేవాడు. తన ఆస్థానంలోని పండితులనూ, ఆస్థాన ఉద్యోగులనూ మంత్రి మండలినీ అందరినీ ఆహ్వానించేవాడు. అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం ఇచ్చేవాడు.
ఒకమారు ప్రతాపవర్మ అలా ఇష్టాగోష్టిలో ఆ సభలో మాట్లాడుతూ ‘‘పండిత వరులారా! మానవున్ని అన్నింటికంటే పట్టి పీడించే గుణమేది?’’ అని అడిగాడు.
దానికి రామశర్మ అనే పండితుడు ‘‘మహారాజా! అన్నింటికంటే మానవున్ని పట్టిపీడించేది ఆశ. ఆశ వుండవచ్చు. కానీ పేరాశ ప్రమాదకరమైనది. మనిషిని పట్టి పీడించి యమపాశంలా వెంటాడి చంపుతుంది’’ అన్నాడు.
అలా ఆశ మీద చాలా చర్చ జరిగాక మహారాజు ‘‘పండితులారా! నాకు ప్రత్యక్షంగా ఈ ఆశ, అదే మీరన్నట్లు పేరాశ, దురాశ గురించీ మన దేశ ప్రజలందరికీ తెలియజేయాలని ఉంది. దానివల్ల అంతా యదార్థం తెలుసుకుని జాగ్రత్త పడుతారు. దీనికేదైనా ఉపాయం ఆలోచించండి’’ అని కోరాడు.
మంత్రి మల్లేశ్వరుడు ‘‘ప్రభూ! త్వరలో మీ జన్మదినం వస్తున్నది గదా! ఈ ఏడాది ఆ శుభదినాన ఉచితంగా భూమి పంపకం చేయండి. భూమి లేని వారు పండించుకుని బాగుపడతారు. ఈ సందర్భంగా పేరాశ గురించీ మనకు రుజువులు కనిపించవచ్చు’’ అన్నాడు.
ఆ ప్రతిపాదనను మహారాజు అంగీకరించారు.
మంత్రి మల్లేశ్వరుడు రాజ్యమంతా చాటింపు వేయించాడు.
‘‘ప్రియ ప్రజలారా! పక్షం తర్వాత వచ్చే తన జన్మదినాన మహారాజు ఉచితంగా భూమి దానం ఇవ్వదలచారు. భూమి కోరే వారంతా మన
క్రీడా మైదానం వద్దకు వచ్చి చేరండహో..’’ అనే దండోరా విని రాజ్య ప్రజలంతా ఆ రోజు తూర్పు తెల్లారక ముందే వచ్చి గుంపులు గుంపులుగా మైదానంలో చేరారు.
సూర్యోదయం తర్వాత రెండు ఘడియలకు మహారాజు ప్రతాపవర్మ తన రథంలో వచ్చి దిగాడు. ఆయన అనుమతితో మల్లేశ్వరుడు ‘‘ప్రియ ప్రజలారా! మహారాజు తెల్ల జెండా ఊపగానే మీరు గీత గీచిన ప్రాంతం నుంచీ కదిలివెళ్ళి సూర్యాస్తమయానికి మీరు ఎన్ని అడుగులు నడుస్తారో అంత భూమి మీకు ఉచితంగా మహారాజు ప్రదానం చేస్తారు’’ అని ప్రకటించాక మహారాజు జెండా ఊపారు.
ప్రజలంతా హుషారుగా నడక సాగించారు. కొందరు మధ్యాహ్నం వరకూ నడిచి అక్కడే కూర్చుని తాము తెచ్చుకున్న ఆహారం, నీరు సేవించి విశ్రాంతి పొందారు. మరికొందరు సాయంకాలం వరకూ నడిచి కూర్చున్నారు. వారిలో ఒకడు మాత్రం నడక కాక పరుగందుకున్నాడు. తిననూ, త్రాగనూ కూడా లేదు. ఆగకుండా పరుగు తీస్తూనే ఉన్నాడు. సూర్యాస్తమయానికి అరఘడియ ఉందనగా ఇంకా వేగంగా పరుగుతీసి ఆహారం నీరూ లేనందున కిందపడి స్పృహ తప్పి మరణించాడు. పక్కనే రథం మీద, పరివారం గుఱ్ఱాల మీదా ప్రజలను అనుసరించారు మహారాజా వారు. అతడు పడిపోవడం గమనించిన పరివారం ఉపచారాలు చేద్దామని దగ్గరకు వెళ్ళి అతడు మరణించి ఉండటం గమనించారు. ప్రజలంతా అతడి పేరాశకు ఆశ్చర్యపోయి.. పేరాశ యమపాశంలా ప్రాణం తీస్తుందని తెలుసుకున్నారు. మహారాజు ప్రజలకు తాము ఇవ్వదలచిన సందేశం నెరవేరింది.
నీతి: పేరాశ ప్రాణం మీదకు తెస్తుంది.

-ఆదూరి హైమావతి