S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భుజాల మీద ప్రపంచం

== సండేగీత=

చాలామంది ఈ ప్రపంచాన్ని తమ భుజాల మీద మోస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా భావించడానికి కారణం - వాళ్లు తాము చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావడం కూడా కావొచ్చు. ఈ పరిస్థితి చాలాచోట్ల కన్పిస్తుంది. ఆఫీసుల్లోనూ కన్పిస్తుంది. అకాడెమీల్లో కూడా.
అకాడెమీల్లో పనిచేసే వాళ్లకి పని తక్కువ ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. మరీ ముఖ్యంగా జ్యుడీషియల్ అకాడెమీల్లో పని మరీ ఎక్కువగా ఉంటుంది. అది కనపడని పని. ‘లా’ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందుకని ప్రతి క్లాసూ కొత్త క్లాసే. ఓ రెండు గంటలు క్లాసు తీసుకోవాలంటే రెండు రోజులు చదవాల్సి ఉంటుంది. బాగా కష్టపడి, ఇష్టపడే వాళ్లనే అకాడెమీల్లో నియమిస్తూ ఉంటారు.
అకాడెమీల్లో పనిచేసే వాళ్లు చాలా దీక్షగా పని చేస్తారు. ఈ విషయాన్ని చాలామంది హైకోర్టు న్యాయమూర్తులు గమనించారు. అందులో ఒకరు భవానీ ప్రసాద్. ఆయన గతంలో జిల్లా జడ్జిగా వున్నప్పుడు, అకాడెమీలో కూడా పని చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన అకాడెమీ పాలక మండలి సభ్యులు కూడా.
అందుకని ఆయన పదవీ విరమణ సభని అకాడెమీలో కూడా ఏర్పాటు చేశాం. ఆయనను సన్మానించిన తరువాత చాలా విషయాలు మాట్లాడుతూ మా అందరి కోసం ఓ విషయం చెప్పారు.
ఈ అకాడెమీలో మీకు మల్లే చాలా కష్టపడి పని చేశాను. ఉదయం నించి సాయంత్రం దాకా పని చేసేవాడిని. ఎవరైనా రిసోర్స్ పర్సన్ రాకపోతే వాళ్ల క్లాసులని కూడా తీసుకునేవాడిని. చివరికి ఓ రోజు నాకు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయినయ్యాను. రెండు రోజుల తరువాత కొంత కుదుటపడ్డాను. అకాడెమీలో క్లాసులు ఎలా జరుగుతున్నాయో, గెస్టు లెక్చరర్స్ వచ్చారా లేదోనన్న ఆలోచన వచ్చింది. నా భార్యతో ఈ విషయమే చెప్పాను.
అప్పుడు ఆవిడ నవ్వి ఇలా అన్నారు. ‘అకాడెమీ చాలా బ్రహ్మాండంగా పని చేస్తుంది. మీరు ఉన్నప్పటికన్నా ఇంకా బాగా పని చేస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించకుండా రెస్టు తీసుకోండి’
అకాడెమీ ఫ్యాకల్టీలో వున్న వాళ్లకి చెప్పినట్టుగా ఉంది కానీ ఈ ప్రపంచాన్నంతా తామే మోస్తున్నానని అనుకుంటున్న అందరికీ ఆ విషయం చెప్పినట్టు అన్పించింది.
ఈ విషయాన్ని మరో విధంగా చెప్పాలంటే-
నువ్వు వున్నా ఈ ప్రపంచం ఉంటుంది.
నువ్వు లేకున్నా ఈ ప్రపంచం ఉంటుంది.
ఈ ప్రపంచాన్ని నీ భుజాల మీద మోస్తున్నానని అనుకోకు.
నువ్వు లేకున్నా ప్రపంచం పరిగెడుతూనే ఉంటుంది.
అంచనాకి మించి ఊహించుకోకు.