S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కులవృత్తులు కనుమరుగు!

దేశానికి పట్టు కొమ్మలు పల్లెలు.. ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు పల్లెలు.. కుల వృత్తులకు పుట్టినిల్లు పల్లెలు.. ఇది కొనే్నళ్ళ క్రితం మాట. పల్లెలకూ పాశ్యాత్య పోకడలనే విషం సోకి పల్లెల్లో పూర్వపు పద్దతులు కనుమరుగవుతూ మేము, మనం అనే పల్లె వాతావరణం ఆధునీకరణ వైపుతొంగిచూస్తూ నేను, నాది అనే స్వార్థపూరిత ధోరణిని పునికిపుచ్చుకుంటోంది. ఆదరణ కరువై తమ కుల వృత్తులను కూడా వదిలేస్తూ పొట్టకూటి కోసం పట్నం బాట పడుతున్నారు. దీంతో పల్లెల్లో కులవృత్తులకు కాలం చెల్లుతోందని చెప్పుకోవచ్చు.
ఈపరిస్థితి రతనాల సీమగా పేరొందిన రాయలసీమ ప్రాంతంలోని పల్లెలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. రైతన్న దుక్కిదున్ని పంటను సాగుచేసేందుకు వినియోగించే ప్రతి పనిముట్టూ పుట్టింది పల్లెలోనే. ఆరోజుల్లో అన్నం వండి ఆకలి తీర్చుకునేందుకు, నీళ్ళు నిల్వవుంచుకుని దాహం తీర్చుకునేందుకు వినియోగించిన మట్టి కుండలు తయారయ్యింది పల్లెల్లోనే. ఇలా ఒకటా రెండా మనిషి మనుగడకు వినియోగించే వస్తువుల్లో సుమారు 80శాతం పనిముట్లు కుల వృత్తుల వారి నుంచే అందేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునీకరణ పద్దతుల్లో తయారవుతున్న వస్తువులు పల్లెల్లోని చేతివృత్తులపై పూర్తీ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. దీంతో కుల వృత్తులనే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నవారు వారు తయారు చేసే వస్తువులకు ఆదరణ కరువవ్వడంతో వారి జీవనం కష్టంగా మారి కూలీలుగా మారుతున్నారు.
చెదలు పడుతున్న వ్యవసాయ చెక్కపనిముట్లు
రైతన్న చమటోడ్చి పంటలు పండిస్తేనే అందరికీ ఆహారం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే రైతే రాజు అన్నారు. గత కొనే్ళళ్ళ క్రితం పల్లెల్లోని ఏ రైతు ఇంట చూసినా పాడిపశువులు, చేతి వృత్తుల ద్వారా తయారైన వ్యవసాయ పనిముట్లు కనిపించేవి. ఎడ్ల బండ్లు, మడకలు, గుంటకలు, చెక్కల గూటవ, గొర్రు, బారగూటవ, నాలుగుజానల గుంటక, సాగు గుంటక ఇలా వ్యవసాయానికి వినియోగించే ప్రతి వస్తువూ కులవృత్తుల వారి ద్వారా తయారయ్యేవే కనిపించేవి. అయితే ఆధునీకరణ కారణంగా కుల వృత్తుల ద్వారా తయారయ్యే వస్తుసామాగ్రి అన్ని కనుమరుగైపోతున్నాయి. గతంలో ఏ రైతన్న ఇంటి ముందు చూసినా పాడిపశువులు, ఎడ్లు, బండ్లు, కుల వృత్తుల వారు తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు కనిపించేవి. కాగా పొలాల్లో నుంచి సాగైన పంటలు, తిండిగింజలు అన్నీ మోసుకొచ్చే ఎడ్ల బండ్లు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాయి. ఆధునిక సులువైన పద్దతుల్లో వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వాలే పలు రకాల ఇనుప పనిముట్లను రాయితీ ద్వారా అందజేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఏ రైతు ఇంటి ముందు చూసినా ఓ ట్రాక్టర్, ఆధునిక పద్దతులతో తయారైన ఇనుప వ్యవసాయ పనిముట్లే దర్శనమిస్తాయి. కుల వృత్తుల వారు అప్పట్లో చేసిన వ్యవసాయ పనిముట్లు చూద్దామంటే ఎక్కడో ఓ మూలన పడేసి చెదలు పట్టి వుండటం కనిపిస్తాయి. రైతన్నలు వ్యవసాయానికి వినియోగించే వస్తు సామాగ్రిలోనే కాదు, వారి వ్యవహార శైలిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొనే్నళ్ళ క్రితం ఎవరైనా కొత్త వ్యక్తులు రైతుల ఇంటివద్దకు వచ్చి దాహం వేస్తోంది నీళ్ళివ్వమంటే చిక్కటి మజ్జిగ ఇచ్చి దాహం తీర్చేవారు. గ్రామంలోని వారు ఎవరైనా రైతన్న ఇంటి వద్దకు వెళ్ళి పాలు, మజ్జిగ అడిగినా ఉచితంగా పోసేవారు. ఎవరైనా ఆకలితో రైతుల ఇంటికెళ్తే కడుపునిండా బువ్వ పెట్టి ఆకలి తీర్చే వారు. అయితే ఆ పరిస్థితులు ప్రస్తుతం 90శాతం కనుమరుగయ్యాయి. పాడి పశువులున్న రైతన్నలు పొద్దున, సాయంత్రం పాలు పితికి డైరీలకు అమ్మేసి వాళ్ళు వినియోగించుకోవడానికి కూడా ప్యాకెట్ పాలను, పెరుగును తెచ్చుకుంటున్న రోజులివి. పండించిన వరి ఇతర పంటలు ఎక్కడికక్కడ అమ్మేసి ఇంట్లో వినియోగించుకోవడానికి కూడా మళ్ళీ దుకాణాల నుంచి తెచ్చుకునేంతలా పచ్చని పల్లెల వాతావరణంలోకి పాశ్యాత్యపు పోకడల సంస్కృతి చేరుకుని పల్లెల్లోని స్నేహపూరిత మాధుర్యమైన జీవన విధానానే్న మార్చేస్తోంది.
పల్లెల్లో కనిపించని మట్టి కుండలు
గతంలో అయితే పల్లెసీమల్లో ఏ వంటను వండినా కుమ్మరులు తయారు చేసిన మట్టి కుండల్లోనే వండేవారు. ఆ వంటలు తినడానికి కూడా రుచిగా వుండేవి. తిండిగింజలు కూడా ఇళ్ళల్లో కుమ్మరులు చేసిన మట్టి గాదెల్లో నిల్వవుంచుకునేవారు.అయితే స్టీల్, అల్యూమినయం పాత్రలు, కుక్కర్లు మార్కెట్లో చక్కర్లు కొడుతుండటంతో మట్టి కుండల జాడే లేకుండా పోతోంది. మట్టి కుండలోని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదనేవారు పూర్వీకులు. అదేవిధంగా వేసవి వస్తే ఒ కొత్త మట్టికుండ కొని దానికి చుట్టూ సున్నం రాసి ఇసుకపై కుండను పెట్టి నీళ్ళను అందులో పోస్తే చల్లగా వుండి ఎంతటి వేసవిలోనైనా దాహం తీరేపోయేది. ప్రస్తుతం ప్లాస్టిక్ క్యాన్‌లు రావడంతో వాటిలో నీళ్ళను నిల్వవుంచుకోవడం జరుగుతోంది. పల్లెల్లో కూడా ప్రతి ఇంట్లో ఫ్రిజ్‌లు వుండటం వల్ల కొత్తకుండల్లో నీళ్ళు పోసి చల్లబరుచుకోవడం పోయి చిన్నచిన్న ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్ళు పోసి చల్లగా మారడానికి ప్రిజ్‌లలో పెట్టుకుంటున్నారు. వాటిని తాగాకా దాహాం తీరడం ఎలాగున్నా గొంతు సంబంధిత వ్యాధులు మాత్రం సోకుతున్నాయని చెప్పుకోవచ్చు. కాగా మట్టి కుండలకు ఆదరణ తగ్గిపోవడంతో కుమ్మరులు కుల వృత్తికి దూరం అవుతున్నారు. ఎక్కడో వందకు ఐదుశాతం మంది పూర్వీకులు తప్పా ప్రస్తుత రోజుల్లో కుండల తయారీపై శ్రద్ధ చూపడం లేదు. వాటిని తయారు చేసినాకూడా అవి పూర్తీ స్థాయిలో అమ్ముడుపోతాయని నమ్మకం కుమ్మర్లలో సన్నగిల్లింది. దీంతో చాలా పల్లెల్లోని కుమ్మర పొయ్యిలు శిథిలం అయ్యాయి. కుండలు తయారు చేసే కుమ్మరి చక్రాలను మూలన పడేశారు. మట్టి కుండలు చేసే కుమ్మరులే కనుమరుగువుతున్నారు.
ఈత, వెదురు గంపలేవీ..
ఏ రైతన్న ఇంట చూసినా పదుల సంఖ్యలో మేదరులు తయారు చేసిన ఈత, వెదురు గంపలుండేవి. ఈ గంపలను ఎన్నో విధాలుగా ఆరోజుల్లో వినియోగించేవారు. అయితే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గంపలు వచ్చేయడంతో ఈత, వెదురు గంపల చిరునామా గల్లంతయ్యింది. అంతేకాకుండా చివరికి ఇళ్ళల్లో తిండి గింజలు చెరిగే చాట, జల్లెడలు కూడా పూర్తీగా ప్లాస్టిక్ తయారీతో కూడినవే మార్కెట్‌లోకి వచ్చేశాయి. అదేవిధంగా రైతన్నలు మల్బరీ సాగులో పురుగుల మేతకు వినియోగించే తట్టలు, చందరికలు కూడా ప్లాస్టిక్ తయారీవే వచ్చేశాయి. దీంతో మేదరులు తమ కుల వృత్తిలో కొనే్నళ్ళుగా స్థిర పడ్డ కుటుంబాలు వారివృత్తిని వదులుకుని వేరే పనులకు వెళ్ళాల్సి వస్తోంది.
కొలిమి పనులూ తగ్గిపోయే..
రైతన్నలు పంట పొలాలకు సాగు చేసే పనిముట్లలో ఇనుప సంబంధిత వస్తు సామాగ్రి అంతా గతంలో విశ్వబ్రాహ్మణులే కొలిమిలో తయారుచేసేవారు. వాటితోపాటు, గడ్డపార, పార, చక్కబండి చక్రాలు లాంటి వస్తు పరికరాలను గతంలో కొలిమిలోనే తయారు చేసేవారు. రైతాంగానికి సంబంధించిన ఇనుప వస్తువులన్నీ దుకాణాల్లో లభిస్తుండటంతో పల్లెల్లో కొలిమి పనులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి జీవనం దుర్భరంగా మారింది. చివరికి గడ్డపార, పార లాంటి వస్తువులు విరిగిపోతే కొలిమిని ఆశ్రయించకుండా క్షణాల్లో వెల్డింగ్ షాపులకెళ్ళి మరమ్మత్తులు చేసేసుకుంటుండటంతో కనీసం చిన్నచిన్న పనులు చేయించుకునేందుకు కూడా కొలిమిని ఆశ్రయించే వారు పల్లెల్లో కనిపించడంలేదు.
నూనె గానుగలూ కరుమరుగాయే..
పూర్వం శనగ, ఆందెము, కొబ్బెర నుంచి నూనె తీయాలంటే ఒ పెద్ద బండ రాతితో తయారు చేసిన గానుగ ( రోకలిని పోలివుంటుంది) లో గింజలు పోసి ఎడ్లకు కాడిమానుకట్టి దాని చుట్టూ తిప్పుతూ స్వచ్ఛమైన నూనెను గాండ్ల కులానికి చెందిన వారు తీసేవారు. నూనె తీసేందుకు కూడా యంత్రాలు రావడంతో రాతి గానుగలు వ్యర్థంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పెద్దపెద్ద ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విద్యుత్ యంత్రాల ద్వారా పలు రకాల నూనెను తీయడం జరుగుతోంది. అర లీటరు ఏదైనా నూనె కావాలన్నా ప్లాస్టిక్, టెట్రా ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసేసి దుకాణాల్లో పలు కంపెనీల పేర్లతో అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో గాండ్ల కులస్థుల కులవృత్తి పల్లెల్లో అంతరించిపోయింది.
చర్మపు తప్పెట్లూ లేవూ..
పల్లెల్లో దేవుడి గుడిలో అయినా, ఇళ్ళల్లో అయినా ఏ శుభకార్యం చేసినా ముందుగా వచ్చేది మాదిగల తప్పెట్ల చప్పుళ్ళే. దాంతోపాటు పల్లెలో పంచాయతీ వారుగానీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు గానీ ప్రజలకు తెలియజేసేందుకు వీధివీధి డప్పు కొట్టుకుంటూ తిరుగుతూ విషయాన్ని గట్టిగా చెప్పుకుంటూ ప్రచారం కొనసాగించేవారు. గంగమ్మ, మారెమ్మ, పోలేరమ్మ ఇలాంటి దేవతామూర్తుల ముందు జంతు బలులు ఇవ్వాలన్నా కూడా ముందుగా తప్పెట్లు కొట్టుకుంటూ ఆ జంతువులను ఊరేగింపుగా తీసుకెళ్ళే వారు. గ్రామాల్లో మొహర్రం (పీర్ల) పండుగ వచ్చిందంటే చాలు వారం రోజుల పాటు తప్పెట్లు వాయించేవారికి భలే గిరాకీ వుండేది. మేక చర్మంతో ఎంతో సుందరంగా అప్పట్లో చర్మపు తప్పెట్లు తయారు చేసేవారు మాదిగలు. అయితే ఇప్పుడు చర్మపు తప్పెట్లు పోయి ప్లాస్టిక్ పేపర్ తప్పెట్లు, డ్రమ్ము వాయిద్యాలు అధికం అయ్యాయి. అవి మోగించే పనైనా పూర్తీగా మాదిగలకే ఇస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎవరు పడితే వారు నేర్చుకుని డ్రమ్ములు వాయించే పనిని ఎంచుకుంటున్నారు. కారణంగా ప్లాస్టిక్ పేపర్లతో తయారు చేసిన డ్రమ్ములొచ్చాక మాదిగల కులవృత్తిగా కొనసాగుతున్న చర్మపు తప్పెట్ల వాయిద్యం మూగబోయింది.
పల్లెల్లో టీవీల ప్రభావం అధికం...
రోజురోజుకీ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో టీవీ ప్రభావం అందరిపైనా బాగా కనిపిస్తోంది. ఇవి పల్లెలకూ సోకడంతో పూర్వపు అలవాట్లు, పాతపద్దతులను పాతరేస్తూ కొత్త వింతలను స్వాగతం పలుకుతూ జీవనం విధానాన్ని మార్చుకుంటున్నారు. గతంలో పొలం పనులన్నీ పూర్తీ చేసుకుని సాయంకాలం ఇంటికి చేరుకుని వేడివేడి నీళ్ళు పోసుకుని కాసింత బువ్వ తిని ఊళ్ళో వున్న రచ్చబండపై కూర్చుని మంచి చెడులు పంచుకునేవారు. పగటి సమయాల్లో వ్యవసాయ పనులు లేనప్పుడు కూడా రచ్చబండపైనే కూర్చుని పులిమేక, బారాకట్ట, నక్కాముట్టి లాంటి ఆటలు ఆడుకుంటూ కాలం వెళ్ళబుచ్చేవారు. గ్రామంలో ఎవరికైనా సరే మంచి జరిగినా, చెడు జరిగినా అక్కడే చర్చకొచ్చి అప్పటికప్పుడు పరిష్కారం కూడా జరిగిపోయేది. అయితే ప్రతి ఇంట్లో టీవీలను ఏర్పాటు చేసుకున్నాక పల్లెవాసులు కూడా ఇళ్ళు విడిచి బైటికి రాని దుస్థితి నెలకొంటోంది. వ్యవసాయ పనులు పూర్తీ చేసుకుని ఇంటికొస్తే టీవీల్లో వచ్చే మాయదారి సీరియళ్ళు, సినిమాలు చూసుకుంటూ ఊళ్ళో వాళ్ళతోనే ఏ వారానికో మాట్లాడుకునేంత అభివృద్ధి దిశవైపు పల్లెల వాతావరణం మారుతోంది.
రోజురోజుకీ ఆధునిక పనిముట్లు మార్కెట్‌లోకి రంగప్రవేశం చేస్తుండటంతో కులవృత్తుల వారు చేసే వస్తువులకు కాలం చెల్లిపోతోంది. దాంతోపాటు గ్రామంలోని ప్రతి మంచీ చెడునూ చర్చించుకుంటూ కాలయాపనచేసే పల్లెవాసులు తనను మరిచి టీవీల ముందు మోకరిల్లుతుండటంతో రచ్చబండలు కన్నీళ్ళు పెడుతున్నాయి. సమాజంలో ఆధునీకరణ దిశగా అడుగెయ్యడం మంచిదే. అందుకోసం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మార్చుకోవాలా...్భవిశ్య తరాలకు ఫలానా కులం వాళ్ళు ఫలానా పనిచేసేవాళ్ళు, చేతి వృత్తులంటే అలా వుండేవని, పల్లెల్లో ఇంతటి స్నేహపూర్వక జీవన విధానం వుండేదని కథల్లా చెప్పుకోవాల్సిన రోజులు రాకుండా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం, మచ్చలేని స్నేహభావం, ఒకరినొకరు మంచి చెడులు పంచుకునే బాంధవ్యం కొనసాగుతూ వుండే పల్లె సీమలు అలానే వుంటే బాగుంటదేమో...

-నల్లమాడ బాబ్‌జాన్ 9492722595