టీవీ
Published Saturday, 26 May 2018ఫ్లాట్ నుంచి విల్లాకు మారి ఓ ఆరుమాసాలు అవుతోంది. గృహ ప్రవేశం చేసినప్పుడు మా అన్నయ్య కొడుకు శివప్రసాద్ అమెరికాలో వున్నాడు. అందుకని కొత్త ఇంటికి రాలేకపోయాడు. ఓ పూజ వుంది రమ్మని పిలిచాను. ఓ రెండు మూడు రోజులు మాతో గడిపే విధంగా వచ్చాడు. నాకన్నా రెండు సంవత్సరాలు చిన్న అతను.
పూజ తరువాత నుంచి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చిన్ననాటి విషయాలు, చిన్ననాటి ఫొటోలు ఇట్లా చూశాం. చిలుకూరు గుడికి, ఇక్కడ దగ్గర్లో వున్న ప్రాంతాలని చూశాం. ఎప్పుడో మరిచిపోయిన రమీ ఆటలు ఆడాం. చదరంగం సరేసరి. చిన్నప్పుడు కార్డ్సుతో ఆడిన చిట్‌సాట్ ఆటలు గుర్తుకు తెచ్చుకున్నాం. మహాశివరాత్రి రోజు మా ఇంట్లో ఆడే పచ్చీస్ ఆట, కైలాసం ఆటలను గుర్తుకు తెచ్చుకున్నాం.
రెండు రోజుల తరువాత ఇంత ప్రశాంతంగా ఆనందంగా వుండటానికి కారణాలని వాడు అనే్వషించాడు. ఇల్లు పెద్దగా వుండటం మాత్రం కారణం కాదని అన్నాను.
చివరికి వాడే అన్నాడు - ఇక్కడ టీవీ లేకపోవడం వల్లే మనం ఇన్ని ఇన్‌డోర్ గేమ్స్ ఆడాం. ఇంత ఎక్కువ మాట్లాడుకున్నాం.
వాడు చెప్పింది వంద శాతం నిజం.
మొదట ఇంటికి వచ్చినప్పుడు టీవీ లేదన్న విషయం గమనించాడు. కానీ ప్రస్తావించలేదు.
ఒక్క టీవీ ఎంత సమయాన్ని తినేస్తుంది మనలని అనుకున్నాం. నవ్వుకున్నాం.
ఈ ఆధునిక కాలంలో టీవీ అవసరమే. కాదనలేం. కానీ అందులోకి పరకాయ ప్రవేశం చేసి బతకకూడదు. మనం దాన్ని శాసించాలి. అంతేకానీ అది మనలని శాసించకూడదు. కాని చాలామంది జీవితాలని టీవీ శాసిస్తోంది. చూడాలని లేకున్నా, ఏదో ఒక చర్చా కార్యక్రమం మనలని టీవీ ముందు కూర్చోబెడుతుంది.
ఇంట్లో ఎవరో టీవీని ఆన్ చేస్తాం.
మిగతా వాళ్లు బందీలవుతారు.
యూట్యూబ్ వచ్చిన తరువాత టీవీకి బానిసలు కావడం విషాదం. యూట్యూబ్‌లో మనకు కావల్సినవి చూడవచ్చు. టీవీల్లో వాళ్లు చూపించినవే చూడాల్సి వస్తుంది.
ఇంట్లో టీవీ లేకపోతే మంచిది. వుంటే అది రోజుకి గంటా రెండు గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు.
చాలామంది విజేతలు టీవీలను తక్కువ కాలం చూస్తారు. ఎక్కువ సమయాలు టీవీలను చూసే వ్యక్తులకన్నా తక్కువ సమయం చూసేవాళ్లలోనే లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు పుస్తకాలు చదువుతారు. ఇతరులతో సంభాషిస్తారు. అన్నింటికీ మించి లోకాన్ని పరిశీలిస్తారు.
టీవీ వుండి తక్కువ చూడటం అనేది మీ చేతుల్లో పని. ఆలోచించండి.