S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనదంతా అమెరికా లెవల్

అప్పుడే మంచి నిద్ర పట్టింది. వేసవిలో సామాన్యంగా ఎవరికయినా.. తెలతెలవారుతూ వుండగానే నిద్ర పడుతుంది. రాత్రంతా వేడిగాలులు వీస్తూనే వుంటాయిగా ఆ సమయంలో నిద్ర లేవాలంటే.. ఎంత బాధాకరం..
కరెక్టుగా అలాంటి సమయం చూసి.. ‘ఏమండోయ్!’ అంటూ.. మేలుకొలుపు పాడింది మా ఆవిడ..
‘్ఛఛీ! రాత్రి అంతా వేడిగాలి..! కంటి మీద కునుకు లేదు. ఇప్పుడే.. చిన్న నిద్ర పట్టింది’ అది కాస్తా చెడగొట్టావ్! అని విసుక్కున్నాను.
‘అందుకే.. ఏసీ గదిలో పడుకోండి బాబూ.. అంటూ బ్రతిమాలుతాను! నాకు ఏసీ పడదు.. అంటారు..’ అన్నది శ్రీమతి.
‘ఇంతకీ బంగారంలాంటి నిద్ర ఎందుకు చెడగొట్టావ్?’ అని అడిగాను.
‘మీరు ఇవాళ.. అంట్లు.. గినె్నలు తోముతారా? వంట చేస్తారా?’ అని అడిగింది నన్ను.
‘ఏం.. పనిమనిషి ఏమయింది? పోయిన నెలలోనే జీతం పెంచావుగా?’
‘నీ బోడి జీతం.. ఎవరిక్కావాలి? చందనా వాళ్లు రెండు చీరలు ఇచ్చి.. మూడు వేలు ఇస్తున్నారు.. అంటూ వెళ్లిపోయింది ఆ పిల్ల!’ అని చెప్పింది శ్రీమతి. ఇంతకీ ఆ పిల్ల ఉద్యోగం ఏమిటంటే చీర సింగారించుకుని.. షాపులోకి వచ్చేవారికి నవ్వుతూ స్వాగతం చెప్పాలట!
ఫర్వాలేదు.. మనం కూడా అమెరికా స్థాయికి ఎదిగిపోయాం! పోయిన సంవత్సరం.. అమెరికా నుండి మా అమ్మాయి, అల్లుడూ పిల్లలిద్దర్నీ తీసుకుని ఇండియా వచ్చేశారు!
‘ఇండియాలో ఇంచక్కా పనిపిల్లలు దొరుకుతారుట! హాయిగా.. నలుగురు పని పిల్లల్ని పెట్టుకుంటా!’ అంటూ తెగ మురిసిపోయింది నా కూతురు.
‘మన డాలర్లతో పోలిస్తే.. ఇక్కడ జీతాలు చాలా తక్కువ! నలుగురు కాదు.. అయిదుగురు పనిపిల్లల్ని పెట్టు! ఒకరు సెలవులో వెళ్ళినా నలుగురు ఇంట్లో వుంటారు..’ అన్నాడు మా అల్లుడుగారు.
నిజంగానే.. మా అమ్మాయి నలుగురు పనిపిల్లల్ని పెట్టుకుంది! రెండు నెలలు హాయిగానే జరిగిపోయింది. ఆ తర్వాత మొదలయ్యాయి.. కష్టాలు! ఒక పనిపిల్ల.. పక్కింటి కారు డ్రైవరుతో పారిపోయింది! ఆ పిల్ల అమ్మానాన్న నానాయాగీ చేసి.. ఓ లక్షరూపాయలు పరిహారం తీసుకున్నారు! పైగా మా అమ్మాయి చాలా అమాయకురాలు! మీ అమెరికా వాళ్ళని చూసి పాడయిపోయింది అంటూ ఎదురు తిరిగారు!
ఇంకో పనిపిల్లకి మా అమ్మాయి.. ఫేషియల్.. పెడిక్యూర్ వంటి బ్యూటీపార్లర్ విద్యలు నేర్పింది. ఆ పిల్ల మెల్లగా.. ఓ బ్యూటీ పార్లర్‌లో చేరిపోయింది. నాలుగువేలు జీతం!
ఇంకో పనిపిల్ల.. దొంగతనం చేస్తూ దొరికిపోయింది! పోనే్ల.. ఇంకోసారి చెయ్యకు.. అని మా అమ్మాయి బ్రతిమాలింది. కానీ, ఆ పిల్ల మాత్రం నో.. అంటూ పనిమానేసి వెళ్ళిపోయింది! ఈ విధంగా.. నాలుగు నెలల్లో మా అమ్మాయికి జ్ఞానోదయం అయ్యింది. ‘ఇండియా కంటే అమెరికానే బాగుంది!’ అంటూ మళ్లీ అమెరికా వెళ్ళిపోయింది! పిల్లలిద్దరికీ సీట్లు కోసం ఇంటర్నేషనల్ స్కూల్లో కట్టిన అయిదు లక్షల్లో సగమయినా తిరిగి ఇవ్వమని బ్రతిమాలింది. కానీ వాళ్ళు ‘సారీ’ అన్నారు! ఛీ.. అని విసుక్కుంటూ అమెరికా పారిపోయారు.. మా అమ్మాయి, అల్లుడూ..!
‘ఏమండోయ్.. మళ్ళీ కలగంటున్నారా?’ అంటూ గట్టిగా అరిచింది మా ఆవిడ. ఉలిక్కిపడి లేచాను.
‘ఇలాంటి బాధలు వుంటాయనే.. నేను ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పాను.. ఆ చిన్నపిల్లని వుండనివ్వు’ అని.
‘సర్లుండి! మొన్న చైల్డ్ లేబర్ అంటూ మన ఎదురింటి పనిపిల్లను తీసుకుపోయారు! ఆ ఇంటావిడ దగ్గర పోలీసులు అయిదువేలు ఆమ్యామ్యా పట్టేశారు! ఆ టీవీ వాడు ఎవరో.. అన్నీ.. ఆర్భాటంగా చూపిస్తారు చూడండీ.. వాడు! ఆ పిల్లను తీసుకెళుతుంటే.. షూటింగ్ తీశాడు. ఆ ఇంటి ఆవిడ్ని బెదిరించి అయిదువేల రూపాయలు తీసుకున్నాడు! లేకుంటే.. పొద్దస్తమానం మిమ్మల్ని టీవీలో చూపిస్తా అని బెదిరించాడట! ఆవిడ.. పదివేలు వదిలించుకున్నా.. ఆ పిల్లను మాత్రం వదల్లేదట! ఆ పిల్ల తల్లి లబోదిబోమని.. గోలపెడుతోంది! నేను మీ మాటవిని.. ఆ పిల్లని పనిలో వుంచుకుంటే.. ఈ పాటికి మీ పేరు నా పేరు టీవీలో మార్మోగేది!’ అని చెప్పింది మా ఆవిడ.
ఓరినాయనోయ్.. శ్రీరంగనీతులు చెప్పే టీవీల వాళ్ళలో కూడా.. లంచావతారాలు వున్నారన్నమాట!
‘చెప్పండి! మీరేం చేస్తారు? అంట్లు తోముతారా? వంట చేస్తారా? త్వరగా చెప్పండి.. ఆఫీసుకు టైం అవుతోంది’ అన్నది మా ఆవిడ.
‘అంట్లు తోమితే.. నా చేతులు పాడయిపోతాయి! వంట చేస్తాలే! ఇవాళ ఒక్కరోజు’ అన్నాను.
‘ ఒక్కరోజు కాదు.. ఇక ముందు మనమే యజమానులం.. మనమే పనివాళ్ళం..’ అన్నది మా ఆవిడ.
‘ ఓరి.. దేవుడోయ్! అయితే.. ఇక పనిపిల్లని పెట్టవా?’ అని అడిగాను.
‘గట్టిగా అరవకండి! పైన మేడమీద వున్న ఇంట్లో పనిపిల్లకు కడుపు వచ్చింది. పైగా నేను అయ్యగార్ని వదల్లేను అంటోందిట! ఇంటావిడ లబోదిబోమని ఏడుస్తోంది! పెళ్లి చేసుకుంటావా..? డబ్బులు ఇస్తావా? అని పనిపిల్ల అమ్మానాన్నా, బంధువులు గోల చేస్తున్నారట! నాకేం తెలీదు.. అంటాడట ఆ ఇంటి యజమాని! గట్టిగా అంటే.. టీవీల వాళ్ళు వచ్చేస్తారని భయం! ఈ పరిస్థితిలో నేను తెలిసి.. తెలిసి.. పనిపిల్లని పెట్టుకోను! మీరు చేస్తే సరి! లేకుంటే.. ఉద్యోగానికి రాజీనామా చేసేసి.. ఇంటిపని, వంటపని నేనే చేసుకుంటా..’ అంది మా ఆవిడ.
‘వద్దులే! రోజూ నేను వంట చేస్తా! నువ్వు మిగతా పనులన్నీ చెయ్యి!’ అన్నాను. మా ఆవిడకు నాకంటే రెండువేలు జీతం ఎక్కువ! ఎలా వదులుకోమంటారూ? అయినా మనదంతా అమెరికా లెవల్! అమెరికా స్థాయికి ఎదిగిపోయాం! అంటే ‘లేబర్ ట్రబుల్’ అన్నమాట.. అంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవడం!

--విశ్వరత్న గీతా 98480 34418