S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాధకులకే విశ్వరూప దర్శనం

‘రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహూ రుపాదమ్
బహూదరం బహుదంష్ట్రా కరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్త్థాహమ్’
విశ్వాత్మ వికృత రూపంలో - అగ్నిగోళాల్లాంటి కళ్లు, ప్రళయకాలాన్ని తలపించే నోళ్లు, పొడవాటి చేతులు, గగుర్పాటుకు లోనుచేసే తొడలు, పాదాలు, పొట్టలు, భయంకర కోరలు - ఇవన్నీ ఆ విశ్వవిభుని విభూతులే. ఈ భయంకర రూపంలోకి అతిరథ మహారథులైన భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, కౌరవ పాండవ సైన్యంలోని ఎందరో యోధులు ప్రవాహ వేగంతో చేరుకుంటున్నారు. ఆ మహామహులలో కొందరికి తలలు లేవు. కొందరికి చేతులు లేవు. కొందరికి కళ్లు లేవు. ఇలా ఆ విశ్వాత్మ నోటిలా అనిపించే ఆ మృత్యుద్వారంలోకి ప్రవేశిస్తున్నారు.
విశ్వరూప దర్శనంలో నిర్మలాకారంలో సకల చరాచరాల విశ్వాత్మ నుండి సృష్టించబడటం చూసిన అర్జునుడు ఈ వికృతాకారంలో ఆ సృష్టి అంతా - ఉత్తమం అధమం అన్న భేదభావం లేకుండా - ఆ భయంకరాకారానికి ఆహారమవుతున్నారు.
ఈ వికృత రూపాన్ని దర్శించలేక, అంగీకరించలేక, అర్జునుడు ఆ విశ్వ పురుషుడ్ని ‘ప్రసన్నుడవు కమ్ము’ అని ప్రార్థిస్తాడు.
పురుషోత్తముడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపించిన మీదట - రెండవ అధ్యాయంలో
‘కార్పణ్య దోషోపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢ చేతాః
యచ్ఛ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహి తనే్మ
శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్’
అని అర్జునుడు శరణు వేడిన దానికి సమాధానంగా-
‘కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృద్ధో లోకాన్
సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతేపి త్వా న భవిష్యంతి సర్వే
వ స్థితాః ప్రత్యనీకేష యోధాః’
శత్రువుల్ని జయించి కీర్తిని పొందు. రాజ్య సంపదలను అనుభవించు. ఈ సంగ్రామంలో నీచేత సంహరింపబడే వారందరూ ముందుగా నాచే సంహరింపబడ్డవారే. నువ్వు ప్రస్తుతానికి సాధనం మాత్రమే - అంటూ కృష్ణుడు అర్జునుడికి అభయహస్తమిస్తాడు.
మొత్తానికి ఈ విశ్వరూప దర్శన అధ్యాయం వల్ల-
పురుషోత్తముడైన విశ్వాత్మ సృష్టి బ్రహ్మకు ఆది స్థితి అనీ, సత్ అసత్‌ల ద్వంద్వాతీత స్థితియైన అఖండ సత్ అనీ, అన్ని దిక్కుల వ్యాపించి ఉన్న సర్వాంతర్యామి అనీ, ఇంద్రియ గోచరం కాని స్వరూపం అనీ, చరాచర ప్రాణి సంతతికి గురువు అనీ, విశ్వరూపుడు అనీ స్పష్టమవుతుంది.
ఈ విశ్వరూప దర్శనం వేదాధ్యయనం వల్ల కానీ, యజ్ఞానుష్ఠానం వల్ల కానీ, దానాదుల వల్ల కానీ, అగ్నిహోత్రాది కర్మలవల్ల కానీ సాధ్యం కాదు.
మరి ఎవరికి ఎలా సాధ్యం అంటే -
‘మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్సంగ వర్జితః
నిర్వైరస్సర్వ భూతేషు యస్స మామేతి పాండవ’
ఎటువంటి స్వార్థం లేకుండా - సర్వోత్తమ గతిని సైతం ఆశించకుండా - భౌతిక బంధాల సంగమం లేకుండా - ఉండే సాధకులైన మానవ అవతారులకే విశ్వరూప దర్శనం సాధ్యం.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946