S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విచక్షణే దిక్సూచి

‘విచక్షణ కలిగి ఉండటం’ అనే వాక్యాన్ని మీరు చాలా సార్లు వినే వుంటారు. మరి దీనికి అర్థం ఏమిటి? అంటే మన లక్ష్యం మీద దృఢత, దాన్ని చేరుకునే గమ్యపథంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులను ధీరత్వంతో, సమయస్ఫూర్తితో ఎదుర్కోవడం. విచక్షం అంటే ఇదా? అని మీరు అనుకుంటున్నారు కదూ! కానీ నిశితంగా పరిశీలిస్తే జీవితమంతా లక్ష్యాలు ఏవైనా వివిధ గమ్యాలతో పయనిస్తూ ఉండటమే. ఆ పయనంలో కొన్నిసార్లు వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది. ఆ వైఫల్య కారణాలను పరిశీలిస్తే చాలాసార్లు ‘విచక్షణ రాహిత్యం’ అనే అంశం కూడా వెలుగులోకి వస్తుంది. అంటే పయనంలో వాస్తవిక కోణానికి బహుదూంరగా వుండటం. అలాంటి పరిస్థితి మనకున్న ఫోబియాలు, మనకున్న అభిప్రాయాలు ఇలా ఎన్నో కారణాలవలన జనించవచ్చు. కనుక ఏ పరిస్థితులలోనైనా ఎటువంటి భయాలకు, బలహీనతలకు లోనుకాకుండా వీలైనంత సమయస్ఫూర్తితో వ్యవహరించడమే విచక్షణ.
కొన్ని కొన్నిసార్లు విజ్ఞానవంతులమని భావించేవారు కూడా సత్యాసత్యాలమధ్య, మంచి చెడులమధ్య, సుగుణ దుర్గుణాలమధ్య సరిగా విచక్షణ చేయలేక తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ వుంటారు. ఇది సరైన విచక్షణ లేకపోవడాన్ని చూపుతుంది. మనకున్న అన్ని రకాల భయాలను పోగొట్టగలిగేది జ్ఞానం ఒక్కటే. మనిషికి భయమొక్కటే అన్నిటికన్నా గొప్ప శత్రువు. మనుష్యులు శిక్షకు భయపడి అబద్ధాలు చెపుతారు. కొద్దిపాటి అనారోగ్యం కలిగితే చచ్చిపోతానేమోనన్న భయంతో దిగులుపడతారు. అపజయం ఎదురవుతుందన్న భయంతో జీవిత సమస్యలను వదలి పారిపోవాలని ప్రయత్నిస్తారు.
మహాభారత యుద్ధంలో మహాయోధుడైన అర్జునుడు యుద్ధం చెయ్యడానికి ఉవ్విళ్ళూరుతూ కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు. కానీ యుద్ధానికి ముందు ఆఖరు నిముషంలో భయంలో, దుఃఖంలో మునిగిపోయి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. తన విల్లు అయిన గాండీవాన్ని జారవిడిచి, గుండె జారిపోయి రథంలో కూలబడ్డాడు. తానే ఒక గొప్ప జ్ఞాని అయినప్పటికీ, ఆ క్షణంలో అన్నీ మర్చిపోయాడు. శ్రీకృష్ణుడు తిరిగి అతడికి జ్ఞానబోధన చేశాడు. ఆది, అంతాలు లేకుండా ఆమరమైనది ఆత్మ ఒక్కటేననీ, శరీరమనేది క్షణికమైనదనీ శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అందుచేత అతడికి నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. తన నిజస్వభావం తెలియకుండా చేసే అజ్ఞానమే అతడి నిరాశా నిస్పృహలకు కారణం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అతడికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా అతడి నిస్పృహను పోగొట్టాడో, అప్పుడు అతడు తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకొని, విజయుడై గెలిచాడు.
జీవితగమ్యంపై స్పష్టమైన అవగాహన లోపించడం కూడా విచక్షణా రాహిత్యానికి కారణమవుతుంది. గమ్యం ఏమిటో తెలిస్తే తప్ప, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నిశ్చయమైన గమ్యం, పదునైన ఏకాగ్రత మాత్రమే మనలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలవు.
‘‘ఒకే ఆలోచనను (పనిని, ఆశయాన్ని) చేపట్టండి. దానినే మీ జీవితంగా మలచుకోండి. దానినే తలపోయండి, దానినే కలగనండి, దానిమీదే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం, అదే ఆలోచనతో నిండి పోనివ్వండి. దాన్ని తప్ప మిగిలిన ప్రతి ఒక్క ఆలోచనను విడిచిపెట్టండి. విజయానికి దారి ఇదే’’- స్వామి వివేకానంద.
మనం ఒకేసారి చాలా పనులు చెయ్యాలనుకుంటాము. మన ఆదర్శం పట్ల ఏకాగ్రమైన భక్తి లేకుండా ఏ గొప్ప పనీ సాధ్యం కాదు. హర్యానా రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన కల్పనా చావ్లా రోదసిలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ యువతి. ఎందుకంటే ఆమె తన చిన్నతనంలోనే ఒక స్థిరమైన జీవిత గమ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె జీవిత కథను వ్రాసిన రచయిత, ‘‘వేసవి రాత్రులలో కల్పన వెల్లకిలా పడుకుని ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ ఉండేది. బహుశా రోదసిలో ప్రయాణించాలన్న ఆమె కలలను అదే రగిల్చి వుండవచ్చు’’ అని వ్రాశాడు. ఆమె అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం (ఏరోనాటికల్ ఇంజనీరింగ్)లో పట్ట్భద్రత సాధించాలని అనుకున్నపుడు ఆమె తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, చివరికి కళాశాల ప్రిన్సిపాల్ కూడా ఆ శాస్త్రానికి బదులుగా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ మొదలైన విభాగాలలో ఇంజనీరింగ్ చదవమని సలహా ఇచ్చారు. కానీ కల్పన తన లక్ష్యాన్ని మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి అన్ని అడ్డంకుల్ని అధిగమించి తన గమ్యాన్ని సాధించింది. తన గమ్యం పట్ల ఆమెకున్న ఏకాగ్ర భక్తి ద్వారానే ఆమె తన జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పొందింది.
అంటే మన లక్ష్యం, గమ్యం, అడ్డంకులు తదితర విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుని ఆత్మవిశ్వాసంతో ఎందరు నిరుత్సాహపరిచినా ముందుకు సాగే ధైర్యం ఉంటే జీవితంలోని ఏ పరిస్థితిలోనూ విచక్షణా రాహిత్యంగా ప్రవర్తించే మనఃస్థితి ఉండదు.
విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించడానికి అలవర్చుకోవాల్సిన ఇంకో లక్షణం బాధ్యతను సక్రమంగా నిర్వహించడం. బాధ్యతకు కట్టుబడి వ్యవహరించడం, ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ముందుకు సాగుతాయి. ఒక విషయం పట్ల ఎప్పుడైతే మనం మన బాధ్యతను మర్చిపోతామో, అప్పుడు మనమీద మనకే విశ్వాసం పోయి మన బలహీనతలను సమర్థించుకోవాలని ప్రయత్నిస్తాము. *

--శృంగవరపు రచన 9959181330