S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరివర్తన (కథ)

సీతాపతి మాస్టారికి ఆ రోజంతా ఆందోళనగా ఉంది. గత కొన్ని రోజులుగా ఐదవ తరగతి పిల్లల డబ్బు, వస్తువులు మాయమవుతున్నాయి. ఆ రోజయితే ఏకంగా ఆయన ఖరీదైన పెన్నుని మాయం చేసారు. దురలవాట్లకు లోనయిన విద్యార్థుల పనే అయి ఉంటుందని గ్రహించారు మాస్టారు.
దొంగతనం జరిగిన రోజు డబ్బు పోగొట్టుకున్న పిల్లలు ఆ విషయం చెప్పడం, మిగతా వారు తమ వస్తువులు భద్రపరచుకోవడం, తమ డబ్బు దొంగిలిస్తారనే భయంతో దృష్టిని పాఠాల మీద లగ్నం చేయకపోవడం జరుగుతున్నందుకు బాధగా ఉంది మాస్టారికి. పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారాయన.
తరువాత రోజు పాఠం చెబుతుండగా కృష్ణ నిలబడి ‘నా సంచిలో డబ్బు కనపడలేదు’ అని చెప్పాడు. అప్పటికే ఏమి చెయ్యాలో ఆలోచించి ఉండటంతో ‘పిల్లలంతా ఐదు నిమిషాలు బయటకు వెళితే పుస్తకాల సంచులు వెతికి దొంగని కనిపెడతాను’ అన్నారు మాస్టారు. విద్యార్థులు బయటకు వెళ్లగానే తలుపులు మూసి తనిఖీ చేశారు మాస్టారు.
కాసేపటికి తలుపులు తెరచి ‘దొంగ దొరికాడని’ మాస్టారు చెప్పగానే పిల్లలంతా ఉత్సాహంగా లోపలకి వెళ్లారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. దొంగ ఎవరో తేలిపోతుందని ఆశ పడ్డారు పిల్లలు. ‘తరువాత చెబుతాను. ప్రస్తుతానికి పాఠం చెప్పుకుందాం’ అని జవాబిచ్చి పోగొట్టుకున్న డబ్బుని కృష్ణకి అందించి తగు జాగ్రత్తలు చెప్పారు మాస్టారు.
పిల్లలకి మాత్రం మాస్టారి ప్రవర్తన వింతగాను, దొంగ పేరు రహస్యంగా వుంచడంతో ఆశ్చర్యంగాను వుంది. మరొకరైతే బెత్తం విరిగేలా కొట్టి, తోటిపిల్లల ముందు అవమానపరిచే వారని, తల్లిదండ్రులను పిలిపించి జాగ్రత్తలు చెప్పేవారని, అలాంటిదేమీ చేయకుండా సాధారణంగా ప్రవర్తించడం నచ్చలేదు వారికి.
తరువాత రోజు నుండి తరగతిలో దొంగతనాలు ఆగిపోయాయి. ఒకప్పటిలాగే శ్రద్ధగా పాఠాలు వింటున్నారు పిల్లలు. రోజులు వేగంగా గడుస్తున్నాయి.
ఒకరోజు ప్రధానోపాధ్యాయులు సీతాపతి మాస్టారుని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కావలసిన రంగు కాగితాలు, బహుమతులు కొనుగోలుకు వెళ్లమని చెప్పారు. ఒక విద్యార్థిని తనతో రమ్మని అడిగారు సీతాపతి మాస్టారు. ఆయనతో కమల్ వెళ్లాడు.
ప్రధానోపాధ్యాయుడు చెప్పిన వస్తువులు కొనుక్కుని తిరిగి వస్తుండగా మధ్య దారిలో ఒక చెట్టు కింద చాలా మంది జనం మూగి ఉండడం, ఏదో గొడవ జరుగుతున్నట్టు కేకలు విని అక్కడకు వెళ్లారు మాస్టారు. వెనుకే వెళ్లాడు కమల్.
ఒక నడి వయసు వ్యక్తిని చెట్టుకి కట్టేసి కర్రతో కొడుతున్నాడు ఒక యువకుడు. కట్టేసి ఉన్న వ్యక్తి మీదకు చెప్పు విసిరారు మరొకరు. గినె్ననిండా సున్నపు ద్రావణాన్ని ఆ వ్యక్తి ముఖం మీద పోసారు ఇంకొకరు. అంతలో ఒక స్ర్తి ‘వాడికి గుండు గీయించి గాడిద ఎక్కించి ఊరంతా తిప్పితే సిగ్గు వస్తుంది’ అని సలహా ఇచ్చింది.
జరుగుతున్నది చూసి, మాటలు విన్న సీతాపతి మాస్టారు ‘అతడేం నేరం చేశాడు?’ అని అడిగారు. కర్రతో కొట్టిన యువకుడు ముందుకి వచ్చి ‘మా బీరువాలో దాచిన బంగారం, డబ్బు దొంగతనం చేశాడు. పారిపోతుంటే పట్టుకున్నాం. దండించకుండా నెత్తిన పెట్టుకోమంటారా?’ అని అడిగాడు కోపంగా.
‘అతడిని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. అతడికి ఏమయినా జరిగితే మీకే ప్రమాదం’ అని బోధపరచి పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించారు మాస్టారు.
అక్కడ నుండి కదలి వెళ్తుండగా కమల్‌తో ‘ఆ దొంగకి ఏ గతి పట్టిందో చూశావా? దొంగని ఎవరూ గౌరవించరు. దొంగతో ఎవరూ స్నేహం చెయ్యరు. దూరంగా పెడతారు. భవిష్యత్తులో ఎక్కడైనా దొంగతనం జరిగితే ముందుగా అతడినే అనుమానిస్తారు. పోలీసుల కళ్లెప్పుడూ అతడిని కనిపెడుతూ ఉంటాయి’ అన్నారు.
‘ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు మాస్టారూ’ అని అడిగాడు కమల్.
‘ఆ రోజు మీ తరగతిలో పోయిన డబ్బు తీసింది నువ్వే కనుక. నీ పేరు చెప్పి వుంటే ఏమయ్యేదో ఒకసారి ఊహించు’ అన్నారు మాస్టారు.
కమల్ తలదించుకున్నాడు. ‘స్నేహితుల సరదాల కోసం దొంగతనం చేసాను. దొంగతనం చేస్తే ఎదురయ్యే కష్టాలు ఇప్పుడు చూసాను. ఆ రోజు నా పేరు చెప్పకపోయేసరికి క్షేమంగా బయటపడ్డానని సంబరపడ్డాను. కొన్నాళ్లు ఆగి మళ్లీ దొంగతనం చేయాలనుకున్నాను. అదెంత నేరమో ఇప్పుడు తెలిసింది. ఈ రోజు నుండి చెడ్డ స్నేహితులను వదిలేస్తాను. మరెప్పుడూ దొంగతనం చేయనని ప్రమాణం చేస్తున్నాను. బుద్ధిగా చదువుకుంటాను. నా పేరు బయటపెట్టవద్దు మాస్టారూ’ అని కాళ్లమీద పడ్డాడు కమల్.
‘నీలో పరివర్తన రావడం కంటే ఆనందమేముంది’ అన్నారు మాస్టారు.
కమల్ తనతో రావడం, చెట్టు దగ్గర జరిగిన సంఘటన రెండూ యాదృచ్ఛికమే అయినా అతడు రావడంవల్లనే దొంగతనం గురించి చెప్పే అవకాశం వచ్చిందని, చాలా రోజులుగా దాచుకున్న విషయం మంచి ఉదాహరణతో పరివర్తన కలిగించేలా చెప్పగలిగినందుకు సంతోషించారు మాస్టారు.

-నారంశెట్టి ఉమామహేశ్వరరావు 9490799203