కోడిగుడ్డు
Published Sunday, 10 June 2018కోడిగుడ్డుని చూసి మనం చాలా విషయాలని ఊహించుకోవచ్చు. అది బలం ఇస్తుందని, కోడిపిల్లలు అందులో నుంచి వస్తాయని ఇలా ఎన్నైనా ఊహించుకోవచ్చు.
మా చిన్నప్పుడు బ్రాయిలర్ కోళ్లు లేవు. జీవం లేని కోడిగుడ్లు లేవు. ఇప్పుడు మనం నాటుకోడి అని మనం వేటినైతే అంటున్నామో ఆ కోళ్లే వుండేవి.
దాదాపు ప్రతి ఇంట్లో (మాంసాహారుల ఇంట్లో) కోళ్లు వుండేవి. మా ఇల్లు చాలా పెద్దగా వుండేది. అందుకని కనీసం పది కోళ్లు దాకా ఎప్పుడూ మా ఇంట్లో వుండేవి.
కోడిపిల్లలు ఎలా జన్మిస్తాయో మాకు తెలిసేది. కోడిగుడ్డు, పెంకుని పగులగొట్టుకొని అవి బయటకు వచ్చేవి. పొదుగు పట్టిన కోడి తన పిల్లలను రక్షించుకోవడానికి చాలా పౌరుషంగా వుండేది. పొదగడం మొదలుపెట్టినప్పటి నుంచే కోళ్లు ఆ విధంగా వుండేవి. అందుకని ఆ కోడిగుడ్లను ముట్టుకునే సాహసం ఎవరూ చేసేవాళ్లు కాదు.
కోడిగుడ్డుపై నుంచి పగిలితే జననం వుండదు. జీవం అక్కడితో ముగుస్తుంది. కోడిగుడ్డు పెంకు లోపలి నుంచి పగిలితే జననం వుండేది.
ఈ విషయం మాకు చిన్నప్పుడు అంతగా బోధపడేది కాదు. మా తాత ఈ విషయం చెప్పేవాడు. కోడిగుడ్డు పెంకులాగా లోపలి నుంచి పగలాలి. మన కోరికలు, కాంక్షలు సఫలం కావాలంటే ఆ విధంగా పగలాలి అని చెప్పేవాడు.
మనం ఏ పని చేద్దామని అనుకొన్నా ఎన్నో అవాంతరాలు వస్తూనే ఉంటాయి.
మనం ఏదో పనిని చేద్దామని అనుకుంటాం. ఎవరో దానికి అభ్యంతరం చెబుతారు.
అంతే!
ఆ పని అక్కడితో ఆగిపోతుంది.
మన కోరిక అనే కోడిగుడ్డు పై నుంచి పగిలిపోతుంది.
వ్యక్తులే కాదు. చాలా సందర్భాల్లో పరిస్థితులు మనల్ని ఆపేస్తాయి.
కొన్ని ప్రతిబంధకాలను మనమే సృష్టించుకుంటాం. పై నుంచి కోడిగుడ్డును పగులకొడతాం.
పై నుంచి కోడిగుడ్డును పగులకొట్టడం సులువు. లోపలి నుంచి పగులగొట్టడం అంత సులువు కాదు. కొంచెం కష్టం. కొంచెం కష్టమే సుమా.
జీవితం మనకి ఎన్నో సవాళ్లని విసురుతుంది. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మనుషుల మధ్య సంబంధాలు కావొచ్చు ఆర్థిక సమస్యలు కావొచ్చు. ఏవైనా వాటిని లోపలి నుంచే పగులకొట్టాలి. బయట నుంచి కాదు.
కోడిగుడ్డు లోపలి నుంచి పగిలితే అది విజయానికి దారితీస్తుంది. బయటి నుంచి పగిలితే వైఫల్యానికి దారితీస్తుంది. మనం ఏం సాధిస్తాం అన్న దానికన్నా ఎన్ని అవరోధాలని అధిగమిస్తామన్నది ముఖ్యం.