S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాయు కాలుష్యంతో నేర ప్రవృత్తి!

మనిషి ఆరోగ్యంపై వాయుకాలుష్యం చూపే ప్రభావం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. వాయు కాలుష్యంవల్ల వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు, గుండెపోటు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధుల గురించి చాలా పరిశోధనలు జరిగాయి కూడా. కానీ వాయుకాలుష్యం ఆలోచనలు, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుందని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.
సీసం కలిసి ఉన్న పెట్రోలు వాడే వాహనాలనుంచి వచ్చే కార్బన్ అమెరికాలో ప్రజల ప్రవర్తనలపై ప్రభావం చూపుతోందనీ గుర్తించారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఐక్యూ తగ్గి, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోందనీ గుర్తించారు. శరీరంలో సీసం యొక్క పరిమాణం పెరగడంవల్ల పిల్లల్లో ఐక్యూ తగ్గడమే కాదు, వారిలో ఇతరుల పట్ల దౌర్జన్య ప్రవృత్తికూడా పెరుగుతోందని గుర్తించారు. అందువల్ల 1970లలోనే అమెరికాలో పెట్రోలు నుండి సీసం తొలగించి వాడడం మొదలుపెట్టారు. పెట్రోలునుండి సీసాన్ని తొలగించిన తరువాత 1990లలో అమెరికాలో 56 శాతం వరకు హింసాత్మక సంఘటనలు తగ్గడం గమనించారు.
షాంఘై నగరంలో సల్ఫర్ డయాక్సైడ్ కలిసిన వాయువులు పీల్చడం వల్ల మానసిక రుగ్మతలకులోనై ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువ కావడం ఒక సమస్యగా మారింది. పార్టిక్యులేట్ మేటర్ (పిఎం) అధికం ఉన్న గాలిని పీల్చడం నగరాలు, ఆ పరిసర ప్రాంతాలలోని యుక్త వయస్కులలో నేరప్రవృత్తి పెరగడంపై ప్రభావం చూపుతోందని అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిపిన ఒక అధ్యయనం వెల్లడిస్తోంది.
మనుషుల్లో ముఖ్యంగా యువతలో నేరప్రవృత్తి పెరగడంలో వాయు కాలుష్యం కూడా ఒక కారణవౌతోందని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది ముందుముందు ఇంకా తీవ్రమైన దుష్ఫరిణామాలకు దారితీయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. అమెరికాలో 9,360 పట్టణాలలో జరిపిన అధ్యయనం వాయు కాలుష్యంవల్ల మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతోందని వెల్లడయ్యింది.
కలుషిత వాయువులు పీల్చడంవల్ల హార్మోన్లపై వత్తిడి పెరుగుతుంది. ఇది మనుషుల్లో అలజడికి కారణవౌతోంది. అలజడికి లోనైనవారు అనాలోచితంగా నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎన్విరానె్మంట్‌కి చెందిన ఇవాన్ హెర్న్‌స్తాడ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన ఎరిక్ మ్యూలేగ్గేర్ చికాగో కేంద్రంగా వాయుకాలుష్యంపై పరిశోధనలు చేసారు. కొన్ని సంక్లిష్టమైన పద్ధతులను ఉపయోగించివారు చేసిన పరిశోధనల నివేదికను 2015లో ప్రచురించారు. వాయుకాలుష్యం ఉన్న పట్టణాలలో ఇతర ప్రాంతాలలో కంటే నేరాల రేటు 2.2 శాతం అధికంగా ఉందని వారు అంటున్నారు.
చికాగో పోలీసుశాఖ అందించిన 2001-2012 మధ్యకాలంలో జరిగిన 2 మిలియన్ల పెద్దపెద్ద నేరాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వీరు పరిశోధనలు చేసారు. తమ పరిశోధనలలో భాగంగా వీరు వాహనాలవల్ల కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలలోని ప్రధాన కూడళ్ల వద్ద కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. నేరాల జరిగిన తేదీలలో ఆయా ప్రాంతాలలో గాలులు ఏ దిశలో వీచేయో ఆ సమాచారాన్ని వాతావరణ శాఖకు సంబంధించిన వివిధ రికార్డులనుండి వారు సేకరించారు. తాము అధ్యయనం చేసిన పట్టణాల పరిసర ప్రాంతాలలో వాయుకాలుష్యం తక్కువగా సందర్భాలలో జరిగిన నేరాల సమాచారాన్నికూడా వీరు పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల మనుషుల్లో నేరప్రవృత్తికి వాయుకాలుష్యం ఒక్కటే ఎంతమేరకు కారణం కాగలదో వారు స్పష్టంగా అంచనా వేయగలిగారు.
గాలిలోని కార్బన్ మోనాక్సైడ్ కన్నా నైట్రోజన్ ఆక్సైడ్ మనుషుల్లో నేరప్రవృత్తికి ఎక్కువ కారకమవుతోందనీ, వేసవికాలంలో ఈ నేర ప్రవృత్తి ఇంకా ఎక్కువగా ఉంటుందనీ ఈ పరిశోధకులు అంటున్నారు. వాయుకాలుష్యం అధికంగాఉన్న నగరాలలో నేరాలుకూడా అధికంగా ఉన్నాయనీ, కలుషిత ప్రాంతాలలో నివసించే వారిలో నైతికత పట్ల ఔచిత్యం దెబ్బతింటోందనీ, అందువల్లవారు అనైతిక, అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందనీ, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించినట్లయితే మనుషులలో నేరప్రవృత్తిని కూడా కొంతవరకు నియంత్రించవచ్చని పరిశోధకులు అంటున్నారు.
ఇంగ్లండుకి చెందిన ఒక పరిశోధన సంస్థ రెండు సంవత్సరాలపాటు చిన్న చిన్న పట్టణాలు, బస్తీలలో సేకరించిన 1.8 మిలియన్ల నేరాలకు, కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో వివిధ కాలాలలో వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతానికి సంబంధించిన సమాచారం ఆధారంగా వారు అధ్యయనం చేసారు. పరిగణనలోకి తీసుకున్న ప్రతి పట్టణంలోను ప్రతిరోజూ వాతావరణం పరిశుభ్రంగా ఉందా లేక కలుషితమై ఉందా అన్న సమగ్ర సూచీని రూపొందించారు. వారి పరిశోధనలో తెలిసేదేమిటంటే ఎక్కకైతే వాతావరణంలో కాలుష్యం ఒక 10 పాయింట్లు పెరుగుతోందో అక్కడ క్రైమ్‌రేటు 0.9 శాతం ఉంటోంది. ఈ కోణంలోంచి చూస్తే లండన్ నగరంలో వాతావరణ కాలుష్యం అధికంగాఉన్న రోజుల్లో నేరాలుకూడా అధికంగా ఉన్నాయని. లండన్ నగరంలో అత్యధిక ధనికులు, అత్యంత పేదలు పక్కపక్కనే నివసిస్తున్న కలుషిత ప్రాంతాలలోనే నేరాలు అధికంగా జరుగుతున్నాయని పరిశోధనలో తేలిన మరో విషయం.
అనేకరకాల వత్తిడులు, అలజడులతోపాటు వాయుకాలుష్యం కూడా మనుషుల్లో నేలప్రవృత్తి పెరగడానికి కారణవౌతోందని ‘సైకలాజికల్ సైన్స్’ పత్రిక ప్రచురించిన ఒక అధ్యయన నివేదిక పేర్కొంది. ‘‘వాయు కాలుష్యం మనుషుల ఆరోగ్యానే్నకాదు, వారి నైతికతను కూడా కలుషితం చేస్తోంది’’అని జూలియాలీ అంటారు. ఈమె ఈ అధ్యయన బృందంలో ఒకరు.
గత తొమ్మిదేళ్లుగా 9వేల పట్టణాలకు సంబంధించి యూ.ఎస్. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అందించిన సమాచారాన్ని, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అందించిన నేరాలకు సంబంధించిన గణాంకాలను ఈ పరిశోధన బృందం అధ్యయనం చేసింది. ఇతర ప్రాంతాలలోకన్నా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల సగటుస్థాయికన్నా నేరాలు ఎక్కువగా ఉన్నాయని వీరి అధ్యయనంలో వెల్లడయ్యింది.
‘‘వాయుకాలుష్యం ఎక్కువగా ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా మానసిక అలజడులకు గురౌతున్నారు. ఇది వారిలోని అనైతిక ప్రవృత్తికి దారితీస్తోంది’’అని ‘‘పొల్యూటెడ్ మొరాలిటీ: ఎయిర్ పొల్యూషన్ ప్రేడిక్ట్స్ క్రిమినల్ ఏక్టివిటీ అండ్ అం ఎథికల్ బిహేవియర్’’ పేరుతో వెలువడిన ఒక నివేదిక తెలుపుతోంది.
వాయుకాలుష్యానికి, మనుషుల్లోని నేరప్రవృత్తికి మధ్య సంబంధాన్ని కనుగొనడానికి ఈ బృందం వరుసగా ఎన్నో పరిశోధనలుచేసింది. పొగబారిన ఆకాశం ఉన్న ప్రదేశాలలోనూ, స్వచ్ఛమైన నీలాకాశం ఉన్న ప్రదేశాలలోనూ నివసించే చాలామంది ఫొటోలను సేకరించి, వారి ముఖ, శారీరిక కవళికలను అధ్యయనంచేసారు. కలుషిత ప్రాంతాలలోకన్నా ఇతర ప్రాంతాలలో నివసించేవారి ముఖకవళికలలో ఎంతో ప్రశాంతంగా ఉండడం వీరు గమనించారు. ‘‘వాయుకాలుష్యానికి గురైన ప్రాంతాలు భారీగా నైతిక మూల్యాన్ని చెల్లించాల్సివస్తోంది. ఇది పర్యావరణపరంగా, భౌతిక ఆరోగ్యపరంగా కలిగే నష్టంకన్నా ఎక్కువే!’’అని డాక్టర్ జాక్సన్‌లూ అంటారు. ఈయన ఈ అధ్యయన బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ‘‘మనం దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే వాయుకాలుష్యం ప్రపంచంలో కోట్లాది ప్రజలపై ప్రభావం చూపుతోందికదా! కాలుష్య రహిత ప్రాంతాలు ఆరోగ్యప్రదమైనవే కాదు, సురక్షితమైనవి కూడా’’ అని డాక్టర్ జాక్సన్‌లూ అంటారు. ‘‘మేము ఇంకా ఎక్కువగా పరిశోధనలు చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా మేం జరిపిన అధ్యయనాలు వెల్లడిచేస్తున్న విషయాలు వివిధ దేశాల ప్రభుత్వాలకు తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నాయి’’అని ఆయన అంటున్నారు.
ఒకప్రక్క ప్రపంచంలో పలు దేశాలలో వాయుకాలుష్యం పెరుగుతూండడమే కాదు, మరోప్రక్క దాని దుష్పరిణామాలు కూడా అంచనాలకు అందనివిగా ఉంటున్నాయి. ప్రపంచంలో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది విషపూరితమైన వాయువునే పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
ప్రపంచంలోని ప్రజలంతా నెలకు ఒక్కరోజన్నా సరే తమ కార్లను, ఇతర వాహనాలను వదలి ప్రత్యామ్నాయ పద్ధతులలో ప్రయాణాలు చెయ్యాలని ‘‘యూ.ఎన్.బ్రీథ్‌లైఫ్’’సంస్థ పిలుపునిచ్చింది. వాయుకాలుష్యం మనుషుల వ్యక్తిగత ఆరోగ్యం, ప్రవర్తనలపై చూపే ప్రభావం గురించి మనకి తెలిసింది చాలా తక్కువే. కానీ మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యాలపై వాయుకాలుష్యం ప్రభావం చూపుతున్న ఉదంతాలు ఎన్నో పరిశోధనల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ సమస్యని నియంత్రించడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి.

-దుగ్గిరాల రాజకిశోర్ 8008264690