S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాలుతున్న వాసన

అట్లాంటిక్ మహాసముద్రపు అలలని విమానం తాకినప్పుడు హేరిస్‌కి గుర్తున్న ఆఖరి జ్ఞాపకం షార్ట్ సర్క్యూటైన ఎలక్ట్రిక్ వైర్లు కరిగే ఘాటైన వాసన. అతనికి దేనికీ సమయం దొరకలేదు. జీవించాలనే కోరిక తప్ప కాక్‌పిట్‌లోని పేసెంజర్ కంపార్ట్‌మెంట్‌ని తెరిచే సమయం కూడా అతనికి చిక్కలేదు.
విమానానికి చెందిన పైలట్ సీట్లో మంచులా చల్లగా ఉన్న నీళ్లల్లో తేలుతూండగా చాలాసేపటికి తనని ఎవరో పైకి ఎత్తుతున్న భావన కలిగింది. అవి స్వర్గపు చేతులా? లేక నరకపు చేతులా? అనే ఆలోచన స్పృహ తప్పే ముందు అతనికి కలిగింది.
* * *
తను సౌకర్యవంతమైన ఓ పరుపు మీద, దుప్పటి కింద నగ్నంగా పడుకుని ఉన్నాడని తెలిసింది.
కళ్లు తెరచి చూస్తే దాదాపు తెల్లచొక్కా తొడుక్కున్న ఒకరు తన మీదకి వంగి చూస్తూ కనిపించారు. అతని మొహం దయగా ఉంది.
‘ఎలా ఉంది?’ అతను ప్రశ్నించాడు.
‘నాకు తెలీదు. నేను చచ్చిపోతానని అనుకున్నాను. ఎక్కడ ఉన్నాను?’ హేరిస్ బలహీనంగా అడిగాడు.
ఆ తెల్లచొక్కా అతను నవ్వి హేరిస్ మీద తన చేతిని వేశాడు.
‘మేము మీ విమానం కూలడం చూశాం. నీళ్లల్లోని నిన్ను చూసి రక్షించాం. ఇది చాలా విశాలమైన సముద్రం. నువ్వు అదృష్టవంతుడివి. మా కళ్లబడ్డావు’
ఆ గది నెమ్మదిగా కదలడం హేరిస్ గుర్తించాడు. తను ఓ పెద్ద పడవలోని గదిలో ఉన్నాడని కూడా గ్రహించాడు.
‘ఇదేం ఓడ?’ అడిగాడు.
‘ఇండస్. దీని యజమాని జె.పి.గేల్వన్. ఆ పేరు మీరు విని ఉంటారు’
కళ్లు మూసుకుని హేరిస్ ఆ పేరు గురించి తన మెదడు పొరల్లోని జ్ఞాపకాల దొంతర్లోంచి వెదికే ప్రయత్నం చేశాడు. కొన్ని క్షణాల్లో వరదలా అతనికి అది గుర్తొచ్చింది.
‘అధ్యక్షుడు.. అమెరికా అధ్యక్షుడు కూలిన విమానంలో ఉన్నారు’ గట్టిగా అరిచాడు.
పక్కమీంచి అతను ప్రయత్నిస్తూంటే తెల్లచొక్కా వ్యక్తి పట్టుకుని ఆపి చెప్పాడు.
‘విమాన ప్రమాదంలో బతికి బయటపడింది నువ్వు ఒక్కడివే. ఇప్పుడు ఇంక ఎవరూ, ఏమీ చేయలేరు’
‘ఇక్కడ నేను ఎంతసేపటి నించి స్పృహలో లేను?’
‘నువ్వు అలసటతో నిద్రపోయావు. నిన్ను రక్షించి ఏడు గంటలైంది’
‘అయ్యో! ఐతే నేను వాషింగ్టన్‌కి జరిగింది చెప్పాలి’ అతను కంగారుగా చెప్పాడు.
‘ఆ పని మేము చేశాం. నువీ పడవలో ఉన్నావని వాళ్లకి తెలుసు’
‘కాని అధ్యక్షుడికి ఏమైందో వాళ్లకి చెప్పారా? పైలట్‌గా అది నా బాధ్యత. నేను నా పై అధికారులకి చెప్పాలి.’
‘కొద్దిసేపు ముందు విశ్రాంతి తీసుకో. తర్వాత మిస్టర్ గేల్వన్ మీతో మాట్లాడుతారు’
అతను బయటకి వెళ్లాక ఒంటరిగా ఉన్న హేరిస్ జరిగింది మరోసారి గుర్తు తెచ్చుకున్నాడు. అతను గత ఆరు నెలలుగా అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానానికి చీఫ్ పైలట్‌గా పని చేస్తున్నాడు. అధ్యక్షుడు ఫ్రాన్స్‌కి, జర్మనీకి వెళ్లి చర్చల్లో పాల్గొని విజయవంతమైన చర్చల్లో వెనక్కి అమెరికాకి తిరిగి వెళ్తూండగా విమానం సముద్రం ఈదకి వచ్చిన గంటకి, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూలిపోయింది. ఓ తుఫానుని గమనించి తను ఆ విమానాన్ని మేఘాల మీదకి తీసుకెళ్తూంటే దాని మీద పిడుగు పడటంతో ఆ ప్రమాదం జరిగింది. వైర్‌లైన్‌ని, ఎలక్ట్రిక్ సిస్టంని ఆ విద్యుద్ఘాతం నాశనం చేసేసింది.
తనకి వచ్చిన ఘాటైన వాసన ఎలక్ట్రిక్ వైర్లకి ఉన్న ప్లాస్టిక్ తొడుగుదని అతను గ్రహించాడు. విమానం కూలుతూండగా కింద విశాలమైన నీళ్లల్లో ఓ పడవని తను చూసానని కూడా గుర్తొచ్చింది. అదే తనున్న పడవై ఉండాలి. తన కోపైలట్‌కి తను ఏదో అరిచి చెప్పి, ఎమర్జన్సీ రేడియో బటన్‌ని నొక్కాడు. అది పనిచేయడం లేదని గ్రహించగానే, ఆగ్జిలరీ రేడియో బటన్ని నొక్కి ‘గోయింగ్ డౌన్. రష్ హెల్ప్’ అని అరిచాడు. తర్వాత విమానంలో మెరుపులు కనిపించాయి.
తెల్లచొక్కా అతను మళ్లీ వచ్చాక అడిగాడు.
‘అందులో మొత్తం ముప్పై ఆరు మంది ఉన్నాం. ఇంకెవర్నైనా కాపాడారా?’
‘లేదు. వెదికాం కాని నువ్వు మాత్రమే మా కంటపడ్డావు. మిస్టర్ గేల్వన్ నీతో మాట్లాడడానికి వస్తున్నారు’
‘మంచిది. మీరు ఆయన కొడుకా?’
ఆయన కొడుకు తండ్రిని మించిన వ్యాపారదక్షత గలవాడని చదివిన సంగతి గుర్తొచ్చి అడిగాడు.
‘ఊహు. నేను ఆయన సెక్రటరీని. నా పేరు మార్టిన్’
ఆ కేబిన్ తలుపు తెరచుకుంది. మధ్యతరగతి వ్యక్తిలా కనిపించే ఓ పొట్టి మధ్యవయస్కుడు లోపలకి వచ్చాడు. మెరిసే ఇత్తడి గుండీలు గల ముదురు నీలంరంగు జాకెట్, తెల్లటి పేంట్, కెప్టెన్ టోపీ ధరించిన అతను పాలిపోయినట్లుగా కనిపించాడు.
‘మిస్టర్ జాన్ హేరిస్. నేను జె.పి.గేల్వన్‌ని’ ఆయన చేతిని చాపి చెప్పాడు.
హేరిస్ పడుకునే ఆయనతో కరచాలనం చేశాడు. జె.పి.గేల్వన్ తను చదివిన ఓ వ్యాసం అతనికి గుర్తొచ్చింది. ఆయన అంతర్జాతీయ కరెన్సీ వ్యాపారం చేసే ఫైనాన్షియర్, బేంకర్.
‘నన్ను రక్షించినందుకు థాంక్స్’
‘అది నీ అదృష్టం. విమానం నా పడవకి చాలా దగ్గరలో కూలింది. అది పేలిన శబ్దానికి అంతా డెక్ మీదకి వచ్చి చూసాం. మిగిలిన వాళ్ల విషయంలో సారీ. మీ అధ్యక్షుడు మంచివాడు’
‘నేను రేడియో వింటాను. దీని గురించి అమెరికాలో ఏం జరుగుతుందో వినాలి’ హేరిస్ కోరాడు.
‘తర్వాత. ఆకాశంలో ఏం జరిగింది?’ ఆయన ప్రశ్నించాడు.
అకస్మాత్తుగా ఇంజన్ శబ్దం ఆగిపోవడం హేరిస్ గమనించాడు. ఎందుకో అర్థంకాలేదు. బహుశ తనని ఇంకో పెద్ద ఓడలోకి తరలించబోతున్నారా? అది అమెరికన్ ఓడా? సమాచారం అందుకుని ఈ ప్రాంతానికి వచ్చిన యుద్ధ నౌక అయి ఉండచ్చా?
‘విమానం మీద పిడుగు పడి ఎలక్ట్రికల్ సిస్టం ఫెయిలవడంతో ఈ ఘోరం జరిగింది. నాకు అధ్యక్షుడ్ని రక్షించే అవకాశమే లేకపోయింది. రేడియో ద్వారా సమాచారం కూడా ఇవ్వలేకపోయాను. నేను నడిపే విమానంలోని అధ్యక్షుడ్ని నేను రక్షించలేక పోవడం.. ఛ!’ హేరిస్ బాధగా చెప్పాడు.
గేల్వన్ సన్నగా నవ్వి చెప్పాడు.
‘కాని మిస్టర్ హేరిస్. మీరు ఆఖరి క్షణంలో రేడియో ద్వారా ఓ సమాచారాన్ని పంపారు’
‘ఏమిటది?’
‘ఇందాకే మీ కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఆ విమానాన్ని రష్యన్స్ కూల్చారని ఆయన భావిస్తున్నారు’
‘ఏమిటి? ఎందుకలా అనుకుంటున్నారు?’ హేరిస్ ఆశ్చర్యంగా పక్కమీంచి లేచి కూర్చుని అడిగాడు.
‘వాళ్లు రేడియోలో విన్నదాంట్లో రష్యన్స్‌అన్న ఒక్క మాటని మాత్రమే అర్థం చేసుకో గలిగారు’
హేరిస్ తను చివర్లో చేసిన మాటని గుర్తు చేసుకున్నాడు. ‘రష్ హెల్ప్’ అన్న తన ఉచ్చారణ రష్యన్స్‌గా వినపడి ఉంటుంది.
‘అది ప్రమాదం. నేను అన్నది ‘రష్ హెల్ప్’. అది యుద్ధాన్ని ప్రేరేపించచ్చు’ హేరిస్ భయంగా చెప్పాడు.
‘అవును’ గేల్వన్ అంగీకరించాడు.
‘ఐతే వెంటనే నేను వైర్‌లెస్‌ని ఉపయోగించాలి. వాషింగ్టన్‌తో మాట్లాడి అధ్యక్షుడికి నిజం తెలిసేలా చేయాలి’
‘కాని అందుకు చాలా సమయం వుంది హేరిస్. మీ మాజీ అధ్యక్షుడి కోసం వెదకడం ఆరంభమైంది. మీ అధ్యక్షుడు నీ మాటలకి ఎలా స్పందిస్తాడో అన్న విషయంలో నాకు ఎలాంటి ఆదుర్దా లేదు’
‘ఆదుర్దా లేదా? ఎలా స్పందిస్తారో తెలీదా? ఏ క్షణంలోనైనా రష్యా మీద యుద్ధం ప్రకటించచ్చు. అది న్యూక్లియర్ యుద్ధంగా కూడా మారచ్చు’ హేరిస్ ఆదుర్దాగా చెప్పాడు.
గేల్వన్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘మిస్టర్ హేరిస్. నేను నైపుణ్యంగా చాలా వాటిని తారుమారు చేసి, నా వ్యాపారంలో సంపాదిస్తున్నాను. ఓ మనిషికి మాత్రమే దొరికే అరుదైన ఓ గొప్ప శక్తి నాకు ఇప్పుడు దొరికింది. నేను మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపగలను. లేదా జరిగేలా చేయగలను’
‘అది పిచ్చి ఆలోచన. ఇంకా యుద్ధం దాకా వ్యవహారం వెళ్లి ఉండకపోవచ్చు. ఆలస్యం చేయకుండా దయచేసి నాకో షార్ట్‌వేవ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్‌ని ఇవ్వండి. నేను అర్జెంట్‌గా వాషింగ్టన్‌తో మాట్లాడాలి’ హేరిస్ దీనంగా కోరాడు.
గేల్వన్ ఆజ్ఞ మీద సెక్రటరీ ఆ గదిలోకి రేడియోని ఆన్ చేశాడు.
‘.. ఇంకా తెలీలేదు. ఈలోగా అట్లాంటిక్‌లో అనే్వషణ కొనసాగుతోంది. రెండు డజన్ల యుద్ధ నౌకలు, వంద విమానాలు అధ్యక్షుడి విమానం కూలిన ప్రాంతంలో అనే్వషిస్తున్నాయి. కొన్ని విమాన శకలాలని కనుగొన్నారు. కాని ప్రయాణీకులు కాని, వారి అవశేషాలు కాని ఇంకా కనపడలేదు. వాషింగ్టన్‌లోని రెండు కాంగ్రెస్ హౌస్‌లు రాత్రంతా కొత్త అధ్యక్షుడితో సమావేశమయ్యాయి. యుద్ధం ప్రకటించాలా? వద్దా? అన్న అంశం మీద అంతా చర్చించబోతున్నారు. రష్యా మీద తక్షణం యుద్ధం ప్రకటించాలన్న వారిని అధ్యక్షుడు శాంతపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని విమానం కూలడానికి మునుపు దాని పైలట్ చెప్పిన మాటలు విన్న అమెరికన్ పౌరుల వత్తిడి వల్ల అమెరికా, రష్యాల మధ్య మరో ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం తప్పదని పరిశీలకులు చెప్తున్నారు.
మాయమైన విమానం గురించి తమకేం తెలీదని మాస్కో ఓ ప్రకటనలో తెలిపింది. తాము పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని కూడా చెప్పింది. విమానం కూలిన ప్రాంతంలో తమ చేపల పడవలు ఉన్నాయన్న సంగతి కూడా మాస్కో ఫ్రాన్స్ రాయబారి ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది.
‘మనం ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి’ హేరిస్ అరిచాడు.
గేల్వన్ తన సెక్రటరీకి రేడియోని ఆపు చేయమని సౌంజ్ఞ చేశాడు.
‘మిస్టర్ హేరిస్. అది నా సమస్య’
హేరిస్ మొదటిసారి తను తప్పుడు మనిషి చేతిలో ఉన్నాడనే భయం కలిగింది. ప్రపంచానికి ఏవౌతుందో అనే కాక తనకేవౌతుందని భయపడ్డాడు.
‘నేను రక్షించబడ్డట్లు మీరు ఎవరికీ చెప్పలేదు కదా?’ అనుమానంగా చూస్తూ అడిగాడు.
‘లేదు. ఓడలోని ఐదుగురు సిబ్బందికీ ఇంగ్లీష్ రాదు. నీకు, నాకు, నా సెక్రటరీకి మాత్రమే ఇంగ్లీష్ వచ్చు’
‘ఇదంతా దాచి మీరు ఏం సాధించాలని అనుకున్నారు?’ హేరిస్ నిస్సహాయంగా చూస్తూ అడిగాడు.
‘నేను లండన్, రోమ్, రియో, పేరిస్, ఇంకా చాలా నగరాల్లోని బేంక్‌లతో టచ్‌లో ఉన్నాను. యుద్ధ వాతావరణ నేపథ్యంలో వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులు, సమీకరణలు జరుగుతున్నాయి. మీ అధ్యక్షుడు శాంతిని కోరుతారు. రష్యన్స్‌కి కూడా యుద్ధం మీద ఆసక్తి లేదు. ఇలాంటి నేపథ్యంలో కరెన్సీ విలువల్లోని మార్పుని గమనించి వాటిని కొంటున్నాను. ఓసారి నిజం బయటపడితే వాటి విలువలు మళ్లీ అసలు స్థితికి చేరుకుంటాయి. అప్పుడు నాకు వచ్చే లాభం అనూహ్యం’ గేల్వన్ మొహం వెలిగిపోతూంటే ఆనందంగా చెప్పాడు.
‘మీ లాభం కోసం ఇంత సంక్షోభం అవసరమా?’ హేరిస్ ప్రశ్నించాడు.
‘అవును. ఇది ప్రతీ విదేశీ కరెన్సీ వ్యాపారస్థుడి కల. నేనిప్పుడు తెలివిగా, విరివిగా లాభదాయకంగా కొంటున్నాను. ఆఖరి నిమిషంలో ఆ సాక్ష్యాన్ని వాషింగ్టన్‌కి పగానే త్వరలోనే మళ్లీ కరెన్సీ విలువలు యథాస్థితికి చేరుకుంటాయి. వెంటనే కోటానుకోట్ల లాభం నాకు వస్తుంది’
‘కాని ఇదే ఆఖరి నిమిషం. మొదటి మిస్సైల్‌ని ఎవరు ప్రయోగించినా ఆలస్యమైపోతుంది’
అకస్మాత్తుగా ఓ బజర్ మోగింది. ఒకతను హడావిడిగా లోపలకి వచ్చి హేరిస్‌కి అర్థంకాని భాషలో మాట్లాడి, తగిన సూచనని తీసుకుని వెళ్లాడు. గేల్వన్ చిన్నగా మూలిగి చెప్పాడు.
‘ఓ అమెరికన్ యుద్ధనౌక నించి సమాచారం వచ్చింది. వాళ్లు లోపలకి వస్తారట. ఇది నేను ఆశించిన దానికన్నా ముందుగా జరుగుతోంది. మీ గురించి నేను వాళ్లకి ఇప్పుడే చెప్పాలి. లేదా ఎప్పటికీ చెప్పలేను’
హేరిస్ ఆ మాటల వెనక అర్థం గ్రహించగలిగాడు. తను మాట్లాడాలని మాటలని కూడా తన మరణానికి మునుపు చెప్పాడని చెప్పచ్చు.
‘మీకు పిచ్చి. లేదా మీరు దుర్మార్గులు’ హేరిస్ కోపంగా అరిచాడు.
‘అమెరికాలో యుద్ధం కోరుకునే వారంతా పిచ్చిలేని వారనా నీ ఉద్దేశం?’
‘ప్రపంచం మొత్తం యుద్ధంలో నాశనమైపోతే మీకు డబ్బుండీ ప్రయోజనం ఉండదు’
‘అందుకే ఓ నిర్ణయం తీసుకోలేక పోతున్నాను’
‘లేదా ఈ క్షణం మీరు అనుకోకుండా పొందిన శక్తి వ్యామోహంలో కూరుకుపోయి సరిగ్గా ఆలోచించ లేకపోతున్నారు’
తక్షణం హేరిస్ మంచం మీంచి గేల్వన్ మీదకి దూకి అతని గొంతు పిసకసాగాడు. వెంటనే సెక్రటరీ చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.
‘వదులు. లేదా చస్తావు’ సెక్రటరీ హెచ్చరించాడు.
హేరిస్ అతని బెదిరింపుని పట్టించుకోలేదు. అతని చేతిలోని రివాల్వర్ పేలింది. హేరిస్ వెంటనే రెండడగులు వెనక్కి వేసి నేలకూలాడు. తన శవాన్ని ఇప్పుడు గేల్వన్ అమెరికన్స్‌కి ఇవ్వలేదని హేరిస్ భావించాడు. తననా గుండు ఎలా చంపిందో గేల్వన్ వాళ్లకి నచ్చచెప్పలేదు. అమెరికన్స్ ఈ పడవని క్షుణ్ణంగా వెతుకుతారని తెలుసు. కాబట్టి బహుశ తన శవాన్ని దాయరు. పైకి తేలకుండా సముద్రంలో పడేస్తారు అన్నది హేరిస్‌కి కలిగిన ఆఖరి ఆలోచన.
అతనికి మళ్లీ కాలుతున్న వాసన వేసింది. ప్రపంచం కాలుతున్న వాసన.
*
(ఎడ్వర్డ్ డి హాక్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి