S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ..

తామెదుర్కొన్న కష్టాలు భవిషత్తులో మరెవ్వరికి కలుగకూడదన్న ఆలోచనతో ఎనిమిదేళ్లుగా నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శివ భక్తుల మెప్పుపొందుతూ దేశ వ్యాప్తంగా సిద్దిపేటకు తరగని కీర్తిని ఆర్జించిపెట్టింది అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి.
నునుపైన మంచు కొండలు, ఎముకలు కొరికే మైనస్ డిగ్రీల చల్లటి వాతావరణంలో గుహలో మంచులింగంగా భక్తులకు దర్శనమిచ్చే అమర్‌నాథ్ యాత్ర సాహసోపేతమే. జీవితంలో ఒకసారి అమరనాథుడుని దర్శించుకుంటే జన్మ దన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు. అలాంటి భక్త సులభుడిని దర్శించుకుని తీరాలన్న కోరిక సిద్దిపేటకు చెందిన కొంత మందిని 2000 సంవత్సరంలో ఆలోచింపజేసింది. అమర్‌నాథ్ యాత్రకు వెళితే తిరిగి వస్తారన్న నమ్మకం ఉండదని, చలి తీవ్రంగా ఉంటుందని, పీల్చుకునేందుకు ప్రాణవాయువు కూడా లభించదని, ఉగ్రవాదులు ఎక్కడ పెట్రేగిపోతారో తెలియని అయోమయ పరిస్థితులు ఉంటాయన్న రకరకాల భయాలు కల్పించడంతో వెళ్లాలన్న కోరికను తొమ్మిది సంవత్సరాల పాటు వాయిదా వేసుకున్నారు. 2009వ యేటా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు టికెట్లు సైతం బుక్ చేయించుకున్నా చివరి క్షణంలో మళ్లీ వాయిదా వేసుకున్నారు. 2010 సంవత్సరంలో సృష్టికి లయకారకుడైన బోళాశంకరుడి దర్శనానికి వెళుతున్నాం..ఏం జరిగినా పరవాలేదనుకుని 45 జంటలు అమర్‌నాథ్ యాత్రకు పయనమయ్యారు. శ్రీనగర్‌కు వెళ్లిన ఈ పర్యాటక బృందానికి ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పర్యాటక బృందానికి విషయం తెలియకపోవడంతో పోలీసుల కాపలా మధ్య బస్సును నిలుపుకుని భోజనాలు చేసి అక్కడి నుండి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. భక్తులకు కఠోరమైన పరీక్షలు పెట్టి తనపై ఉన్న భక్తిని పరిశీలించడం సదాశివుడికి మహా సరదా. బాల్‌థాకు సిద్దిపేట భక్తులు చేరుకోగానే ఎడతెరిపి లేకుండా ఐదు రోజుల పాటు కుంభవృష్టి కురియడం ప్రారంభమైంది. తినడానికి అన్నం లేక, త్రాగడానికి నీరు లేక 90 మంది భక్తులు నానా అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా అమరేశ్వరుడి దర్శనాన్ని అధికారులు నిలిపివేయడంతో పునరావాస శిబిరాలన్ని భక్తులతో నిండిపోయాయి. ఇదే సమయంలో సిద్దిపేట నుండి వెళ్లిన భక్తుల్లో తోటి భక్తులకు సేవలు అందించాలన్న ఆలోచనను అమరేశ్వరుడు కల్పించాడు. అన్ని రకాలుగా హితోధిక సహాయ సహకారాలు అందించి వర్షం నిలిచిపోగానే అమర లింగేశ్వరుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చాలా శిబిరాల్లో ఉచిత అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా తెలుగు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు లేకపోవడంతో సిద్దిపేట భక్తులు కడుపు మాడ్చుకోవాల్సి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక్కటంటే ఒక్క శిబిరం లేకపోవడం ఏమిటన్న ప్రశ్న తట్టిలేపింది. అక్కడ కలిగిన ఇబ్బందులతో జీవితంలో మళ్లీ అమర్‌నాథ్ యాత్రకు రాకూడదని చాలా మంది లెంపలేసుకున్నారు. అప్పటికప్పుడు ఆ భక్తుల్లో వ్యక్తమైన బాధ యేడాది తిరుగకుండానే ఊహించలేని చక్కటి మార్పును తీసుకువచ్చింది. తామెదుర్కొన్న కష్టాలు ఇతరులకు రాకూడదన్న నిర్ణయానికి వచ్చారు. 2011 సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు నెలల సమయం ఉండగానే 21 మంది సభ్యులతో అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేటను ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ సభ్యులతో పాటు భక్తుల సహకారంతో మొదటి సంవత్సరమే 20 లక్షల వరకు ఖర్చు చేసి అమర్‌నాథ్ యాత్రీకులకు తెలుగు వంటల రుచి చూపించారు. ఆవకాయ పచ్చడిని సైతం వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులను ఆకట్టుకోవడం మరో విశేషం. బాల్‌థాలోని శిబిరంలో భోజనం చేసేందుకు భక్తులు క్యూ కట్టడంతో పోలీసు అధికారుల్లో సైతం అనుమానం పెంచి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో లోపలకు వెళ్లి పరిశీలించారంటే సిద్దిపేట సద్దులకు ఏ విధమైన ఆదరణ లభించిందో స్పష్టమవుతోంది. గత నెల 28 నుండి ఆగస్టు 26వ తేదీ వరకు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. దాదాపు 50 వేల మంది భక్తులకు అన్నదానం చేసేందుకు సిద్దిపేట నుండి లారీలో బియ్యం, పప్పులు, నూనే, ఆవకాయ పచ్చళ్లు, ఇతర సామాగ్రిని తరలించారు. రెండు మూడు విడతలుగా సిద్దిపేట నుండి 15 మందితో బృందాలు వెళ్లి భక్తులకు అక్కడ సేవలు అందించనున్నారు. బాల్‌థా నుండి అమర్‌నాథ్ క్షేత్రానికి వెళ్లే భక్తులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు యాత్రను చక్కగా ముగింపజేసి తిరిగి సురక్షితంగా గమ్యాలకు చేర్చడంలోనూ సేవా సమితి నిరంతరం సేవలందిస్తోంది. చల్లటి వాతావరణం శరీరానికి వేడినిచ్చే విధంగా బాటిళ్లలో కాచిన వేడి నీటిని సమకూర్చనున్నారు. అన్నం పరాబ్రహ్మ స్వరూపం అన్న నినాదంతో ఆకలితో అలమటించకుండా కడుపునిండా రుచికరమైన భోజనాలు పెడుతూ సిద్దిపేటకు దేశ వ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో సేవా సమితి నిరతికి నిదర్శనం. ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బిస్కట్లు, టీ ఉదయమే ప్రారంభిస్తారు. ఇడ్లి, వడ, దోశ, పొంగల్, ఉత్తప్ప, ఉప్మా, పొహ తదితర వాటిని రోజు వారిగా అల్పాహరంగా అందించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సన్న బియ్యంతో వండిన అన్నం, అవకాయ పచ్చడి, పప్పు, కుర్మా (కర్రీ), సాంబర్, పెరుగు, పాపడ్, మిఠాయిని పెడ్తారు. మొదట్లో బాల్‌థాలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమాన్ని మార్గమధ్యంలో కూడా ప్రారంభించారు. బాల్‌థాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణిలో భోలే భండారి చారిటబుల్ ట్రస్ట్, లుథియానా వారి సౌజన్యంతో 2వ లంగర్ (శిబిరం), బాల్‌థాలో అమర్‌నాథ్ సేవా మండలి, అమృత్‌సర్ వారితో 8వ లంగర్‌లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సిద్దిపేట అన్నదాన సేవా నిరతికి మెచ్చిన అమర్‌నాథ్ గుహకు బందోబస్తును పర్యవేక్షించే సీఐ మంచులింగం సన్నిదిలోని త్రిశూలాన్ని కానుకగా బహూకరించడం గమనార్హం. ఆ త్రిశూలం సిద్దిపేట పట్టణంలోని శరభేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి సారిగా వచ్చిన గోదావరి పుష్కరాల్లో కూడా సిద్దిపేట అన్నదాన సేవా సమితి ధర్మపురిలో 12 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మొబైల్ నంబర్లను అందుబాటులో ఉంచారు. 9490890893, 9494023701, 9494023702 నంబర్లతో పాటు సేవా సమితి అధ్యక్షులు చీకోటి మధుసూదన్‌కు చెందిన 9949930005 నంబర్‌ను భక్తుల కోసం పని చేయనున్నాయి. అన్నదానాన్ని మించిన గొప్ప దానం మరొకటి లేదని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి, జీవన్ముక్తికి సోపానమైన అమర్‌నాథుడి దివ్యసన్నిదిలో సేవలు చేసే భాగ్యం లభించడం గొప్ప అవకాశమని, భక్తులు హితోధికంగా అందించే సహాయంతో నిరంతరాయంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారులైన చీకోటి మధుసూదన, నేతి కైలాసం, ఉప్పల భూపతి, గోపిశెట్టి శరభయ్యలు పేర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మొట్టమొదటి అన్నదాన సేవా కేంద్రంగా ప్రారంభించే అదృష్టం సిద్దిపేటకు లభించడం చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు. ఎన్ని వేల మంది వచ్చినా లేదనకుండా యాత్రకు శక్తిని ఇచ్చే ఆహారాన్ని అందిస్తామని భక్తులకు భరోసానిస్తున్నారు.

-తమ్మలి మురళీధర్ 99895 07333